Menu Close
Page Title

కథంటే

పరిమిత పాత్రలతో, సంఘం యొక్క, సమాజం యొక్క, వ్యక్తిగత సమస్యలకు అద్దం పట్టేది, పరిష్కారాలు చూపించే రచనా ప్రక్రియ కథ.

కథలో పాత్రలు, సమయం పరిమితంగా ఉంటాయి. నాలుగు లేక ఐదు పేజీలదయితే కధానిక, పది పేజీల లోపలయితే కథ, ఇరవై పేజీల వరకు సాగితే పెద్ద కథ అనడం సమంజసం.

రచయిత తన ఆలోచనలను ఎక్కడి కక్కడ నియంత్రించుకొంటూ, ఆవేశానికి లోనుకాకుండా, సందేశాత్మకమైన, రసస్ఫూర్తి కల్గిన ఇతివృత్తాన్ని సుందర శిల్పంగా మలచడమే కథ యొక్క పరమార్థం.

చక్కని రాజమార్గమే యుండగా...

అది సాయం సంధ్య. చల్లని, కమ్మని చందనం తనువుకు పూసినట్లుగా మలయమారుతం వీస్తున్నది. ఆ గాలికి లాన్ లోని రకరకాల పూల బాలలు సుతారంగా తలలను అటు ఇటు ఊపుతూ విశ్వసంగీతాన్ని ఆస్వాదిస్తున్నాయా అన్నట్లు కదులుతున్నాయి.

సరోజ, రమేష్ లాన్ లోని కుర్చీలలో కూర్చొని ఉన్నారు. ఎండలకు ఎండి ఆకులన్నీ రాలిపోగా మోడువారిన ఒక చెట్టు నిరాశావాదిలా నిలబడి ఉంది. సరోజ ఆ చెట్టు వంక కన్నార్పకుండా చూస్తున్నది. రమేష్ శూన్యాకాశంలోకి చూస్తూ ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా..’ అని పాడుకొంటున్నాడు, సన్నగా. ఇంతలో ‘నేను వచ్చేశాగా’ అంటూ సుకుమార్ వచ్చి కుర్చీలో కూర్చొన్నాడు.

సుకుమార్, రమేష్ చిన్ననాటి స్నేహితులు. అంతేగాక ప్రాణమిత్రులు. స్నేహం యొక్క విలువ ‘ప్రాణ’ శబ్దంతో కలిసి మరింత పరిపూర్ణత్వాన్ని సిద్ధింపచేసుకొన్నాది. అందుకే బంధువులకు దూరంగా, స్నేహితులకు దగ్గరగా ఉండాలన్నారు పెద్దలు.

“ఏందిరా! వాడిపోయిన పువ్వుల్లా మొహాలు మీరూ! ఎప్పటి సమస్యేనా?” సుకుమార్ అన్నాడు రమేష్ తట్టు చూచి.

“ఆ అదే. గమ్యం తెలియని పడవల్లాగా కాలప్రవాహంలో కొట్టుకొని పోతున్న మాకు, మా సమస్యకు పరిష్కార మార్గం ఎప్పుడ దొరుకుతుందో ఆ పరమాత్మునికే ఎరుక.” రమేష్ గొంతు బొంగురుపోయింది. అర్థనిమిలితాలైన రమేష్ కళ్ళలోనుండి కన్నీటి బొట్లు జారి అతని బుగ్గల మీద నిలిచాయి. సుకుమార్ కు మనసంతా కలచినట్లయింది.

“రమేష్, ఏంటది. చిన్న పిల్లాడిలా. నువ్వే ఇలా అయితే మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? లేచి అలా లాన్ లో కూర్చొందాం రండి. ప్రకృతి ఒడి అమ్మ ఒడి లాంటిదే.” సుకుమార్ లేవగానే రమేష్, సరోజలు అతన్ని వెంబడించారు. పచ్చిక మీద కూర్చొన్న ఆ దంపతులకు నిజంగానే మనసులు కుదుటపడ్డట్టనిపించింది.

ప్రకృతి మాత ఒడిలో ఎన్నో అందాలతో పాటు అమ్మలా ఓదార్చే ప్రేమగుణం ఉంది. ప్రకృతితో కలిసి మెలిసి చరించిన కాళిదాసాది కళాహృదయులు, కవిశేఖరులు ప్రకృతి అందాలను ఆస్వాదించగలిగిన ధన్యజీవులు. కానీ, ఈ నాటి వ్యక్తులు ఎదురుగుండా ఉన్న పచ్చని చెట్లనుగూడా చూసి ఆనందించలేని దురదృష్టవంతులు.

రమేష్ సుకుమార్ ఒడిలో తలపెట్టుకొని పడుకొన్నాడు. “రమేష్ ఒక పాట పాడరా. చిన్నప్పుడు ఎంత మధురంగా ఉండేది నీ గొంతు. మనం పల్లెలో ఉండగా నువ్వు, నేను కోనేటి దగ్గర కెళ్ళి పొన్న చెట్టు క్రింద కూర్చొని మురళి వాయించుకొంటూ ‘యమునా తీరమున సంధ్యా సమయమున...’ అనే పాట, ఓహ్! మనిద్దరం కలిసి ఎంత అద్భుతంగా పాడుకొనేవాళ్ళం. ఏదీ, ఒక్కసారి పాడు” చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకొంటూ అన్నాడు సుకుమార్.

రమేష్ ‘యమునా తీరమునా..’ అంటూ పాటందుకొన్నాడు. సరోజ, సుకుమార్ పాత వింటూ మైమరచిపోయారు.

“ఎక్కడికో వెళ్ళిపోయిందిరా, నా ప్రాణం” రమేష్ ను చూస్తూ అన్నాడు సుకుమార్.

“సరే అంతా బాగుంది. మా మాటేంటి?” అంది సరోజ.

“ప్రతి సమస్యకూ ఒక పరిష్కారమార్గం ఉంటుంది. అయితే ఆ మార్గం ఎక్కడ ఉందొ కనుక్కోవడానికి సమస్యను అనేక కోణాల్లోంచి చూచి, దాన్ని గూర్చి బాగా చర్చించుకొని, ఆలోచించి ఆ తర్వాత ఆచరించడం సరియైన పని. వాల్మీకి తన రామ, హనుమంతుని పాత్రల ద్వారా ఈ సంగతిని మనకు తెలియజేశాడు. లంకలో సీతమ్మను చూచిన తర్వాత తదుపరి కార్యక్రమం ఎలా సున్నితంగా నిర్వహించాలి అనే ఘట్టం దగ్గర తను చేయదగ్గ రీతిలో కార్యాన్ని నిర్వర్తించాడు. అలాగే ఆలోచిస్తే మీరు కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అందునా మీరు కూడా హనుమ భక్తులే కదా.” సుకుమార్ మాట్లాడటం ఆపిన వెంటనే,

“ఆ సుందరకాండ సుందరుడే ఈ సుకుమారుడు. మా గాధ సుఖాంతం చెయ్యడానికి నేవే సమర్థుడివి.” అంది సరోజ నవ్వుతూ.

ఆమె మాటల్లో సుకుమార్ యొక్క సామర్ధ్యం మీద కొండంత నమ్మకం, అతనే ఈ సమస్యను పరిష్కరించగలడన్న ఆశ ఉంది.

“నా సమర్ధతపై నీకు ఇంత నమ్మకం ఉన్నందుకు నీకు నా కృతజ్ఞతలు చెల్లమ్మా! కాని ఇక్కడ మన అభిప్రాయాలు కలవాలిగదా! రమేష్ పాతతరపు ఆలోచనలతో ఉన్నాడు. నీవు ఎలా ఉన్నావో నాకింకా పూర్తిగా తెలియదు. నా ఆలోచన నేను మీకు చెప్పనేలేదు. ఇదంతా ఒక కొలిక్కి వస్తే అప్పుడు సమస్య పరిష్కరించడం సులభం” అని వివరించాడు సుకుమార్.

రచయితలు రెండు రకాలు. 1) ప్రజోపయోగం ఆశించేవారు. ఇంకా తమ పాండిత్యాదుల చేత ప్రజల హృదయాలను ఆకర్షించేవారు. 2) ప్రజాకర్షక రచనల చేత ప్రజలకు తాత్కాలిక ఆనందాన్ని అందిస్తూ వారు కూడా లాభం పొందుతుంటారు.

సుకుమార్ ప్రఖ్యాత రచయిత కాకపోయినా అతని రచనలు సమాజ శ్రేయస్సునే సూచిస్తుంటాయి. అతని కన్ను సంఘం, దాని క్షేమం, వీటి చుట్టూనే తిరుగుతుంటుంది. పదిపేజీలకు మించని సుకుమార్ రచనలు చిన్న కథల్లాగానో లేక సంభాషణ పూర్వకంగానో ఉంటాయి. అదే అతనికున్న ప్రతిభ.

సుకుమార్ లో, ఒక మనిషికి ఉండవలసిన గుణాలున్నాయి. అవి – సూక్ష్మ దృష్టి, నిశిత పరిశీలన; అందరితో కలిసిపోయే గుణం; ఇతరుల విషయాలలో ఎంత వరకు కల్పించుకోవాలో అంతవరకే కల్పించుకోవడం; అనవసర ప్రసంగ పరిత్యాగం; ఇతరులకు చేయాల్సిన సహాయం చేయడం, మొదలైనవి.

“చూడు చెల్లెమ్మా! సంతానం సంసారానికి మూలధనం. కుటుంబాభివృద్ధికి పట్టుకొమ్మ. వంశాభివృద్ధికి రాచబాట. అయితే దురదృష్టవశాత్తూ సంతానం లేని దంపతుల జీవితాలు మీలాగే పైకి నవ్వుతూ మనసులో కుమిలిపోతూ భారంగా గడపాల్సిందేనా? ఈనాడు అద్దె గర్భం వంటి ఆధునిక పద్దతులున్నాయి. ‘దత్తత’ వంటి ప్రాచీన పద్దతులూ ఉన్నాయి. మనది కానప్పుడు ఏదైనా ఒక్కటే. ఇవన్నీ ఏక వ్యక్తికి మన శ్రమ, ధనము సమర్పించడమే గదా. కాబట్టి అసలు మీ అభిప్రాయం ఏంటి? అది నాకు తెలియాలి.” సుకుమార్ మాట్లాడటం ఆపాడు.

**** సశేషం ****

Posted in March 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!