Menu Close
Kadambam Page Title
అవ్యక్తమూర్తి
సన్యాసి

ఎవని చేదోయి నించి ఈ మహాసుందర జలపాతాలు
శైల శిఖరాలపైనించి క్రింద చరియలపై జాలువారె?

ఎవరి ఊహలు ఈ సప్తద్వీప వసుంధరని సృజియించె?
ఎవని అనంత జ్ఞానశక్తి సర్వమానవాళికి బుధ్ధినొసగి నీ జగతి నడిపె?

ఎవడు తన అజ్ఞాత శక్తిచే ఈ భువన బ్రహ్మాండమెల్ల త్రిప్పు?
ఎవని వెలుగుచే నీ సూర్య, చంద్ర, తారకా సహిత సర్వగోళములన్ని వెలిగిపోవు?

ఏ మాయచే మనకు శీతోష్ణ సుఖదుఃఖాదులెల్ల స్వానుభవైక వేద్యమాయె?
ఏ ఇంద్రజాలికుడు సస్య శ్యామలంబైన పంట పొలాల నెల్ల సృజియించి యిచ్చె?

ఏ మాయావి తన హస్తమ్మునూచి ప్రళయ జంఝామారుతమ్ము పంపె మనపై?
ఎవని కృపచే ఉదయాస్తమాలలో పూలవాసనలతో చల్లని పిల్ల వాయువులు వీచె?

ఎవడుచిన్నారి పాపల బోసి నవ్వుల కారణంబు?
వాడె వృద్ధుల పండు నొసబొమల వెనక దాగియున్న
ఆర్ద్రతా పూరిత మమతల వృద్ధి జేయు.

ఎవడు పంచకోశాత్మిక మానవాళిని సృజియించి తోడుగా
పాంచభౌతిక బ్రహ్మాండమ్ము కానుకగా నొసంగె?

నామరూపరహితమా మహాచైతన్యశక్తి
జీవజగదీశ్వర త్రిపుటిగా వ్యాపించి భాసించు మూర్తి

వానినొక విగ్రహముగా మలిచి పూజింప జాల
పేరు, ఊరు లేని వాని పేరు పెట్టి పిలువజాల
వాని నశరీరు, గుడి కట్టి బంధింపజాల.
నేనె నా శరీర దేవళమ్ము వీడి,
ఆ అవ్యక్తమూర్తిలో కలిసిపోదు: కలిసి,
ఈ సుందర ప్రకృతి నెల్ల తానుగా తలపోసి
తిలకించి తరియింతు నెపుడు..

Posted in December 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!