Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 81
- ఛాయాదేవి
Vikshanam

వీక్షణం-81 వ సమావేశం శానోజే లోని క్రాంతి మేకా గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర రావు గారు అధ్యక్షత వహించారు.

ముందుగా అందరికీ పరిచితమైన  వీక్షణం సాహితీ గవాక్షం సాహితీ లోకానికే  వీక్షణంగా పేరు గాంచాలని  సభలోని వారందరూ ఆకాంక్ష వెలిబుచ్చారు.

మొదటి అంశంగా డా||కె.గీత శ్రీ విశనాథ సత్యన్నారాయణ గారి "జీవుడి ఇష్టం" కథానికను సభకు చదివి వినిపించి కథా చర్చకు ఆహ్వానం పలికారు.

ఈ కథపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. కథలో నాగరిక, అనారిక ప్రజల్ని భారతదేశంలోని ప్రజలు, బ్రిటీషు వారిగా  ఊహించుకోవచ్చని, ఇందులో ప్రధాన పాత్రధారి అయిన స్త్రీ ధైర్యాన్ని కొనియాడవలసినదని, సీతా రావణుల కథకు ప్రతిరూపమని, స్త్రీ హృదయం ఎవరూ దొంగిలించలేరని, కథ పురుషుడు రాసినందు వల్ల స్త్రీ హృదయావిష్కరణ సరిగా జరగలేదని, ఒక స్త్రీ తన పిల్లల్ని తన కళ్ల ముందు నిర్జీవం కానివ్వదని ...ఇలా అనేక రకాల ఆసక్తికరమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

తర్వాత శ్రీ కృష్ణమూర్తి గారు గ్రహణం- రేడియాలజీ అనే అంశం మీద సూక్ష్మంగా వైజ్ఞానిక ఉపన్యాసం చేశారు.

ఆ తర్వాత శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ఆముక్తమాల్యదలోని విష్ణుచిత్తుని కథను, ఇతర ఆసక్తికర అంశాల్ని గురించి ఉపన్యసించారు.

విరామం తర్వాత శ్రీమతి శారద తెలుగు పదాల క్విజ్ ను ఆసక్తికరంగా నిర్వహించారు.

కవి సమ్మేళనం లో శ్రీ కృష్ణమూర్తి గారు మాతృదినోత్సవం సందర్భంగా "స్త్రీ" అనే కవితను, డా||కె.గీత  ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సైబర్ ఉద్యోగుల నుద్దేశ్యించి  "కార్మికులారా వర్థిల్లండి" కవితను , శ్రీ చెన్నకేశవ రెడ్డి గారు మిత్రుల వివాహ దినోత్సవ ప్రత్యేక కవిత "పరిణయ దినోత్సవం" ను చదివి వినిపించగా, శ్రీ సత్యనారాయణ గారు ఉమర్ ఆలీషా గారి పద్యాల్ని రాగ యుక్తంగా పాడి వినిపించారు.

ఆ తర్వాత శ్రీ సుభాష్ గారు సిరికోన సాహితి ప్రచురించిన కవిత్వాన్ని సభకు పరిచయం చేశారు. చివరిగా శ్రీ చిమటా శ్రీనివాస్ గారు వేటూరి వారి గీతాన్ని, డా||కె.గీత "ఎంత చక్కనిదోయి" లలిత గీతాన్ని, శ్రీమతి స్వాతి "వినరో భాగ్యము" అంటూ అన్నమయ్య కీర్తనను ఆలపించి అందరినీ అలరించారు.  ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సభలో స్థానిక సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొన్నారు.

Posted in June 2019, వీక్షణం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!