Menu Close
పెళ్ళిసందడి (నాటిక)
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం --

రమేష్ – “సార్, మినిస్టరుగారి ఇంట్లో పెళ్ళిలో; కళ్యాణ మండపం డెకొరేషనుకి; మీకు చెప్పేను కదా సార్; పువ్వులు; ముఖ్యంగా రోజెస్; కాష్మీర్ నుండి వస్తాయి అని... మీకు చెప్పానో లేదో సార్; కల్యాణ మండపం తయారు చెయ్యడానికి; వర్కర్సు ఒడిశా నుండి వస్తారండి. హాల్ డెకొరేషన్ కూడా వాళ్ళే చేస్తారండి.”

ప్రసాద్ - "అలాగా; ఆ పనుల్లో ఒడిశాకు బాగా పేరుంది లెండి."

రమేష్ - "వాళ్ళు చాలా డిమాండు లో ఉంటారండి. వెంటనే బుక్ చేసుకోవాలి."

ప్రసాద్ – “మీరు ఇమేజ్ బిల్డింగ్; అన్నారు. పువ్వులు ఎక్కడినుండి వచ్చేయి; డెకొరేషన్ వర్కర్సు ఎక్కడినుండి వచ్చేరు; ఆ డీటైల్సుకు ఇమేజ్ బిల్డింగ్ కి ఏమిటి కనెక్షన్.”

రమేష్ – “సార్, అటువంటి డీటైల్స్ అన్నీ.. మీకు మాకు తెలుసు గాని; పెళ్ళికి వచ్చిన గెస్టులకి తెలీదు కదా సార్.”

ప్రసాద్ – “అవును; వాళ్లకి ఎలా తెలుస్తుంది. అయినా వాళ్లకి ఎందుకా డీటైల్స్.”

రమేష్ – “ఆ డీటైల్స్ తెలిస్తే; మినిస్టరు గారు పెళ్లి ఏ లెవెల్లో చేస్తున్నారో; పెళ్ళికి వచ్చిన వాళ్లకు తెలుస్తుంది కదా సార్. వాళ్ళ ద్వారా పెళ్ళికి రానివాళ్లకు కూడా తెలుస్తుంది కదా సర్.”

ప్రసాద్ – “ఆ.. you have a point.”

(అంతలో సంభాషణ రాకేష్ అందుకొంటాడు)

రాకేష్ - అవి ఒక్కటే కాదు సార్. పెళ్ళికొడుకు వివరాలు; ఆయన ఏం చేస్తున్నారో; ఆయన తండ్రిగారి వివరాలు;  అటువంటివన్నీ ఇన్విటేషనులో ఉండవు కదా సర్. గెస్టులకు ఆ డిటైల్స్ తెలిస్తే; మినిస్టరు గారు; అమ్మాయి కి ఎంత మంచి సంబంధం చేసేరో.. వచ్చిన వాళ్లందరికి తెలుస్తుంది కదా సార్.”

ప్రసాద్ – “మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఆ డీటైల్సు అన్నీ.. పెళ్ళిలో మైకు పెట్టి ఎనౌన్సు చెయ్యలేం గదా.”

రమేష్ - "అందుకే మా ఇమేజ్ బిల్డింగ్ సర్వీస్ సార్."

ప్రసాద్ - "మీరేమిటి చేస్తారు!”

రమేష్ - "మేము చేసిన పనులలోని ప్రత్యేక  వివరాలు… పువ్వులు ఎక్కడినుండి వచ్చాయో.. డెకొరేషన్ వర్కర్స్ ఎక్కడినుండి వచ్చారో.. అటువంటివన్నీ మాకు తెలుసు కదా సార్. పెళ్ళికొడుకు చదువు వివరాలు.. అటువైపు పెళ్లిపెద్దల వివరాలు మీ దగ్గర తీసుకొంటాం సార్..."

ప్రసాద్ - "ఏమిటో ఇంటరెస్టింగుగా ఉన్నాది; చెప్పండి."

రమేష్ - "మిడిల్ ఏజ్ లో ఉన్న అయిదారుగురు మగవాళ్లకు; అయిదారుగురు ఆడవాళ్ళకు; ముందుగా ఆ వివరాలన్నీ చెప్తాము సార్. వాళ్ళు ఏమిటి చెయ్యాలో వాళ్లకు బోధపరుస్తామండి. మా ఇన్స్ట్రక్షన్సు ప్రకారం.. ఒక్కొక్కరు.. వేరే వేరే చోట్ల.. పెళ్లికొచ్చిన గెస్టులతో కలసి కూర్చొంటారు సార్. క్రమక్రమంగా వాళ్ళను సంభాషణలోనికి దింపి.. సందర్భం చూసుకొని; ‘చూసేరా; ఆ పువ్వులు కాష్మీర్ నుండి వచ్చేయిట; ఆ కళ్యాణ మండపం చెయ్యడానికి; ఒడిశానుండి వచ్చేరట వర్కర్సు' అని వివరాలు ఒక్కొక్కటి వాళ్ళ చెవుల్లో వేస్తారు సార్. తరువాత ఆ గెస్టులు వాళ్ళ బంధువులకి.. ఫ్రెండ్సుకి చెప్పొచ్చు. అలా.. మినిస్టరుగారి అమ్మాయి పెళ్లి ఏ లెవెల్లో అయిందో... మగపెళ్ళివారి స్టేటస్సు... ఊళ్ళో నలుగురికి తెలుస్తుంది కదా సార్.”

ప్రసాద్ - "ఆడవాళ్ళ చెవుల్లో వేస్తే ఆల్ ఇండియా న్యూస్ అవుతుంది. సరే; ఇది బాగానే ఉన్నట్టుంది.”

రమేష్ - "ఈ సర్వీసు ఏడ్ చెయ్యమన్నారా సార్."

ప్రసాద్ - "ఆ.. ఏడ్ చెయ్యండి."

రమేష్ - "Thank you sir."

రాహుల్ - "సార్. మీకు టైము ఉంటే.. మాది.. మరో ఇంపార్టెంట్ సర్వీస్ గూర్చి చెప్తాను సార్."

ప్రసాద్ - "ఫరవాలేదు, ఇంపార్టెంటు అంటున్నారు; చెప్పండి."

రాహుల్ - "సార్, పెళ్లిళ్లకు కొందరు లేడీస్ చంటిపిల్లలు చిన్న పిల్లలతో వస్తారండి."

(ఆ మాటలు చెవిలో పడగానే సంతోషి రంగప్రవేశం చేసి భర్త పక్కకు చేరుతుంది.)

సంతోషి - "అవును; వాళ్ళని ఇళ్ళళ్ళో వదిలేయలేరు కదా."

రాహుల్ - "మీకు తెలిసే ఉంటుంది మేడం గారూ. వాళ్లకు ఆ పిల్లల్ని మేనేజ్ చెయ్యడం ప్రోబ్లెం అవుతూ ఉంటుంది."

సంతోషి - (భర్తతో) "ఆ అబ్బాయి చెప్పింది నిజమేనండి. మీ చిన్నక్కయ్యగారి స్వర్ణ పెళ్ళిలో; మన కిషోర్; అప్పటికి మూడేళ్ళవాడనుకొంటా; నన్ను నానా తిప్పలూ పెట్టేడు. ఎప్పటికప్పుడు చెయ్యి విదిలించుకుని పారిపోతూ ఉండేవాడు. వాణ్ని వెతికి పట్టుకోడంలోనే నా టైమంతా అయిపోయింది. దానితో సగం పెళ్లి చూడలేక పోయేను. మీకదేమీ తెలీదు. దర్జాగా మొగవాళ్ళ మధ్య కూర్చొని బాతాఖానీ చేస్తూండేవారు."

ప్రసాద్ - "నాకు తెలీకపోవడం ఏమిటి సంతోషీ. వాణ్ని తీసుకొచ్చి; నాకు అప్పచెప్పేసి; వీడు ఎటూ పారిపోకుండా జాగ్రత్తగా చూడండని ఓ ఆర్డరు వేసి వెళ్లిపోయేవ్."

సంతోషి - "సరేలెండి. అది అటుంచి చిన్నపిల్లలతో వచ్చినవాళ్ళకు వీళ్ళు ఏమిటి చేస్తారో విందాం."

రాహుల్ - "మేడం గారూ; ఆ సమయంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొంటూ; వాళ్ళని చిన్న ఆటలలో ఎంగేజ్ చెయ్యడానికి; ట్రైన్డు నర్సులను ఎరేంజ్ చెయ్యగలమండి."

సంతోషి - "అది బాగానే ఉంది. కొందరు తల్లులు చంటిపిల్లలతో వస్తారు; వాళ్ళ మాటేమిటి.”

రాహుల్ – “ఆ నర్సులు చంటిపిల్లల్ని చూసుకొంటూ; వాళ్లకు అవసరమయిన సేవలు కూడా చేయగలరు మేడం."

సంతోషి - "చంటి పిల్లలు, చిన్న పిల్లలతో వచ్చిన ఆడవాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు హేపీగా ఫీలవుతారు."

ప్రసాద్ - "మరేం; మేడంగారు రికమెండు చేస్తున్నారుగదా. ఇది కూడా ఏడ్ చెయ్యండి."

రాహుల్ - "Thanks sir. మేడంగారు మీకు కూడా థేంక్సండి."

సంతోషి - (భర్తతో) "పెళ్ళిలో మంగళ వాయిద్యాలు మాట ఆలోచించేరా ."

ప్రసాద్ - "సంతోషీ బాగా జ్ఞాపకం చేసేవ్."

రమేష్ - "మంగళ వాయిద్యాలు మేము ఎరేంజ్ చెయ్యగలం సార్."

సంతోషి - "చక్కగా సన్నాయితో ‘సీతారాముల కళ్యాణము చూదము రారండీ’ వంటి పాటలు వినిపించాలి గాని, చెత్త సినిమా పాటలు మాత్రం వాయించకూడదు."

రమేష్ - "ఆ సినిమా పాటలు వాయించే బృందాలు వేరే ఉన్నారు మేడం. మినిస్టరుగారి ఇంట్లో పెళ్ళికి వాయించే బృందం వేరే ఉన్నారు మేడం. వాళ్ళు అన్నీ క్లాసికలువి; అన్నీ పెళ్లిళ్ల పాటలు; మీరు చెప్పినట్లు; సీతాకళ్యాణం వంటివే వాయిస్తారు మేడం."

సంతోషి - "మంచిది. ఆ సమయంలో అవే బాగుంటాయి. (భర్తతో) సరే; మిగతావి మీరు చూసుకోండి. నాకు వంటింట్లో పని ఉంది. వెళతాను."

(సంతోషి నిష్క్రమించును)

ప్రసాద్ - "ఇంపార్టెంటువి డిస్కస్ చేసేం. ఇంకా చిన్న చిన్న విషయాలు చాలా ఉంటాయి. నేను మీకు చెప్పేది ఏమిటంటే; ఈ ఫంక్షన్లో A-Z, అన్నీ మీరే చూసుకోవాలి. పెళ్ళిలో గెస్ట్లను రిసీవ్ చేసుకోడం; కావలిసిన ఫర్నిచరు ఎరేంజ్ చేసుకోవడం; అటువంటివి అన్నీ మీరే చూసుకోవాలి. ఏ విషయంలోను; ఇది మాకు చెప్పలేదు సార్; అని మీరు అనకూడదు. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. ఆ.. మీకు చెప్పాలి. నేను సిద్ధాంతిగారితో మాట్లాడేను. ఆయనకు కావలిసిన సామగ్రి ఆయన తెచ్చుకొంటారు. మిగతావన్నీ మీరే చూసుకోవాలి."

రమేష్ - "మీకు గేరంటీ ఇస్తున్నాం సార్. పెళ్ళిలో మా తరఫున మీకు ఏ లోటూ రాదు సార్. ఏ విషయంలోనూ మీకు కంప్లైంటు చెయ్యవలసిన అవసరం రాదు సార్."

రాకేష్ - "మీ వంటి పెద్దల మెప్పు సంపాదిస్తే, మీరే మరో నలుగురు పెద్దింటివాళ్లకు మమ్మల్ని రికమెండ్ చేస్తారు సార్."

ప్రసాద్ - "you are correct. పెళ్ళికి పెద్ద పెద్ద వాళ్ళొస్తారు. మీ సర్వీస్ చూసి; వాళ్ళే మిమ్మల్ని మీ బిజినెస్ కార్డులు అడుగుతారు."

రమేష్  - "మీరు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నాం సర్. (కొన్ని క్షణాలు ఆగి) సార్, కొటేషన్స్ విషయంలో; ఏవైనా సలహాలు...

ప్రసాద్ - "మీరు కొటేషన్స్ పట్టుకొని రేపు సాయంత్రం నన్ను ఆఫీసులో కలియండి. అప్పుడు అన్నీ మాట్లాడుకొందాం."

(రమేష్, రాకేష్, రాహుల్; ముగ్గురూ నిలబడి)

"Thank you సర్. రేపు మీ ఆఫీసుకు వచ్చి కలుస్తాం సర్."

ప్రసాద్ - "మధ్యాహ్నం 5 తరువాత ఫోను చేసి రండి."

(ముగ్గురూ మరోమారు thanks చెప్పి నిష్క్రమిస్తారు)

(ప్రసాద్ సురేష్ కు ఫోను చేస్తాడు)

ప్రసాద్ - "సురేష్, పడుకొన్నావా ఏమిటి... నీకు thanks ఎలా చెప్పాలో నాకు తెలీదు. . . అలా అనకు...నువ్వు ఆ ఈవెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళని సజెస్ట్ చెయ్యకపోతే నేను మేనేజ్ చెయ్యలేకపోయి ఉందును... no no no - it's a fact. ఆ..వాళ్ళు చాలా ఎక్స్పీరియెన్సుడు వాళ్ళలా ఉన్నారు... ఆ.. అన్ని విషయాలు; డీటైల్డుగా మాట్లాడేను. వాళ్లకు క్లీయరుగా చెప్పేను; A to Z అన్నీ మీరే చూసుకోవాలి అని... ఎప్పుడూ మనం వినని సర్వీసులు ఏవో వాళ్ళు చెప్పేరు సురేష్. ఇంటెరెస్టింగుగా ఉన్నాయి. నీకు లేటయిపోతుంది; పడుకో; రేపు నీకు వాటి డీటైల్సు చెప్తాను. Once again thank you. గుడ్ నైట్ సురేష్."

(సంతోషి ప్రవేశిస్తుంది)

సంతోషి - "ఏమండి, సీతాలు పెళ్ళికి; మూడు జతలైనా గాజులు కొనుక్కోవాలండి. (తన చేతి గాజులు చూపిస్తూ) ఇవన్నీ పాతబడిపోయేయండి. ఇవి కూడా మార్పించి; కొంత బంగారం వేయించి; కొత్తవి చేయించుకోవాలండి."

ప్రసాద్ - "సంతోషీ, ఈ పెళ్లి తతంగం అయ్యేక; సీతాలు పెళ్ళికి నీకు ఏమిటేమిటి కావాలో తీరిగ్గా ఆలోచిద్దాం."

సంతోషి - "ఇప్పటినుండి చేయించుకోకపోతే అప్పటికప్పుడు తయారవ్వవండి."

ప్రసాద్ - "అయితే ఏమిటి చేద్దామంటావ్."

సంతోషి - "ఆ నగల దుకాణం వాడు వచ్చేడు కదండి. అతగాడితో చెప్తే; వేళకు అందిస్తాడండి."

ప్రసాద్ - "సరే; బోధపడింది. ఇందులోనుండి బయటపడ్డాక ఆలోచిద్దాం."

(సంతోషి ఏదో మాట్లాడబోతూండగా ప్రసాద్ కు ఫోను వస్తుంది. ఫోను ఎత్తుకొని ప్రసాద్ సంతోషిని మాట్లాడవద్దని సౌజ్ఞ చేస్తాడు)

ప్రసాద్ - నమస్కారం సర్; ఏర్పాట్లన్నీ.. ఆల్మోస్ట్..అయిపోయేయి సర్....... ఏమిటయింది సర్....... మీరు చాలా అదృష్టవంతులు సర్. పెద్ద గండమే తప్పింది ........ అలాగే సర్.... అలాగే సర్ ... definitely సర్. ఇప్పుడే వాళ్ళందరికీ  చెప్తాను సర్. ... ఉంటాను సర్."

సంతోషి - "మినిస్టరుగారికి ఏమిటయిందండి. అంత గాభరా పడుతున్నారు."

ప్రసాద్ - "మినిస్టరుగారికి ఏమీ కాలేదు."

సంతోషి - "మరి..."

ప్రసాద్ - " వాళ్ళ అమ్మాయికి కుదిరిందే… అమెరికా సంబంధం… ఆ పెళ్ళికొడుకు… ఉట్టి ఫ్రాడ్ వెధవట. ఇప్పటికి; అప్పుడే రెండు పెళ్లిళ్లు  చేసుకున్నాడట."

సంతోషి - "అయ్యో! అదేమిటండి! అమెరికా సంబంధం అంటే.. ఏదో చాలా.. పెద్ద సంబంధం అనుకొన్నాను. ఉట్టి మోసగాళ్ళన్నమాట. వీళ్లకు అది ఎలా తెలిసిందండి.”

ప్రసాద్ - "మేడంగారు; నిన్నరాత్రి ఒక  పెళ్ళికి వెళ్ళేరట. అక్కడ ఆవిడకు ఒకావిడ ఈ విషయం చెప్పిందట. ఆవిడ బంధువులెవరో; ఆ స్కౌండ్రల్ గోతిలో పడ్డారట. ఆ వెధవ ఫేమిలీ అందరూ ఫ్రాడ్ వాళ్లేనట. అది తెలిసేక మేడంగారు సంబంధం కేన్సిల్ చేసుకున్నారట."

సంతోషి  - "అమ్మాయి నిజంగా.. అదృష్టవంతురాలు. పెద్ద.. గండం తప్పింది."

(తెర పడును)

****సమాప్తం****

Posted in April 2023, నాటికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!