Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 90
- రూపారాణి బుస్సా
vikshanam-90

వీక్షణం 90వ సమావేశం ఫిబ్రవరి 9, 2020 న ఫ్రీమౌంట్ లోని సుభాష్ గారు, వందన గారింట్లో అతి ఉత్సాహకరంగా జరిగింది.

అపర్ణ గారు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభంలో సమావేశమైన రచయితలందరు తమ పరిచయంతో పాటు తాము ఇటీవల చదివిన కథ లేక కవిత గురించి చెప్పి ఎందుకు నచ్చిందన్న విషయాన్ని తెలియపరిచారు.

మొదట గోకుల్ రాచి రాజు గారు తమ పరిచయం తరువాత సైరాబి పొయట్రీ గురించి తెలియపరిచారు. అలాగే ఒక కొరియాన్ చలనచిత్రం గురించి కూడా చెప్పారు. తదుపరి రమణారావు గారు కథకు కథాశిల్పం ఎంత ముఖ్యం అని చెబుతూ "పడవప్రయాణం" అనే కథ అద్భుతంగా ఉందని, ఏ కథకైన క్రమ పద్ధతి పెట్టుకుని ఏ రచయితైనా వ్రాస్తారు అని చెప్పారు. వాస్తవ పరిస్థితి తీసుకువచ్చిన కథా శైలి బాగా నచ్చిందని చెప్పారు.

ఆ తరువాత ఉదయలక్ష్మిగారు గొల్లపూడి మారుతిరావుగారి గురించి మాట్లాడుతూ కిరణ్ ప్రభగారు గొల్లపూడి గారికి సన్నిహిత ఆప్తులుగా ఉండేవారని కిరణ్ ప్రభ గారు సాహిత్య జగత్తుకు ఎన్నో నిస్వార్థ సేవలను అందిస్తున్నారని అటువంటి నిరర్గళ సేవకు గుర్తింపు రావడం చాలా ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. కిరణ్ ప్రభగారి ఔన్నత్యం గురించి సభికులందరు తమ తమ అభిప్రాయాన్ని తెలియజేసారు.

అనంతరం కోటీశ్వరి గారు తాము అప్పడప్పుడు కథలు చదువుతుంటారని అన్నారు. తర్వాత సుభద్ర గారు చాసు కథలు, వాయులీనము మరియు ఎందుకు పారేస్తావు నాన్న అన్న కథ యొక్క రూపకల్పన గురించి చెప్పారు. ఆ పై కృష్ణ కుమార్ పిల్లలమఱ్ఱి గారు గీతాంజలి ప్రతి భాగము సీస పద్యములో దాదాపు 100 సీస పద్యాలలో అనువదించిన శైలి గురించి మరియు గీతాంజలి భావానికి ఏ మాత్రం లోపం తేనీకుండ సరళమైన పదాలతో సీస పద్యాలను రచించిన వింజమూరి విజయభాస్కర్ గారు చేసిన వర్ణన చక్కనైనదని తెలియపరిచారు. గీతాంజలి అనువాదం కాబట్టి గీతాంజలి అనే పేరుతో రవీంద్రుని భావానికి సరిగ్గా వ్రాసిన పద్ధతి సుమధురంగా ఉందన్నారు.

ఆ తరువాత లెనిన్ గారు తత్వము ఉందా లేదా అన్న విషయంపై కొన్ని సంగతులు చెప్పారు. తత్వంతో వ్రాసినవి వేదాలు అందుకే ఈనాటికి మిక్కిలి ప్రాధాన్యత పొందినవిగా ఉన్నాయి. కాని ఈనాటి రచయితలు వ్రాసే కథలు రచనల్లో అలాంటి తత్వం పెద్దగా ఉండదు కనుక అవి ఒక్క పది ఏళ్ళ తరువాత గుర్తుండవు అని అంటూ సుభాష్ గారు వ్రాసిన కథలో తత్వమున్నది కాబట్టి అందరి మనసుల్లో ఎప్పటికి ఉండి పోతుందని తమ అభిప్రాయాన్ని తెలియపరిచారు. తదుపరి మువ్వ శ్రీనివాస రావు గారు వీక్షణ సభకు వచ్చాక గీత గారి మరియు కిరణ్ ప్రభ గారి సాహిత్యం గురించి తెలిసి వారి పై మరింత గౌరవం పెరిగిందన్నారు. వాక్యాంతం అన్న పుస్తకం తాము వ్రాసారన్న సంగతి తెలియపరిచారు.

ఆ పై  కిరణ్ ప్రభ గారు మరొక్క ఆకర్షక విషయంపై విశ్లేషణ అందించారు. తెలుగులో పత్రికలు ఎలా వచ్చాయి అన్న సంగతి ఎవ్వరూ అంత గమనించి ఉండరు. ఎన్నో అమూల్యమైన విషయాలను పంచారు. 1866 నుండి ఈ నాటి వరకు పత్రికలు ఎలా ఎదుగుకుంటూ వచ్చాయో చూద్దాం. 1900 ముందు వరకు వృత్తాంతి అని వార్త పత్రిక సి.పి. బ్రౌన్ వ్రాసారు. తర్వాత సుజనరంజని అను పత్రిక ఇవాల్టి పిల్లల గైడ్ లా ఉండేది. పిల్లల కొరకు ఆ పత్రికలు అచ్చు కొట్టేవారు. హిత బోధిని మహిళల పత్రిక వచ్చేది. తరువాత దిన దర్శన్ అనే బెంగాలి మాగజైను ప్రారంభం అయ్యింది. అది ప్రయోగాత్మకంగా మాత్రమే విడుదల చేశారు. తరువాత అప్పట్లో నవలలు అనేవారు కారు వచన ప్రబంధం అనేవారు నవలల పోటి పత్రికలలో పెట్టేవారు. 3 బహుమతులు పెట్టారు అందులో నాలుగు నమోదులు మాత్రమే వచ్చాయి కాబట్టి ఎలాగు 3 బహుమతులు ఇస్తున్నారని ఆ నాలుగవ నమోదుకు కూడ బహుమతి ఇవ్వడం జరిగింది. 1897లో నవల అనే పేరు వచ్చింది. 1900 నుండి 1950 వరకు పత్రికలన్ని అభ్యుదయం, అమూల్యం, అనుభవసారం మాత్రమే ధ్యేయంగా ఉండేవి పత్రికలు. కృష్ణా పత్రిక భారతి ఇలాంటివి ఆ కాలపు పేరుగల పత్రికలు. 1950 వరకు పత్రికలు వ్యాపారాత్మకం కాదు. ఆ పై 1950-1980 వరకు పెద్ద పెద్ద వాళ్ళు పత్రికలకు రావడం జరిగింది అయినప్పటి విలువలకు ప్రాముఖ్యత ఉండేది. 1980 నుండి 1990 వరకు మహోధృతం, మరోప్రపంచం అనే పత్రికలు వచ్చాయి. విలువలు వెనక్కు వెళ్ళి వ్యాపారాత్మకం అయినది. 1900-2000 వేగం చల్లబడినది. 2000 నుండి అంతర్జాలాల్లో పత్రికలు ఇక అందరికి తెలిసిందే. అన్ని ఆ కాలానికి తగినట్టు సమాజానికి ప్రతిఫలించాయి.

తరువాత  సుబ్బారావు గారు అపర్ణ గారు వ్రాసిన కథ చదివారు. చదవడం కన్నా చదివినది వినడం ఇంకా బాగుందంటున్నారు. వసంత లక్ష్మి అయ్యారి గారి యూ ట్యూబ్లో ఉన్న  కథలు వినడానికి చాలా బాగున్నాయన్నారు. ఫణీంద్ర గారు తమ పరిచయంతో పాటు రమణ రావు గారు వ్రాసిన పుట్టిల్లు కథ గురించి చెప్పారు. కథ చాలా సరళంగా తీసుకున్నారు. సరదాగా మొదలై గంభీరమైన ఘట్టాన్కి చేరేటువంటి కథ అని చెబుతూ వెన్నెల వెలుగు ఆ కథకు ప్రేరణ అని చెప్పారు. మధుసూదన్ గారు పిల్లల పుస్తకాలు ప్రచురిస్తారు. వీక్షణ గ్రంథాలయానికి ఎన్నో మంచి పుస్తకాలు ఇచ్చారు. తెలుగు వద్దని ఆంగ్ల మాధ్యమాలు ఉంటే చాలన్న విషయం కోసం తరగతిలో తల్లి అన్న కథను ప్రచురించి ఉచితంగా అందరికి పంచారు.

తరువాత కార్యక్రమంగా శ్రీమైత్రి అను చిన్నారి లలిత సంగీతం పాడింది. ఆ తరువాత సౌజన్య నేదునూరి గారు రామకృష్ణ మిషన్ కథలు చదివేవారని చెప్పారు. ఆ పై వేమూరి ఉమ గారు పరిచయం చేసుకున్నారు. తరువాత పరిచయం జయశ్రీ దేవినేని తేనేరు వాసస్తులు తమకు కథలు చదవడం చాల ఇష్టమని చెప్పారు. పడవ ప్రయాణం కథ గురించి కూడ చెప్పారు. ఆమె కిరణ్ ప్రభగారి యూ ట్యూబ్ ఆడియోలు వింటారన్నారు. జ్యోతి గారు పరిచయంలో కిరణ్ ప్రభ గారి అభిమాని అని ఆమెకు కథలు చదవడం చాల ఇష్టం అన్నారు.

తదుపరి పరిచయం సుభాష్ గారు మన్టో రచయిత పంజాబీ కథ శైలులు చాలా బాగుంటాయని నెట్ఫ్లిక్స్ లో ఆ చలనచిత్రం ఉందని వీలైనప్పుడు చూడవచ్చుని చెప్పారు. తెలుగు కథలన్ని 30-40 ఏళ్ళు దాటిన వాళ్ళు వ్రాసినవే ఉన్నాయి 18-30 ఏళ్ళ వాళ్ళు వ్రాసే కథలు టేపే-ఎ-టేల్ ఉన్నాయని చెప్పారు.

రూప గారు తమ పరిచయంతో పాటు తాము ఇటీవల చదివిన స్పెషల్ డేస్ అడిక్షణ్ అను కథ గురించి చెప్పారు. పాశ్చాతీకరణం వల్ల అటు కాదు ఇటూ కాదన్నట్టున్న ప్రజల పరిస్థితిని చక్కగా చెప్పిన కథ అని చెప్పారు. వందనగారు తమ పరిచయం చేసుకున్నారు.

తరువాత డా|| కె.గీత గారు తమ పరిచయంలో వీక్షణం గురించి చెప్పారు. ఎలా మొదలు పెట్టారు, ఎలా కిరణ్ ప్రభగారు మరి ఇతర రచయితలు ఎలా ప్రోత్సహించారు అనే విషయం చెప్పారు. సూరంపూడి సీతారామ్ గారు రచించిన వనవాసి నవల నుంచి లో ఒక పేరా చదివారు. అధ్యక్షురాలు అపర్ణ గారు పరిచయం చేసుకుని కథ మధురాంతకం రాజారాం గారు వ్రాసిన ఇతివృత్తం వర్ణన ప్రధానంగా ఉన్నదని చెప్పారు.

పరిచయాల తరువాత కవి సమ్మేళనం జరిగింది. గీత గారు "నువ్వు లేని ఇల్లు" కవిత చదివారు. ఇక తరువాత రూపా గారు పరిస్థితుల ప్రభావానికి లోనైన దేశమేమి చేయును అన్న స్వీయ కవిత చదివారు. రమణరావు గారు నాన్న గురించి ఒక కవిత చదివారు. తండ్రి మీద పురుషసూక్తం శైలిలో వ్రాసినందుకు పితృసూక్తి అని పేరు పెట్టారు. తమ తండ్రిగారికోసం వ్రాసారు. మువ్వా శ్రీనివాస రావు గారు తమ "వాక్యాంతం" నుంచి కవితలు వినిపించారు. తరువాత కిరణ్ ప్రభ గారు నడిపించిన సాహితీ క్విజ్ అత్యంత ఉల్లాసంగా జరిగింది.

విరామం తరువాత శ్రీమయి విద్యార్థిని "రొద చేయకే" అన్న లలిత సంగీతం పాట పాడింది.

తరువాత గీత గారు తమ స్వీయ రచన "ఆమని గీతం పాడనా" అన్న లలిత గీతం పాడారు.

సుభద్ర గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు పాడారు. ఉమ గారు మంచి పాటను వినిపించారు. అపర్ణ గారు స్వీయ రచన శంకరుడి పాట పాడారు. భక్తి రస పాటతో సభ ధనాత్మకంగా ముగించబడినది.

Posted in March 2020, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!