Menu Close
Lakshmi Jayanthi
తే.గీ.
అమృతపానాభిలాషులై యసురసురలు
కవ్వముగఁజేసి మందరక్ష్మాధరంబు
వాసుకిని రజ్జు వొనరించి బలముకొలఁది
క్షీరసాగరమథనంబు సేయు వేళ 1
కం.
కమఠావతారుఁడై హరి
సమముగ ధరియించె నగముఁ జక్కఁగ నిలువన్
భ్రమణ మ్మూ పందుకొనన్
క్రమముగఁ దా ముద్భవించెఁగా గరళంబున్ 2
తే.గీ.
కామధేనువు, శ్వేతాశ్వగజము, లమర
వృక్ష, మప్సరోజనములు, విధుఁడు, పిదప
సకలశుభలక్షణోపేత సాగరసుత
శ్రీమహాలక్ష్మి, యమృతమ్ముఁ జింత దొలఁగ 3
కం.
భీకరహాలాహలమును
లోకార్తిహరమ్ముసేయ లోకేశ్వరుఁడే
శ్రీకాళీపాతివ్ర
త్యైకనిదర్శనమనన్ ధరించ గళానన్ 4
తే.గీ.
కృషియు నమ్మక ముపదేశ(1) మెచట నుండు
నచట కర్మఫలంబు తథ్యంబు మంగ
ళప్రదంబయి లోకల్యాణకారి
యగుట కిది దివ్యమౌ యుదాహరణ గాదె ? 5
(1) సరస్వతీప్రతీక
కం.
సిరి పుట్టిన మాస మ్మిది
సిరి మెట్టిన మాస మిదియె, చేయుదు రెలమిన్
సిరి జన్మదినము నీ నెల,
స్థిరముగ ఘల్ ఘల్లటంచు సిరి దిరుగంగన్ 6
Posted in March 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *