Menu Close
సేల్ మేనియా
-- వెంపటి హేమ

అమెరికాకు పశ్చిమాన, ఫసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక పట్టణం అది. ఆ రోజు వాతావరణం ఏమీ బాగాలేదు. తెల్లవారిందిగాని ఇంకా సూర్య దర్శనం కాలేదు. ఆకాశాన్ని ఆక్రమించి ఉన్న మేఘాలు.  నీటితో బరువెక్కి వేలాడుతూన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇహనో ఇప్పుడో కుండపోతగా వర్షం - తప్పుతప్పు -  ఇది అమెరికా కనక, కుక్కల్నీ పిల్లుల్నీ -  కురిపించేలా ఉన్నాయి ఆ మేఘాలు! ఉండుండీ ఒక మెరుపు, అప్పుడప్పుడూ ఒక ఉరుము కనిపిస్తూ, వినిపిస్తూ వాన రాబోతోందని హెచ్చరిస్తున్నాయి. ఈదురుగాలి జోరుగా వీస్తోంది.

అంతలో గుమ్మంబయట బరువైన వస్తువేదో విసురుగా ఎగిరివచ్చి ధబ్బుమని పడ్డట్లు పెద్ద చప్పుడయ్యింది. ఫ్రైడే సాయంకాలానికి సాల్వుకాని ప్రోబ్లం ఒకటి ఉంటే,  దాన్ని సాధించడం కోసం పెందరాళే నిద్రలేచి "లాప్ టాప్" ఒళ్ళో ఉంచుకుని సోఫాలో కూర్చుని పని చేసుకుంటున్న ప్రసాద్, పరాగ్గా ఉన్నాడేమో, అదాటుగా వినపడ్డ ఆ చప్పుడుకి తృళ్ళిపడి, సోఫాలో ఇంతెత్తున ఎగిరి పడ్డాడు. అతని ఒళ్ళో ఉన్న "లాప్టాప్ కంప్యూటర్" ఘోరంగా స్పందించింది.
ఆ వచ్చిపడ్డ దేమిటో అతనికి తెలుసు. ఆ శబ్దం అతనికి చిరపరిచితమైనదే. సేల్సు ఇన్ఫర్మేషన్ తో బరువెక్కి ఉన్న "శాన్ హోసే మెర్చ్యురీ న్యూస్" పేపర్ బండిల్ వచ్చిపడి చేసిన హంగామా అది! సైకిలైనా దిగకుండానే రోడ్డు మీద నుండి పేపర్ బోయ్ చేతికొద్దీ  విసిరెయ్యగా, గాలిలో తేలివచ్చి, కఠినమైన సిమ్మెంటు నేలమీద పడిన న్యూస్ పేపర్ చేసిన ఆర్తనాదమే ఆ శబ్దం!

అంతలో మళ్ళీ సద్దుకుని కూర్చున్నాడు ప్రసాద్. అతనికి పెళ్ళయ్యింది. భార్య పేరు జయంతి.  ఆమెకు భర్త సంగతి బాగా తెలుసు. ఒక్క శనివారం తప్ప తక్కిన ఆరురోజులూ, దేశంలో ఏమూల ఏం జరిగిందో తెలియజేసే ఆ పేపర్ రాక కోసం అతడు  ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక శనివారం నాడు మాత్రం ఆ పని జయంతి  చేస్తుంది. చుట్టుపక్కల పన్నెండామడల దూరంలో ఏ మాల్లో ఏ సేల్ ఉందో, డర్టు చీప్ గా  ఏ ఏ షాపుల్లో ఏమేం సరుకులు దొరుకుతాయో అందరికీ తెలియజేసే ఆ శనివారం పేపరంటే జయంతికి ప్రాణం. దాని పేరు చెపితేనే మంట ఆమె భర్త ప్రసాద్ కి. ఆ సంగతి బాగా తెలుసున్నది కనకే, స్నానానికి వెడుతూ హెచ్చరికలు చెప్పే వెళ్ళింది జయంతి.

"రాత్రంతా నువ్వు హాయిగా గుర్రెట్టి నిద్రపోయావు, రాత్రి తెల్లవార్లూ పిల్లాడు చెవిపోటుతో ఏడిచింది నీకు అసలు తెలియనే తెలియదు. ఓ రాత్రి వేళ వాడు లేచి ఏడిస్తే, నాకు మెలకువ వచ్చి, లేచి వాడి గదిలోకి వెళ్ళాను. నే నెళ్ళి మందూ మాకూ ఇచ్చి, వాడిని సముదాయించి పడుకోబెట్టా. తెల్లారగట్ల ఎప్పుడో కాస్త నిద్రపోయాం ఇద్దరమ్. ఈ వేళ శనివారం కాకపోతే నేనింత తొందరగా లేచేదాన్నేకాదు. నిద్ర తక్కువై తలంతా నాదుగా ఉంది, తలంటుకుని వస్తా. వానొచ్చేలా ఉంది. ఈలోగా పేపర్ వస్తే తీసి లోపల పెట్టు.  మర్చిపోకుసుమీ!" అంటూ బాత్రూంలో దూరి, తలుపు వేసేసుకుంది ఆమె.

ఒక చల్లని గాలిపెర వీచింది, వానమొదలయ్యి, పెద్దపెద్ద చినుకులతో  కురవసాగింది. మెరుపుల, ఉరుముల ఆర్భాటం బ్రహ్మాండంగా పెరిగిపొయింది. చూస్తూండగా నీరు కాలవలుకట్టి ప్రవహించసాగింది. వాన ఎంత ఉధృతంగా ఉందన్నది, అద్దాల తలుపుల మీదుగా కారుతున్న వాననీటి వేగాన్ని బట్టి, అంచనా వేయగలిగాడు ప్రసాద్.

"అచ్చికచ్చికా! మా బలేగా ఔతోంది! ఆ మాయదారి పేపర్ వాననీళ్ళలో పడి దూరంగా కొట్టుకుపోతే, పీడ విరగడైపోతుంది కదా" అనుకున్నాడు కసిగా మనసులోనే.  ప్రసాద్ ఆనందంగా తలవంచి పనిచూసుకోడం మొదలెట్టాడు.

అంతలో అతనిలోని వివేకం నిద్ర లేచింది. "అంత సాహసం పనికిరాదురా అబ్బీ! ఎంత ధైర్యం నీకు!ఆ పేపర్ తడిసి ముద్దై పోతే జయంతి ఊరుకుంటుందనే అనుకుంటున్నావా? నీ సంగతి తెలిసున్నది కనకనే  నిన్ను ముందే హెచ్చరించి మరీ వెళ్ళింది. ఇప్పుడు నువ్వు అశ్రద్ధ చేస్తివా, ఏం జరుగుతుందో నీకూ తెలియదు, నాకూ తెలియదు" అంది లేస్తూనే.

అదీ సబవైన మాటే అనిపించింది ప్రసాద్ కి. వెంటనే లాప్-టాప్ పక్కనపెట్టి, లేచాడు. ఈ సరికి ఆ పేపర్ తడిసి ముద్దైపోయే ఉంటుంది అనిపించింది అతనికి. వెంటనే గుర్తొచ్చింది, ఏ చిన్న తేడా వచ్చినా జయంతి ఇల్లు పీకి పందిరి  వెయ్యకుండా వదలదు - అన్నది! శాంతి కాముడైన అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బిక్కుబిక్కుమని బెదురుతూనే, నెమ్మదిగా తలుపు తెరిచాడు. రయ్యిన జల్లు లోపలకు కొట్టింది. చటుక్కున గుమ్మం పక్కన పడి ఉన్న పేపర్ని అందుకుని, మళ్ళీ తలుపు మూసి గడియ వేసేశాడు.

పేపర్ బండిల్ వంక చూసిన అతని ముఖ వికాశం పెరిగింది. ఆ పేపర్ తడవలేదు - అన్నది, అతనికి ప్రశాంతత నిచ్చింది. అతని గుండె కుదుట పడింది. సూచికలో వర్షం రాసిఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా, పేపర్ వాళ్ళు, ఆ  పేపర్ని ప్లాస్టిక్ సంచీలో ఉంచి సీల్ చేశారు. రిలీఫ్ తో "అమ్మయ్య" అనుకున్నాడు ప్రసాద్. ఆ బండిల్ని లోపలకు తెచ్చి, వాష్ రూం లో ఉన్న బొచ్చు తువ్వాలుతో తడంతా శుభ్రంగా తుడిచి, దాన్ని జయంతి కోసమని పొదుపుగా డైనింగ్ టేబులుమీద పెట్టాడు  ఆ తరవాత వెళ్లి సోఫాలో కూర్చుని లాప్ టాప్ ఒళ్ళో కి తీసుకుని, ప్రోబ్లమ్ సాల్వు చేసే పనిలో పడ్డాడు మళ్ళీ. అంతలో ఫోన్ మోగింది. పట్టించుకోవాలనిపించలేదు ప్రసాద్ కి.

ఫుల్ రింగ్ అయినా ప్రసాద్ లేవలేదు. అతనికి అనుభవమే, ఈ రోజు ఈ సమయంలో వచ్చే కాల్సన్నీ జయంతికే! తనకోసం ఒక్కటి కూడా రాదు - అనుకున్నాడు ప్రసాద్. అంతలో బాత్రూం లోంచి పెద్ద కేక వినిపించింది, "ఫోన్ పట్టించుకోవేమిటి" అంటూ అరిచింది జయంతి. లేవక తప్పలేదు ప్రసాద్ కి. ఉసూరుమంటూ లాప్ టాప్ పక్కన ఉంచి ప్రసాద్ లేచేసరికి ఫోన్ ఆగిపోయింది. కాని అతడు కూర్చోబోతూండగా అది మళ్ళీ రింగవ్వడం మొదలుపెట్టింది. ఇక తప్పదురా భగవంతుడా అనుకుంటూ వెళ్ళి రిసీవర్ అందుకుని "అలో" మన్నాడు ప్రసాద్.

"ఎవరా మాట్లాడుతున్నది? జయంతి ఏమైపోయింది " అని అడిగింది ధాష్టీకంగా అవతలి గొంతుకు.

ప్రసాద్ ఆ ధాష్టీకానికి కంగారు పడ్డాడు. ఆ కంగారులో అతనికి, ఎప్పుడో మర్చిపోయాడనుకున్న జన్మభూమి తాలూకు యాస అకస్మాత్తుగా తన్నుకు వచ్చింది.

"నే నాండీ, ప్రెసాదు నండి, ఆయ్!, జయంతి మొగుణ్ణండి. ఆవిడగారు స్నానానికి వెళ్ళిందండి, ఆయ్. ఇప్పుడే వచ్చేస్తుందండి" అన్నాడు.

అతని కంగారు చూసి - కాదు కాదు - విని అవతలి వ్యక్తి చెంబులో పోసిన గవ్వలు గిలకరించినట్లు, పకపకా నవ్వి, "సర్లెండి, రాగిణి కాల్చేసిందని చెప్పండి. గ్రేటర్ మాల్ లో మంచి సేల్ ఉంది, తొమ్మిదిన్నరకల్లా నే నక్కడ ఉంటానన్నాననీ, అక్కడికి ఆమెను రమ్మన్నాననీ  చెప్పండి. మర్చిపోకండేం!"

"అయ్యబాబోయ్! అలా ఎలా మర్చిపోతానండి! తప్పకుండా జయంతికి చెప్తానండి, అమ్మతోడు, ఆయ్! మర్చిపోనండి!”

రాగిణి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది. ప్రసాద్ మళ్ళీ సోఫాలో కూర్చుని, లాప్ టాప్ ఒళ్ళోకి తీసుకున్నాడో లేదో మళ్ళీ రింగయ్యింది ఫోను.....

జయంతి  స్నానం ముగించి వచ్చే వరకు, ఈ ఫోన్ కాల్సు తను అట్టెండ్ అవ్వాల్సిందే! లేకపోతే జయంతి ఊరుకోదు. తనకిది తప్పదు." లాప్ టాప్ ని లాగ్ ఆఫ్ చేసేసి వచ్చి, ఫోన్ పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు ప్రసాద్.

ఒకటి తరవాత ఒకటిగా జయంతికి ఫోన్ కాల్సు వస్తూనే ఉన్నాయి. వాటికి సాధ్యమైనంత సరళంగా అతడు జవాబులు చెపుతూనే ఉన్నాడు. అన్నింటి సందేశం ఒకటే! జవాబు కూడా, "రెడ్డొచ్చె మొదలాడు" అన్నట్లు, ఒకే జవాబు మళ్ళీ మళ్ళీ చెప్పడం! విసికిపోయాడు ప్రసాద్. ఏ ఒక్క కాల్ మిస్ కొట్టినా ఆ వార్త వెంటనే జయంతికి చేరిపోతుంది. ఆ తరువాత ..."అమ్మ బాబోయ్, అంతకన్నఈ ఇబ్బంది పడడమే మేలు" అనుకున్నాడు ప్రసాద్.

పళ్ళ బిగువున చిరాకుని ఓర్చుకుంటూ, వాళ్ళకి ఓపిగ్గా జవాబులు చెపుతున్నాడు ప్రసాద్. ఇదంతా "స్వయం కృతం" అంటే తను చేతులారా చేసుకున్న దాని ఫలితమ్ కదా - అనుకున్నాడు మరోసారి. అతడు అలా అనుకుని మనసులోనే, మనసారా చెంపలు వాయించుకోడం అన్నది ఇది ఎన్నోసారో అతనికే లెక్క సరిగా తెలియదు.

* * * * * * * * *

ఇండియాలో ఉద్యోగం చేసుకుంటున్న జయంతిని పెళ్ళాడి అమెరికా తీసుకువచ్చాడు, ఇంకా H1 వీసా మీద వున్న ప్రసాద్. ఇండియాలో ఎంతో యాక్టివ్ గా తిరిగిన జయంతికి, అమెరికా వచ్చాక కాలు కదపాల్సిన పని లేకుండా పోయింది. ప్రసాద్ ఆఫీసుకి వెళ్ళిపోయాక, ఇంట్లో ఒక్కర్తీ ఉండాల్సి రావడంతో ఒడ్డునపడ్డ చేపలా, తోచనితనంతో గిలగిలలాడి పోయేది జయంతి. సాయంకాలం తను ఇంటికి వచ్చేసరికి బిక్కమోహం వేసుకుని తనకు ఎదురొచ్చే జయంతిని చూసి బాధపడేవాడు ప్రసాద్. దానికి పరిష్కారం కోసం వెతికాడు.

ఒక ఆదివారం ఆమెను వెంటతీసుకుని, ఇంటికి దగ్గరలోనే ఉన్న "గ్రాండ్ ఓక్సు" మాల్ కి వెళ్ళాడు. అది కాలినడకను వెళ్ళగల దూరమే కనక, తోచనితనం వేధిస్తున్నప్పుడు వెళ్ళి, విండో షాపింగుతో సేదదీరి రమ్మని సలహా ఇచ్చాడు. అంతేకాదు, రోడ్దు క్రాస్ చెయ్యడం ఎలాగో నేర్పాడు, ఇండియాకి అమెరికాకి ఉన్న రైట్ సైడ్, రాంగ్ సైడ్ విభేదాలను విడమరచి చూసుకోవాలని హెచ్చరికలు కూడా చెప్పాడు. అదిమొదలు జయంతి మాల్ కి వెళ్లి కాలం గడపడం మొదలెట్టింది. మొదట్లో విండో షాపింగ్ తో మొదలైన జయంతి మాల్ విజిట్సు క్రమంగా, మాల్ నుండి ఒకటీ అరా సరుకులు కొనితేవడంగా పరిణమించి, క్రమంగా వృద్ధిగాంచాయి. కాల క్రమంలో మాల్లో కలిసిన మనదేశ యువతులతో ఆమెకు స్నేహం ఏర్పడింది. వాళ్ళ సహాయంతో, తనకని కారు లేకపోయినా, జయంతికి తక్కిన మాల్సుకి కూడ వెళ్ళే అవకాశం కూడా దొరికింది. ఎక్కడ సేల్ ఉందన్నా వెళ్ళి, ఏదో ఒకటి, రెండు వస్తువులు కొనుక్కురావడం అలవాటయ్యింది కాలక్రమంలో!

* * * * * * * * *

కాలం వేగంగా గడిచిపోయింది. జయంతీప్రసాదుల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వాళ్ళు అమెరికాకు పాత కాపులయ్యారు. గ్రీన్ కార్డు చేతికి వచ్చింది. జయంతి ఉద్యోగంలో చేరింది. వాళ్ళకు ఒక కొడుకు. వాడు అమెరికాలోనే పుట్టాడు. అంతా బాగుంది.

కాని జయంతికి సేల్ మానియా మొదలయ్యింది. ఉద్యోగం వచ్చాక కూడా జయంతి మాల్సుకి వెళ్ళడం మానలేకపోయింది. అది ఆమెకొక వ్యసనమయ్యింది! ఎటొచ్చీ, ఇదివరకు మాల్సుకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిన మనిషి, ఇప్పుడు ఆ పనిని శని, ఆది వారాలకు మాత్రమే పరిమితం చేసింది. దాంతో శలవున్న రెండు రోజులూ కూడా ఆమె ఇంట్లో కనిపించేది కాదు. అది ప్రసాద్ కి నచ్చలేదు.

ఊపిరాడనంత బిజీగా ఉండే అమెరికా జనజీవన సరళిలో శని, ఆది వారాలు మాత్రమే కాస్త జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడానికి ఉన్న వారాంతపు శలవు దినాలు. ఆ రెండు రోజులైనా పెళ్ళాం బిడ్డలతో సరదాగా గడపాలని ఆశించేవాడు ప్రసాద్. కాని జయంతికి ఉన్న సేల్ మానియా వల్ల అది కుదిరేది కాదు. ఆ రెండు రోజులూ కూడా పగటి సమయాన్ని, ఆమె స్నేహితురాళ్ళతో కూడి మాల్సు విజిట్ కి వెళ్ళి, చాలా సమయం బయటే గడిపి, అలసిపోయి సాయంకాలానికి ఇల్లు చేరేది. అది ఎంతమాత్రం నచ్చని ప్రసాద్ గిజాట పడేవాడు. కాని అతని కోరిక తీరాలంటే సేల్ ప్రసక్తి లేని శని,ఆది వారాలు రావాలి. అది జరిగే పనా ఏమిటి! ఎన్నో విధాలుగా ఆమెకు నచ్చజెప్పాలని చూశాడు, కాని కుదరలేదు.

"అత్త మీది కోపం దుత్తమీద చూపించినట్లు",  ప్రసాద్ కి,  సేలన్నా, సేల్ ఇన్ఫర్మేషన్ మోసుకొచ్చే "మెర్క్యురీ న్యూస్" వాళ్ళ శనివారం పేపరన్నా ఒళ్ళు మంట! అతని దృష్టిలో, "s-a-l-e" సేల్ అన్నమాట కూడా ఫోర్ లెటర్ వర్డ్సు లో ఒకటి! అంటే SALE అన్న మాట అనడానికీ, వినడానికీ కూడా పనికిరాని అశ్లీల పదమన్న మాట! కాని జయంతి అతని మాట చెవినిబెట్టదు. స్త్రీ జనాభ్యుదయం పేరుతో, అతని గోడు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యదు. తక్కిన అన్నింటిలోనూ అన్యోన్యంగా ఉండే వాళ్ళిద్దరికీ ఈ విషయంలో మాత్రం చుక్కెదురు.

* * * * * * * * *

బాత్ రూం తలుపు భళ్ళున తెరుచుకుని జయంతి బయటికి వచ్చింది. వస్తూనే నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి పేరర్ చేతిలోకి తీసుకుంది. జయంతికి ఎలాగైనా ఈ సేల్ వ్యసనం పోగొట్టాలని శతవిధాలా ప్రయత్నించాడు ప్రసాద్. కాని నెగ్గలేకపోయాడు, పాపం!

"మనకు అవసరంగా ఉన్న వస్తువుల్ని సేల్లో కొనుక్కుంటే, మనకి ఎంతోకొంత  లాభం వస్తుందన్నది నిజమే.  కాని సేల్ ఉంది కదాని కొనడం మొదలుపెడితే, అది చివరకు నష్టం గానే పరిణమిస్తుంది" - అంటాడు ప్రసాద్. కాని, అతడు ఎంత ప్రయత్నించినా ఈ విషయం ఆమె మనసుకు పట్టేలా చెయ్యలేకపోయాడు.

"ప్రతి వస్తువు మీదా 5% అనీ, 10% అనీ అప్పుడప్పుడు 20% అని కూడా  తగ్గింపు ధరలు వేసి అమ్ముతారు. అరుదుగా 50%, 75% కూడా రాయితీ ఉంటుంది. నీదంతా విపరీతం! ఇంతింత లాభాలు కనిపిస్తూండగా నువ్వొక్కడివీ నష్టం అంటే సరిపోతుందా ఏమిటి" అని ఎదురడిగింది జయంతి.

ఎలాగైనా అసలు విషయం ఆమెకు అర్థమయ్యేలా చెయ్యాలని పట్టుదలగా విడమర్చి చెప్పడం మొదలెట్టాడు ప్రసాద్.   "నేను నీకు అర్థమయ్యేలా చెపుతా, విను- ఎటు చూసినా మనకున్నది అబ్బిగాడు ఒకడే కదా! వాడికి తొడగడానికి ఎన్ని బట్టలు కావాలిట! పైగా, వాడిది రోజు రోజుకీ ఎదిగే వయసాయే! సెల్ లో చవగ్గా వస్తున్నాయి కదాని, వాడికోసం అన్నన్ని బట్టలు కొంటే అవి వాడికి తొడక్కముందే ఇరుకై పోతున్నాయి కదా, అర్ధం చేసుకో..... మొన్న సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన వాటిలో ఎన్ని టాగ్సయినా తియ్యని సరికొత్త బట్టలు ఉన్నాయో గుర్తు చేసుకో. అవే కాదు, మనం మొన్న గార్బేజ్ డిస్పోజ్ చేస్తున్నప్పుడు ఆ చెత్తలో ఎన్ని ఎక్స్పైర్ ఐపోయిన క్రీములు పారేశావో గుర్తుందా! ఇలా ఎన్నని చెప్పను? ఇవన్నీ కొనడానికైన డబ్బు - ఎంత సేల్లో ఐతే మాత్రం - నష్టమే కదా! అవసరానికి కొనుక్కోవాలి గాని, ఇలా పారెయ్యడానికి కొనడం తగని పని. మాల్సుకి వెళ్లి నప్పుడల్లా, సేల్లో ఉన్నాయంటూ కనిపించిందల్లా కొని తెస్తే చివరకు మన చేతికి వచ్చేది చిప్పే!

తను చెప్పిందంతా శ్రద్ధగా విన్నదనే అనిపించింది ప్రసాద్ కి.  అతడు మాటలు ఆపెయ్యగానే బిక్కమొహంతో భర్తవైపు మిడుతూమిడుతూ చూసింది జయంతి. తన కంఠశోష ఊరికే పోలేదు, ఆమె మనసుకి చేరుకుంది - అనుకున్నాడు ప్రసాద్.

కాని, శనివారం వచ్చే సరికి మళ్ళీ ఎప్పటాటే మొదలయ్యింది! ఆమె కోసం స్నేహితురాళ్ళు వచ్చేసరికి, అంతా మర్చిపోయి పర్సు బుజాన్నేసుకుని వాళ్ళతో వెళ్ళిపోయింది జయంతి. నిరాశతో వెనక ఉండిపోయాడు ప్రసాద్.

ప్రసాద్ మరో మాటు వేరే విధంగా ప్రయత్నించాలి అనుకున్నాడు. ఒక వీకెండ్ జయంతి ఎందుచేతనో తొందరగా షాపింగ్ ముగించి, ఇంటికి తిరిగివచ్చింది. ఇంట్లో పిల్లాణ్ణి ఆడిస్తున్న ప్రసాద్ ఇదే అదునని ఆమె దగ్గరకు వచ్చాడు. సేల్ లో కొన్న వస్తువులు కారులోంచి తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతోంది జయంతి.

"ఈ వేళ ఖర్చు ఎంతేమిటి"  అని అడిగాడు ప్రసాద్.

"ఎంతైతే నీకేం నెప్పి? నేను నిన్నేం అడగట్లేదు! నేనూ సంపాదిస్తున్నాకదా! ఎంతోకొంత" అంది, ప్రసాద్ ప్రశ్నకు హర్టైన జయంతి పెడసరంగా.

"ఔను! నువ్వూ సంపాదిస్తున్నావని నాకూ తెలుసు. కాని ఏం లాభం? ఇద్దరం సంపాదిస్తున్నాగాని, మిగిలేదేం కనిపించడం లేదన్నది నీకూ తెలుసుకదా! ఇలాగైతే మనం ఒక ఇంటివాళ్ళం అయ్యేది ఎప్పటికి? మనతోటి వాళ్ళంతా ఎప్పుడో ఇల్లు కొనుక్కుని స్థిరపడిపోయారు కదా! మనమే మిగిలి ఉన్నాం అద్దింట్లో! అసలా యోగం మన మొహాన రాసి ఉందో, లేదో అని నాకు అనుమానం వస్తోంది" అన్నాడు ప్రసాద్ కంఠశోషగా.

"లాభసాటి బేరం కదాని వెళ్ళి కొంటాను గాని డబ్బు దూబరా చెయ్యలని కాదు. పాపం! షాపు వాళ్ళు నష్టం పెట్టుకుని, అంతంత తగ్గించి ఇస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే తెలివి తేటలు ఉండాలి మనకు" అంది జయంతి.

జయంతిని మాట పూర్తిచెయ్యనివ్వలేదు ప్రసాద్. "అది నీ భ్రాంతి! షాపువాడు నీకేం నష్టానికి అమ్మడు. అదొక స్ట్రేటజీ. సేలనగానే, కొట్టువాడు మనకేదో ఒరగబెడుతున్నాడనుకుంటాం, కాని అదంతా ఉట్టిది. వాళ్ళంతా కొమ్ములు తిరిగిన వ్యాపారవేత్తలు!  డామేజ్ ఐనవాటిని, పాత స్టాకుని ఒదిలించుకొంటేనే గాని గొడౌన్లు ఖాళీ కావు కదా!

వాటిని  వదిలించుకోడానికి ఈ సేల్ అన్నది పెట్టడం జరుగుతుంది. అప్పటికే ఆ స్టాక్ మీద వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించే ఉంటారు. ఇప్పుడు కాస్తంత తగ్గించి అమ్మినా వాళ్ళకి ఏ నష్టం ఉండదు. అసలు విషయానికి వస్తే, మొదట్లోనే కొన్న ధరని బాగా పెంచి, అమ్మే ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు సేలని పేరుపెట్టి ఆ ధర కొంచెం తగ్గించినా లాభంలో కొంచెం తగ్గుతుంది గాని అసలుకి మోసం రాదు, షావుకారుకి ఏనష్టం ఉండదు.

ఆ సేల్సుకి ఎర్లీ బర్డు సేల్ అనీ, బై వన్ గెట్ వన్ సేలనీ, హాఫ్ ప్రైస్ సేలనీ... ఇలా ఆకర్షణీయమైన పేర్లు పెట్టి నీలాంటి వాళ్ళను "ల్యూర్" చేస్తారు. ఇంక పండుగల పేర్లతో వచ్చే సేల్సు సరేసరి" అన్నాడు ప్రసాద్.

బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ ఐన ప్రసాద్ వ్యాపారంలోని రహస్యాలన్నిటిని ఒక్క గుక్కలో చెప్పేశాడు జయంతికి. కాని కోరుకున్న ఫలితం దక్కలేదు అతనికి. దృష్టి పెట్టి వినకపోడం వల్ల జయంతికి అందులో ఒక్కముక్క కూడా కొరుకుడుపడలేదు.

కాని దానికి, జయంతి రియాక్టైన పద్ధతి వేరుగా ఉంది. భర్త మాటలు జయంతికి కోపం తెప్పించాయి. భర్త వైపు నిరసనగా చూస్తూ, "నీ కింతకన్నా మంచి సమయం దొరకలేదా సెర్మన్సు చెప్పడానికి? నువ్వెప్పుడు డయల్ చేసినా అది రాంగ్ నంబరే ఔతుంది, అదేం పాపమో గాని! ఈ క్రిస్మస్ హాలీడేస్ లో మనం ఇండియా వెళతాం కదా? అక్కడ వాళ్ళకోసం ఏవో నాల్గు సరుకులు కొనాలని, పనిగట్టుకుని వెళ్ళా. అక్కడివాళ్ళు ఇక్కడినుండి వచ్చే వాటి కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అ సరుకులేవో సేల్లో కొంటే మనకు కొంచెమైనా కలిసొస్తుందని నా ఆశ. లేకపోతే నాకేమైనా తిని కూర్చోడానికి తీపరమా ఏమిటి?" అంది.

"ఇప్పుడు ఇండియాలో ఇక్కడ దొరికేవన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరూ ఇక్కడి సరుకుల కోసమని ఆశించి లేరు. పైగా, విమానాల్లో లగేజ్ బరువు బాగా తగ్గించేశారు కదా, మర్చిపోయావా?"

"అలాగని మనం ఉత్తిచేతులతో వెళ్ళలేం కదా..."

"అవసరానికి కావలసినవి సేల్లో కొనడం బాగానే ఉంటుంది. కాని అది అక్కడితో ఆగాలి. సేల్ పేరుతో మనం ఆ షాపులకు మహారాజ పోషకులం కానక్కరలేదు." చిరాకుపడ్డాడు ప్రసాద్.

"నన్ననడానికైతే ఎన్నయినా అంటావు! నువ్వు మాత్రం లాభం వచ్చేది వదుల్తావా ఏమిటి! నీ "లాప్ టాప్" నువ్వు "బ్లాక్ ఫ్రైడే" సేల్ లో కొన్నది కాదా? గురివెంద గింజలా మాట్లాడకు, బాగుండదు. నువ్వు తొడుక్కున్న పాంటు హాఫ్ ప్రైస్డు సేల్లో కొన్నది. నీ చొక్కా ఎర్లీబర్డు సెల్లో నువ్వే వెళ్లి కొనుక్కున్నావు. ఇక పోతే నీ చేతి రిస్టువాచీ కొన్నది ఆఫ్టర్ క్రిస్మస్ సేల్లో. నీ బనీను కొన్నది క్లియరెన్సు సేల్లో! నీ ..."

జయంతి వాగ్ధోరణికి అడ్డువచ్చాడు ప్రసాద్, "చాల్లే, ఇంక ఆపు నీకు పుణ్యముంటుంది" అంటూ.

జయంతి గొప్ప మాటకారి. కంఠశోషగా తను చెపుతున్న దానిలోని సారాంశం ఏమిటన్నది పట్టించుకోకుండా అసందర్భ విషయాలతో శాఖా చంక్రమణమ్ చేస్తూ ఇలా ఎంతసేపైనా మాటాడగలదు. ఆమెను మార్చడమన్నది ఇక తనవల్ల కాదని చివరకి చేతులు ఎత్తేశాడు ప్రసాద్.

* * * * * * * * *

"ఏమిటలా తెల్లమొహం వేసుకు చూస్తూ ఉండిపోయావు" అన్న జయంతి మాటతో ఆలోచనలలోంచి బయటకు వచ్చాడు ప్రసాద్.

"ఇంతకీ ఇది చెప్పు, నాకేమైనా ఫోన్ కాల్సు వచ్చాయా?"

ఆ, వచ్చాయి, బోలెడు! కాని అన్నింటి సారాంశం ఒకటే. నిన్ను 9-30 కి రెడీగా ఉండమని. ఎవరో రాగిణిట! ఎవరుబాబూ ఆవిడ? మొగాడికి మొగుడులా ఉంది! ఏమి కంఠమది! అచ్చం ఉరిమినట్లే ఉంది!."

"ఇంతకీ రాగిణి ఏమందేమిటీ? ముందది చెప్పు చాలు."

"ఏమంటుంది! షరా మామూలే! 9-30 కంతా నిన్ను సిద్దంగా ఉండమంది. గ్రేటర్ మాల్ లో ఏదో సేలుందిట. మీ ట్రూపంతా అదే మాట. వాళ్ల పేర్లు గుర్తు లేవుగాని వాళ్ళoతా చెప్పిన విషయం మాత్రం ఇదే!

"నాకో వెయ్య డాలర్లు కావాలి సర్దుదూ!"

"నీ క్రెడిట్ కార్డు ఏమయ్యిందిట!"

"సరే! అదుంటే నిన్నెందుకు అడుగుతా? అది ఎక్సీడ్ అయ్యింది."

"ఆ! ఎక్సీ -  డై - పోయిన్ - దా ..." ఆశ్చర్యంతో తడబడ్డాడు ప్రసాద్.

"ఔను. అంత ఆశ్చర్యమెందుకు? త్వరలో మీ అక్కయ్య కొడుక్కీ, మా పింతల్లి కొడుక్కీ పెళ్ళిళ్ళు జరగ బోతున్నాయి కదా! ఆ ముహూర్తాలు రెండూ ఒకదానికొకటి దగ్గరలోనే ఉన్నాయి కనక మనం ఆగి, ఆ రెండు పెళ్ళిళ్ళూ చూసి వద్దాం. మనం ఇండియా వెళ్ళి కూడా చాలా ఏళ్ళయ్యింది. మనవాళ్ళందరూ సంతోషిస్తారు. వెడదాం, ఇకనో, ఇప్పుడో మనకు ఫార్మల్ గా పిలుపు వస్తుంది. పెళ్ళిళ్ళకు. వెడితే ఎక్కడెక్కడి బంధువులూ ఒకేచోట కనిపిస్తారు."

"ఔను కనిపిస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ గిఫ్టులు కొనాలా?"

"ఔను గాని నీ దగ్గర డబ్బేమైనా ఉందా?"

"ఉంది. నా వేలెట్ లో జిప్ ఉన్న పోకెట్లో రెండొందలు కాబోలు ఉన్నాయి. ఖర్మం చాలక ఎప్పుడైనా అవసరమైతే ఉంటుందని, "మగ్గర్సు మనీ" గా దాన్నెప్పుడూ అక్కడ ఉంచుతా. నీకు కావాలంటే తీసుకో..."

ఠక్కున మాటందుకుంది జయంతి, "ఐతే నేను మీకొక "మగ్గర్" లా కనిపిస్తున్నానన్నమాట! మీకేం - మీరు మగ మహారాజులు. మిమ్మల్నెవరూ ఏమీ అనరు! అందరూ మమ్మల్నంటారు! చేతులు ఝాడిoచుకుంటూ వెళ్లి వాళ్ల మొహం చూసేదెలా? నా స్టేటస్ మాటేమిటి? బైదిబై! ఈవేళ నాకు ఒకవెయ్యి డాలర్లు కావాలి. లేకపోతే నా ఫ్రెండ్సు ముందు నా పరువు నిలవదు. బుద్ధితక్కువై పెళ్ళి షాపింగ్ ఉందని చెప్పేశా కూడా!"

"ఇక చాల్లే! మాల్సు వెంట తిరగ మరిగావు, నీకు ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు దొరుకుతూనే ఉంటుంది. ఒక్క వీకెండైనా ఫామిలీతో సంతోషంగా గడపాలంటే కుదరదు కదా! ఏం మాల్సో, ఏం సేల్సో ..." ఉసూరుమన్నాడు ప్రసాదు.

గడియారం వైపు చూసింది జయంతి. "అప్పుడే ఎనిమిదిన్నర అయ్యింది.. తొమ్మిది దాటేసరికి నేను రెడీగా ఉండాలి. డాట్ ఆన్ టయిం వాళ్ళు వచ్చేస్తారు. తీరా మాటిచ్చాను, వెళ్ళక తప్పదు మరి."

"మరి భోజనం సంగతి?"

"నీకంత ఆకలిగా ఉంటే ఫ్రిజ్ లో పాస్తా ఉంది, వెచ్చచేసుకు తిను. పిల్లాడు లేచి ఏడిస్తే వాడిక్కూడా అదే కొంచెం పెట్టు. లేవగానే వాడికి పాలు పట్టాలి, మర్చిపోకుసుమీ!"

"మరి వాడి భోజనం...?"

"అబ్బ! ఇది హాఫ్ డే మాత్రమే ఉండే సేల్, తొందరగానే అయిపోతుంది. వంటా-పెంటా అంటూ ఆలస్యం చేస్తే వెళ్ళిన ప్రయోజనం ఉండదు. ఫ్రిజ్ లో ఏవేవో లెఫ్టోవర్సు ఉన్నాయి. అవి నచ్చకపోతే, ఓ కప్పున్నర బియ్యం అత్తెసరు చిన్న కుక్కర్ లో పడెయ్యి. ఫ్రీజర్లో ఏవో కూరల పేకెట్లు ఉన్నాయని గుర్తు. ఈ పూటకి వాటితో లాగించెయ్యండి. రాత్రి కి నేను వచ్చి కావలసినవన్నీ వండి పెడతా. ఇంతకీ నేనడిగిన వెయ్యి డాలర్లమాట ఏమిటి?"

"బయట వాన చూశావా, ఎంత ఉధృతంగా ఉందో? ఇదేమైనా అంత ప్రాణావసరమా ఈ వానలో పడి పోవడానికి? నేను వెళ్ళ లేను" అన్నాడు ప్రసాద్.

"ఇప్పుడు మేము వెళ్ళమా ఏమిటి ఈ వానలో! మగవాడివి, వానకి భయపడతావా? ఉట్టి చేతులతో వాళ్ళతో నే నెలా వెళ్ళగలననుకుంటున్నావు? పరువు పోదా? వాళ్ళంతా పర్సు నిండా డాలర్ల కట్టలతో వస్తారు."

"ఒకళ్ళతో మనకి వంతు ఎందుకు చెప్పు? ఎవరి కెపాసిటీ వాళ్ళది."

"ఇంతకీ నా మాట ఏమిటి? ఇచ్చేది ఉందా లేదా' అంటూ నిలదీసినట్లు అడిగింది జయంతి.

"నాకీ వానలో గుమ్మం కదలాలని లేదు" అన్నాడు ప్రసాద్ ఖండితంగా.

ఇక జయంతికి "బ్రహ్మశిరో నామకాస్త్రం" పైకి తియ్యక తప్పలేదు. "ఐనా నా వెర్రి కాకపోతే, నువ్వెప్పుడు నా మాటకు "సై" అన్నావు కనుక! ఎప్పుడూ "ఎడ్డెం" అంటే "తెడ్డెం" అనడమేగాని" అంటూ ఏడవసాగింది.

అక్కడితో కూడగట్టుకున్న ధైర్యం కాస్తా నీరు కారిపోగా, "ఏడవకు, వెడుతున్నాలే" అంటూ కారు తాళాలు తీసుకుని గరాజ్ వైపుగా నడిచాడు, పాపం! ప్రసాదు, పెళ్ళైన ప్రసాదు!

* * * సమాప్తం * * *

Posted in June 2019, కథలు

1 Comment

  1. Anupama

    చాలా చక్కగా చమత్కారంగా వివరించారు.ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *