Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకరు. ఆయనను గురించిన విషయాలను తెలుసుకుందాము.

లక్ష్మణరావు గారు 1877 మే 18 న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. ప్రముఖ రచయిత్రి బండారు అచ్చమాంబ ఈయన సోదరి. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించడంతో సవతి అన్న శంకరరావు ప్రాపకములో తన ప్రాథమిక విద్యను భువనగిరిలో పూర్తి చేశాడు. లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు నాగపూరు (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర) లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా, బావల వద్ద నాగపూరులో ఉంటూ మరాఠీ భాషను నేర్చుకున్నాడు. లక్ష్మణరావు, ఆయన అక్క బండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ "అబలా సచ్చరిత్రమాల" అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు. అచ్చమాంబ 18-1-1905 లో మరణించింది.

1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ.లో లక్ష్మణరావు ఉత్తీర్ణుడయ్యాడు. మరాఠీ భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు మాత్రమే కాక సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు. మహారాష్ట్రలో విద్యాభ్యాసమైనాక ఆయనకు అభ్యుదయ భావాలు కలిగి, తెలుగు భాషాభిమాని అయిన మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానములో ఉద్యోగము లభించింది. ఆయన, లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.

లక్ష్మణరావు వయస్సు 22 ఎళ్లప్పుడే 1899 సం.లో బాలగంగాధర తిలక్ "రామాయణము"లో చెప్పబడిన పర్ణశాల మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద కలదన్న వాదమును లక్ష్మణరావు తోసిపుచ్చి, అప్పటికే పర్ణశాల నాసిక్ దగ్గర కలదను వాదము ఆకాలపు మరాఠి పత్రికలలో ప్రచురితం ఐనను లక్ష్మణరావు దానిని తప్పు అని నిరూపించి, పర్ణశాల గోదావరి సమీప ప్రాంతమని మూలమును బట్టి నిరూపించారు. ఆ విధముగా మహారాష్ట్ర విద్యాలోకంను ఆశ్చర్య పరచి తిలక్ దృష్టిలో పడి ఆయనతో పరిచయం కలిగించిన నాటినుంచి వారిరువురకు గాఢ మైత్రి కుదిరినది. లక్ష్మణరావు తిలక్ గారికి అనుయాయి అయినాడు.

కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారు కలసి హైదరాబాదు లోని అప్పటి రెసిడెన్సీ బజారు (కోఠీ) లో రావిచెట్టు రంగారావు స్వగృహంలో 1901 సెప్టెంబర్ 1 న "శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయము” ను స్థాపించారు. తెలుగునాట అధునాతన పద్ధతులలో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగింది. ఆదిరాజు వీరభద్రరావు వంటి మహనీయులు దీనికి కార్యదర్శులుగా పనిచేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్యోద్దేశ్యం. అలాగే 1906 లో 'విజ్ఞాన చంద్రికా మండలి' స్థాపించడంలో ప్రముఖపాత్ర వహించాడు. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది - స్వరాజ్యం కొఱకు ఆంధ్రదేశంలోను, యావద్భారతంలోను కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చిన ప్రతి పురుషునికి, స్త్రీకి వోటు గలిగిన స్వరాజ్యమే మన గమ్యస్థానం. పంచముల అస్పృశ్యత రూపుమాపనిదే స్వరాజ్యము రానేరాదు. ఆంధ్ర ప్రజలకు నవీన ప్రపంచములో అత్యంతముగా వృద్ధియైన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్ధిక విజ్ఞానముల నిచ్చుట ఆవశ్యకము. విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి తెలుగుదేశానికి అందించిన మొదటి పుస్తకం గాడిచర్ల హరి సర్వోత్తమరావు రచించిన "అబ్రహాం లింకన్". దీని ప్రచురణకు ప్రూఫులు దిద్దడం నుండి తొలిపలుకు వ్రాయడం వరకు చాలా భారాన్ని లక్ష్మణరావు నిర్వహించాడు. 1906 – 1910 మధ్యకాలంలో మండలి 30 పైగా గ్రంథాలను ప్రచురించింది. గ్రంథాలన్నింటిలోనూ సంపాదకునిగా లక్ష్మణరావు హస్తం సోకనిదేదీ లేదంటారు. 1908 లో ఈ సంస్థను మద్రాసుకు మార్చారు.1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్తును స్థాపించారు. గ్రంథ పఠనాభిరుచిని పెంపొందించడం పరిషత్తు లక్ష్యం. అనేక కేంద్రాలలో సాహిత్యం, చరిత్ర, ప్రకృతి శాస్త్రం వంటి రంగాలలో పోటీలు పెట్టి విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ఇచ్చేవారు.

1916 లో కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించినవారిలో లక్ష్మణరావు ఒకడు. మొదటినుండి యావజ్జీవ సభ్యుడుగా ఉండడమే కాకుండా, కొంతకాలం దానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. 1922 డిసెంబర్ 27 న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు కలసి ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను ప్రకటించడం, అముద్రిత గ్రంథాలను ప్రకటించడం ఈ సంస్థ లక్ష్యాలు. తెలంగాణా శాసనాలు, షితాబుఖాను చరిత్ర మొదలైన గ్రంథాలను ఈ సంస్థ ప్రచురించింది. తరువాత దీనిని లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చారు. ఈ సంస్థ ప్రస్తుతం నామమాత్రంగా హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయంలో ఉంది. "శివాజీ చరిత్రము" ఆయన మొదటి తెలుగు గ్రంథం. "హిందూ మహా యుగము", "ముస్లిమ్ మహాయుగము" వంటి ఆయన వ్యాసాలు తరువాత "లక్ష్మణరాయ వ్యాసావళి" పేరుతో ప్రచురితమైనాయి.

లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచి పెట్టాలని ఆయన తపించి, బ్రిటిష్ ఎన్‌సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగా, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు ఈ ప్రయత్నములో ఆయనకు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాలనుండి సమాచారం సేకరించేవారు.లక్ష్మణరావు వ్రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ వ్రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయము, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు. ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలలోను కనిపించలేదట. చేసిన ప్రతి పనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు.

లక్ష్మణరావు ప్రత్యక్షంగా దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనకపోయినా, ఉద్యమానికి పలువిధాలుగా సంఘీభావం ప్రకటించాడు. ఆయన రచనలలో దేశాభిమానాన్ని ప్రోత్సహించాడు. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నాడు. 1907 కృష్ణా జిల్లా కాంగ్రెస్ మహాసభ ఆహ్వాన కార్యదర్శిగా ప్రముఖులను సభకు పిలిపించాడు. 1908 లో ఆయన సహచరుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అరెస్టు కాగా వారి కుటుంబాన్ని లక్ష్మణరావు ఆదుకున్నాడు. లక్ష్మణరావు సంఘ సంస్కరణా కార్యక్రమాలకు తోడు నిలచాడు. బాల్య వివాహాలను గట్టిగా వ్యతిరేకించాడు. వితంతు వివాహం, రజస్వలానంతర వివాహం, భోగం మేళాల నిషేధం, అస్పశ్యతా నివారణ, సముద్రయానం, అంతశ్శాఖా వివాహం వంటి వాటిని ప్రోత్సహించాడు. స్త్రీలలో విద్యాభివృద్ధికి తన సోదరి అచ్చమాంబతో కలసి ప్రయత్నించాడు. రాత్రిళ్ళు హరిజనులకు విద్య నేర్పే కార్యక్రమంలో పాల్గొనేవాడు. 46 ఏండ్ల వయసులో, ఆంధ్ర సంపుటం వ్రాయడానికి శాసనాలను పరిశీలిస్తూనే, ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. ఈ శ్రమలో ఆయన ఆరోగ్యము బాగా దెబ్బ తిని కందుకూరి వీరేశలింగం మరణించిన ఇంటిలో అదే గదిలో, 1923 జూలై 12 న, లక్ష్మణరావు మరణించాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రమునకు లక్ష్మణరావు పేరు పెట్టారు. విజ్ఞాన సర్వస్వాలను ప్రారంభించిన ఆయన స్మృతికి గౌరవంగా తెలుగు వికీపీడియన్లను సత్కరించుకునేందుకు 2014లో ఏర్పరిచిన పురస్కారానికి కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారంగా పేరుపెట్టారు.

లక్ష్మణరావు రచనలలో దేశభాషలలో శాస్త్ర పఠనం అనే వ్యాసాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈనాటి పరిస్థితులకు కూడా ఈ వ్యాసం నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుంది. శాస్త్ర పఠనానికి కొన్ని భాషలు మాత్రమే అర్హమైనవన్న వాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ జ్ఞానమొక భాషయొక్క యబ్బ సొమ్ము కాదు అన్నాడు. ఈ విషయములో జర్మనులు మనకు ఆదర్శము కావలెనన్నాడు. బాలబాలికలకు బోధించే విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగా ఉండాలి, కేవలము పాండిత్యము చూపించటానికి ఉపయోగము లేని విషయములు వారికి నేర్పి, గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రథము. అని లక్ష్మణ రావు భావించేవారు. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడ ప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. అని లక్ష్మణ రావుగారి ఉద్దేశ్యము. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. తెలుగు భాషకు ఆయన చేసిన సేవ మరువరానిది. ప్రత్యేకించి తెలుగు వికీపీడియా కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి ఆయన చేసిన సేవ స్మరణీయము.

ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన చరిత్రకారులు, వివిధశాస్త్రవేత్తలు ఆయనద్వారా ఆకర్షితులై 'విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి' ద్వారా దేశానికి పరిచితులయ్యారు. ఆ విధముగా ఆయన ఒక వ్యక్తి కాదు సంస్థ అని ప్రముఖులు ఆయనను పొగిడారు.

********

Posted in April 2023, వ్యాసాలు

1 Comment

  1. Kolli Venkateswara Rao

    Chala Chala Baghundi.
    Mother Tongue Telugu IMPORTANCE Was Transformed into reality to my Age group people.
    Tqu very much SRI SYAM GARU
    OM SHANTI

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!