ఆకు మీదేసుకుని అభయం ఇస్తావు...
నీరు మీదేసుకుని నెమ్మది ఇస్తావు
పువ్వు మీదేసుకుని పుణ్యం ఇస్తావు
సృష్టిని మీదేసుకుని ఓ ఆట ఆడుకుంటావు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
బూది మీదేసుకుని భూతములు కాస్తవు
గంగ మీదుంచుకుని జంగదేవరైనావు
నెలవంకను నెత్తిమీదుంచుకుని చలవనిస్తవు
నుదుటిమీద నిప్పుంచుకుని కాల్చి బూది చేస్తావు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా ...
హిమాలయం మీదుండి హితము చెబుతావు
నంది మీద తిరిగి ఆనందమిస్తవు
భక్తుల మీద చేయి ఉంచి భయం తీస్తావు
తిక్కరేగితే సృష్టినే కాళ్ళకిందేసుకుని తాండవమాడుతావు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
మనసు ప్రమిదలో
బుద్ధి నూనెపోసి
ఆలోచనల ఒత్తులేసి
జీవమనే దీపం వెలిగించి
మా జీవితమునే కార్తీకమాసం చేశావా...!
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
సరసం త్యాగం చేసి...
శ్మశానం నివాసం చేసి...
బూదిపూసుకుని...
భూతములకు బుద్ధినిచ్చే...
ఆది దేవా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
పైకేమో...ఆకాతాయి కోతివి
లోన ఆత్మనెరిగిన ఖ్యాతివి
జగమును కాచే పసుపతివి
రామ రక్షణలో నిర్వికార మనుసుడివి
రామా... అనగానే రక్షించే మారుతివి
అంగ లింగ సంగమ జంగమానివి
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీళ్ళేస్తే నిలకడ ఇస్తవు
ఆకేస్తే అభయమిస్తవు
పువ్వేస్తే పుణ్యమిస్తవు
మొక్కితే మోక్షమిస్తవు
వూరికే...ఉన్నదంతా ఇచ్చే ఉమాశంకరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
సూర్యోదయం నీకొక ఆట
చంద్రాగమనం నీకొక ఆట
మనిషి ఉద్భవం నీకొక ఆట
ఆ మనిషి ఉద్దానపతనము నీకొక ఆట
నీ ఆటే కదా కాలానికి బాట
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నువ్వు ఎక్కడ పడుకుంటవో
నువ్వు ఎక్కడ పండితివో...
నన్ను ఎప్పుడు పండిస్తవో
నన్ను ఎప్పుడు పండబెడతవో నీకే తెలుసు
నీ ఆటకు నీవెసాటి భళా సదాశివా...
ఇక్కట్లు చీకట్లు
విజయాలు వెలుతుర్లు
సమన్వయం శ్మశానం
ఆడుకునేది నువ్వు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...