Menu Close
Galpika_title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

గల్పికావని - శుక్రవారధుని - 23 -- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

వాయ్స్ ఓవర్

డియర్ వ్యూయర్స్, వెల్ కమ్ టు బయం బక్తి చానెల్ మోస్ట్ ఎవైటింగ్ డివోషనల్ ప్రోగ్రామ్ "టెంపుల్ దర్సన్". మనం ఈరోజు చిత్తూరు డిస్ట్రిక్ట్, కలకడ మండల్, ఎరకోటపల్లె విలేజ్, ముస్టూర్ లో ఉన్న ముష్టూరమ్మ టెంపుల్ దగ్గరకి వచ్చేసాం. ఇక్కడికి వస్తే చాలు, ఈ ఛుట్టూ కనిపింఛే పరిసరాలన్నీ మంత్రాలు, సుప్రబాతాలు, మంగల వాద్యాలతో  స్రవనానందఖరంగా మారు మోగుతూ ఉంటాయి. ఇక్కడి టెంపుల్లో కొలువైన ముస్టూరమ్మ మోస్ట్ పవర్ ఫుల్ గాడెస్ అని బక్తులందరూ విస్వసిస్తారు. ఆ తల్లిని పిలిచిన పలికే కొంగు బంగారం అంటారు. ఇట్స్ సెంట్ పర్సెంట్ కరెక్ట్. ఇదిగో మీరే చూడండి. ముస్టూరమ్మకి కట్టిన చీర. దాని కొంగు కూడా గోల్డ్ తో వీవ్ చేసిందే. ఇక్కడి బక్తులు అందర్నీ సెంట్ పర్సెంట్  బక్తులు అంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే బక్తులు వాల్ల బందుమిత్రులు ఎవరైనా సరే సెంట్ లేకుండా లోపలకి రాకూడదు. అందుకే వాల్లని సెంట్"పర్సెంట్ బక్తులు అంటారు. అలాంటి సెంట్ పర్సెంట్ బక్తులందరూ కోరుకునే ఆయుస్సు, ఐస్ వర్యం, అదుర్ స్ టమ్, అబీష్ టమ్, ఏ కష్ టమ్ లేకుండా తీరుస్తుందని బక్తులు విస్వసిస్తారు. అలాంటి మోస్ట్ పవర్ ఫుల్ గాడెస్ ముస్టూరమ్మ దర్సన్ చేసుకుని దన్యులం అవుదాం. బోగ బాగ్యాలను పొందుదాం.., రండి. ముస్టూరమ్మ దర్సనానికి కారులో వెల్లేవాల్లు తిన్నగా గుడి దగ్గరకే వెల్లిపోవచ్చు. అలా కాకుండా బస్సులోవచ్చేవాల్లు కలకడలో బస్సు దిగి ఆటోలోగానీ బై వాక్ గానీ రావచ్చు. ముస్టూరమ్మ బేసిగ్గా బేబీ బూన్ గాడెస్. పిల్లలు లేనివాల్లకి పిల్లలని కలిగిస్తుంది. పిల్లలు లేనివాల్లు గుడికి వచ్చి వర పడతారు. అంటే గుడి ముందున్న బోర్ వెల్లో బాత్ చేసి తడి బట్టలతో బక్తిబావంతో వచ్చి పాతకాలం ఐదు గంటలకి (ఈ రైటరెవడోగానీ పైనొకటీ కిందోటీ సున్నలు పెట్టాడు. వాటినెలా ఛదవాలో ఐ డోంట్ నో. బికాజ్ ఐ know నో తెలుగు. తెలుగులో ఎంతో మంది ఎన్నోఅక్సరాలు తీసేసారంట. నేనీ రెండు సున్నల్నీ తీసేస్తే నస్ టమ్ ఏముంది. టెంపుల్ కి వెల్లేది మార్నింగవర్స్ లోనే కాబట్టి, పాతకాలం అంటే మద్యానానికి పాతకాలం మార్కింగే కదా. మరి 'పా'కి రావత్తు ఎందుకు పెట్టాడు?ఈ రైటర్ కి రాయడం తప్ప అన్నీ వఛు. ఈ ప్రాథకాలం అంటే మార్నింగే అయ్యుంటుంది. ఓకె నో ప్రాబ్లం. ఐ విల్ కరెక్ట్ ది స్క్రిప్ట్.. కమాన్ టేక్) పాతకాలం ఐదు గంటలకి అంటే ఎర్లీ మాణింగ్ ఫైవోక్లాక్ కి గరబ గుడికి ఎదురుగా ముస్టూరమ్మ వెండి కల్లు చూసి వాటిని మనసులో తలుఛుకుంటూ కల్లు మూసుకుని సాయం కాలందాకా ద్యానం చేస్తూ పడుకుంటారు. అలా బక్తితోపడుకుంటే వాల్లకి ఓ సపనం వస్తుంది. ఆ సపనంలో మనులు, మానిక్యాలు, ,పల్లు, పూర్ నాలు, సొర్ న పాదాలూ కనిపిస్తే పిల్లలు పుడతారు. బై మిస్టేక్ వాల్లకి ఆ సొపనంలో కల్లు, ముల్లు, కాల్లు, బల్లు, బానాలు, వేప రుచ్చం, ఔదుంబర రుచ్చం, బోదిరుచ్చం కనిపిస్తే వాల్లకి సంతానబాగ్యం లేదని అర్ దం. అలా సంతాన బాగ్యం లేనివాల్లకి ముస్టూరమ్మ సాక్సిగా గరబ గుడిలో మల్లీ పెల్లి చేస్తే సంతానం కలుగుతుంది. మల్లీ పెల్లి అంటే పూజార్లు వచ్చి కొన్ని ట్రెడిషనల్ రిచువల్స్ జరిపించి ఆ బార్యాబరతలకే మల్లీ పెల్లి జరిపించి వాల్లకి సంతాన బాగ్యం కలిగిస్తారు. అందుకే అందరూ ముస్టూరమ్మని సంతాన సౌబాగ్య పరదాత అంటారు. ముస్టూరమ్మ గుడిలో అన్ని గుల్లలోలాగా కల్లుమూసుకుని దర్సనం చేసుకోకూడదు. కల్లు తెరుచుకుని కల్లారా ఆ తల్లిని దర్సించుకోవఛు. గుడి ఛుట్టూ మూడు పరదక్సినాలు చేస్తే ఛదువు, పదకొండు పరదక్సినాలు చేస్తే పెల్లి. నూటొక్క పరదక్సినాలు చేస్తే ఐస్వర్యం, సౌబాగ్యం కలుగుతాయి. బక్తి అతిషయింఛినవారు పొర్లుదండాల పరద క్సీనాలు చేస్తే అసటైస్ వరియాలూ, నవ నిదులూ లబిస్తాయని బక్తుల విస్వాసం. మండల దీక్స చేస్తే విథౌట్ ఎనీ డౌట్ వాల్లు సంగంలో గొప్పవాల్లవుతారు. వాల్లకి రాజయోగం పడుతుంది. వాల్లనిమింఛినవాల్లు ఎవరూ ఉండరు. ముస్టూరమ్మ మరోస్పెసాలిటీ ఏమిటంటే ఎవ్రీ ఫ్రైడే అంటే సుక్రవారం ఇక్కడ వీక్లీ జాతర జరుగుతుంది. అన్ని టెంపుల్స్ లోనూ జాత్రలు సంవస్తరానికి ఒక్కసారి మాత్రమే కమిన్స్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వీక్లీ జాతర. ఆ జాతర అంగాంగ వైబవంగా సకల వైబవాలతో సకల సుబాలతో సకల సౌబాగ్యాలతో సకల జనుల బాగస్వామ్యంలో బవబందాలను తెంచుతూ బక్తిబావాన్ని పెంచుతూ మనసుల్ని మైత్రీ బందాలలో ముంచేస్తుంది. ఇలా వారం వారం జాతర జరిపే టెంపుల్ వరల్డ్ వైడ్ గా ఇది ఒక్కటి మాత్రమే. దీన్ని గిన్నీస్ బుక్కులోకి కూడా ఎక్కింఛారు. "వాని నా రాని/ అలివేని/ పూబోని/ కిర్ స్నవేని/ కలవాని/ మనిమేకల/ తలతలల/పెలపెలల/కలకలల/గలగలల మనికర్ నిక ముస్టూరమ్మ వర్ న రంజిత స్ వర్ న కూజిత/ పర్ న పూజిత/ కలి కల్ మస హారిని"అంటూ పొయిట్రీ రాసిన గ్రేట్ పొయెట్ స్త్రీస్త్రీస్త్రీ పున్ య మూర్ తుల విగ్’ నేస్వర సాస్త్రి గారు ఈ ముస్టూరమ్మని ఆజన్ మాంతం సేవించి పూజించి తరించిన పున్యాత్ ముడు. ముస్టూరమ్మని దర్సిన్ ఛుకుని పున్యం పొందడానికీ బక్తులందరికీ సాదరంగా ఆహ్ వానం పలుకుతుంది "స్ వర్నాలయ" గోపూర్ ద్ వారం.  ఇక్కడ బక్తుల సౌకర్ యార్ దం ఎన్నో ఎరేంజ్ మెంట్స్ ఛేసారు. గుడి దగ్గర ఫ్రీ చెప్పల్ స్టాండ్, ఫ్రీ బాత్ రూమ్స్, ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ మద్యానం ఫ్రీ బోజనం, మార్నింగ్ ఈవెనింగ్ ఫ్రీ దర్సన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ.  అన్ని గుల్లలోలాగా ఈ గుల్లో ముస్టివాల్ల బెడద ఉండదు. ఎందుకంటే ముస్టూరమ్మ టెంపుల్ దగ్గర ముస్టి అడుక్కుంటే వాల్లకి లోకంలో పల్లకిందకి రాల్లు కూడా రావని బక్తుల విస్వాసం. సో ఫీల్ ఫ్రీ టు విజిట్ ఫర్ ఫ్రీ దర్సన్ ఆఫ్ ముస్టూరమ్మ. సో ఇంతవరకూ ముస్టూరమ్మ పరమ పున్యదర్సనం చేసుకున్న బక్తులందరికీ మా బయం బక్తి చానెల్ తరపున దన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్ "పున్యమ్ పురుసార్ దమ్" కార్ యక్రమానికి వెల్ కమ్ చెబుతూ.. హేవ్ ఎ గుడ్ డే.., ప్చ్.., ఫ్.., బై మల్లీ రేపటి బయం బక్తీ కార్ యక్రమంలో కలుద్దాం.., అంటిల్ దెన్ సర్ వే జనాసుకినో బవంతు. కాలే వర్సతు పర్ జన్ య .., (ఏంటండీ ఈ స్క్రిప్టు తొక్కలాగా కాలే వర్సం ఏంట్సార్. వర్సం ఎక్కడైనా కాల్తుందా? మీరు పేమెంటిచ్చేది వాయిస్ ఓవర్ చదివినందుకా లేక కరెక్షన్స్ చేసుకుందుకా? ఈసారి కాస్త తెలుగొచ్చినోల్లతో రాయించండి లేకపోతే ఆ రైటర్ పేమెంట్ కూడా నాకే ఇవ్వండి. ఈ మాత్రం వాయిస్ ఓవర్ నేను రాసుకోలేనా? ఓకే లెట్ మీ కంప్లీట్)కురిసే వర్సపు ప్రజాన్యాయ పృద్వీరాజ్ సస్య సాలినీ(మంత్రాలు ఎక్కువ ఛదివితే రేటింగ్స్ పడిపోతాయి. ఇంక ఛాలు)

కఠిన పదాలకు అర్థాలుప్చ్=డివోషనల్ కిస్ఫ్=డివోషనల్ కిస్ ని గాల్లోకి ఊదడంవాయ్స్ ఓవర్=దృశ్యానుగుణ వ్యాఖ్య.

వీల్ చయిర్ --- రాజేశ్వరి దివాకర్ల

తరుణి ఇంటి నుంచి రాత్రి 12 గంటలకు విమానాశ్రయానికి బయలు దేరింది. అంతర్జాతీయ విమాన ప్రస్థానం కాబట్టి ముందుగానే బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. భద్రతా కార్యక్రమం పూర్తి అయ్యాక, కాబిన్ బేగ్ పట్టుకుని, ఎస్కలేటెర్ మీద మొదటి అడుగు జాగ్రత్తగా వేసి పయనం ఆరంభించింది. పొద్దున్న నుంచి పెట్టెలు సద్దుకోవడం బరువును మళ్ళి, మళ్ళీ తూచుకోవడం, తీసుకెళ్ళాలని ఆత్రుతతో కొన్న వాటిని వదిలేసి వెళ్ళలేక, కొన్ని వస్తువులను కొరియర్ లో పంపడం, వంటి హడావుడిలో మధ్యాన్నం భోజనం సరిగా చేయలేదు. రాత్రి బయలుదేరే సన్నాహంలో రెండు మెతుకులు నోట్లో వేసుకుంది. ఇప్పుడు కొంచం కుదురుకున్నాక ఆకలి గుర్తొచ్చింది. అక్కడ లాంజ్ లో బెంగళూరు ఫలహారశాలను చూడగానే ఏదయినా తినాలని అనిపించినా, అప్పటికి దాదాపు 2 గంటల సమయం. ఆ వేళప్పుడు తింటే తరువాత ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ ప్రయత్నం మానుకుంది. మొదటి సారి విదేశ ప్రయాణం. తరుణికి బెరుకుగా ఉంది. బెంగళూరు కెంపగౌడ విమానాశ్రయం నుంచి అబుదబికి 4 గంటల ప్రయాణం. ఇథిహాడ్ విమానం బయలుదేరడానికి ఇంకా చాలా సమయం ఉంది. తరుణి అనన్యను పై చదువులకని అమెరికా పంపించి 3 సంవత్సరాలయింది. అనన్య ఎం ఎస్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరింది. తను ఉండడానికి ఫ్లాట్ ను తీసుకున్నాక అమ్మకు టికెట్ కొని పంపింది. అమ్మా! నువ్వు ఎయిర్ పోర్ట్ లలో నడవలేవు, టికెట్ కొనేటప్పుడు వీల్ చయిర్ కి చెప్తాను అంది అనన్య. ఆమాటకు తరుణి వెంటనే స్పందిస్తూ, వద్దే, నేను నడవగలను, ఆ వీల్ చయిర్లో కూచొడం నాకిష్టం ఉండదు, అంది. సరేలే అమ్మా, బెంగళూరు నుంచి కాకపోయినా అబుదబి నుంచి తీసుకోక తప్పదు, అక్కడ చాలా దూరం నడవ వలసి వస్తుంది. అక్కడ నువ్వు తికమక పడతావు, ఇమ్మిగ్రేషన్ అక్కడే అయిపోతుంది కాబట్టి. ఇక్కడ దిగగానే ఇబ్బంది ఉండదు. అందుకని టికెట్ అలా తీసుకున్నాను. అంటూ తరుణిని ఒప్పించింది అనన్య. టైంను చూసుకుని మెల్లగా తను విమానం ఎక్కవలసిన వలయానికి చేరుకుంది తరుణి. తెల్లారు ఝామున 4 గంటలకు విమానంలోనికి వెళ్ళాక, మరో అర్థ గంట తరువాత విమానం బయలు దేరింది. అలసట వల్ల తరుణికి బాగా నిద్ర పట్టేసింది. మధ్యలో గగన సఖి తిండి తీర్థాలను తెచ్చిన సంగతి కూడా తెలియలేదు. కళ్ళు తెరిచేటప్పటికి, విమానం దిగాలన్న సూచన వచ్చింది. ముందుగా దిగేవాళ్ళందరూ వెళ్ళాక మెల్లిగా లేచి బయటకు వచ్చింది తరుణి. అక్కడ వీల్చయిర్ తో యువకుడు సిద్ధం గా ఉన్నాడు. అతుల్యను చూడగానే వీల్ చయిర్ మాడం అన్నాడు. రండి అన్నట్టుగా చయిర్ని ముందుకు జరిపాడు కూర్చున్నాక, కాళ్ళు ఎత్తి ముందు మెట్టు మీద పెట్టుకుని కూచోండి, మీకు ఉర్దు వచ్చనుకుంటాను అన్నాడు. అతడు చెప్పినట్టుగా చేసిన ఆమెను చూసి, తనకు ఉర్దూ తెలుసునన్న సంగతిని అతడు గుర్తు పట్టినందుకు తరుణికి సంతోషం కలిగింది. మాడం మీరు ఎక్ష్జికుటివ్. క్లాస్ లో వచ్చారా, అని అడిగాడు. ఆ ప్రశ్నతో వెనక్కు తిరిగిచూసింది. ఆ యువకుడు స్ఫురద్రూపి, నవ్వుముఖం, తనను ఉన్నతీకరించి, కొంత పరిచయపూర్వకంగా మాట్లాడడానికి అతడు ప్రయత్నిస్తున్నాడని, గుర్తించిన తరుణి "లేదు ఎకానమీ క్లాస్స్లోనె" అంటూ క్లుప్తంగా సమాధానమిచ్చింది. పాస్ పోర్ట్ ను ఇవ్వండి, అంటూ అడిగి తీసుకొన్నాడు. అక్కడ భద్రతాధికారులకు చూపించడానికి. అబుదబి విమానాశ్రయం లో ఇమ్మిగ్రేషన్ వరకు చేరుకోవాలంటే చాలా టెర్మినల్స్ ను దాటాలి. ఉదయం 11 గంటల లోపున వచ్చి చేరుకొనే విమానాలవల్ల జన కోలాహలం ఉంటుంది. అనేక ఘట్టాల వరుసలలో నిలబడిన జనాలను దాటి ముందు ఎక్కే విమాన స్థలానికి చేరుకోవాలంటే తనవల్ల అయ్యేది కాదని తరుణికి తెలిసి వచ్చింది. తన వయసు వాళ్ళకు ఇది గొప్ప సహాయం అనిపించింది. ఆ యువకుడు సునాయాసంగా గుంపులుగా వస్తున్న జనం మధ్యలోంచి వీల్చయిర్ని తోసుకుంటూ, మధ్యలో లిఫ్ట్ ద్వారా అంతస్థులను దాటించి, నేనున్నాను అన్నింటికీ అన్నట్టుగా అక్కడ అధికారులు అడిగే ప్రశ్నల గురించి, అవన్నీ సాధారణమైనవేనని, ఆప్తునిగా భరోసా ఇస్తున్నట్టు, మాటలను కలుపుతూ, తరుణిని ఇమ్మిగ్రషన్ అధికారివద్ద నిలిపాడు. అనన్య బయలుదేరేముందే ఇమ్మిగ్రషన్ అధికారి అడిగినప్పుడు తొట్రుపాటు లేకుండా సమాధానం చెప్పమని హెచ్చరించడంతో తరుణికి గుండె దడ దడ లాడినా ఈ కాస్సేపటికే మిత్రుడైన ఆ యువకుడు తన వెనుక ఉన్నాడన్న బలంతో ఏమాత్రం తొట్రుపాటు పడక, తాను తన కుమార్తెను చూడడానికి వెళ్తున్నాననీ, ఆరునెలల్లో తిరిగి వెళ్ళిపోతానని సమాధానాలనిచ్చింది. విదేశ ప్రయాణాల గురించి, అక్కడ ఇమ్మిగ్రేషన్ అనుభవాలను గురించి అనేక విధాలుగా విన్న తరుణి మన్సులో తెలియని జంకు గూడు కట్టుకునే ఉంది. అందుకనే అనన్య అబుదబి లో కష్టపడతావు, వీల్చయిర్ కి చెప్తాను అంటే అన్య మనస్కంగానైనా ఒప్పుకుంది. ఇంతకు ముందు వరకు వీల్ చయిర్ అన్న మాటవింటేనే ఏవగించేది. అది బలహీనతకూ, అసమర్థతకూ సంకేతం అనుకునేది. తానేమిటి, ఇతరుల సహాయం తనకెందుకు? అని గర్వ పడేది. తన అత్తగారు చనిపోయే ముందు వీల్ చయిర్ మీద ఆధారపడి తను సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఎంతో విసుగుకునేది. "అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడికి మొక్కుకుంటా" అని ఆవిడకు వినిపించేటట్లుగా అని బాధ పెట్టేది. ఇప్పుడు తన పరిస్థితి అలాంటిది కాకపోయినా ఇకముందు రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటే మానవత్వం మీద నమ్మకం  పెంచుకొని సాటి మనిషిని గౌరవించే తత్వం ఏర్పరచుకోవాలని ఎంచింది. ఆ యువకుడు పాక్ దేశీయుడు. ఉర్దూలో మాట్లాడుతున్నాడు. మరొక మనిషితో ఉండవలసిన పరిచయానికి, తనకు మాటలాడవలసిన అవసరం లేకున్నా స్నేహపూర్వకమైన ప్రస్తావనను కొనసాగించి, ఆదరభావాన్ని చూపాడు. . . ఎంతో చురుకైన వాడు. తానొక్కతే వెళ్ళాలంటే ఎంత సమయం పట్టేదో! ఇమిగ్రేషన్ ముగించుకొని బయటకు వచ్చాక, ఆ యువకుడు "మీకు ఇక్కడ కొన్నిగంటల సమయం ఉంది మీ ఫ్లయిట్ ఎక్కడానికి, విశ్రాంతి తీసుకోండి . అంటూ తనకు కూచునే చోటు చూపించి బయలుదేరబోతుంటే, తరుణి తన దగ్గర ఉన్న బేగ్ లోంచి 25 డాల్లర్లు తీసి ఇచ్చింది. అతడు వద్దు అనలేదు అతని ముఖంలో తగిన పారితోషికం లభించిన భావం కనుపించింది. అతని ఉద్యోగ నిర్వహణకు ఆధికారికంగా ఎంత సంపాదన ఉందో తనకు తెలియదు కాని , అతడు మనిషి పై తనకు కలిగించిన నమ్మకానికీ, వృత్తి ధర్మంలో చూపిన స్నేహ ప్రవృత్తికి అమూల్యమయిన సంతృప్తి లభించినట్లుగా భావించింది.

Posted in March 2020, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!