అతను ఆమె
పెంచుకున్న
చెట్టుకు
కాసుల ఆకులకు కొదవలేదుగాని
ప్రేమ ఆప్యాయతలకే
కరువు వచ్చింది
ఆ చెట్టుకు పువ్వులు పూయలేదు మరీ
తుపానుకు గురైన పడవల్లా
చెల్లాచెదురైపోయిన
పిల్లలను చూస్తుంటే
అర్థమవుతున్నది
ఆమె నిత్యం ఎగిసిపడే కెరటమని
అతను కోతకు గురైన తీరమని
ఎందుకండీ
మీ ప్రతి కవిత
మనసును తడుపుతుందని
అడిగిందామె
నేల తడిస్తేగా
విత్తనం నాటేది
అన్నాడతను
తడిచిన మనసులో
వికసించిన మొక్కై
కదిలిందామె
అతని చేతులు
క్రూరత్వంతో
ఆమె తనువెల్లా కాయలు కాసేలా చేసాయి
అతని మాటలు
మృగత్వంతో
ఆమె కడుపులో కత్తులను గుచ్చాయి
అందుకే
ఆమె
వీపుకు రాయిని కట్టుకుని
బావింటికి వెళ్ళింది
ఆ బావికి ఆమెకు ఏ బంధుత్వం ఉందో ఏమో
ఆమె తిరిగి రాలేదు
మరో పడక సుఖానికి పరుపుగా
మారిన అతను ఆమెకై ఎదురుచూడనేలేదు
లంగరుతెగిన పడవల్లా మారిన ఆ పిల్లలకు
ఏ తీరం దొరకనే లేదు
తూర్పున ఆట మొదలుపెట్టిన
సూర్యుడు
పడమరన పడుకోవడము
జరిగిపోయింది కానీ
ఆమె చేతులు కంచంలో కడగనేలేదు
అతను ఆమె మనసును మద్యం మత్తుతో
ఎడపెడ కడిగేసాడు మరి
అతనికి తెలిసిన
చుక్కల ప్రపంచం
ఆమె
ఆమెకు తెలిసిన
చుక్కల ప్రపంచం
అతనే
వారిరువురికి తెలిసిన
చుక్కల ప్రపంచం
సంసారమే
ఎందుకండీ
ఆడవాళ్లపై
అఘాయిత్యాలు
పెరిగిపోతున్నాయని
అడిగిందామె
ఆన్లైన్
అంగట్లో
అనవసరమైన
దృశ్యాలు
పెరిగినందుకన్నాడతను
రోగానికి మూలం
తెలిసినందుకు
సంతోషించాలో
మందు లేదని తెలిసి
ఆవేదన పడాలో
తెలియని చిత్రమైన స్థితిలో
చిన్నబోయిన పువ్వులా
కదిలిందామె