Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

కోటి విద్యలూ కూటి కొరకే

రామాయ పట్నంలో రాములోరి గుడి పక్కన పోలయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతడూ వాని భార్య రామమ్మ రోజంతా కష్టపడి కూలో నాలో చేసుకుంటూ వచ్చిన దాంట్లో ఆనందంగా జీవించేవారు. వారి ఒక్కగానొక్క కొడుకు కిష్టప్పను ఆఊరి బళ్ళో చదివించేవారు. వాడైనా చదివి తమలా ఎండావానలకు కష్టపడకూడదని వాడ్ని చదివించసాగారు.

ఆ ఊరి రామాలయాంలో ప్రతి సంవత్సరం రామనవమికి ఉత్సవాలు జరిగేవి. ఒకమారు ఉత్సవాలకు వారి దూరపు బంధువు, రామమ్మ తమ్ముని వరసవాడు బాపయ్య వచ్చాడు. వాడు ఊరికే రాలేదు. తనవెంట ఒక మూటెడు సరంజామా తెచ్చాడు. రాత్రికి ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ అంతా ఇంటిముందున్న వసారాలో పడుకున్నారు. కిష్టప్ప మహా మేధావేకాక, ప్రతి విషయమూ చాలా శ్రధ్ధగా పరిశీలించేవాడు. కొత్త కొత్త విషయాలు తెల్సుకోనూ, నేర్చుకోనూ వాడికి ఆసక్తి.

కిష్టప్ప "మావా! నీవెంట తెచ్చిన పెద్ద గోనెమూటలో ఏవుంది మావా?" అని అడిగాడు.

దానికి బాపయ్య "ఒరే కిట్టప్పా! నీకు రామనవమి తిరునాళ్ళకు మూడురోజులు సెలవు కదా!  నావెంటే ఉండు. బతుకుతెరువెలాగో చూపిస్తాను. మీ అమ్మా, నాయనా కూలి పని తప్ప మరేమీ చేయరు. నీవైనా నాలుగు రకాల పనులు నేర్చుకుని హాయిగా మంచి ఇల్లు కట్టుకుని మీ అమ్మనూ, నాయన్నీ సుఖపెట్టరా!" అని ఇంకా ఏవేవో మాటలు చెప్పాడు.

కిష్టప్పకు ఆ రాత్రంతా సరిగా నిద్రేపట్టలేదు. తెల్లారితే బాపయ్య మామ ఏం చెపుతాడో అని ఆలోచిస్తూ తెల్లారగట్ల నిద్రపోయాడు.

బాపయ్య తట్టిలేపి "లేలే కిట్టప్పా! లేచి ముఖంతోము, సద్దికూడు తిని మనం పని మొదలెడదాం. ముందుగా వెళ్ళి మన అంగడి కోసం ఒక చెట్టుకింద చోటు పెట్టుకుని రావాలి. పొద్దెక్కితే చోటు దొరకదు" అంటూ తొందరచేసి వారి ఇంటి ముందున్న తాటి చెట్టెక్కి తాటాకులు కోశాడు. పక్కనే ఉన్న కానుగ చెట్టెక్కి ఎండి పోతున్న కానుగ కొమ్మలు నరికాడు. వాటిని చెక్కి కొయ్యల్లాగా చేశాడు. అన్నీ మూటకట్టి తలమీద పెట్టుకుని, కిష్టప్పను తోడు తీసుకుని రాములోరి గుడి ఎదుట ఉన్న పెద్ద వేపచెట్టు నీడన గడ్డపారతో త్రవ్వి, స్తంబాలునాటి, పైన కర్రలు కట్టి తాటాకు పందిరేశాడు. ఆ తతంగాన్నంతా ఆశ్చర్యంగా చూస్తున్న కిష్టప్ప "మావా! పందిరిట్టా వేస్తారా!" అని అడిగాడు. దానికి బాపయ్య నవ్వుతూ , "ఇదేంట్రా మన మింకా చాలా సెయ్యాల. పద. స్తలం రిజర్వు ఐంది, ఇక బెంగేలేదు." అంటూ ఇంటికి నడిచాడు.

ఇంటికొచ్చాక తాటి చెట్టునుంచి కోసిన మరికొన్ని ఆకులతో చకచకా విసన కర్రలూ, కూర్చునే చిన్న చాపలూ, చిన్న బుట్టలూ అల్లుతూ, కిట్టప్పకూ బొమ్మలు చేయడం, తాను తెచ్చిన వెదురుకర్రలతో బాణాలు చేయడం, నేర్పాడు. కిష్టప్పకూడా బాపయ్య మామ చెప్పినట్లే అన్నీ నేర్చుకుని చేయసాగాడు. మధ్యాహ్నం దాకా కొన్ని చేసి, భోజనం చేసి వేపచెట్టునీడన కూర్చుని వాటికి రకరకాల రంగులు అందంగా ఆకర్షణీయంగా వేస్తూ కిష్టప్పచేతా వేయించాడు. పొద్దుకుంకుతుండగా వెదురుకర్రలను సన్నగా చెక్కి గాలిపటాలు చేశాడు. వాటికీ రంగులు వేయించి దారాలు కొద్దిగా కట్టి ఎగరేసి సరిగా ఎగురుతున్నాయో లేదో చూసుకున్నాడు. చివర్లో వీధి దీపం కింద కూర్చుని తాటిచెట్టు నుంచి కోసిన మొగ్గాకులను విడదీసి వాటితో గుండ్రాలు చేసి అన్నింటినీ కలిపి చక్కని దండలలాగా అల్లాడు, వాటికీ రంగులేశాడు. తాటి ఆకులతో గిలక్కాయలు చేసి లోపల సన్నటి రాళ్ళు కిష్టప్పచేత ఏరించి పోసి మూసి, ఒక వెదురు పుల్లకు దాన్ని అల్లాడు. కదిలించగానే గిలక్కాయ గలగలా శబ్దంవచ్చి ఆకర్షిస్తోంది. కొద్దిగా ముదిరిన ఆకూలతో గుమ్మటాలు చేశాడు.

అన్నీ వరుసగా చక్కగా ఆరేందుకు తీరుగా అమర్చుకుని రామమ్మక్క పెట్టిన సంకటి ముద్ద బావ పోలయ్య కిష్టప్పలతో కలిసి తిని, కిష్టప్పతో రేపు చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నాడు. కిష్టప్పకు బాపయ్య మామ పనులన్నీ చాలా తమాషాగా అనిపించాయి. రేపు చేయాలని మామ చెప్పిన పనుల గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు.

సూర్యోదయానికి ముందే బాపయ్య తట్టి కిష్టప్పను లేపి కాలకృత్యాలు తీర్చుకుని, రావమ్మ పెట్టిన చద్దిబువ్వతిని, నిన్నచేసిన వన్నీ చక్కగా చెడి పోకుండా అమర్చుకుని భుజాలకూ. తలమీదా పెట్టుకుని రాములోరి గుడి దగ్గరకు వెళ్లారు. ఆపాటికి ఇంకా జనాలు చేరలేదు. కిట్టప్పకు పనులు చెప్తూనే బాపయ్య తాను అన్నీ చక్కగా అమర్చాడు. పూజారులు మాత్రం దేవుని అలంకరణలూ, పూజలూ మొదలుపెట్టారు.

దూరం నుంచి చూసేవాళ్లకు ఆ రంగురంగుల అంగడి కళ్ళకు ముచ్చట కలిగిస్తోంది. చూస్తుండగానే గుడి జనాలతో నిండసాగింది. భక్తులు పూజ సామానులతో ఆలయంలోకి ప్రవేశించారు. లోపలినుండి పూజలూ, మంత్రాలూ వినిపిస్తుండగా బాజాలూ, గంటలూ మోగుతుండగా జనం సూర్యునితో పోటీపడుతూ అక్కడ చేరారు. అందరికంటే బాపయ్య అంగడి అందరినీ ఆకర్షించింది. ప్రతి బిడ్డా బాపయ్య చేసిన గిలక్కాయలూ, గాలిపటాలూ, బాణాలూ కొనందే వాళ్ళ అమ్మా అయ్యలను కదలనివ్వడం లేదు. చూస్తుండగానే బాపయ్య అంగడిలో సరుకంతా ఐపోయింది. పడినశ్రమకు ఫలితం వచ్చింది.

రాత్రి ఇంటికెళ్లగానే బాపయ్య రావమ్మక్కచేత బొరుగులు వేయించి, ఉప్పూకారం చల్లి, చిన్న చిన్నపొట్లాలు కట్టించాడు. మరికొన్ని బొరుగులతో బెల్లప్పాకం కట్టించి ఉండలు చేశారు అంతాకలసి. బెల్లప్పాకం గట్టిగా చేయించి తీగలుగా సాగదీసి, దాన్ని పువ్వుల్లా, పండ్లలా ఇంకా అనేకరకాల రూపాలతో చుట్టాడు. వాటన్నింటినీ ఆరబెట్టి, తాను అల్లిన తాటాకుల బుట్టల్లో సర్దాడు. హాయిగా నిద్రపోయి తెల్లారాక అవన్నీ పట్టుకెళ్ళి తన అంగట్లో అమర్చాడు. తీపి వస్తువులన్నీ దూరం నుంచి కనిపించేలా వేలాడదీశాడు. పిల్లలు వస్తూనే బాపయ్య అంగడిమీద పడ్డారు. మధ్యాహ్నానికే అన్నీ ఐపోయాయి. సాయంకాలానికి తాను తెచ్చిన రేక్కాయలూ, బెల్లపు ఉండలూ పెట్టాడు. అవీ సాయంకాలానికి ఐపోయాయి. మూడోరోజు కోసం రాత్రికి రంగు కాయితాలు కత్తిరించి రకరకాల పూల హారాలు, అలంకరణకోసం తోరణాలూ చేశాడు. కిష్టప్ప బాపయ్య మామకు కుడి చేయిలా ఉండి సహాయంచేస్తూ అన్నీ నేర్చుకున్నాడు. మూడోరోజూ మధ్యాహ్నానికే అన్నీ ఐపోయాయి. మధ్యాహ్నం నుంచి అంతా రధోత్సవాన్ని చూస్తూ, రాములోరికి మనస్పూర్తిగా దండాలు పెట్టుకుని ఇంటికొచ్చారు.

రాత్రికి బాపయ్య తన సంపాదనలో సగం కిష్టప్పకు బహుమతిగా ఇచ్చాడు. రావమ్మ, పోలయ్యా వద్దేవద్దన్నారు. "అక్కా! మీఇంట్లో ఉండనివ్వబట్టేకదే ఈ సొమ్ము వచ్చింది. నాకు బెల్లప్పాకం కట్టి, ఎన్ని చేశావే అక్కా! నాకు నాలుగు రోజులపాటు తిండీ సౌకర్యాలూ చేశారు. మీరు లేకపోతే నేనేమీ చేయలేను కదే అక్కా! పైగా మన కిష్టప్ప చూడూ ఇహనుంచి గుళ్ళో ఏ పండుగ జరిగినా ఇవన్నీ సొంతంగా చేసి అమ్మి సొమ్ము మీకు చూపిస్తాడు." అని కిష్టప్ప చేసిన సాయానికి ఆ సొమ్ము ఇచ్చి "ఒరే కిట్టప్పా! ఒకే పని చేస్తే సాగదురా. అన్నీ నేర్చుకోవాలి. అవసరం కొద్దీ ఏపని చేస్తే సొమ్ము కూడుతుందో అదిచేసి మన విద్యలు ఉపయోగిం చాలిరా!. వస్తా మళ్లా రాములోరి తిర్నాళ్ళకు." అంటూ సాగిపోతున్న బాపయ్య ను చూసి “‘కోటివిద్యలూ కూటికొరకే’ అన్నమాట నిజం చేశాడు బాపయ్య. తెలివైన వాడు." అని అనింది రావమ్మ.

Posted in March 2020, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!