తెలుగింటి సరదాలు
ఆవకాయ సీ. మా కందు మాకంద(1)మో కర్కటి(2)యొ మోచ కం(3)బొ మాకంది(4)యో కార మావ పిండి, క్షారము(5) చేర్చి ఖండంబులకు, తైల సంస్కార మొనరించి, స్వాదురుచికి బెల్ల మల్లంబొ వెల్లుల్లియో పెసరపిం డియొ జీడిపప్పొ వేన్నీళ్లొ కాని జతజేర్చి జాడీల శ్రద్ధతో నిల వుంచ నోరూర చేసెడి యూరుగాయ తే.గీ. ఆవకాయగ ప్రత్యక్ష మగును తెలుగు వారి యునికికి చిహ్నమై బహువిధముల బలము, రోగనిరోధకపాటవంబు, రుచికి తోడయి నిలువంగ రుచిర(6) మగుచు (1) మామిడి (2) దోస (3) మునగ (4) ఉసిరిక (5) ఉప్పు (6) ఇంపయినది పండుగ సీ. దండిగా కలలెన్నొ పండించి సుఖశాంతు లండగా నుండ చెండాడి వెతల గండుసమస్యల, గుండిగల్ కొనితెచ్చి గుండియల్ ప్రేముడి నిండ వండి పిండివంటలును కూష్మాండాదిశాకమ్ము లెండబెట్టినవి వేగించి చేర్చి కొండంత వేడుక “కొం” డంచు వడ్డించి కుండలతో చెల్మి కుమ్మరించి తే.గీ. చెండు(1) లాడుచు బంధుల చేరి క్రొత్త గుండలను(2) చేతి కందించి గుండె లలర మెండుగా సందడిని కూర్చు మేళవంబె కుండకము(3) లేని తెలుగింటి పండు వగును (1) పూలబంతులు (2) బట్టలను (3) కొఱత/లోటు