Menu Close
SirikonaKavithalu_pagetitle

అటకపై తెల్లటి బట్టను కప్పి భద్రపరచుకొన్న పేటిక

రోజూ అటకెక్కి పేటికలో శవాసనం వేసుకు పడుకొంటాను
ఓ అలోకం కోసం వెదుకుతుంటాను
నా లోకం నుంచి తప్పించుకోటానికి తంటాలు పడుతుంటాను
తప్పక మళ్లీ దిగొస్తుంటాను
వెలుగు మైపూత పూసుకొని నలుగుర్లో పడుతుంటాను
ఇచ్చకాలవనంలో ముచ్చట్లాడుతుంటాను
కడుపాత్రంతో అయినవీ కానివీ చేస్తుంటాను
పనిపాటల పేరేకానీ ఏ పట్టింపులేకుండా గడుపుతుంటాను
నచ్చీ నచ్చని వాటి గుర్తు గీతల్ని చెరిపేస్తుంటాను
మళ్లీ అటకెక్కుతాను...

మౌన ఏకాంతానుభోగం..
శవాసన యోగ సాధనం...

జీవిస్తూ మరణిస్తుంటాను
మరణానంతర జీవితాలపై కలగంటాను
కలల్ని కమ్మని మాటల్లో అమ్ముతుంటాను
ఓం, ఆమెన్ అంటూ అమాయకులను
దీవిస్తుంటాను
పరిపూర్ణ మానవుడంటే ఏమిటో
నన్ను నేను దృష్టాంతరీకరించుకొంటాను
నాకు నేనే గురువంటాను
నడిచే నిష్కర్మనౌతూ ఇదే జీవన కర్మాగారమంటాను
నాకు నేనే కర్తనంటాను, ప్రవక్తనంటాను...

పైన పేటిక, దిగువ విహారవాటిక పదిలంగా ఉన్నంతదాకా
ఎవరు నువ్వు అనే ప్రశ్న ఎదురుపడనంత దాకా
ఏం వాగినా, ఎలా తిరిగినా చుట్టూ ప్రజ పట్టించుకోనంతదాకా
అంతా నేనే, అన్నిటా నేనే నంటూ ఏమేమో అవుతుంటాను
ఏం కావాలో తెలియక అన్నీ నేనే కావాలనుకొంటాను
ఉన్నాను--ఉంటాను ల తేడాతెలియక
కొత్త పదబంధాలు సృష్టిస్తుంటాను
మిత్రమా! నువ్వు బుద్ధిమంతుడవైతే నేను ఆత్మను
మరీ బుద్ధిమీరితే పరమాత్మను...

అదేమిటంటావా, నువ్వే నా ధీమా
నిన్ను నువ్వు తెలుసుకోలేని వాడివి నన్నేం తెలుసుకొంటావు...
ఎంత సుఖమయ్యా నీలాటి వారిమధ్య జీవించటం
నీలాల రేవులో నింగిచూపి ఈత కొట్టటం

1. జయంత్ మహాపాత్ర

భారత దేశపు వేసవి కాలం

వ్యాకులపడుతున్న గాలి కాలవలమీద
ఎప్పటికన్నా మరింత పెద్దస్వరంతో పూజారుల మంత్రాలు
భారదేశపు నోరు తెరుచుకు౦టు౦ది
మొసళ్ళు మరింత లోలోతు నీళ్ళలోకి కదులుతాయి
రవిబింబం కింద
వేడెక్కిన చెత్తకుప్పల పొగల ఉదయం
దీర్ఘమైన మధ్యాన్నాలు
ఉత్తమురాలైన భార్య
నా ఇంకా మంచం మీద
ఇంకా స్వప్నిస్తూ
చితిమంటల దీర్ఘ గర్జనల్లో
ఏ మాత్రం అలసట లేకుండా

2.  విలియం బ్లేక్

మా లోయల గుండా నీ శక్తి కొద్దీ సాగిపోతావు
నీ అశ్వాల కళ్ళేలు  అదలిస్తూ వాటి ముక్కుల్లో౦చి  వచ్చే సెగలను తగ్గిస్తూ
ఓ వేసవీ !
తరచూ ఇక్కడ నీ బంగారం గుడారం వేసుకు
మేము ఆనందంగా నీ ఎర్రని కిరణాల పాదాలు, విస్తరిస్తున్న కేశాలు   చూస్తుంటే
మా ఓక్ చెట్ల నీడలో శయని౦చావు

మా దట్టమైన నీడలా వెనక
తరచూ నీ స్వరాన్ని విన్నాం
సాయ౦త్ర౦ దాని అతి వేడి వాహనం
స్వర్గపు లోతులపై నడిపినప్పుడు
మా నీటి చెలమల పక్కన కూర్చో
మా నాచు పెరిగిన లోయల్లో
ఏదో ఒక స్వచ్చమైన నదీ తీరాన
నీ సిల్క్ వస్త్రాలను వదిలేసి
ప్రవాహంలో ఈదులాడు
మాలోయలకు ఎంత ప్రేమో వేసవిని అంత
అతిశయంగా చూడటం

వెండి తీగలు మీటే మా ఖ్యాతి గల కవులు
మా యువతకు  దక్షిణాది హంసలకన్నా ధైర్యం
మా యువతులు ఉల్లాసంగా నర్తిస్తూ
మాకు పాతలకేం తక్కువ కాదు ,
ఆనందపు వాయిద్యాలకూ కొదువ లేదు
తియ్యని ప్రతిధ్వనులో ఆకాశంలా స్వచ్చమైన నీటికో
ఎండ వేడిమికి ధాటిగా తమాల వృక్షపు దండలో
వేటికీ కరువులేదు

3. ఒక వేసవి సాయంత్రానికి కీట్స్

జనాలను వేరే ప్రార్ధనలకు పిలుస్తూ
చర్చ గంటలు మరో విషాదపు వరుసలో మోగుతున్నాయి
మరో విషాదం , మరింత భయంకరమైన జాగ్రత్తలు
ప్రవచనాల భయంకర శబ్దం వింటూ
మనిషి మనసు తప్పకుండా ఒక ఎదో ఒక గుడ్డి వశీకరణలో
ప్రతివారూ తమను తాము వెచ్చని ఆనందాల
పక్కనించి, భాషా వీచికల నుండి చీల్చుకుంటూ
కీర్తి కిరీటం తగిలించుకుని గొప్పగా సంభాషిస్తారు
ఇంకా , ఇంకా సహిస్తారు , నాకు ఏదో ఒక తేమ, సమాధిలో ఉన్నట్టుగా చలి
నాకు తెలియదు
వాళ్ళు వెలిగి వెలిగి ఆరిపోయే దీపాలని
అది వారి నిట్టూర్పు , ఏడుపు
నీలి గగనం ఆవలకు చేరే లోగానే
తాజాగా పూలు పూస్తాయి
ఎన్నోకీర్తి ప్రతిష్టలతో  హరితముద్రలతో

4. నిన్నో వేసవి దినం తో పొల్చనా -విలియం షేక్స్పియర్

నిన్నో వేసవి దినం తో పొల్చనా
నువ్వింకా మరింత ఆహ్లాదంగా మరింత అందంగా ఉంటావు
మే మాసపు చిన్నారి మొగ్గలను రౌడీ గాలులు కుదిపేస్తాయి
అయినా వేసవి ఉండేది చాలా తక్కువేగా కలుసుకునేందుకు
ఒక్కోసారి ఆ స్వర్గపు కన్ను ఎంత వేడి గా ఉంటుందో
అవును కదా తరచూ అతని బంగారపు రంగు మసకబారుతు౦ది కదా ,
ప్రతీ మెరుపూ ఒక్కోసారి మెరుపులనే తిరస్కరిస్తుంది
యధాలాపంగానో , ప్రకృతి మార్పుతత్వం సంస్కరి౦చలేదో
కాని సతత హరితమైన వేసవి ఎప్పుడూ వాడిపోదు
లేదూ నీకున్న ఆ మెరుపుల ఆధిపత్యం వదులుకోదు
లేదూ మరణం అతని నీడలోకి లాక్కున్నానని గొప్పలకు పోదు
సమయం హరిత క్షణాల్లోకి నువ్వు పెరిగినప్పుడు
కళ్ళు చూడగలిగినంత వరకూ మనుషులు ఊపిరి పీల్చే వరకూ
ఇది సజీవమే అదే నీకు జీవనాన్నిస్తు౦ది

నేనెవ్వరో తెలిస్తే కదా
నీవెవ్వరో తెలియడానికి
నీవెవ్వరో తెలిస్తే కదా
నేనెవ్వరో తెలియ డానికి ...

పిపీలికం మొదలు
బ్రహ్మండం వరకూ నిండివున్నది
ఒకటే అయినప్పుడు
ఇన్ని వైరుద్ద్యాలేల ...

ఎవరిని ఎవరు తెలుసుకోవాలి
ఆ వున్నదేదో నాలోలేదా
నీలో లేదా  ఎక్కడలేదుగనుక
మరి ఈ ఉపాదుల భేదాలేల...

కాలంలో వుండి పోతున్నదేమిటి
పోయి కూడా వుంటున్నదేమిటి
దేశకాలాదులు లేవన్నప్పుడు
మిగిలివున్నదేది
ఈ ప్రశ్నిస్తున్నదేది ....

అంతటా నిండి వున్నది
ఒక్కటే అయినప్పుడు
బింబ ప్రతి బింబాల గోల ఏల
మధ్యలో ఈ ప్రపంచపుఅద్దమేల...

నన్ను నన్ను గా
నిన్ను నన్ను గా
తెలుసుకోనివ్వని
ఈ పొరలేల
నా జీవితం నాజీవితమంటుా
ఈ పొర్లుదండాలేల...

ఉన్న సృహలో వుండలేక
రాని స్మృతి లో  తెలియలేక
ఏమటీ ద్వంద్వం
ఎవరు కల్పించిన నిర్బంధం...

ఇంకా చర్చించడానికి
ఏమీ మిగలలేదు
నిరామయ జీవితం తప్ప!

మానప్రాణాలు కోర్కెల వాణిజ్యపంటలు
మనిషితనమంతా మార్కెటైన నాగరికత
అమ్మ ఆలి అక్క చెల్లె అనే తేడాలేవీ లేవు
కేవలం అమ్మకం ఒక్కటే లక్ష్యం

గర్వించే సంసృతి నుండి
ఎన్నడో బైట పడి పోయాం!
ప్రమేయాలతో సంబంధం లేదు

స్వేచ్చ
పరిధి పద్దతి ఉద్దేశ్యం కాదు
అంతా నిర్భయమే!

మనిషి జంతువు
కళ్ళు అతికించిన దారి
భంగపాటు సహజమే ఇప్పుడు

గుడి బడి హోటళ్ళు మాల్స్
బస్సు కారు నిర్మానుష ప్రదేశం
చివరికి ఇల్లు వాకిలి
అన్నతమ్ముడు తండ్రి
మనిషి తత్వం మానవత్వం
ఏదీ మిగిలి లేదిప్పుడు
అన్నీ నగ్నసత్యపు వజ్రదేహాలే

అడుగులెటుపడుతున్నాయో....తెలియదు
ఆడతనం పట్టపగలే ఒంటరిగా నడవలేని కాలం

రాత్రింబగళ్ళు
ఒంటరి పోరాటాల నిశీదిని
ప్రొత్సహించే మృగతృష్ణలు

పాలకులకే కరువైన భద్రత
పల్లె పడుచులకెక్కడుంటుందని
అన్నీ కెమెరా కళ్ళే తప్ప

Posted in April 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!