Menu Close
అందమైన అల్లరి (కథ)
-- రాజ్యలక్ష్మి బి. --

“మీరు రోజూ సాయంకాలం గుడికి వస్తారా?” అని అడుగుతున్న వ్యక్తిని తలెత్తి చూసింది శ్రీలత.

“అవును, ఎందుకు?” కోపంగా అతనికేసి చూసింది.

“నేనూ గుడికి వస్తుంటాను, డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్నాను, మీ ప్రక్కవీధిలో రూమ్ తీసుకున్నాను, నా కాలేజీ బస్ స్టాప్ మీ వీధి లో వుంది. నా పేరు సీతారాం.” తన్ను తాను పరిచయం చేసుకున్నాడు.

శ్రీలత అతన్ని తేరిపారా చూసింది. శ్రీలత కు చిలిపితనం ఎక్కువ. హైస్కూల్ చదువుతో ఆపేసింది. తల్లికి అనారోగ్యం! పదహారేళ్ల వయసు సరదాలు, గడుసుతనం, ముఖ్యంగా పిరికికితనం లేదు. ఇంట్లో మెరుపుతీగ లాగా అన్ని పనులు చూసుకుంటూ, ఫ్రెండ్స్ తో సరదాగా వుంటుంది. సన్నగా నాజూగ్గా అందంగా వుంటుంది. సీతారాం రెండు నెలలనించి శ్రీలతను గమనిస్తున్నాడు. అతనికి శ్రీలతతో స్నేహం చెయ్యాలని మహా కోరికగా వుంది. మొత్తానికి యెలాగైతేనేం గుళ్లో శ్రీలతను పలకరించాడు.

“నా పేరు శ్రీలత, మీ పేరేం బాగోలేదు” అంటూ మూతి ముడిచింది.

“పేరు నచ్చక పోయినా నేను నచ్చానా?” అంటూ గుళ్లోనించి బయటకు వెళ్తున్న శ్రీలతను అడ్డుకున్నాడు. శ్రీలతకు విసుగేసింది.

“అసలు మీ గోలేమిటి?” నిలేసింది.

“అయితే వినండి. పోయిన ఆదివారం మీరు సినిమాకు వెళ్లారు కదా, అప్పుడు నేను అక్కడే వున్నాను. నేను కూడా మీ వెనక సీటులో కూర్చున్నాను. ఇంట్రవెల్ లో మీరు కూల్ డ్రింక్ త్రాగారు. నేను కూడా త్రాగాను, మీరు ఆటోలో వెళ్లిపోయారు. నేను నడుచుకుంటూ వెళ్లిపోయాను. మీ కళ్లు, నవ్వు చాలా బాగున్నాయి” అన్నాడు సీతారాం.

“అయితే నన్నేం చెయ్యమంటారు?” శ్రీలత విసుక్కుంది.

“నేను, నా ఫ్రెండ్ డబ్బులు వాడుకుని సినిమాకు వచ్చాను. నా పర్సు ఖాళీ! మీరు నాకు అయిదువందలిస్తే నేను నెలాఖరుకు యిస్తాను, నన్ను చూస్తున్నప్పుడు మీ కళ్లల్లో నవ్వు కనిపిస్తున్నది, ఆ నవ్వంటే నాకెంతో యిష్టం. మీరు యిప్పటికిప్పుడు నన్ను అర్జెంట్ గా ప్రేమించక్కర్లేదు లెండి” అన్నాడు సీతారాం.

శ్రీలతకు అతని మాటకారితనానికి నవ్వూ, కోపం, విసుగూ, చిరాకు కలిసికట్టుగా వచ్చాయి. కొంచెం సేపు ఆలోచించింది.

“అయితే యింటికి రండి, మా నాన్నను అడిగి యిప్పిస్తాను” అన్నది.

సీతారాం బిత్తరపోయాడు.

“వద్దులేండి, మీ దగ్గర లేనట్టున్నాయి, ఇంకెక్కడన్నా ప్రయత్నిస్తాను” అంటూ గబగబా వెళ్లిపోయాడు. శ్రీలత నవ్వుకుంది.

మర్నాడు సాయంకాలం ఆటోలో శ్రీలత బజారెళ్లింది. దోవలో సీతారాం కనపడ్డాడు. ఆటో ఆపింది.

“సీతారాం గారూ” పిలిచింది.

సీతారాం కంగారుగా ఆగాడు.

“మీరేమీ కంగారు పడకండి, నేను సినిమాకు వెళ్లడం లేదు. మీరు రూమ్ కి వెళ్లి తయారవక్కర్లేదు, మీ ఫ్రెండ్ దగ్గర అప్పూ తెచ్చుకోనక్కర్లేదు ..వూరికే పిలిచాను” అన్నది శ్రీలత.

సీతారాం సీరియస్ అయ్యాడు.

“మీరెక్కడికెళ్తే నాకెందుకు? మీ వ్యంగ్యాలక్కర్లేదు” రుస రుస చూస్తూ వెళ్లిపోయాడు. శ్రీలత నవ్వుకుంటూ ఆటోలో ముందుకెళ్లి పోయింది.

మరో వారం రోజుల తర్వాత శ్రీలత వీధి గుమ్మం దగ్గర నించుంది. ప్రక్కింటి వాళ్లబ్బాయి సుమారు ఆరేళ్లు వుంటాయి. వాడు శ్రీలత దగ్గర నించుని బజారు చూస్తున్నాడు. అదే సమయానికి సీతారాం వీధిలోకి మలుపు తిరుగుతున్నాడు. అల్లరి పిల్ల శ్రీలత బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది. బుజ్జిని దగ్గరగా పిలిచింది.

“ఒరేయి బుజ్జి, నీకు పదిరూపాయలిస్తాను, మన వీధిలోకి నడిచివస్తున్నాడే చూసావా అతన్ని రాయేసి గట్టిగా కొట్టి పారిపో, నేను తలుపు చాటునుంచి చూస్తాను. అతను వెళ్లిపోగానే డబ్బులిస్తాను సరేనా” అంటూ చేతిలో పదిరూపాయలు చూపించింది శ్రీలత.

బుజ్జి మొదట భయపడ్డాడు కానీ పదిరూపాయాల కోసం ఒప్పుకున్నాడు.

బుజ్జి రోడ్డు ప్రక్కన పదునయిన రాయి సీతారాం మొహానికి విసిరి కొట్టాడు కానీ కరెక్టుగా అదే సమయానికి సైకిల్ మీద వస్తున్న బట్టతల పెద్దమనిషి నుదురుకు రాయిదెబ్బ గట్టిగా తగిలింది. అతను క్రింద పడిపోయాడు, సైకిల్ హ్యాండిల్ వంకరయ్యింది.

సీతారాం పారిపోతున్న బుజ్జిని గట్టిగా పట్టుకుని మరో చేత్తో బట్టతల పెద్దమనిషిని లేపాడు. సైకిల్ నిలిపాడు.  ఆ బట్టతల పెద్దమనిషి నుదిటిమీద రక్తం తుడిచాడు.

“ఏరా వెధవా నీ ఆటలకు రోడ్డే దొరికిందా? చూడు. నెత్తురు ఎలా కారుతుందో పద మీయింటికెళ్దాం” అంటూ సీతారాం బుజ్జిని గట్టిగా బెదిరించాడు. బుజ్జి భయపడ్డాడు.

“లతక్కయ్య మీ మొహం మీద రాయేసి కొడితే పది రూపాయలిస్తానంది” అంటూ బిక్కమొహం వేసాడు బుజ్జి.

“లత ఎవరు?” అంటూ సీతారాం కేసి చూసాడు బట్టతలవ్యక్తి.

సీతారాం కు విషయం మొత్తం అర్ధమయ్యింది.

“పదండి వాళ్ళింటికెళ్లి కనుక్కుందాం, మీ పేరేమిటి?” అడిగాడు సీతారాం.

“నా పేరు రమణ, మా చెల్లెలు యిల్లు అడ్రస్ వెదుక్కుంటూ బయల్దేరాను. నేను యీ ఊరివాణ్ణి కాదు. పదండి ఆవిడింటికి వెళ్దాం” అన్నాడు రమణ.

బుజ్జి భయపడుతున్నాడు, చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నించాడు కానీ సీతారాం వదల్లేదు.

“నీకు డబ్బులిప్పిస్తాను పద” అంటూ ముగ్గురూ సైకిల్ తీసుకుని బయల్దేరారు.

శ్రీలత యింటి ముందు నించున్నారు. బుజ్జి, సీతారాం ప్రక్కగా నించున్నారు. రమణను తలుపు కొట్టమన్నాడు సీతారాం.

తలుపు కొట్టగానే శ్రీలత తండ్రి తలుపు తీసారు.

రమణ “మీతో మాట్లాడాలి లోపలికి రావచ్చా?” అని అడిగాడు. ఆయన తలుపు తియ్యగానే ముగ్గురూ లోపలికి వెళ్లి కుర్చీల్లో కూర్చున్నారు. రమణ నుదిటిపైన నెత్తురు శ్రీలత నాన్నగారు చూసారు. ఆయనకంతా అయోమయంగా వుంది. బుజ్జిని గుర్తుపట్టారు.

“మీ అమ్మాయిని ఒకసారి పిలిపిస్తారా?” అన్నాడు రమణ.

“అసలు మీరెవరు? మా అమ్మాయి ఎందుకు? ఏరా! బుజ్జి నువ్వేనా వీళ్లకు యిల్లు చూపించింది” కోపంగా అరిచారు శ్రీలత తండ్రి.

“అదంతా తర్వాత చెప్తాం, ముందు మీ అమ్మాయిని పిలవండి, యీ కుర్రాడికి పదిరూపాయలిచ్చి పంపండి” అన్నాడు రమణ సీరియస్ గా. బుజ్జి పదిరూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆయన శ్రీలతను పిలిచారు. శ్రీలత వచ్చింది. సీతారాంను, రమణను చూసింది. సీను మొత్తం అర్ధమయ్యింది.

“ఏమండీ లత గారూ, నేనేం అన్యాయం చేసాను మీకు? ఆ కుర్రాడి చేత రాయేసి కొట్టించారు?” అంటూ రమణ కోపంగా గట్టిగా అరిచాడు.

“నాకేమీ అర్ధం కావడం లేదు, ఏమ్మా ఏం జరిగింది?” శ్రీలతను తండ్రి ప్రశ్నించారు.

“నాన్నా, నేను ఈయన మీద రాయేసి కొట్టమన్నాను కానీ బుజ్జి పొరపాటున యీ బట్టతలాయన మీద కొట్టాడు” అంటూ సీతారాం కేసి చూసింది శ్రీలత.

“రాయి విసరమనడం యేమిటి? అతని మీద ఎందుకు విసరమన్నావు?” అంటూ శ్రీలతను కోప్పడ్డారు ఆమె తండ్రి.

“నాన్నా మీరిలా ఒక్కసారి లోపలికి రండి అంతా వివరిస్తాను” అంటూ శ్రీలత తండ్రిని లోపలికి తీసుకెళ్లింది. ఆయన లోపలి కెళ్తూ సీతారాం వైపు అనుమానంగా చూసారు. పది నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. వస్తూనే,

“మీ అబ్బాయి ఎక్కడ?” అంటూ సీతారాం కుర్చీ వైపు చూసారు సీతారాం. అక్కడ సీతారాం లేడు.

“మా అబ్బాయి ఎవరు? అతనెవరో నాకు తెలియదు” అంటూ రమణ వింతగా చూశాడు. రమణకు మహా చిరాకేసింది.

“చూడమ్మా లతా, ఈమారు నువ్వు యెవరినయినా రాయేసి కొట్టించాలనుకుంటే బాగా గురి చూసి కొట్టే పిల్లాణ్ణి వెతుక్కో” అంటూ రమణ తండ్రీ కూతుళ్లను కోపంగా చూస్తూ వెళ్లిపోయాడు.

మరో చిలిపి పనితో సీతారాం ను ఆటపట్టిద్దామనే ఆలోచనలు చుట్టుముడుతుంటే,

శ్రీలత నవ్వుకుంటూ లోపలికెళ్లింది.

********

Posted in April 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!