Menu Close

Adarshamoorthulu

డా. వింజమూరి (అవసారల) అనసూయ
-- విద్యార్థి

మునుపటి సంచికలో వింజమూరి అనసూయ గారి శాస్త్రీయ సంగీతం గురించి లిప్తం గానూ, భావ సంగీతం లేక లలిత సంగీతం గురించి క్లుప్తంగానూ వివరించబడినది. ఈ సంచికలో అనసూయమ్మ జానపద సంగీతం గూర్చి చేసిన అసమాన కృషి గురించి విపులంగా పరిశీలించుదాము.

జానపద గీతాలు

V Anasuyaఅనసూయమ్మ ఎనిమిదేళ్ల వయసులో కాకినాడలోని సంగీతపు పోటీలలో "నిధి చాలా సుఖమా" పాడబోయి, ఆ ఉదయం ప్రక్కింటి గ్రామఫోనులో విన్న బిడారం రాచప్పగారు పాడిన "మగడొచ్చి పిలిచెరా, పోయి వత్తురా స్వామి" జావళి పాడారు. ఆ రోజులలో (1928) జావళీకి నేటి సినిమా పాటలకున్నంత లోక ప్రియత్వము ఉండేదట. ఆ జావళి పాడిన తరువాత న్యాయ నిర్ణేతలు "బాగా పాడావు కానీ, ఇది శాస్త్రీయ సంగీతపు పోటీ" అని అంటె, "ఓ అది కూడా పాడుతాను అని "నిధి చాలా సుఖమా" పాడి మొదటి బహుమతి గెలుచుకుంది.

వల్లూరి జగన్నాధ రావు అనే ఆయనకు జానపద గీతాలను పోగు చేసి, వాటిని పాడి గ్రామఫోను రికార్డులుగా విదుదల చేయాలని కోరిక. తనతో పాటు పాడటానికి ఒక ఆడ గొంతు కావాలి. అందుకోసం ఆ సంగీతపు పోటీలకు వచ్చారు. జావళీ పాడిన చిట్టి అనసూయ గొంతు బాగా సరిపోతుందనుకుని, బహుమతి గెలుచుకున్న అనసూయమ్మ వాళ్ల నాన్నగారిని అడిగితే అలాగే అన్నారు. 1928లో, ఎనిమిదేళ్ల వయసులో గ్రామఫోను రికార్డు విడుదల చేసిన ఖ్యాతి అనసూయమ్మది. ఆ రికార్డులో ఆమె ఒక్కరే పాడిన పాటలూ, జతగా పాడిన పాటలు కూడా ఉన్నాయి. ఆ రికార్డులో ఉన్న పాట (రీ-రికార్డింగు చేసినది) క్రింద వినగలరు.

ఆ తరువాత ఈ జానపద గీతం బాణీలో వచ్చిన పాటలు ఇవి. వీటిలో, బాణీ కానీ సాహిత్యం కానీ ఏది గ్రహించబడినదో, ఏది సంగ్రహింపడినదో పాఠకులు నిర్ణయింపగలరు.

ఆ తరువాత కాలంలో, ముఖ్యంగా 1950ల నుండి సినీ సంగీతం జానపద సంగీత సాహిత్యాలను ఎంతో కొంత

సంగ్రహించినది అనటానికి పై పాటలు ఉదాహరణలు.  అనసూయమ్మ మాత్రం తన పుస్తకాలలో ఎక్కడనుంచి సేకరించారో వ్రాసుకున్నారు, అందరికీ చెప్పుకున్నారు.

సినిమా సంగీతం 1940, 50ల ప్రాంతాల వరకు నాటక సంగీత బాణీలోనే ఉండేది. ఆ తరువాత సినీ సంగీతంలో జరిగిన మార్పులలో జానపద సంగీత సాహిత్యాలను వాడుకోవటం ఒక మార్పు. గ్రామఫోను రికార్డులలోనూ, రేడియోలోనూ అనసూయమ్మ వంటి వారు పాడిన జానపద గీతాల బాణీని కూడా ఎక్కువగానే వాడుకున్నారు. అనసూయమ్మ మాత్రం జానపద గీతాన్ని జానపద గీతంగానే పాడారు. అవసరమైన చోట రాటుదనము, మొరటుదనము, ఇంకొన్నిచోట్ల అమాయకత్వం, మరికొన్ని చోట్ల తన్మయత్వంతో కూడిన ఉత్సాహం, తను విన్నది విన్నట్లుగా పాడారు. ఆవిడ ఏ పాటను ఎక్కడ నుంచి సేకరించారో ఆవిడ వ్రాసిన పుస్తకాలలో పొందుపరిచారు. ఏ పాటనూ అనవసరంగా సంస్కరించలేదు, అతిశయించి శాస్త్రీయతను ఆపాదించలేదు. జానపద సాహిత్య, సంగీత మూలాలని నిలిపారు. ఇదీ, జానపదానికి ఆవిడిచ్చిన గౌరవం. 1930, 40, 50ల కాలంలో ఆవిడ పాడిన జానపద గేయాలను గ్రామఫోను రికార్డులుగా విడుదల చేస్తే, వాటిని కొందరు కామెడీ పాటలు అనేవారట. కానీ, ఎక్కడ పడితే అక్కడ మైకుల్లో వినబడేవట. ఈ పాటలకు ఎంత ప్రాచుర్యం ఉండేదనటానికి, ఈ క్రింది పాట ప్రస్తావన బుచ్చిబాబు గారి "చివరకు మిగిలేది" నవలలో ఉన్నది.

ఈ కాలంలో డోరు నంబరు, వీధి పేరు మొదలైనవి సౌలభ్యంతో కూడిన చిరునామాలు. వాటికి ప్రాణం లేదు, చేతన లేదు. ఒక పల్లె పడుచు పాటలోని "ఇంటి ఎదుట ఈత పొద, ఇంటి వెనుక గచ్ఛా పొద ..." అని చిరునామా చెపుతుంటే రమ్యత ఉంది, ఆశ ఉంది, పల్లెటూళ్లలోని అత్మీయత వుంది. ఆనాడు బండి వాడు, ఈనాటి కారు డ్రైవరు కావచ్చు. కానీ యువతకు సహజమైన ప్రేమ మాత్రం ఒక్కటే.

అదే పడుచు, నమ్మిన వాడు మోసం చేసి పొరుగూరిలో వదిలివేస్తే, ఆ పడుచు పశ్చాత్తాపం ఈ క్రింది పాట.

నిక్కుతూ, నీలుగుతూ, ఎగశ్వాసతో ఈ పాట పాడటం అంత తేలిక కాదు. ముఖ్యంగా కచ్చేరీలలో. అది అనసూయమ్మకే చెల్లింది. జానపదులు ఈ సందర్భానికి కూడా పాట కట్టుకోగలిగారు. "Blues" పాటలలో కూడా ప్రియుడు లేక ప్రియురాలు మాట ఇచ్చి మోసం చేయటం, అందులోని వేదన, ఆర్తి, ఉలుకుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వేదనతో కూడిన పాటలు ప్రపంచ జానపద సాహిత్యంలో సహజమేమో?

వల్లూరి జనార్ధన రావు గారు శాస్త్రీయ సంగీత విద్వాంసుడే. ఆయన "చాలా క్లిష్టమైన గమకాలు సంగతులతో కూడుకున్న కీర్తనలూ, రాగమాలికలూ నేర్పారు" అని అన్నారు అనసూయమ్మ గారు. ఒక గురువు ఇంకొక విద్యార్థి ప్రతిభ గుర్తించి దిశా నిర్దేశం చేస్తాడు. ఆయన సేకరించిన జానపద గీతాలను ఉచ్చారణ, రస భావాలు పొల్లు పోకుండా ఎన్నిటినో చిట్టి అనసూయమ్మకు నేర్పారు.

జగన్నాథరావు గారు జానపద గీతాల సేకరణకు కూడా చిట్టి అనసూయను తీసుకు వెళుతుండేవారు. కళావంతులు (భోగం) స్త్రీలు పాడే పాటలు నాట్య సంగీతాలతో కూడిన వృత్తి పాటలు. అవి జగన్నాధరావు గారికి ఇవ్వటానికి ఆ కళావంతులు నిరాకరించారు. జగన్నాథ రావు గారు చిట్టి అనసూయ ఏకసంథాగ్రాహి అని గమనించి, ఇంటివాళ్లకు తెలియకుండా ఆవిడను కళావంతుల ఇంటికి తీసుకువెళ్లి, అనసూయతో కొన్ని పాటలు వాళ్లకు నేర్పి, "చిన్న పిల్ల, ముచ్చటపడుతోంది, మీరొక పాట పాడండి" అనేవారట. ఇంటికి రాగానే ఆ పాట చిట్టి అనసూయ పాడితే, జగన్నాథరావు గారు వ్రాసుకునేవారట. అయితే, ఆవిడకు కళావంతుల మీద, వారి కళల పట్ల గౌరవం పెరిగింది, వారి దైనందిక జీవితం సామాన్య ప్రజలకు భిన్నం కాదని అర్థమయ్యింది. కళావంతుల దగ్గర గీత, సంగీతాలు సేకరించటమే, ఆ తరువాత ఆవిడ ఎన్నో వేల జానపద గీతాలు సేకరించటానికి అంకురార్పణ. ఇక్కడ గమనించ వలసిన విషయం, 1920ల కాలంలో ఒక అమ్మాయిని ఇంటి వాళ్లకు చెప్పెకుండా కళావంతుల ఇంటికి తీసుకు వెళ్లటం. ఈ విషయాన్ని అనసూయమ్మ చాలా కాలమే దాచిపెట్టారు.

V Anasuya1920, 1930ల కాలంలో రాజమహేంద్రవరంలోని నాళ్లం క్రిష్ణారావుగారి సంగీత సభ పేరెన్నిక గలది. ఎందఱో ఆనాటి సంగీత విద్వాంసులు, కవి ప్రముఖులూ వచ్చేవారట. అనసూయమ్మ 11వ ఏట (1931) ఆ సభలో కచేరీ చేస్తూ, త్యాగరాయ కీర్తనలూ, భావ గీతాలూ పాడి, వల్లూరి జనార్ధన రావు గారు ఇచ్చిన ఒక జానపద గీతం పాడారట. "జానపద గీతం సంగీత సభలో పాడటం అదే మొదలు" అని అన్నారు అనసూయమ్మగారు. ఆ జానపద గీతం -

‘కోటి రత్నము ముద్దు కోమలాంగి

తన కోటకు రమ్మనాదీ

కొక్కొరోమని కోడి కూసే వేళదాకా

మక్కువా దీర్చి పొమ్మన్నాదీ ....’

సాంప్రదాయం నవ్యతను అంగీకరించదు. అలాగే నిజ జీవితాన్ని అంగీకరించకపోగా చులకన చేయటం నేటికీ ఉన్న నిజం. ఆనాటి సంగీత సభలో, ఈ పాట విన్న ప్రముఖ కవయిత్రి ఒకరు, అనసూయమ్మగారి తల్లిగారైన వెంకటరత్నమ్మ గారితో ఈ జానపద గేయానికి గట్టిగానే అభ్యంతరం చెప్పారట. అప్పుడు వెంకటరత్నమ్మగారు తల దించుకునే "క్షేత్రయ్య పదాలలోనూ, జావళీలలోనూ ఉన్నంత శృంగారం కూడా ఈ పాటలో లేదు, అందుకే పాడమన్నాను" అన్నారట. "ఆ రోజు అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే ఇన్ని వేల జానపద గీతాలు సేకరించ గలిగాను, ఆ తరువాత సభలలోనూ, రేడియో లోనూ పాడగలిగాను" అన్నారు అనసూయమ్మ. సాంప్రదాయానికి బంధింప పడిన ఆనాటి గాయకులు జానపద గీతాల దగ్గరకు రాలేదు. ఆ పని తెలిసో తెలియకో అనసూయమ్మ చేసిన సాహసం ఆ తరువాతి కాలంలో “Queen of Folk Music" బిరుదును, 76 అవార్డులనూ సంపాదించుకున్నారు.

అనసూయమ్మ వివిధ దశలలో సేకరించిన జానపద గీతాలు  కొన్నిటిని పరిశీలించుదాము.

వల్లూరి జనార్ధన రావు గారి వద్ద నేర్చుకున్న పాట, 1930లో విడుదలైన గ్రామఫోను రికార్దులో ఉన్న పాట "వయసు పొంగు"

ఈ పాటలో ఆనాటి సామాజిక దురాచార చరిత్ర ఉన్నది. ఒక చిన్నపిల్లను డబ్బుకు ఆశపడి ముసలివాడికి కట్టబెట్టారు. గురజాడ వారి "పూర్ణమ్మ" ఒక పసిదాని బాధ చూసి ఒక సంస్కర్త వ్రాసినది. అదే పసిది వయసులోకి వస్తే, ఆ పసిదాని వయసు కోరిక, ఆ స్త్రీ తన భావాలతో పాడిన పాట ఇది. మొగుడిని కాదని మరిదితో రంకులాడటం తప్పు అని నేటికీ సాంప్రదాయ కుటుంబీకులు అనవచ్చు. కానీ, పసలేని ముసలి మొగుడుకిచ్చి పెళ్లి చేయటమే తప్పు అనే వారు తక్కువ.

రంకు అనేది అన్ని సామాజిక వర్గాలలో ఉంటుంది. (ఉదాహరణకు చివరకు మిగిలేదు నవలలో కథా నాయకుడు గాలి వాన వచ్చినప్పుడు పెళ్లయిన తన మేన మామ కూతురుతో కలవటం). సాంప్రదాయపు కుటుంబాలలోని చాటు వ్యవహారాలు, జానపదుల జీవితాలలో బహిరంగం. ఒక పాట కూర్చి పాడుకోవటం కూడా, ఆనాటి జానపద స్త్రీలు తమకు తాము చాటుకున్న స్త్రీ స్వాతంత్ర్యమేనేమో.

1930ల కాలంలో అనసూయమ్మ, వారి చెల్లెలు సీతతో కలసి ప్రతి వారాంతంలోనూ ఎడ్ల బండి మీద కాకినాడ నుండి పిఠాపురం వారి మేనమామ కృష్ణ శాస్త్రి గారింటికి వెళ్లేవాళ్లమని చెప్పారు. వల్లూరి జనార్ధనరావు గారు ఇచ్చిన జానపద గీతాల సేకరణ ఉత్సాహంతో, అనసూయమ్మ ఆ మార్గంలోని గ్రామీణుల జానపద గీతాలను చాలానే సేకరించారు. ఇది ఆవిడ స్వయముగా తనకు తాను సేకరణ మొదలు పెట్టిన అధ్యాయం. ఈ అధ్యాయంలో ఎక్కువగా గోదావరి జిల్లాల ప్రాంతంలోని పాటలు సేకరించారు. కాకినాడ నుండి పిఠాపురం ఎడ్ల బండిలో తీసుకువెళ్లే బండివాడు పాడిన పాట ఇది, సేకరణ 1938లో.

వింజమూరి సీత, అనసూయలు

V Anasuyaవింజమూరి సీత "మా భూమి" చిత్రానికి సంగీత దర్శకురాలు. ఆ సినిమా తీసే సమయానికి  సీత-అనసూయల జంట విరివిగా కచ్చేరీలలో ఈ పాట పాడేవారు. అనసూయ "మా భూమి" చిత్రానికి ఇచ్చిన పాట ఇది. సాహిత్యాన్ని సందర్భానికి సరిపడా కొద్దిగా మార్చి జానపద బాణీలోనే సినిమా పాట తయారయ్యింది .

కృష్ణ శాస్త్రి గారు, ఆయన కవి మిత్ర మండలి కూడా అనసూయమ్మ జానపద సంగీత ఉత్సాహం చూసి, వారు విన్న పాటలు చాలానే ఆవిడకు అందించారు. అడవి బాపిరాజుగారు సేకరించి అనసూయమ్మకు 1934లో ఇచ్చిన పాట ఇది:

1945ల కాలానికి, సినిమా పాటలకు ఈనాడు ఉన్నటువంటి జనాదరణ లేదు. గ్రామఫోను రికార్డులలో వినపడుతున్న భావ గీతాలకు, జానపద గీతాలకు, భక్తి గీతాలకు ఆదరణ ఉండేది. AIR మద్రాసు కేంద్రం 1938లో ప్రారంభమయ్యింది. రేడియోలో తరచుగా వినపడే అనసూయ ఆనాటి తారామణి. ఆవిడ కచేరీలకు మంచి గిరాకీ ఉండేది. అంతటి సౌభాగ్య జీవితంలో, ఆవిడ 25వ పుట్టిన రోజునాడు, ఏ స్త్రీకీ జరగరాని ఘటనతో అవిడ గర్భవతి అయ్యారు. ఇంటివారు అభ్యుదయవాదులే, కానీ సమాజం అంత అభ్యుదయ స్థాయికి చేరుకోలేదేమో.  ఈ పరిస్థితులలో అనసూయమ్మ, తమ కుటుంబానికి శ్రేయోభిలాషులైన బంధువుల నెల్లూరి నివాసంలో మూడు నెలలు గడిపారు. ఇది ఆవిడకు ఎంతగానో మానసిక నిర్వేదనతో కూడిన గడ్డు కాలము. ఆ సమయంలో ఆవిడకు తోడు నెల్లూరు బంధువుల ఇంటిలో, తన గది ప్రహరీ గోడకు ఆవలనున్న యానాది మొదలైన వ్యవసాయ కార్మికుల గుడిశలలో నుండి వినపడిన జానపద గీతాలు. "యానాదులకి చెప్పలేనంత రాగ జ్ఞానం తాళ జ్ఞానం ఉంటుందయ్యా" అనేవారు అనసూయమ్మ. ఈ దశలో ఆవిడ నెల్లూరు ప్రాంతంలోని జానపద గీతాలను సేకరించి ఆ తరువాత సంగీతం కూర్చి పాడారు.  ఆ దశలో ఆవిడకు ఓర్పునూ, ధైర్యాన్ని కూర్చిన ఒక సోది దాని ప్రార్థనా గీతం ఇక్కడ వినగలరు:

ఆ తరువాత కొంత కాలానికి, ఆవిడ AIR మద్రాసు కేంద్రంలో పని చేస్తూ, నెల్లూరు సముద్ర తీరంలో బెస్తవారి పాటలు పోగు చేయటానికి వెళ్లారు.  ఇంటిలో జ్వరంతో ఉన్న మూడేళ్ల కొడుకు. ప్రయాణం తేలిక కాదు. నెల్లూరులోని బంధువుల ఇంటిలో రాత్రికి ఉండి, ఎక్కడో రహదారిలేని తీర ప్రాంతానికి ఉదయం తొమ్మిదింటికి చేరి పన్నెండింటి దాకా పాటలు రికార్డింగు చేసుకుని, రాత్రికి ఇంటికి వెళ్లి జ్వరంతో ఉన్న కొడుకును దగ్గరకు తిరిగి వెళ్లదామనుకున్నారు. కానీ, బెస్తవారు ఎంతటికీ రాలేదు. వేచి చూసి ఇక తప్పదు తిరిగి వెళ్లటమే అనుకుంటూ, మద్యాహ్నం మూడు గంటల సమయంలో అన్ని వస్తువులూ సర్దుకుంటూ వుండగా, బెస్తవారు పూర్తిగా తాగి వచ్చి పాడతామన్నారు. సర్దుకున్న సామాను తిరిగి అమర్చితే, మైకులో అయితే పాడము, మైకు ఆయువు తీస్తుంది అని ఒక అమాయకత్వపు మూఢ నమ్మకం చెప్పారు. ఎలా అయితేనేం, వారి వద్ద రాత్రి దాకా మైకు లేకుండా పాడించి చాలా పాటలే పోగుచేశారు.  ఆ రాత్రికి తిరిగి మద్రాసు బయలుదేరి వెళ్లలేకపోయారు. ఒక ఉద్యోగస్తురాలైన స్త్రీ, ఇంటి దగ్గర బిడ్డల ఆరోగ్య సమస్యలు తలుచుకుంటూ, దైనందిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో సాధించుకు రావటం, నాటికీ, నేటికీ బారత దేశంలో స్త్రీలు పడుతున్న కష్టానికి నిదర్శనమేమో!

అనసూయమ్మ చిత్తూరు జిల్లాలో సేకరించిన ఈ పాట, బహుశా నెల్లూరు నుండి వచ్చిన వ్యవసాయ కూలీల దగ్గరనుండీ అయ్యి వుండవచ్చు.

V Anasuyaవొలియా --

చిత్త చిత్తా వానలు కురిసే

చిత్తా వానలు కురిసే

బంగారు వానా కురిసే  - ఔనొదినా

బంగారు వాన కురిసే

బాగాయే పనులూ

నెల్లూరు భూముల్లో

నెమిలీ వాలింది

నెమిలీ కేసినయంబు -ఔనొదినా

నేలకొరిగింది

ఇది ఊడ్పుల పాట. వరి నాట్లు ఒక నాలుగు చరణాలతో అయ్యే పని కాదు. సామాన్యంగా నాట్లు వేసే స్త్రీలు ఒకే పాటను చరణం తరువాత చరణం కలుపుకుంటూ కొన్ని వందల పంక్తులతో కూడిన పాట ఒక పూట మొత్తం పాడుతారు. జట్టులో ఒకరు పంక్తులు పాడుతూంటే, వరస మొత్తం ఒక నాటు వేసి, ఒక అడుగు వేస్తూ "ఔనొదినా" అంటూ ముందుకు జరిగే అందమైన దృశ్యం మనకు స్ఫురిస్తుంది. సంగీతం శ్రామికులనుండి పుట్టింది అనుకోవడానికి ఇది నిదర్శనమేమో.

చిత్త కార్తి నైఋతీ ఋతుపవనాల ప్రారంభ దశ. ఈ కార్తెలో ఒక్కొక్కసారి ఉన్నట్లుండి మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడడము ఉంటుంది. ఇదే సమయంలో చెట్ల తోపుల మధ్య వుండే ఖాళీ స్థలాలో నెమళ్లు నాట్యం చేయటం జరుగుతుంది (చెట్లూ, నెమళ్లూ విరివిగా ఉన్న పాత తరంలో). ఇది శుభ సూచకం.  గట్టు మీద చెట్ల తోపులలో నెమళ్లు ఆడుతూ ఉంటే, వరి చేలల్లో లయబద్దంగా పాడుతూ వరి నాట్లు వేసే స్త్రీలు. ఎంత అందమైన దృశ్యం!!!

అనవసరమైన అలంకారాలు, సమాసాలూ లేని అందమైన జానపద గీత సాహిత్యమిది. ఇందులో చిత్తకార్తెలో నెమళ్లు వాలటం వాతావరణ శాస్త్ర రీత్యా సమ్మతం, ప్రకృతి  సహజం, ఇది నెమళ్లు ఆడే కాలం. ఆ తరువాత  వచ్చిన సినీ సాహిత్యంలో ఇంత అందమైన వాన పాట కనబడదేమో. పైగా వాతవరణ శాస్త్రానికి విరుద్దమైన పంక్తులు కూడా సినీ సంగీత సాహిత్యంలో ఉన్నవి. ఉదాహరణకు హిందీలో విజయవంతమైన ఒక పాట "दीवाना हुआ बादल, सावन की घटा छाई". వసంత ఋతువులో మేఘాలు కమ్ముకోవటం ఉండదు.  ప్రజలెవరూ ప్రశ్నించలేదు, పైగా చప్పట్లు కొట్టారు. జానపద సంగీత సాహిత్యాలు అలా కాదు, నిజ జీవితంలోని నిజాయితీతో నింపబడి ఉన్నాయి.

రేడియో అభిమానులకు ఒక చిరపరిచితమైన జానపద గేయం ఇక్కడ వినగలరు. ఈ పాటను కాకినాడలో సేకరించానని అనసుయమ్మా అన్నది. అయితే ఏనాటిదో నిర్ధారణగా తెలవదు. కానీ, ఆవిడ 18 ఏళ్ల వయసు తరువాత కాకినాడలో గడిపిన సమయం తక్కువ. అందువలన, బహుశా 1938కి పూర్వం అయినది కావచ్చు.

నోమీ నమల్లాల నోమన్నలాలో

చందమామా చందమామా

చుక్కాలో సెందురూడు

సూటీగ పొడిసే....

ఇది బహుశా వరి కోతలు లేక కుప్ప నూర్పిళ్లప్పుడు రాత్రుళ్లలో వ్యవసాయ కార్మికులు ఇంటింటికీ తిరిగి పాడే పాట అయి ఉండవచ్చు. వెన్నెలలో ఒక రైతు ఇంటి ముంగిట్లో వరుసలో నిలబడి చిట్టి చిట్టి చిందులు వేస్తూ, చప్పట్లు కొడుతూ, వలయాకారంలో తిరుగుతూ పాడే పాట ఇది.  పంట చేతికొచ్చే కాలం కావున రైతులు కొంత ఉదారతతో డబ్బు ఎక్కువిచ్చే అవకాశం ఉంది. అందుకుని ..

ఆ వూరి మారాజు

అయిదణాలు ఇస్తే

ఈ వూరి మారాజు

ముప్పావలా  ఇచ్చాడు…

అంటూ ఇప్పుడు నీ పొలం పనులు చేస్తున్నాము, నువ్వు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు అని పాడే పాట. మర్యాదగా అడగటంలో కూడా అందము చూపించే పాట ఇది.

వరి నాట్లు, పంటను కాపాడుకోవడం, వరి కోతలు, వడ్లు దంపుళ్లు ఒక వరస. అన్నిటిలోనూ స్త్రీల శ్రమ ఇమిడి వుంది. ఈ కాలంలో ఒక గింజ అన్నం నోటికి చేరటానికి ఎందరి శ్రమ ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచించము. ఆ శ్రమలో భాగమే వడ్ల గింజల దంపుళ్లు. మిల్లు ధాన్యం వచ్చే వరకు (1950లు) దంపుళ్లు స్త్రీల జీవితంలో ఒక భాగం.  నిజామాబాద్ జిల్లాలో అనసూయమ్మ సేకరించిన దంపుళ్ల పాట ఇక్కడ వినగలరు:

సంగీతం కూర్చటంలో మనం సామాన్యంగా గమనించేది రోకలి ఎత్తి వేసేటప్పుడు "హాఁ, హాఁ" అంటూ ఊపిరి తీసుకోవటం. కానీ అనసూయమ్మ సంగీతం కూర్చటంలో ఆ రోకళ్ల చప్పుడు ఒక తాళంలాగా వినపడతుంది. ఒక ధాన్యపు కుందు చుట్టూ ముగ్గురు లేక నలుగురు ఆడవాళ్లు రోకలి పోటు వేస్తుంటే, అన్ని రోకళ్లు ఒకేసారి పడటానికి వీలు పడదు. ఒక రోకటి పోటు తరువాత ఇంకొకటి పడటం ఈ పాటలో గమనించగలరు. అలాగే, దంచటం మొదలు పెట్టినప్పుడు పోటు వేగం ఉండదు, వడ్ల గింజలు ఎగిరి పడతాయి. నెమ్మదిగా వేగం పెరుగుతుంది.ఈ విషయాన్ని కూడా పాట సంగీతంలో చక్కగా అమర్చారు అనసూయమ్మ.

సాహిత్యం విషయానికి వస్తే, ఏ పని మొదలు పెట్టినా ముందు దేవుడికి నైవేద్యం పెట్టటం ఆచారం. కొత్త పంట చేతికి వచ్చిన తరవాత మొదటి దంపుళ్లలో గ్రామ దేవతను తలచుకోవడం ఆచారం. ఇక్కడి గ్రామ దేవత కురుమయ్య. మరి విష్ణువు కూర్మావతరం కావచ్చునేమో. "కురు" శబ్దానికి "అన్నము" అనే అర్థం కూడా వుంది. ఆ కూర్మయ్యకు "దాకెళ్ల" బియ్యం. దాక అంటే వెడల్పాటి చట్టి లేక గిన్నె. దాకెళ్ల బియ్యం ముందు కూర్మయ్యకి, పైగా "శిరిపాయసం" చేయటనికి ప్రార్థనా గీతం కూడానేమో!

ఈ పాట సినీ సంగీతంలో అందరికీ కొంత పరిచయమే. ఈ విషయం అడిగితే అనసూయమ్మ చెప్పిన కబుర్లు - "అప్పట్లో మద్రాసులో మా పై ఫ్లాటులో S.గోపాలరెడ్డి ఉండేవారు. అప్పుడు ఇద్దరు మనవళ్లను పెంచుతున్నాను, పైగా ఒక ప్రేమ వివాహ వివాదం సరి చేసే విషయంలో కూడా ఉన్నా. వీటన్నటితో నా గొంతు పెద్దదిగా ఉండేది. పైనుంచి గోపాల రెడ్డి గారు నన్ను చూస్తూ ఉండేవారు. ఒక రోజున ఆయన వచ్చి, నేను కూడా ప్రేమ వివాహ వివాదం గురించి ఒక కథ వ్రాసుకుంటున్నాను, అందులో మీ పాత్ర పెడతాను, వివాదంలో పౌరుషంగా ఉండే అత్తగారి పాత్ర, మీకు సరిపోతుంది, తప్పకుండా వచ్చి నటించాలి అని అన్నారు. నేను కావాలంటే ఒక పాట ఇస్తాను కానీ, నటించను, భానుమతి కూడా చాలా పౌరుషంగానే ఉంటారు, ఆవిడని అడగండి అని చెప్పా. ఆ రకంగా ఆ అత్తగారి పాత్ర తయారయ్యింది. ఆ సినిమా ఏమిటో పాఠకులే తెలుసుకోగలరు.

పొగ బండి అందరికీ కనబడే వింతే. ఆనాటి జన జీవితంలో ఒక భాగం. మరి జానపదులు ఆ వింతను ఉత్సాహంగా పాడుతూ, ఆ కాలపు పొగబండిలో ప్రయాణిస్తూ తమ అమాయకపు ఆలోచనలని, రైలు ప్రయాణంలో చూచిన ఆనాటి దృశ్యాలనీ ఒక చరిత్రగా ఎలా పొందు పరిచారో వినగలరు.

ఈ పాటను అనసూయమ్మ 1952 బెంగుళూరులో సేకరించానని వ్రాసుకున్నారు. పాట బాణీ జానపదులదే. పూర్తిగా దేశీయ వాయిద్యాలతో అనసూయమ్మ సంగీతం ఎంత సహజంగా, అందంగా, పాట ఉత్సాహం స్థాయి పెరిగేలా కూర్చారో గమనించవచ్చు. పిల్లలు పాడుకునేవారేమో ఈ పాట, పెద్దవాళ్లకు కూడా ఉత్సాహం కలిగిస్తుంది.

బండా కాలిందెక్కాడా?

మైసూర్ పట్నం లోపాలా

చెన్నాపట్నం లోపాలా

చిన్ని కంసాలోడూ

ఇంతాలింతల్ బండి చేసి

ఈదులెంప్పడి పంపేనురా

మైసూరుకు ఎగువున ఉన్న నీలగిరి అడవులలో నుండి వచ్చిన కలపను మైసూరు రైల్వే వర్కుషాపులో చెక్కి, చెన్నపట్నంలోని Integral Coach Factory వాళ్లు రైల్వే బోగీలు తయారు చేసేవారు (ఆనాటి బోగీలు చెక్కవే). చక్కని జానపద అమాయకత్వంతో కూడిన ఆశ్చర్యం "చిన్ని కంసాలోడు", ఇంత పెద్ద రైలు పెట్టెను తయారుచేశాడని! Integral Coach Factory 1952లో ప్రారంభమయ్యి, నెహ్రూగారి చేతుల మీదగా మొదటి బోగీ 1955 గాంధీ జయంతి నాడు విడుదలయ్యింది. ఆ వార్త రాగానే ఈ పాట తయారయ్యిందేమో!

ఆ రైలు ప్రయాణం విశేషాలు -

నీలగిరీ సెరువు కాడ

నిలిసి కూతాలేసునురా

రైలు సీగ్నల్ కోసం నీలగిరి చెరువు దగ్గర కూతలు పెట్టిందట.

అగ్గీ కంటా బాయని బండీ

అగ్గీబర్తీ చేసెనురా

రైలు ఇంజనులోని నిప్పు బయటకి కనబడదు, కానీ పెద్ద అగరుబత్తిలాగా పొగ చిమ్ముతుంది! ఎంత ఆశ్చర్యం!!!

లచ్చీమంటే లచ్చీమీ దాని

అబ్బ డాల లచిమి

కోడీనిస్తానన్నదీ కోడీ

పెట్టా నిస్తా నన్నదీ

కోడీ కాక కాలు రూపాయి

కల్లు కిస్తానన్నదీ

లచ్చిం చూస్తే సొగసూరా - దాని

మొగుణ్ణి చూస్తే ముసలీవాడు

ఇది రైలు ప్రయాణంలో ఆ రైలు పెట్టలోనే జరుగుతున్న రంకు భాగోతం. సొగసుగా ఉన్న పడుచు, చూడబోతే లక్ష్మి లాగా అందంగా, పొందికగా ఉన్నది. కానీ ముసలి మొగుడుతో ప్రయాణిస్తోంది, కోడి పెట్టను కూడా బుట్టలో వెంట పెట్టుకుని తెచ్చింది. పరిచయమయ్యిన కుర్రాడికెవరకో కోడి, ఆ పైన కల్లుకి ఒక రూపాయి కూడా ఇస్తానని ఆశ పెడుతున్నది. ఆడపిల్లలని ముసలి వాళ్లకు కట్టబట్టే దురాచారం 1950ల కాలంలో కూడా ఉన్నదనమాట.

సివిల్ రోడ్ ప్రక్కన

రెండు సిన్నా గుంతల కాడారా

బాగా బతికే రెడ్డి కొడుకును

బంగా పరిచే దక్కడరా

రైలు సివిల్ రోడ్డు ప్రక్కగా వెళుతున్నపుడు, అక్కడి రెండు గుంటల వైపు చేయి చూపిస్తూ ఇదిగో ఇక్కడే హత్య జరిగింది అని కొంత బెరకుతోనూ, దైన్యంతోనూ చెపుతున్నారు. ఇది ఆనాటి రాయలసీమ ఫాక్షన్ హత్య జానపద గీతం రూపంలో బంధించపడిన చరిత్ర.

భారతీయ సినీ రంగంలో మొదటి రైలు పాట జవాబ్ (1942) "దునియా యే దునియా .." అయి ఉండవచ్చు.  తెలుగులో పెంకి పెళ్లాంలోని (1954) "పడుచుదనం రైలు బండి .." అయి వుండవచ్చేమో. అయితే 1960ల కాలం వరకు రైలు దృశ్యమే కాని, రైలు "చుక్ చుక్" చప్పుళ్లతో కూడిన లయ లేదేమో. 1950లలో అనసూయమ్మ పూర్తి దేశీ వాయిద్యాలతో కూర్చిన "బండిరా పొగ బండీరా" సంగీతం ఆనాటి మంచి ప్రయోగం.

అనసూయమ్మ పోగు చేసిన జానపద గేయాలలోని సంగీత, సాహిత్య వైవిధ్యత పాఠకులు పై ఉదాహరణలలో గమనించి  ఉండవచ్చు. ఇంకొన్ని ఉదాహరణలు:

1800-1900ల కాలంలో అమెరికా, ఐరోపా దేశాలలో ఊరూరు తిరుగుతూ ఇదో కొత్త రకం మందు, ఇది తింటే మీకు ఆయువు పెరుగుతుంది, రోగాలు తగ్గుతాయి అని మోసం చేసేవాళ్లు ఉండేవారు. వారికి వారు ఇచ్చుకున్న పేరు “Medicine Man/Woman“. వీరు ఎంత విరివిగా ఉండేవారంటే, వారి వలన ఆంగ్లంలో "Quack", “Snake oil salesman” అనే మాటలు చేరాయి. వారి మోసాల గురించి సినిమాలు కూడా వచ్చాయి (The Kid Brother, Harold Lloyd, 1927). మరి భారత దేశంలో కూడా వీళ్లు తక్కువేమీ కాదు, "మాయ మాటలు చెప్పి, మందో మాకో ఇచ్చి పిల్లలని ఎత్తుకుపోతారు" అని జాగ్రత్త చెప్పటం మన అందరికీ తెలిసినదే. అటువంటి ఈ పాటని విజయనగరం జిల్లాలో అనసూయమ్మ సేకరించారు. ఈ పాట గ్రామఫోను రికార్డు ఉండేది. ఆ తరువాత అనసూయమ్మ SP బాల సుబ్రహ్మణ్యం తో పాడించి విడుదల చేసిన పాటను ఇక్కడ వినగలరు. రికార్డు మీద ఆంగ్లంలో అచ్చుతప్పుతో "Mandaloda" అని, కొంత మంది మార్చి కులం పేరుతో సంబోధించి పాడటం జరిగింది. కానీ, పాట "మందులోడి" మీదనే.

రేడియో అభిమానులకు చిర పరిచితమైన ఇంకొక పాట.

చిత్తూరు, 1962 కాలములో సేకరించిన ఈ జానపద గేయం  కృష్ణుడు, చెంచిత సంవాదం. రాధా కృష్ణుడికి తనను తాను అర్పించుకున్నదనేది సాంప్రదాయ సాహిత్యం, భక్తి సాహిత్యం. నిజ జీవితంలో యువతులు కొంటె కృష్ణుళ్ళని ఎంతో కొంత ఛీత్కరించుకోకుండానూ ఉండరు, ఆట పట్టించకుండానూ ఉండరు. ఈ జానపద గేయమే వాస్తవానికి దగ్గరగా ఉందేమో!

హోలి పాటలకు ఉత్తర భారతంలో మంచి ఆదరణ ఉంది. హోలీ పండుగకు హైదరాబాదు పైని జిల్లాలలో మంచి ఆదరణ ఉంది. తెలుగు జానపద సంగీత సాహిత్యాలలోని హోలి పాటలకు ఒక ఉదాహరణ.

భక్తితో కూడిన సంబరాలకు  రెండు ఉదాహరణలు -

అనసూయమ్మ సేకరించిన జానపద గేయాలను పాడటమే కాదు, జానపద సంగీత సాహిత్యాలు ఎప్పటికీ కొనసాగాలని తన తరువాతి తరం వారితో కూడా పాడించారు. మాల్గుడి శుభతో పాడించి విడుదల చేసిన ఈ పాట ఇక్కడ వినగలరు. ఉత్సాహంలో ఇంతటి పాట ఇంకొకటి లేదేమో!!!

అనసూయమ్మ సేకరించిన జానపద గీతాలలోనుంచి సినీ సంగీతంలో చేరినవి కోకొల్లలు. అనసూయమ్మ వ్రాసిన జానపద గేయాల సంకలనం నుండి కొన్ని పద ప్రయోగాల ఉదాహరణలు - సిరి సిరి మువ్వా, నీకూ నీవారు లేరు, వల్లారి బావో కావురోయ్ రంగా, చల్ మోహన రంగా, పచ్చ బొట్టు పొడిపించు బావా, వస్తావంటే పిల్లా, సెంగావి సీర కట్టి, కోసింది కొయ్‌తోటకూర, ఘల్లు ఘల్లున, ఏం పిల్లో సింకిరి బింకిరిగా ఉన్నావు, వొలీయా మొదలైనవి. సినీ కవులు, సంగీత దర్శకులు కూడా జానపద గేయాలలోని పద ప్రయోగాలు పెక్కు చోట్ల, గేయాన్ని పూర్తిగాను, సంగీతపు బాణీలను విరివిగానే వాడుకుని, తమ పేర్లు వేసుకున్నారు.

కాలం మారింది. జానపద గేయాలు నిజ జీవితంలో పాడుకునేవారు తగ్గుతున్నారేమో. 1910 -1920ల కాలంలో మనకు తెలిసి జానపద గేయాలను పోగు చేసి ప్రచారం కల్పించిన వారు వల్లూరి జనార్ధన రావు గారు. ఆ తరువాత నిర్విరామంగా ఆ కృషి చేసిన వారు అనసూయమ్మ. సంగీతంలో అసమాన ప్రతిభ, సాహిత్యాలలో ఉత్తమ అభిరుచి కలిగినవారు అవటం చేత, జానపద గేయ సంగీత సాహిత్యాలను రెండింటినీ పొందు పరచగలిగారు. ఆవిడను ఎన్ని వందల జానపద గేయాలను పోగు చేసి ఉంటారు అని ఒకసారి అడిగితే, "వందలేమిటి, వేలలో ఉంటాయి" అన్నారు. మరి ఆవిడ వ్రాత పతులు ఎప్పటికైనా దొరికితే, ఆ జానపద సంపదను కాపాడుకోవటం మన కర్తవ్యం. అంతటి జానపద సంగీత సాహిత్య సంపదలు పోగు చేసిన అనసూయమ్మకు శత కోటి నమస్సులు.

-- సమాప్తం --

Posted in June 2019, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!