Menu Close
తెలుగు పద్య రత్నాలు 22
-- ఆర్. శర్మ దంతుర్తి --

తెలుగు సాహిత్యంలో మరుగున పడిపోయి మనం అందరం మర్చిపోయిన అనేకానేక చాటువుల్లో ఉన్న ఈ పద్యం చిన్న పిల్లలకి స్కూల్లో నేర్పించేది. ఈ పద్యం పోతన రాసాడంటారు కానీ దానికి ఆధారాలు లేవు. కవి ఎవరో తెలియని ఈ పద్యం చాటువుగా చెప్తున్నారు.

శా.
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
యుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

హిందువులలో చదువుల తల్లి సరస్వతి కదా? అందువల్ల పుస్తకం తీయగానే ముందు ఆవిణ్ణే తల్చుకుంటున్నారు. పద్యం మరోసారి చదివితే మనకి తెలిసేది ఏమిటంటే, చదువు మొదలు పెట్టేటపుడు, మాట్లాడేటపుడు నా మనస్సులో (ఉల్లము) లో ఉండి నేను మాట్లాడే మాటల్లో (నాదు వాక్కునను) జృంభణము (వికాసముతో కూడిన అతిశయము) ఉండేటట్టూ, మాట్లాడే పలుకులు మంచివిగా ఉండేటట్టు (సుశబ్దంబు శోభిల్లన్) చూడు తల్లీ అని అడుగుతున్నారు. చదివిన చదువు సంస్కారం నేర్పాలి కనక ఎలామాట్లాడాలో ఈ పద్యం చెప్తుంది.  ప్రార్ధించే ఆ సరస్వతి ఎటువంటిది? జగన్మోహిని, ఫుల్లాబ్జాక్షి - వికసించిన కలువల వంటి విజ్ఞానము ప్రసరించే కన్నులు కలది, భగవతి, పూర్ణేందు బింబాననా – నిండు చంద్రునివంటి మోము కలది.

చదువుల తల్లి గురించి కనక ఒక కధ చెప్పుకుందాం. కాళిదాసు మొదట్లో అక్షరం ముక్క రాని శుంఠ. ఆయన ఉండే రాజ్యంలో రాజుగారి కూతురు సంస్కృతంలో ఉద్ధండ పండితురాలు. తనతో సమానంగా తూగగలిగేవాడినే పెళ్ళి చేసుకుంటానని చెప్తుంది. అయితే స్వయంవరంలో ఆవిడ నోరు విప్పకుండా చేతితో చూపించిన చిహ్నాలకి కాళిదాసు తన కొచ్చినవి ఏవో చూపించి అదృష్టం కొద్దీ నెగ్గుతాడు. తర్వాత నోరు విప్పకుండా జాగ్రత్త పడ్డాక పెళ్ళైపోతుంది. మరో కధ ప్రకారం ఈ కాళిదాసుని మంచి పండితుడిగా చూపించి ఆవిడతో పెళ్ళి చేసేస్తారు. పెళ్ళిలో ఎవరైనా అడిగితే – మా కాబోయే అల్లుడు అలా అందరితోనూ మాట్లాడడు, మహా పండితుడు కదా అని చెప్తారు. మొదటి రోజు రాత్రి పెళ్ళి కూతురికి తెలుస్తుంది జరిగిన విషయం – తన మొగుడి సంస్కృతం కాదు కదా, నోట్లో అక్షరం ముక్క లేదు! ఆవిడకి ఎంతో అసహ్యం వేసి కాళిదాసుని  అవమానిస్తుంది. ఆ అవమానం తట్టుకోలేక కాళిదాసు ఊరి బయట గుడిలోకి వెళ్ళి అమ్మవార్ని అడుగుతాడు – నన్ను పండితుణ్ణి చేస్తావా, లేకపోతే ఇప్పుడు ఇక్కడే చావమంటావా అని. ఆ రోజు, అదృష్టవశాత్తూ – అశ్వయుజమాసంలో వచ్చే దసరా రోజులలో నవమి - అమ్మవారిని సరస్వతీ రూపంలో కొలిచే రోజు. కాళిదాసు అమ్మవారు మాట్లాడకపోవడం చూసి వెంఠనే చావడానికి ఉద్యుక్తుడయ్యేసరికి – ఈ పద్యంలో ఫుల్లబ్జాక్షి గా - వికసించిన కలువల వంటి విజ్ఞానము ప్రసరించే కన్నులు కలదిగా చెప్పబడిన - సరస్వతి కనిపించి నాలుక మీద బీజాక్షరాలు రాసి నీ కన్న మహా పండితుడు మరొకడు ఉండబోడు వెళ్ళిరా అని దీవిస్తుంది. ఆ తర్వాత కాళిదాసు ఎటువంటి రచనలు చేసాడో మనకి తెల్సిందే.  మచ్చుకి రఘువంశం అనే కావ్యం మొదలు పెడుతూ కాళిదాసు రాసిన నభూతో నభవిష్యతి అనబడే మహాద్భుతమైన పద్యం చూడండి.

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

జగత్తుకి తల్లి తండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులని తల్చుకుంటూ అంటున్నాడు – వాక్కు, అర్ధం ఒకదానికొకటి అంటి ఉన్నట్లే మీరు కూడా అటువంటి వారు. నోట్లో అక్షరం ముక్క లేని వాడు ఇది రాసాడంటే నమ్మకం ఎలా కలుగుతుంది? అదే భగవతి ప్రసాదించిన వరం కాళిదాసుకి.

ప్రస్తుతం రోజులలోకి వస్తే చిన్న పిల్లలు కూడా అచ్చులో ప్రచురించరాని మాటలు మాట్లాడుతూ అదో గొప్ప అనుకోవడం మొదలైంది. దీనికి తోడు మనకి రోజూ కనిపించే, వినిపించే దృశ్యాలలో, భాషలో కూడా మార్పులు వస్తున్నాయి. సరిగ్గా మాట పలకడం అటుంచి ఫలానా పదాలు తల్లీ తండ్రీ దగ్గిర వాడరాదు, ఉపాధ్యాయులముందు అసలే వాడరాదు అనేవి పూర్తిగా మర్చిపోయాం. ఎంత చెత్త బాష మాట్లాడితే అంత గొప్పవాడు. చదువుకునే పిల్లలు అసలు సరస్వతీ దేవిని తల్చుకుంటున్నారా అంటే చెప్పడం కష్టం. మనం ఏం మాట్లాడినా అవతలవాళ్ళకి కష్టం కలగకూడదు అనేది అసలు ఎవరికీ గుర్తే లేదు. ‘అదేమిటయ్యా అలా నోటికొచ్చినట్టూ మాట్లాడుతున్నారు’ అని అడిగితే ‘పోవయ్యా నువ్వెవరివి మాకు చెప్పడానికి?’ అనే సమాధానం వస్తోంది. పోనీ ఈ పద్యం స్కూల్లో పిల్లలతో వల్లె వేయిస్తున్నారా అని అడిగితే ఏ క్రైస్తవుడో, ముస్లిం కుర్రాడో నేను చెప్పను అని మూతి బిగించుకు కూర్చుంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికెళ్ళి ఇలా హిందూత్వం నా మీద రుద్దుతున్నారు స్కూల్లో అని చెప్పడం. ఆ పైన జరిగే వింతైన కధలన్నీ మనకి తెల్సినవే. అంతవరకూ ఎందుగ్గానీ మన ఆంధ్రదేశపు ముఖ్యమంత్రి గారే తెలుగు మాధ్యమం లో ఇంక పాఠాలు చెప్పడం అనవసరం అని జారీ చేసారు కదా? ఇంక సరస్వతి, ప్రార్ధన అవీ ఎవరిక్కావాలి? అలా దిగజారుడు తనాన్ని మనకి మనమే కొనితెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ జారుడు మొదలైందో అప్పుడే మన భాష మారుతోంది. ఇంక సుశబ్దంబు శోభిల్లు వాక్కు మన నోట్లోంచి ఎలా వస్తుంది?

****సశేషం****

Posted in April 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!