తల్లి, తండ్రీ తరువాత అంతటి అత్యంత విలువైన పదం గురువు. మనకు జన్మ నిచ్చి, పోషించి పెద్దచేసేది తల్లితండ్రులైతే మన జీవన విధానానికి ఒక రూపం కల్పించి మన ఆలోచనల దారితెన్నులను గుర్తించి తదనుగుణంగా దిశానిర్దేశం చేసి సరైన జీవనశైలి రూపకల్పనలో మనకు తోడ్పడేవారు గురువు. ఈ మాటలు మనందరం ఎప్పుడూ వింటూ పెరిగిన వాళ్ళమే. గురువు అనే పదం ఎంతో బాధ్యతతో సమాజపోకడలను గుర్తెరిగి, ఎవరి జీవన స్రవంతికి అనుగుణంగా వారి భవిష్యత్తుకు మంచి మార్గం చూపే ఒక మహత్తర ఆయుధం.
మన జీవితంలో మంచి ఆశయాలకు బీజం వేసుకునేది ప్రాధమిక విద్యాస్థాయిలోనే. ఆ సమయంలో మనకు సరైన మార్గాన్ని సూచించే వారు గురువు మాత్రమే. ఎందుకంటే మనం ఏ రంగంలో ప్రావీణ్యతను కలిగి ఉన్నామో నిశితంగా గమనించి అందుకు తగిన విధంగా మలుచుకునే దారిని సూచిస్తారు. తల్లితండ్రులు కూడా గమనిస్తారు కానీ వారి దృష్టిలో మనమీద ముందునుండీ ఏర్పడిన ఒక అభిప్రాయం వారి ఆలోచనా విధానాన్ని కట్టడి చేస్తుంది. గురువుకు మనం మరో విద్యార్ధి మాత్రమే. అదే తల్లితండ్రులకు మనం ఒక ఆశాకిరణం. వారి జీవితంలో సంతోషాన్ని నింపే ఒక ఆలంబన. ఆ అనుబంధ కుటుంబ సంబంధంలో మనకు ఒక ముఖ్య పాత్రను ఇస్తారు. కనుకనే మనం అనుకున్న ఆశయాల మీద వారికి సరైన అవగాహన వారికి కలగచ్చు, కలగకపోవచ్చు.
గురువు యొక్క అవసరం కేవలం విద్యా పరంగానే చూడకూడదు. మనిషి జీవితంలో అడుగడుగునా అవసరం అయినప్పుడు మంచి సలహాలను అందించి చక్కటి మార్గాన్ని సూచించే ప్రతి ఒక్కరూ గురువే అవుతారు. ఆనందకర జీవన సౌఖ్యానికి అవసరమైన వనరులను అనేక విధాలుగా చూపించడం వరకే గురువు గారి బాధ్యత. వాటిలో ఏది మనకు అనువుగా ఉంటుందో తెలుసుకొని ఎంచుకునే విచక్షణ జ్ఞానం మనలో ఉండాలి.
పూర్తిగా గురువు అడుగుజాడలలో వారి మీద ఆధారపడి గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటే అవి మన దైనందిన జీవితానికి సరిపోకపోతే దానికి ఆ గురువునే మరలా నిందిస్తాము. ఉదాహరణకు అనుభవంతో అర్థంచేసుకొనదగిన వైవాహిక జీవన సూత్రాల విషయంలో ఏర్పడిన ఇబ్బందులను బ్రహ్మచారి అయిన గురువు గారి ముందు ఏకరువు పెట్టుకుంటే ఆయన గాని ఆవిడ గాని ఏమి చెప్తారు. వారికి తెలిసిన సైద్ధాంతిక అంశాలను స్పృశిస్తూ తమకు తోచిన సలహాలను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో చెప్తారు. అలాగే మా పిల్లలు ఫోన్లతో బిజీ అయిపోయి ఇంటికి వచ్చిన ఎవ్వరినీ పలుకరించడం లేదని గురువుకు ఫిర్యాదు చేసి సలహా అడిగితే వారు ఏమి చెబుతారు. ఎందుకంటే పిల్లలకు ఇంట్లో ఉన్న పెద్దవారు మంచి చెడు చెప్పకుండా సామాజిక హోదాను చూపే ప్రహసనంలో వారికి అన్ని సౌఖ్యాలు అందిస్తే మరి వాటిని ఎందుకు వదులుకొంటారు. ఇది స్వయంగా నేను హాజరైన ఒక కార్యక్రమంలో ఒకావిడ వెలుబుచ్చిన సందేహం. ఆ గురువు గారు ఆ ఫోన్ కు వైఫై లేకుండా చేయండి అని సలహా ఇచ్చారు. అంతకన్నా ఆయన ఏమి చెప్పగలరు? అది వైజ్ఞానికమో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయం కాదు కదా.
మనం చేసే చెడుపనులతో కలిగిన కలుగుతున్న మానసిక వత్తిడిని తట్టుకోవడానికి గురువును ఆశ్రయించడం ఆనవాయితి అవుతున్నది. మనలో కలుగుతున్న ఆలోచనలకు స్పందిస్తూ మన శరీర భాగాలలో చలనం వస్తుంది. అందుకు తగినట్లుగానే మనలో ఉత్ప్రేరకాలు జనించి మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆ స్పందనలను అనుకరించి మన ఆలోచనల ప్రవాహాన్ని మనం నియంత్రించుకొనే స్థైర్యాన్ని మనమే పెంపొందించుకోవాలి. ఆ నిగ్రహ శక్తి కలిగిననాడు మనం చేసే ప్రతి చర్యలో మంచిని వెతుక్కొని ముందుకు సాగిపోగలము. అలాగే కొన్ని సందర్భాలలో అటువంటి ఉత్ప్రేరకాల అవసరం కూడా ఉంది. తద్వారా ఎంతో మానసిక ఆనందకర అనుభూతి కలిగి అది మంచి ఆరోగ్యానికి హేతువు అవుతుంది.
కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం. ఈ ఆటుపోట్ల జీవితంలో అన్ని పరాజయాలను చవిచూసి మనం పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, దేవుడిని శరణు కోరినప్పుడు మనిషి రూపంలో మనకు అండగా ఉండి చక్కటి మార్గాన్ని సూచించి మనలను ఒడ్డుకు చేర్చేవారు మనం జీవితాంతం నమ్మే గురువు అవుతారు.
చివరగా, తన జీవిత కాలమంతా సినీ సంగీత కళామతల్లికి సేవచేసి వేలకొలది పాటలతో మనందరి హృదయాలలో నిలిచిపోయి, భావితరాలకు సంగీత శాస్త్ర పరిజ్ఞానం పై మక్కువ కలిగించేందుకు నిర్విరామంగా కృషి చేసి అందులో కృతకృత్యులై నేడు ఎంతోమంది గాయకులలో, సంగీత అభిమానులలో స్ఫూర్తిని నింపి గురువు స్థానంలో నిలిచిపోయిన గాన గంధర్వుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతిని పురస్కరించుకుని, మనఃపూర్వక నమస్కారములతో ఆయనను స్మరించుకుంటూ మనలను మనం సంస్కరించుకుందాం.
‘సర్వే జనః సుఖినోభవంతు’