యానకంలో కాంతి వేగం
మనం మాట్లాడేటప్పుడు సోమరితనం ప్రదర్శిస్తాం. “ట్రాన్సిస్టర్ రేడియో” అనటానికి బద్దకించి మనలో చాలమంది “ట్రాన్సిస్టర్” అనేసి ఊరుకుంటాం. అలాగే “మైక్రోవేవ్ అవెన్” అనటానికి బద్దకించి “మైక్రోవేవ్” అనేసి ఊరుకుంటాం. ఇదే విధంగా “కాంతి వేగం” అన్నప్పుడు సాధారణంగా మన ఉద్దేశం “శూన్యంలో కాంతి వేగం.” “కాంతి వేగాన్ని మించి ఏదీ ప్రయాణం చెయ్యలేదు” అని శాస్త్రవేత్తలు అన్నప్పుడు “శూన్యంలో కాంతి ప్రయాణం చెయ్యగలిగే వేగాన్ని మించి ఏదీ ప్రయాణం చెయ్యలేదు” అని మనం తాత్పర్యం చెప్పుకోవాలి.
శూన్యంలో కాంతి వేగం ఎంత? క్షణానికి (లేదా, సెకండుకి) 186,282 మైళ్లు. లేదా కచ్చితంగా క్షణానికి 299,792,458 మీటర్లు. తేలిగ్గా జ్ఞాపకం ఉంచుకుందికి దీనిని క్షణానికి 300,000 కిలోమీటర్లు అని ఉరమర సంఖ్య వాడుతూ ఉంటాం.
శూన్యంలో కాకుండా మరే ఇతర పదార్థ యానకం (material medium) లో ప్రయాణం చేసినా కాంతి వేగం కుంటు పడుతుంది. ఖాళీగా ఉన్న మైదానంలో పరిగెట్టగలిగినంత జోరుగా జనసమ్మర్దం ఉన్న బజారు వీధిలో పరిగెట్టగలమా? శూన్యంలో కంటె గాలిలో కాంతి వేగం తగ్గుతుంది. గాలిలో కంటె గాజు దిమ్మలో కాంతి వేగం తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఒక యానకం (medium) లో కాంతి వేగం ఎంత తగ్గుతుందో దానిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం (index of refraction) అంటారు. నీటి యొక్క వక్రీభవన గుణకం 1.33. గాజు వక్రీభవన గుణకం 1.5. వజ్రం వక్రీభవన గుణకం 2.4. అంటే వజ్రంలో కాంతి వేగం కేవలం క్షణానికి 77,618 మైళ్లు లేదా 124,188 కిలోమీటర్లు మాత్రమే! అంటే వజ్రంలో కాంతి పెళ్లినడకలు నడుస్తూ ప్రయాణం చేస్తుందన్నమాట. అందుకోసమే వజ్రం అలా మెరుస్తుందంటారా? ఏమో, నాకు తెలియదు. ఎవరినైనా అడిగి చూడాలి.
కాంతి వేగం యానకంలో ఎందుకు తగ్గుతుంది? కాంతి అంటే విద్యుత్ తరంగాలు, అయస్కాంత తరంగాలు కలిసి ప్రయాణం చేసే జంట తరంగాలు. ఈ విద్యుత్ తరంగాలు యానకంలో ఉన్న అణువుల మీద తమ ప్రభావం చూపి వాటిలో భ్రమణం కలిగిస్తాయి. (తోటలో ఉన్న చెట్లు గాలి తాకిడికి ఊగిసలాడవూ? అలాగన్నమాట.) దీని పర్యవసానం ఏమిటంటే ఏ గురుత్వం లేని తేజాణువులు (photons) అనే కాంతి కణాలు గురుత్వం సంతరించుకున్నట్లు ప్రవర్తిస్తాయి. గురుత్వం పెరిగితే జోరు తగ్గుతుంది. తేజాణువుల జోరు తగ్గితే కాంతి వేగం తగ్గినట్లే కదా. ఇదంతా మేక్స్వెల్ సమీకరణాలు (Maxwell’s equations) రాసి, వాటిని పరిష్కరించి, చూపించవచ్చు.