Menu Close
Page Title
మల్లెల తావిని మనసున గుబాళింపగల మాటల మాంత్రికుడు
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
Devulapalli Krishna Saasthri

Devulapalli Krishna Saasthri Family
దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుటుంబం

ఒకప్పుడు కవిత్వమంటే పద్య రచనే. క్రమేణా తరువాతి కాలంలో ద్విపద, వచన రచన కూడా ఆజాబితాలో చేర్చబడింది. తెలుగు జన జీవనం లో 12వ శతాబ్దంలో నుంచి పాట ఉనికి పాల్కురికి సోమనాథుని 'బసవ పురాణమ్' కాలం నుంచి ఉన్నదని తెలుస్తోంది, కానీ దానిని ఏవిధంగా వాడేవారో తెలియదు. తరువాతి కాలంలో అంటే అన్నమయ్య కాలము నుంచి సుందర భావాలని పద విన్యాసంలో కూర్చి అందంగా తీర్చి దిద్దడంతో పద కవిత్వం అందరి మెప్పుని పొందగలిగింది. దానిని పద పితామహుడైన అన్నమయ్య తాను వ్రాసిన పదాల లక్షణాలని, అంతకు ముందే భాసిస్తున్న వాటిని కలిపి క్రోడీకరిస్తూ 'సంకీర్తన లక్షణ' మనే గ్రంధము ద్వారా పదాన్ని 'ముక్తక' పద్ధతిలో శృంగార, వైరాగ్య ఇతివృత్తాలతో రాణింపచేయవచ్చునని నిరూపించాడు. పల్లవి, మూడుచరణాలు కలిపి ఒక రూపాన్ని పదానికి ఇచ్చి రాగ రంజితం, జన రంజితం చేసిన మొదటి వాడు అన్నమయ్య అయితే, దానిని క్షేత్రయ్య కొనసాగించి మువ్వగోపాల పదాలకి ప్రాణం పోసి రక్తి కట్టించాడు. దానినే కొంత మార్పుచేర్పులతో జావళీలు, రాను రాను హరికథలు, బుర్ర కథలు, తెరపై తోలుబొమ్మలాటల కి అనుగుణంగా పాటలు వచ్చాయి. తదుపరి సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఛాయాచిత్రాలు గా పరిణతి చెందడంతో మరింత రమ్యంగాను, హృద్యంగానూ తయారై విస్తృత ప్రచార సాధనాలుగా, క్రమంగా దృశ్యకావ్యాలు గా మార్పుచెందాయి. ఆ నేపథ్యంలో భావ కవులు ఖ్యాతి నార్జించుకుని ప్రేక్షకుల మనస్సులలో స్థిరంగా నిలిచిపోయారు. ‘మనసున మల్లెల మాలలు, కన్నులలో వెన్నెల డోలలూ’గేటట్లు చేస్తూ, వీనులలో వీణలు మీటుతూ తేనెలొలకబోసే భానుమతి వంటి గాయకీ మణుల పాటల వెనుక దేవుల పల్లి వారి పద భావ సంపద ఉన్నదని మన అందరికి తెలుసు. అంతటి మధుర భావనలను సాధారణ పదజాలంతో సామాన్యుని మనో వీధిలో ఎగసి, ఎగిరించే శక్తి కృష్ణ శాస్త్రి కాక మరెవ్వరి కి సాధ్యం? అల్లాగే ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే’ మేఘాలని పట్టుకుని వాటిని మాలలుగా కట్టి దూరమైన ప్రియుల మధ్య విరహ సందేశాలు పంపగల సామర్ధ్యం కాళిదాసు తరువాత దేవులపల్లి వారికే దక్కుతుందని పిస్తుంది. రాగాలు మల్లెపొదలవలె మదిలో విరిసి, పూలై పూసి చిరుగాలికి పరిమళాన్ని అందిస్తే అది నాలుగు దిక్కులూమోసుకుపోయి పంచుతూ ‘బ్రతుకంతా ప్రతినిముషం పాట లాగ సాగాలి' అని ఆశించడం అనుచితం కాదేమో!

Devulapalli Krishna Saasthri photo1 నవంబరు న 1897 లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపాలెం లో పండిత వంశములో పుట్టి, పిఠాపురం లో చదువు సాగించిన కృష్ణ శాస్త్రికి చిన్నప్పటినుంచి కవిత్వ ధోరణులుండేవి. 1929 లో విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగూర్ని 'శాంతినికేతనం' లో కలిసిన తరువాత అవి స్థిరపడి సాహితీ పతాకాన్ని లేపి పైపైకి ఎగుర వేసి 'ఆంధ్రా షెల్లీ' అని ఉపనామం సంపాదించి పెట్టాయి- ఆంగ్ల సాహిత్యంలో అభిరుచి, ఆ రచనా ధోరణుల నిష్ట పడడం బహుశా కారణం కావచ్చు. 1945 లో ఆకాశవాణిలో జేరిన తరువాత తెలుగు సాహిత్యమే వ్యాపకము కావడంతో మనస్పూర్తి కృషికి అవకాశం లభించింది.

రవీంద్ర గీతమొకదానికి కృష్ణ శాస్త్రి స్వేఛ్ఛానువాదం:

ఇచటనే నీ చరణ పీఠి; ఇచటనే  ద
రిద్రు లందు బతితు లందు క్షుద్రు లందు
నీ పదమ్ములు కదలక నిలుచునోయి -

ఎంత వంచిన శిర మిది, హే ప్రభూ! ద
రిద్రు లందు బతితు లందు క్షుద్రు లందు
సాగు నీ పాదముల నందజాల దోయి -
నా ప్రణామమ్ము కరము వినమ్ర మయ్యు!

విగత భూషణుడవై దీన వేషివై ద
రిద్రు లందు బతితు లందు క్షుద్రు లందు
నెపుడు నడయాడు నీ చెంత కేగలేదు
నా యహంకార మెంతటి దోయి నాధ!

తోడు నీడవై నెచ్చెలికాడవై ద
రిద్రు లందు బతితులందు క్షుద్రు లందు
దడయుదువు నీవు; నీ సన్నిధానమునకు
నేనెన్నడేని రానోపునా యీ యెడంద!

ఆ రోజుల్లో ఉన్నత సామాజికులు 'బ్రహ్మసమాజం' సభ్యులవడం, ముఖ్యంగా బెంగాలీ ప్రముఖుల ఆదర్శాలతో ప్రభావితుడై, వ్రాసిన పాటలు ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి. కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి శిష్యరికంలో బ్రహ్మసమాజ ప్రచార గీతాలతో ప్రారంభించి ఆకాశవాణికై దేశభక్తి గీతాలు, దానిలో సంగీత రూపకాలకోసం వ్రాసిన పాటలు, పిల్లల పాటలు, తిరుప్పావై పాటలు, తన కాల్పనిక భావాలకు రూపాన్నిస్తూ, సుగంధభరితం చేసి ప్రాచుర్యాన్ని పెంపొందించారు. ఆనాటి 'రబీంద్ర గీత్' కు అయన ఒసగిన సాహిత్యపు భావ తళుకులు ఎందరినో ఆకట్టుకునేవి. పద్యానికైనా పాటకైనా, రూప వ్యవస్థ కంటే భావోన్నతే ముఖ్యమని ప్రకటించి భావకవి అయ్యాడు.

బ్రహ్మసమాజపు ఆదర్శాల నీడలో వ్రాసిన పాట:

ఏ జాతి వాడవో బ్రాహ్మణుండవో
తేజమే చెడి దేవదేవు నడుగులను విడి!
బిగిసె సిగలో కులము, బిగిసె జందెపుత్రాళ్ళ!
సగము క్రుళ్ళితి కాని తెగదు తెగ దంటావు!
వాడు వద్దంటావు మీదు క్రిందంటావు!
బీదసాదల ప్రభుని విడిచి మత మంటావు!
లోన చేయీకటి రొదలు, పైన ద్వేషపు గదులు!
వేదకాలంనాటి వెలుగు నాదంటావు!

బ్రహ్మ సమాజపు పోకడలు చూపుతూ, దేముడు గుళ్ళల్లోనే లేడు, జనం మధ్య సంచరిస్తూంటాడు, ముఖ్యంగా దీనుల మధ్య అంటూ వ్రాసిన ఆయన ఒక గీతం:

శిధిలాలయమ్ములో శివుడు లేడోయి
ప్రాంగణమ్మున గంట పలుక లేదోయి
దివ్య శంఖము గొంతు తెరువ లేదోయి
పూజారి గుడినుండి పోవ లేడోయి

చిత్ర చిత్రపు పూలు చైత్రమాసపు పూలు
ఊరూర నింటింట ఊరికే పూచాయి
పూజారి కొకటిని పూవులేదోయి.

వాడవాడలా వాడె! జాడలన్నిటా వాడె !
ఇంటిముంగిట వాడె! ఇంటింటిలో వాడె
శిథిలాలయమ్ములో శిలను సందిటబట్టి
పూజారి వానికై వేచియున్నాడోయి  ..

కృష్ణ శాస్త్రికి గల రాగ తాళ పరిజ్ఞానం ఆయన వ్రాసిన పద్యానికి పాటకి నరనరాల పట్టి వినేవారి మనస్సుల నూగించి, పాడుకునే వారి నాలుకతో సులభంగా తిరిగి, మరుపురాని మధుర గీతంగా మిగిలి ఎంతో పేరు తెచ్చి పెట్టింది.

గోదాదేవి తిరుప్పావైని 'ఆండాళ్ళు' పేరుతో అయన తెలుగు భాషలో 30 కీర్తనలతో అలంకరించడం చెప్పుకోదగ్గ విషయం. వాటిని అందరిలాగా అనువదించకుండా, ప్రతి 'పాశురం' లోని ప్రధాన అంశాన్ని పల్లవిలో పొదిగి, తక్కిన పాశుర భావాన్ని అనుపల్లవిగా కూర్చి, అమృతవల్లి సుందరం గారి శాస్త్రీయ సంగీత నిబద్ధతలో బాణీ సమకూర్చగా ఆకాశవాణి చేసిన ప్రసారం బాగా రక్తి కట్టి ప్రజాదరణ పొందింది.

మరొక  ఆకాశవాణి లో ఆ రోజుల్లో వినిపించే బ్రహ్మ సమాజ, సర్వజన హిత గీతం,

'నారాయణ నారాయణ అల్లా అల్లా
మాపాలిటి తండ్రీ నీ పిల్లల మేమెల్లా..

మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నీ మనసుకు మబ్బైతే
మతం వద్దు, గూటం వద్దు, మాయ మర్మం వద్దు

ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు…

మరొక తెలుగు తల్లికి హారతినిస్తూ పాడిన గీత మంగళమ్:

తెలుగు తల్లి కి మంగళమ్! మా
      కల్పవల్లికి మంగళమ్!
ప్రాతకోత కౌగిలింతల
      ప్రసవమగు బంగారు కాంతుల
భావికాల స్వర్గ మమరుచు
      ప్రౌఢ ప్రతిభకు మంగళమ్!
వేద వేదములన్ని తరచీ
      వాడ భేదములన్ని మరచీ
స్వాదు ధర్మ పథమ్ము పరచు
      విశాల శీలకు మంగళమ్!
నాకమందిన పగటివేళ
      నరకమంటిన కారురేల
ఏక గతి తెలుగమ్మ నడిపిన
      ఏకయంతకు మంగళమ్!

మనో వీధిని సంచరించే నీలినీడల ఛాయలు ఆమె కళ్ళలో ప్రతిబింబిస్తూంటే  గీత రూపాన్ని కూర్చుకుని...

ఆమె కన్నులు”

ఆమె కన్నులలో ననం తాంబరంపు
నీలినీడలు కలవు
వినిర్మలాంబు
పూరా గంభీర శాంత కాసారా చిత్ర
హృదయములలోని గాటంపు నిదురచాయ
లందు నెడ నెడ గ్రమ్ము
సంధ్యావసాన
సమయమున నీ పద పాదప శాఖి కాగ్ర
పత్రకుటిల మార్గముల లోపల వసించు
ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు
వినబడుచునుండు
మరికొన్ని వేళలందు
వాన కారు మబ్బుల  మొయి వన్నె  వెనుక
దాగు భాష్పమ్ము లామె నేత్రములలోన
పొంచుచుండును
ఏదియొ అపూర్వ మధుర
రక్తి స్ఫురియించు కానీ అర్ధము కాని
భావగీతమ్ములవి ...
"పాట పక్షి వంటిది మాట మనిషి వంటిది" అంటారు కృష్ణ శాస్త్రి.

-o0o-

Posted in April 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!