Menu Close
NettintiKapuram_pagetitle

వంటింట్లో బాండీలో ఉడుకుతున్న చిక్కటి చిలకాకుపచ్చరంగు పదార్ధాన్ని సెల్ కెమేరాతో క్లిక్ మనిపించి, "హబ్బీకోసం ...అందమైన గ్రీన్ ఉప్మా" అని వో టైటిల్ తగిలించి, వంటతో తంటా, వండితే తింటా, ఆరోగ్యానికి ఆరు రంగులూ, తొక్కలూ తోళ్ళూ లాంటి యాభై ఫేస్బుక్ గ్రూపుల్లోనూ...తిమ్మిరివారి కుటుంబం, సోదెయ్య మనవలూ, పల్లిపాలెం పిచ్చ గ్రూప్, అరుగుమీది ఆ సోది, జాకెట్ల జానకి ఇలాంటి ఇంకో వంద వాట్సప్ గ్రూపుల్లోకీ ఎక్కించి, తృప్తిగా తలపంకించింది, పక్కీ అనబడే పంకజం.

అదరా బదరా బైటనుంచివచ్చి, "ఆఫీసు నుంచి అర్జెంటు కాల్ తొందరగా రడీ కావాలి" అంటూ బాత్ రూంలోకి దూరిన మొగుడు ఏం చెప్పాడో వినిపించుకోకుండా, "హనీ నీకోసం ...'తింటే ఒట్టు ఫేస్ బుక్ గ్రూప్ లో కోకిల గారు చేసిన బ్లాక్ ఉప్మాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసిన 'గ్రీన్ ఉప్మా రడీ" అని వాట్సప్ మెసేజ్ పెట్టింది పక్కీ. ఆరోజు దినఫలాల్లో ఆరోగ్య హాని అని రాసుందనుకంటా ...పాపం మెసేజ్ చూడకుండా చిక్కడిపోయి, డైనింగ్ టేబుల్ దగ్గర కూచున్న మొగుడికి రెడ్ చెట్నీ తో బాటు గ్రీన్ ఉప్మా పెట్టి, పైన డెకరెషన్ కి ఒక కరేపాకు రెబ్బకూడా నిలబెట్టి, ఒక అందమైన చిరునవ్వు బోనస్ గా మొహానికి కూడా అలంకరించి, ప్లేటు తెచ్చిచ్చింది పక్కీ.

చెవులో ఊదరకొడుతున్న బాసుకి యెస్ ....యెస్ ....డెఫినెట్లీ సర్ ....ఐల్ కంప్లీట్ ఇట్ సర్  ...అని బుర్రూపుతూ, ఏం తింటున్నదీ తెలుసుకోకుండా ...అమాయకంగా నాలుగు స్పూన్లు గొంతులోకి పోనిచ్చిన సదరు హబ్బీ'జో' అనబడే జనార్దనం, కడుపులో ఏదో ప్రళయం వచ్చి నిన్నా మొన్న తిన్న పదార్ధాలు కూడా బైటకి తన్నుకొస్తుంటే ...యాక్ ...యాక్ ...మంటూ వాంతి చేసుకోటానికి వాష్ బేసిన్ వైపు పరిగెత్తాడు.

అంతమంచి అవకాశం ఎదురొస్తే ...పక్కీ మాత్రం ఎందుకూరుకుంటుందీ ...చటుక్కున సెల్ లో ఫొటో తీసి, "హెంత ఆనందంగా ఉందో ...పెళ్ళయిన ఆరునెల్లకే వాంతులు చేసుకుంటున్న నా ముద్దుల మొగుడు" అని నూటాయాభై గ్రూపుల్లోనూ పెట్టేసింది. అర నిముషం లోనే ఒక వంద లైకులూ, రెండొందలు లవ్ సింబల్లూ, డెబ్భై అభినందనలూ వచ్చేసాయ్!!

బొటన వేలూ చూపిస్తూ, గుడ్లుతేలేసిన మొగుణ్ణి చూస్తూ బోలెడు సిగ్గుపడిపోయి, "పోనిద్దురూ మీ కంగారూ మీరూనూ ....అనక సెల్ లో కొడుదురుగానీ ..లైకు" అని మెలికెలు తిరుగుతుంటే ..."నీ బొంద ...మంచినీళ్ళు .....మంచినీళ్ళు .....అని కూలబడ్డ మొగుణ్ణి చిన్నగా కుర్చీలో కూచోబెట్టి, మంచినీళ్ళు తెచ్చి ఇచ్చినాక  ....పావుగంటకి తేరుకుని, అరిచే ఓపిక లేక ..."ఏంటిది పంకజం? ఏ ఇడ్లీయో, దోసో చెయ్యొచ్చుగా ..."నెమ్మదిగా అడిగాడు.

"హంతేలెండి .....మీ కోసం మీ ఆరోగ్యం కోసం హింత కష్ట పడుతుంటే ......హెంతలేసి మాటలు అంటున్నారూ ...ముక్కు చీదింది పక్కీ. అసలే కొత్త పెళ్ళాం ...ఇంకేమీ అనలేక, బాసు కూడా ఇంకోసారి ఫోన్ చెయ్యటంతో, ఇంకేం చెయ్యలేక "తలుపేసుకో ...టిఫిన్ చెయ్యి నువ్వుకూడా ..." కసిగా చెబుతూ, ఆఫీసుకు పరుగెత్తాడు జనార్దనం.

చదివిందీ పదోక్లాసే అయినా ..పెరిగింది పల్లెటూరయినా, తెలివితేటలకేం కొదవలేదు పంకజానికి. ఉప్మా డస్ట్ బిన్ లో పడేసి, స్విగ్గీలో సాంబారిడ్లీ తెప్పించుకుంది. తీరిగ్గా తిని, మొగుడు సాయంత్రం దాకా రాడు కనక, ఇస్తి వాయినం, పుచ్చుకుంటి వాయినం గ్రూపులో తనకు లైకులు కొట్టిన వాళ్ళందరికీ లైకులు కొట్టే పనిలో పడింది పంకజం.

ఆ తరువాత గంటకి "టిఫిన్ తిన్నావా బంగారం" అని స్మైల్ ఎమోజీతో కూడా మొగుడి వాట్సాప్ మెసేజీకి "ఇప్పుడే తిన్నాను. ఎంతబాగుందో ...." అని తిన్నదేదో చెప్పకుండా తెలివిగా మెసేజ్ ఇచ్చింది. బిల్లు కట్టయిన మెసేజ్ తనకూ వస్తుందని తెలిసినా అందంగా అబద్ధమాడుతున్న పెళ్ళాన్ని ఏం చెయ్యాలో తెలీక కసిగా జుట్టు పీక్కొని చేతిలో కొచ్చిన జుట్టును చూసి "కెవ్వు"మని, పీకీ ...పీకీ ..వత్తైన ఉంగరాల జుట్టంతా ఊడిపోయి, బట్ట బుర్రగా తయారైన తలను తడుముకున్నాడు నిస్సహాయంగా.

పెళ్ళి కాకముందు అందంగా, అమాయకంగా ఉండే పెళ్ళాన్ని గుర్తుచేసుకున్నాడు. పొడవాటి జడతో అందంగా అమాయకంగా ఉన్న పంకజం తనకు నచ్చింది గానీ "మరీ పల్లెటూరి మొద్దే బామ్మా! నేనేమో మంచి పాకేజ్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని, నాతోపాటూ ఉద్యోగం చేసే అమ్మాయైతే బాగుంటుంది కానీ .....ఈ 'పల్లెటూరి గబ్బిలాయి' నాకెందుకే"  అంటే, బామ్మ వినకుండా "వొరే పిచ్చికన్నా!! వీళ్ళ నాయనకు అమరావతిలో పాతికెకరాల పొలముంది. ఒక్కతే ఆడపిల్ల!! బోలెడు వ్యాపారాలు!! ఉద్యోగం చేసే పెళ్ళామైనా ఇంతకంటే ఏం సంపాదిస్తుంది? పైగా నేనూ ఉద్యోగం చేస్తున్నా ...నువ్వే వంట చేయమంటుంది. పల్లెటూరి పిల్లైతే ఇంటిపట్టున ఉండి నీకింత రుచిగా వండిపెడుతుంది అని కన్విన్స్ చేసింది.

తను జీవితం లో చేసిన ఘోరమైన తప్పు, ఎంగేజ్ మెంట్ రోజు భార్యకు అందమైన, ఖరీదైన ఫోను కొనివ్వటం. అప్పటిదాకా నెంబర్లు కొట్టి మాట్లాడటం మాత్రమే చేతనైన తన భార్యకు, తనతో మాట్లాడటానికి వీలుగా, వాట్సాప్, ఫేస్ బుక్ లాంటివి నేర్పించాడు. పెళ్ళికాకముందు ఇదంతా ఉత్సాహంగా బానే ఉంది కానీ ...ఇప్పుడు అదే లోకంగా అయిపోయి, పంకజం పక్కీ గా మారిపోయింది. వ్యవహారం చేయిదాటిపోతోందని గ్రహించినవాడై .....బామ్మకు ఫోన్ చేసి, బావురుమన్నాడు జనార్దనం.

"ఓరి! వెర్రిపీనుగా! ఇంత చిన్నవిషయానికా భయపడుతున్నావ్ ...నేనొచ్చేస్తా వీలుచూసుకుని, కంగారు పడకురా! తిక్కసన్నాసి" అని ముద్దుగా తిడుతూ భరోసా ఇచ్చింది బామ్మ. "ఇదుగో చూడు బంగారం! నా ఆరోగ్యాన్నీ  ...పదికాలాలపాటు పచ్చగా ఉండాల్సిన నీ తాళి బొట్టునీ ...దృష్టిలో ఉంచుకుని ఇంక కొత్త వంటలేమీ చేయననీ, మీ అమ్మ నేర్పిన వంటలే చేస్తాననీ, ఒట్టేసి చెప్పూ" అని బలవంతాన పంకజం చేత ఒట్టేయించుకుని, ఆరోజుకి ప్రశాంతంగా నిద్రపొయాడు జనార్దనం.

వారం తర్వాత... ఓ రోజు వరండాలో కూర్చొని, పొద్దుటి చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉన్న భార్యాభర్తలకు ఎవరో గేటుతీసిన చప్పుడైంది.  "ఎవరో వచ్చారు చూడు జో" వాట్సాప్ మెసేజ్ పెట్టింది పక్కీ . "పాల పాకెట్ల వాడేమో నువ్వేచూడు" తిరుగు మెసేజ్ పట్టాడు అతను. "పాలబ్బాయ్ పొద్దునే వచ్చాడు డార్లింగ్" మళ్ళీ మెసేజ్ పెట్టింది పక్కీ. "నాకు ఆఫీస్ వర్కు బోలెడుంది బంగారం" మళ్ళీ మెసేజ్!! నేను బిజీగా చాట్ చేసుకుంటున్నా ...ప్లీజ్ చూడుజో” మళ్ళీ మెసేజ్.

"ఇద్దరూ తలకాయలు పైకెత్తి చూసి ఛావండి!!! వచ్చి ఛచ్చింది నేనూ ....."అన్న బామ్మ గొంతువిని ఇద్దరూ నాలిక్కరుచుకొని చటుక్కున కుర్చీల్లోంచి లేచి "రాబామ్మా! ఇప్పుడేనా రావటం" అని పలకరించారు. "నేనొచ్చి పావు గంటైంది. ఫోన్లో తప్పితే మాట్లాడుకోవటం మానేసారా ఇద్దరూ ....ఐనా అదేంట్రా పిచిగ్గూడులాంటి జుట్టంతా ఏమైంది. ఇంత చిక్కిపోయావేం వెర్రికుంకా!! ..తిండి తినటం లేదా యేం" అంటూ, పూర్తిగా చిక్కిపోయిన మనవడి వంకా, స్విగ్గీ ఫుడ్డుతిని ఒళ్ళుచేసిన పంకజం వంకా అనుమానంగా చూడసాగింది.

"అమ్మమ్మగారూ! ఒక్క ఫోటో" అంటూ కావలించుకొని పంకజం సెల్ఫీ తీస్తుంటే ...అయోమయంగా సెల్ వైపు చూసిన బామ్మగారిని క్లిక్ మనిపించి, 'కుటుంబ గౌరవం' ఫేస్బుక్ గ్రూపులో పోస్ట్ రాసి పెట్టే పనిలో పడిపోయింది పంకజం. లాప్ టాపు పట్టుకుని ఆఫీసుపని చేసుకుంటున్న మనవడూ, సెల్ ఫోన్ లో బిజీగా ఉన్న పంకజం ఇద్దరూ రాత్రంతా ప్రయాణం చేసి వచ్చిన తనను కనీసం కాఫీ తాగుతావా అని అడగక పోవటం ఆశ్చర్యం గానూ, కోపం గానూ అనిపించింది ఆవిడకు.

నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళి, కాఫీపొడి వెతుక్కుని కాసిని కాఫీ తాగితే గానీ బుర్ర పనిచేయలేదావిడకి. కాసేపటికి అన్నిగ్రూపులకీ పోస్ట్ షేర్ చేసి, వంటింట్లోకొచ్చిన పంకజం, బామ్మగారు గుర్తొచ్చి కంగారుగా కాఫీ పెట్టబోయింది. ఆపాటికే స్నానం చేసి టిఫిన్ కూడా రడీ చేసిన బామ్మగారు, బల్లమీద ప్లేట్లు రెడీ చేస్తోంది.

గబగబా రెడీ అయ్యి ఆఫీసుకు పరిగెడుతున్న మనవణ్ణి ఆపి,"టిఫిన్ చేద్దాం రా రా” అని పిలిచింది. "నా కొద్దు బామ్మోయ్!! నువ్వుకూడా తినకు .." అంటూ వొణుకుతున్న మనవణ్ణి పట్టించుకోకుండా ..."అంతేలేరా! అప్పుడే నీకు పెళ్ళామేమో బెల్లమూ, బామ్మేమో అల్లమూ అయిపోయారు. నాచేత్తో వండింది తినవాఏం?" అని గదిమింది.

"నువ్వు చేశావా?? నువ్వే చేశావా??" ఆనందంతో కేకలేస్తున్న మనవణ్ణి వింతగా చూసి వడ్డించింది మామ్మ. అడుగున గిన్నె గీరుకోని మరీ తింటున్న మనవడి తలనిమురుతూ "ఎంతాకలేసిందో!! పిచ్చికుంకకి పాపం” అనుకుంది. మిడిగుడ్లేసుకుని చూస్తున్న పంకజాన్ని గమనించలేదావిడ.

ఆ తరువాత పంకజం దినచర్యా, మనవడి దినచర్యా చూసిన ఆవిడకు మతిపోయింది. ఇద్దరూ ఇంటి కాపురం కంటే నెట్టింటి కాపురమే ఎక్కువ చేస్తున్నారని గ్రహించిందావిడ. ఇలాగే వొదిలేస్తే, సెల్ఫోన్లూ, లాప్ టాప్లూ, టాబ్లెట్లూ కంటారేమో తప్ప పిల్లలను కనరన్న నిజం అమెను కలవర పెట్టింది. ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచించి, పంకజం తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. "మీరు చెప్పిన విషయం కనుక్కుంటా బామ్మగారూ!! అలాంటిది ప్రపంచంలో ఎక్కడున్నా పిల్లల్ని పంపిద్దాం అన్నాడాయన. సంతోషంగా నిద్రపోయింది బామ్మ.

సరిగ్గా వారానికి మనవడి చేత రెండువారాలు శలవు పెట్టించి, ప్రయాణానికి సిద్ధం చేసింది బామ్మ.

"ఇప్పటికిప్పుడు హనీ మూనేమిటే? అదికూడా అక్కడెక్కడో అండమాన్ దీవులకీ" అని మనవడు గోలపెడుతున్నా వినిపించుకోలేదు. పంకజం మాత్రం ఉత్సాహంగా "గోయింగ్ హనీమూన్" అని స్టేటస్ పెట్టేసింది. అది చూసి తలబాదుకుంటూ, "అందుకేనే బామ్మా చెబితే వినుకోవు ...మా హనీమూన్ కూడా ఇది ప్రపంచంతో పంచుకుంటుందే ...." అని వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవణ్ణి ఓదార్చింది.

ఆఫీసు వర్క్ ఉంటుందని లాప్టాపూ, ఫోటోలన్నీ ఖాళీ చేసుకొని సెల్ఫోనూ పెట్టుకున్న ఇద్దర్నీ కంగారు పడకుండా చిద్విలాసంగా చూస్తూ వీడ్కోలు చెప్పింది బామ్మ. రాత్రంతా కల్లో బామ్మకి చిన్ని పంకజాలూ, బుజ్జి జనార్దనాలే కనపడ్డారు.

సాయంత్రం ఫ్లైటు దిగిన జనార్దనం జంటతో బాటు ఇంకొన్ని జంటల్ని కూడా స్టీమర్ ఎక్కించి చీకటి పడే వేళకి ఒక ద్వీపానికి తీసుకెళ్ళి, రిసార్టుల్లో ఎవరి రూములు వాళ్ళకి చూపించి శలవు తీసుకున్నాడు గైడు. ఈ లోగా బామ్మకు బై చెప్పటం దగ్గరినుంచి, ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కటం, దిగటం, స్టీమరెక్కటం అన్నీ అప్లోడ్ చేస్తూ బిజీగా వుంది పంకజం. అందరూ రూముల్లో సెటిలై భోంచేసి అలసిపోయి పడుకుండిపోయారు.

తెల్లరుఝామునే లేచి లైకులెన్ని వచ్చాయో చూద్దామనుకున్న పంకజానికీ, ఆఫీసువర్క్ చేసుకుందామనుకున్న జో కీ, నెట్ రాలేదు. తెల్లారి రూం బాయ్ ని అడిగితే నవ్వేసి, "ఇది నో ఇంటర్ నెట్ జోన్ అనీ ..చాలామంది నెట్ తో విసిగిపోయి రిలాక్స్ కావటానికే ఇక్కడికి వస్తారనీ, మిగిలిన అందరికీ ఈ విషయం తెలుసనీ చెప్పగానే  ...హమ్మ బామ్మా!! అనుకున్నారిద్దరూ. వెనక్కెళదామంటే ఇంకా పదిరోజుల దాకా ఇటెవ్వరూ రారనీ తరువాత గైడ్ వచ్చి తీసుకెళతాడనీ చెప్పాడతను.

మొదట్లో బోర్ కొట్టినా, తరువాత అందరితో కలిసి ఆ ద్వీపం లో తిరుగుతూ బానే ఎంజాయ్ చేశారిద్దరూ. ఇంటికొచ్చినాక వాంతి చేసుకుంటున్న మనవరాలిని చూస్తూ చాలా సంతోషించింది బామ్మగారు. పిల్లాడు పుట్టాక ఆరునెల్లు దగ్గరే ఉంచుకుని, తరువాత మనవడి దగ్గరకు పంపించింది.

రెణ్ణెల్లు గడిచాయి ...బుజ్జిగాడు ఒకటే కల్లోకొస్తున్నాడని ఒకరోజు ఊరినించి వచ్చింది బామ్మ. ఎక్కడా ఏడుపూ, అలికిడీ వినిపించలేదు. అతి కష్టం మీద తలుపు కొట్టగా, కొట్టగా తలుపు తీసిన మనవణ్ణి తప్పించుకుని ఇంట్లోకి అడుగుపెట్టిన బామ్మ ....యధా ప్రకారం సెల్ చూస్తున్న పంకజాన్నీ, పక్కనే బోర్లా పడి ఐపాడ్ లోకి ఉత్సాహంగా చూస్తున్న మునిమనవణ్ణీ చూస్తూ నోటమాట రాక నిలబడి పోయింది. తెప్పరిల్లి …”ఇప్పుడే పసివాడికి నెట్ అలవాటుచేసేసారా” అని అరుస్తూ ...ఐ పాడ్ లాగేసింది. కళ్ళముందరి ఐ పాడ్ తియ్యగానే కెవ్వుమని గుక్కలు పెట్టి ఏడుస్తున్న పసివాణ్ణి చూస్తూ .."హతవిధీ "అని కూలబడింది పాపం బామ్మగారు.

Posted in March 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!