విదర్భ దేశాన్ని పరిపాలించే చక్రవర్తికి ఒకసారి తీవ్ర అనారోగ్యం చేసింది. ఏం తిన్నా కడుపులో ఇమడడం లేదు. వాంతులు, విరోచనాలతో పాటు తరచుగా జ్వరం తగులుతుండడం వలన బాగా నీరసించిపోయాడు. రాజ వైద్యులు మూడు నెలలపాటు తీవ్రం గా శ్రమించి మందులు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం తప్ప రోగం తగ్గలేదు.
ఇక చక్రవర్తిని పట్టి పీడిస్తున్న విచిత్ర వ్యాధిని తగ్గిస్తే మంచి బహుమతి ఇస్తామని ప్రకటించారు. రాజ్యం లో వున్న నిష్ణాతులైన వారెందరో వచ్చి వారి వైద్య పరిజ్ఞానంతో ప్రయత్నించినా ఏం లాభం లేకపోయింది.
ఆహారం ఇమడని కారణంగా చక్రవర్తి బాగా నీరసించిపోయి మంచానికే పరిమితం అయ్యాడు.
పొరుగు దేశాల నుండి వైద్యుల్ని రప్పించాలన్న మహారాణి సూచనలను చక్రవర్తి ఒప్పుకోలేదు. పొరుగు దేశాలతో చక్రవర్తికి సత్సంబంధాలు లేవు పైగా చక్రవర్తికి అనారోగ్యం అనగానే అదను కోసం ఎదురుచూస్తున్న వారు యుద్ధానికి రావచ్చు కూడా. అందుకే తన అనారోగ్యం తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించసాగాడు.
ఈ నేపధ్యంలో ఒకరోజు మహామంత్రి వచ్చి చక్రవర్తిని కలుసుకున్నాడు. "మహారాజా, మీ ఆరోగ్యంపై దేశంలో ఎన్నో పుకార్లు వ్యాపిస్తున్నాయి. పొరుగు దేశాల శత్రు రాజులు మన మీద దండెత్తి రావడానికి పధకాలు రచించుకుంటున్నారని మన గూఢచారులు సమాచారం అందించారు. అందుకే మీరు త్వరగా కోలుకోవడం రాజ్య క్షేమం దృష్ట్యా ఎంతో అవసరం. నేను మీకు వైద్యం చేయగల సమర్ధుడి గురించి వాకబు చేయగా గంగా తీరంలో ఒక సాధువు వున్నారని, ఎటువంటి మొండి వ్యాధులనైనా ఇట్టే నయం చేయగల అపర ధన్వంతరి అని ప్రసిద్ధి కెక్కారు. అయితే ఆయన ఎక్కడికీ రారని, రోగే ఆయన దగ్గరకు వెళ్ళాలని, రోగి స్థితి బట్టి వైద్యం చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారని తెలిసింది. మీరు అనుమతిస్తే ఆయనను సంప్రదించి మీరు ఆయన ఆశ్రమానికి వెళ్ళే ఏర్పాట్లు చేయిస్తాను" అని విన్నవించుకున్నాడు.
ఆ మాటలకు అసలే రోగంతో బాధ పడుతున్న చక్రవర్తికి అరికాలి మంట తలకెక్కింది. "నేను చక్రవర్తిని, అందరూ నాకు బానిసలే. నేను అక్కడికి వచ్చే ప్రసక్తే లేదు. ఆ సాధువునే ఇక్కడికి రమ్మని చెప్పండి. ఒకవేళ రానంటే బలవంతంగా ఈడ్చుకు రండి" అని ఆదేశించాడు. మహామంత్రికి ఈ మాటలు రుచించకపోయినా చక్రవర్తి కి ఎదురు చెప్పలేక ఆ సాధువుని తీసుకువచ్చేందుకు తానే సైనాధిపతి, కొందరు సైనికులతో కలిసి స్వయంగా బయలుదేరాడు.
మూడు రోజుల తర్వాత గంగా తీరంలో వున్న ఆ సాధువు ఆశ్రమానికి చేరుకున్నాడు మహామంత్రి. అక్కడ అంతా రోగులతో తిరనాళ్ళలా కిట కిట లాడుతోంది. అయిదు గంటలు వేచి వున్నాక సాధువుని కలిసి మహారాజు ఆనారోగ్యం గురించి విపులంగా తెలిపాడు.
అంతా విన్న సాధువు కాస్సేపు ధ్యానంలోకి వెళ్ళి, తర్వాత కళ్ళు తెరిచి "మీ చక్రవర్తికి వచ్చింది ??? అనే ఒక విచిత్ర వ్యాధి. దీని నివారణ కొన్ని ప్రత్యేకమైన మూలికల వలననే సాధ్యం. మీ చక్రవర్తిని ఇక్కడికి రప్పించండి. నా శక్తి మేరకు కృషి చేసి వ్యాధిని తగ్గిస్తాను" అన్నారు.
“అదే అసలు సమస్య. మా చక్రవర్తి ఎక్కడికీ రారు, మిమ్మల్నే అక్కడికి రమ్మన్నారు, ఆయన అభర్ధనను మన్నించి మా రాజ్యానికి విచ్చేయండి" అని మహామంత్రి ప్రార్ధించాడు.
అందుకు సాధువు ఎంతమాత్రము ఒప్పుకోలేదు. రోగి వద్దకు వెళ్ళడం తన విధానం కాదని స్పష్టంగా చెప్పాడు. మహామంత్రి ఎంతగా అభ్యర్ధించినా సాధువు ఒప్పుకోలేదు. పైగా తన సమయం వృధా చెయ్యొద్దని, తక్షణం తిరిగి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు.
అంతవరకు జరిగే తతంగాన్ని చూస్తున్న సైనాధిపతికి చివ్వున కోపం వచ్చింది. వెంటనే ఆగ్రహావేశాలతో కత్తి ఎత్తి సాధువుని బంధించబోయాడు.
అతడిపై సాధువు తీక్షణమైన దృష్టితో చూడగానే సైనాధిపతి విచిత్రం గా విరుచుకు పడిపోయాడు. కాళ్ళు చేతులు గిల గిల కొట్టుకుంటుందగా మిగితా సైనికులు అతడిని మోసుకుపోయారు.
ఉప సైనాధిపతి, మరి ఇద్దరు సైనికులతో సాధువుపై పడ్డారు. వారికి సాధువు తపోశ్శక్తి వలన అదే గతి పట్టింది. అసలు విషయం అర్ధం చేసుకున్న మంత్రి సైనాధిపతి, మిగితా పరివారంతో తిరిగి రాజ్యం చేరుకొని చక్రవర్తితో జరిగిన విషయం చెప్పాడు.
చక్రవర్తి మండిపడి ఇంకా సైన్యాన్ని పంపిద్దామన్నాడు. లేదంటే స్వయంగా యువరాజును తీసుకువెళ్ళమన్నాడు. ఒక అల్పమైన సాధువు దగ్గరకు తాను స్వయంగా వెళ్ళే ప్రసక్తే లేదన్నాడు.
ఇంతలో గూఢచారులు వచ్చి తూర్పున, ఉత్తరాన రెండు రాజ్యాధిపతులు మన దేశంపై దండెత్తి వచ్చేందుకు సైన్య, అశ్వ, గజ బలగాలను పెద్ద ఎత్తున సిద్ధం చేసుకుంటున్నారన్న వార్త అందించారు.
అప్పుడు మహామంత్రి కల్పించుకొని "రాజా, ఈ విషయంలో తమరు మొండి పట్టుదల వీడడం మంచిది. ఆ సాధువు ఎంతో తపశ్శక్తి కలవాడు. అతని ముందు మన సైన్యం శక్తి ఏపాటిది? అపర ధన్వంతరిగా పేరు తెచ్చుకున్నాడు. పైగా వైద్యో నారాయణో హరి: అన్నారు అంటే వైద్యుడిని సాక్షాత్తు నారాయణుడితో సమానంగా భావించాలన్నది అర్ధం. దేవుడిని దర్శించేందుకు మనం గుడికి వెళ్తున్నప్పుడు, దేవుడితో సమానం అయిన వైద్యుడిని కలిసేందుకు ఆయన దగ్గరకే వెళ్తే తప్పేమిటి? పైగా మీ రోగానికి అరుదైన మూలికలతో చికిత్స చేయాల్సి వుంటుంది. అది అతని ఆశ్రమం లోనే సాధ్యం. ఒకవేళ కొత్త మూలికలు, పసర్లు చేయాల్సి వస్తే అతని ఆశ్రమం సమీపంలో వున్న అడవులలో మాత్రమే అవి దొరుకుతాయి. అదీకాక రాజ్యంలో వున్న మొత్తం సైన్యాన్ని పంపినా లేక ఆయన నిలువెత్తు ధనం పోసినా ఆయనను ఇక్కడికి తీసుకురావడం అసాధ్యం" అని సవినయంగా ఒప్పించాడు.
ఆ మాటలకు చక్రవర్తి కొద్దిగా మెత్తబడ్డాడు. అహంకారం తో నిండి ఉన్న పొరలు నెమ్మదిగా విచ్చుకున్నాయి. అన్నిచోట్ల అధికార దర్పం,డబ్బు గర్వం పనికి రావని, గురుతుల్యులు, మహాత్ముల ముందు తలవంచడం తక్కువ కాదని, పైగా తానున్న పరిస్థితులలో సాధువును త్రికరణ శుద్ధిగా సేవించి రోగాన్ని సత్వరం తగ్గించుకోవడమే వివేకమని అర్ధం చేసుకొని చక్రవర్తి స్వయంగా వెళ్ళి, సాధువు ఆశ్రమంలో నాలుగు నెలలు గడిపి పూర్తి స్వస్థత పొంది తిరిగి తన రాజ్యానికి తిరిగివచ్చి ఎప్పటిలాగే జనరంజకంగా పాలించసాగాడు.