Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

చేమంతి పువ్వు

Chrysanthemum

బంతీ, చేమంతీ మాటాడుకున్నాయి- అనేపాట వినే ఉంటారుగా! బంతి జాతి మొక్క ఇదీనీ. చేమంతి అనీ అంటారు.

ఈ పూవు చూట్టానికి నిండుగా అందంగా ఉంటుంది. అనేక రంగుల్లో మనస్సుకు ఆహ్లాదాన్నీ ఉత్సాహాన్నీ ఇస్తుంది. ఒకరకమైన మత్తు వాసన కలిగి సులువుగా వాసన చూడగానే గుర్తించేలా ఉంటుంది. ముద్దలూ, రెక్కపూలూ, అనేకానేక రంగుల్లో అన్నీ మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి. దీని ఆకులూ అందంగా ఉండటమే కాక, పూలమాలల్లో కలిపికట్టి కొనేవారిని ఆకర్షిస్తాయి.

Chrysanthemumపసుపు, గోల్డ్, రాయచూర్, సిల్వర్, తెలుపు, ఎరుపు, ఇలా ఎన్నెన్నో రంగులు, సైజులూనూ. కుబ్జకము, గొజ్జగి, సేమంతిక, సవంతి, సవంతిక, చామంతి అని మరికొన్నినామాలు దీనికి. ఆంగ్లంలో chamomile అంటారు.  పుష్పించే మొక్కలలోని క్రిసాంథిమం (Chrysanthemum) ప్రజాతికి చెందిన సుమారు 30 జాతుల మొక్కలున్నాయి. ఇవి ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందినవి. చేమంతి శీతాకాలంలో పూస్తుంది. శ్రావణమాసం రాగానే మహిళలు అమ్మవారిని అలంకరించను వరలక్ష్మీవ్రతానికి ఈ పూలకోసం ఎగబడతారు. అందానికి అందం, మన్నికా వీటిప్రత్యేకత, ఒక మాత్రానికి వాడవు.

Chrysanthemumనక్షత్ర చేమంతి చూట్టానికి చిన్నపూలైనా అందంలో పెద్దవే. పట్నం చేమంతి మధ్యసైజు పూలు, పెద్దసైజు పూలు, ముద్దపూలూ అన్నీ ఆకర్షణీయంగానే ఉంటాయి. తెల్ల చేమంతి మధ్యలో పచ్చని దిమ్మెకలిగి చూడగానే మనస్సును హరిస్తుంది. తెల్లచేమంతి పూలమాల దైవానికేకాక జడలో పెట్టుకోనూ అందంగా ఉంటుంది.

తోటల్లోనే కాక ఇళ్ళలోనూ, తొట్లలో ఈ చేమంతి మొక్కలను పెంచుకుంటారు. కాలక్షేపమూ, ఆనందమూ, అందమూనూ. ఈ పూలసారంతో కేమోమైల్ టీని తయారు చేస్తున్నారు. దీన్ని సేవిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది అంటారు. నిద్రకు సంబంధించిన సమస్యలు, పెద్దవారిలో చక్కగా పరిష్కారమవుతాయి- అంటున్నారు పరిశోధకులు.

Chrysanthemumయారో పూలు కొండప్రాంతాల్లో కనిపిస్తూ, తెలుపు రంగునుండీ సమయం గడుస్తున్నకొద్దీ పూల అంచులు గులాబీ రంగులోకి మారతాయి. ఈ పూల సౌందర్యానికి ముగ్ధులైన శాస్త్రవేత్తలు, ఇవి మనస్సును తేలికపరచేందుకు ఉపకరిస్తాయని తేల్చారు. ఈ రోజుల్లో వీటిని ఆందోళనకు చికిత్సలో భాగంగా ఉపశమనకారిగా వాడుతున్నారు. ‘రక్తపోటుతో కూడిన ఆందోళన ఉన్నవారిలో ఈ పూలు అద్భుతంగా పనిచేస్తున్నాయి' అంటున్నారు శాస్త్రవేత్తలు.

Posted in March 2020, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!