ఆరు రుచులు నువ్వే కదయ్యా
రుచికి రాజుని నేనని వెర్రెక్కి వాగే
నరంలేని నాలుక నీ బంటు కదయ్యా
ఈ నాలుకతో మాటలను నర్తింపజేసే
నీ మాయది ఏ రుచో కాస్త తెలుపవయ్యా
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
పుట్టినప్పటినుంచి ఎన్నో రుచులను తింటినయ్యా
ఆ రుచుల మధ్యే రుసరుసలాడుతూ పడి ఉన్ననయ్యా
ఏ రుచితో ఎప్పుడు నను ఋషిని చేస్తవో...నీ ఇష్టమయ్యా...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
పైసలుంటే పండగలు పబ్బాలంటమయ్యా
గుళ్ళో రాయిని పూజిస్తమయ్యా
గుండెల్లో నిన్ను గాలికొదిలేస్తమయ్యా...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
ఆరు రుచులిస్తవయ్యా
అరిషడ్వర్గాలిస్తవయ్యా
హరికీ హరునకు భేదంలేదని హరీ మనిపిస్తవయ్యా
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
పండగంటిమయ్యా
పైయ్ కడుక్కుంటిమయ్యా
మనసు కడుక్కోవడం మరిచితిమయ్యా
పూజంటిమయ్యా నీ పాదాలు కడిగితిమయ్యా
ఆ నీటితో నువ్వే మా మనసు కడగవా...!
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
నా బ్రతుకంతా చేదయ్యా
నీ పూజ మాత్రం తీపయ్యా
మిగిలిన రుచులను ఎవరికిస్తివో....
ఏమి చేస్తివో ఎవరికెరుకా...?
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
తినడానికి మెతుకులేదయ్యా
సాగేందుకు బ్రతుకుభారమయ్యా
చావుకు రేవుకు మధ్య బావురుమంటున్నాం
హలమిస్తవో
పొలమిస్తవో...నీ ఇష్టమయ్యా...
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
కంటినిండా నీరని
ఒంటినిండా చెమటని నేనేడిస్తే....
నువ్వే నిత్యం అభిషేకం చేయు భక్తుడంటివా
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
కష్టపడడం నాకు ఇష్టమయ్యా
కష్టపెట్టడం నీకు ఇష్టమయ్యా
తండ్రి ఏదిచ్చిన తీసుకోవడం తనయుడి సంప్రదాయం కదయ్యా
నువ్వు తండ్రివైతివి నేనే నీ బిడ్డనైతి
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...
నీ అనుగ్రహ నీడలో మా బ్రతుకు పచ్చడి అయ్యా
నీ కోపాగ్ని ఎండలో మా బ్రతుకు పచ్చడిపచ్చడైయ్యా
ఎండైనా నీడైనా...నువ్వేకదయ్యా
నీ స్మరణే మాకు నిత్య ఉగాది
నీ ఆటకు నీవే సాటి భళా సదాశివా...