Menu Close
ప్రేమించి చూడు
-- ఆర్. శర్మ దంతుర్తి

శివరాం దగ్గిర్నుంచి వచ్చిన ఉత్తరం మహేష్ భట్ కి చూపించాడు రామారావు. భట్ “నేను చెప్పాను కదా” అన్నట్టూ తల పంకించేడు.  శివరాం ఇచ్చిన ఫోన్ నెంబర్ కి రెండు మూడు సార్లు ఫోన్ చేసాక ఆ పై నెలల్లో వీలు చూసుకుని మూడువారాల శెలవు మీద ఇండియా వెళ్తూ పూనేలో దిగేడు రామారావు.

ఇంటికి తీసుకెళ్ళాక కవితతో సహా అందరూ వింటూండగా శివరాం టూకీగా విషయాలు చెప్పేడు. కవిత ఉద్యోగం చేస్తోంది, సాఫ్ట్ వేర్ లోనే. అయితే కొన్ని విషయాలు ప్రత్యేకంగా మాట్లాడాలి పెళ్ళి అంటే.

“ఏమిటా విషయాలు?” రామారావు అడిగేడు కుతూహలంగా.

“మా దగ్గిరో రెండేళ్ళ కుర్రాడు దినేశ్ ఉన్నాడు. వాడు కవితని వదిలి ఉండలేడు.”

“దినేశ్ అనే కుర్రాడు ఎవరు?”

“మూడేళ్ల క్రితం, మా చుట్టాలమ్మాయికి బాంబేలో పెళ్ళి అయింది. ఆ అమ్మాయీ, మొగుడూ అటూ ఇటూ అందర్నీ ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. కుర్రాడు పుట్టిన సరిగ్గా ఆరునెలలకి వాళ్ళు ఉండే అంధేరీ లో దొంగలు పడ్డారు రాత్రి. వీళ్ళు తిరగబడేసరికి ఇద్దరినీ కత్తితో పొడిచారు. పిల్లాడు పక్క గదిలో పడుకున్నందువల్ల వీడినేమీ చేయలేదు. ఇంట్లో దొరికినది తీసుకెళ్తూ చడీ చప్పుడూ లేకుండా వెళ్ళారు కాబోలు. పొద్దున్నలేచిన కుర్రాడు ఏడిచే దాకా వీళ్ళని ఎవరూ చూడలేదు. స్పృహ పోయి అప్పటికే బాగా రక్తం కారి ప్రాణాలు పోయాయి ఇద్దరికీ. అసలే అందర్నీ కాదని పెళ్ళి చేసుకున్నారు కనక అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవరూ ఆ చిన్న కుర్రాణ్ణి తీసుకోం అని ఖరాఖండీగా చెప్పారు. మేము తీసుకుని పెంచుకుంటున్నాం. వాడికి తల్లీ తండ్రీ లేరని తెలియదు. మా అమ్మాయి కవిత వాడి తల్లి అని చెప్తున్నాం చిన్నప్పటినుండీ. అందువల్ల కవిత ని చేసుకుంటానంటే ఈ దినేష్ సంగతి తేలాలి ముందు. మొదట వైజాగ్ లో అడిగినప్పుడు నువ్వూ, కవితా ఎందుకు స్వతంత్రంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోవద్దు అన్నానో ఇప్పుడు అర్ధమైందా? ఆ పోయిన మా చుట్టాలమ్మాయినీ వాళ్ళాయననీ వెలివేసినట్టే, అటూ ఇటూ బంధువులందరూ మిమ్మల్ని, మమ్మల్నీ వెలి వేస్తారనే,” దాదాపు కన్నీళ్ళ పర్యంతం అవుతూ చెప్పేడు శివరాం.

కవిత, శివరాం భార్యా కూడా కళ్ళు తుడుచుకోవడం గమనించేడు రామారావు.

“మరో విషయం,” శివరాం కొనసాగించేడు, “పెళ్ళి కనక చేసుకుంటానంటే కవితకి సింపుల్ గా రిజిస్టర్ మారేజి ఒకటే ఇష్టం. అది తప్ప మరోటీ ఒప్పుకోదుట. ఆ సంగతి కూడా ఆలోచించాలి మరి. కొత్త తరం మనుషులు కొత్త తరహా ఆలోచనలూను, నాకూ మా ఆవిడకీ ఇష్టం లేకపోయినా కవిత చెప్పినట్టూ మేము చేయాలనుకుంటున్నాం.”

“శివరాం గారూ నేను మొదట కవితని చేసుకుంటానని అడిగినప్పుడు, నాది ప్రేమా దోమా అని వెక్కిరిస్తే బ్యూటీ అండ్ ద బీస్ట్ అనే సినిమా లో డయలాగు గుర్తు చేసాను; మీకు జ్ఞాపకం ఉందా? కవిత అంటే ఇష్టం ఉంది కనకే మీ ఎడ్రస్ అదీ సంపాదించి మీకు ఉత్తరం రాసాను.  దినేష్ ని దత్తత అని చూపించవచ్చు అనుకుంటా. వాటికి కాయితాలు ఉంటే సరే లేకపోతే ఎలాగో ఒకలాగ సంపాదించగలరా? నేను వైజాగ్ వెళ్ళి ఓ సారి మామయ్యని చూసి వస్తా. ఆయనకీ అత్తకీ నేనెలా ఉన్నానో అనేదానికంటే, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడమే ముఖ్యం అప్పట్లో, ఇప్పటికీను. నేను కవితని పెళ్ళి చేసుకుంటానంటే – నీ ఇష్టం వచ్చిన గంగలో దూకు అనడం తప్ప - మరోమాట ఉండదు. పెళ్ళి కవితకి ఎలా ఇష్టం అయితే అలాగే చేద్దాం. నా వైపు నుంచి అడ్డు చెప్పేది ఎవరూ లేరు,” రామారావు అందరికేసీ చూస్తూ చెప్పేడు సూటిగా.

శివరాం భార్య ఏదో నెపంతో వంటింట్లోకి తప్పుకుంది. కవిత మొహంలో చిరునవ్వు రామారావు గమనించి నవ్వుకున్నాడు లోపల్లోపల.

మర్నాడే వైజాగ్ బయల్దేరాడు రామారావు, మేనమావనీ అత్తనీ ఓ సారి చూసిపోవడానికి.

వైజాగ్ లో సంగతి చూస్తే పిల్లలు పెద్దయినా ఎప్పట్లాగానే మామయ్య గంగిరెద్దులా తల ఊపుతున్నాడు అత్తకి. అమెరికా నుండి తాను పట్టుకొచ్చిన బహుమతులన్నీ ఇంట్లో అందరికీ ఇచ్చాక మర్నాటి నుంచీ అత్త ఆవిడ బంధువుల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని పెళ్ళి చూపుల్లో రామారావు కి చూపించడానికి సిద్ధపడింది.  జాగ్రత్తగా గమనిస్తే రామారావుకి తెలిసొచ్చిన విషయాలు ఇవి – ఎప్పుడో పక్క ఇంట్లో ఉన్న కవిత, శివరాం వాళ్ళ గురించి అత్తా మావయ్యా దాదాపు మర్చిపోయేరు. అత్తకి కావాల్సినవి ఇప్పుడు తన పెళ్ళిలో వచ్చే లాంఛనాలూ, లంకెబిందెలూను. ఆవిడ బంధుకోటిలో అమ్మాయిని కట్టబెడితే ఇప్పుడు అమెరికాలో డాలర్లు సంపాదించే రామారావు అనే బంగారు బాతుని ఎప్పటికీ ఆవిడ తన చేతిలోనే ఉంఛుకోగలదు. పదోక్లాసుకూడా చదువుకోని అమ్మాయిలకి కూడా పెళ్లవగానే ఇటువంటి బ్రిలియంట్ ఆలోచనలు ఎలా వస్తాయో?

మరో రెండు వారాలు వైజాగ్ లో గడిపాక  చూసిన ఏ సంబంధమూ నచ్చలేదని చెప్పేసి పూనే బయల్దేరేడు రామారావు. గంగిరెద్దు మావయ్య సంగతి ఎలా ఉన్నా తానొచ్చేసేటప్పుడు అత్త మొహం నల్లగా మాడడం రామారావు చూడనే చూసాడు. ఎవరి మొహం - రంగు మార్చడానికో, కళకళలాడడానికో తాను తాళి కట్టడం ఎలా కుదురుతుంది?

* * * *

పూనే వచ్చిన రామారావు చెప్పేడు – కవిత ఒప్పుకుంటే మర్నాడు బ్రీచ్ కాండీలో ఉన్న మహాలక్ష్మీ టెంపుల్ లో దండలు మార్చుకుని అటునించి అటు పెళ్ళి రిజిస్టర్ చేసుకుని కాయితాలు తెచ్చుకోవడమే. రామారావు అమెరికా వెళ్ళాక కాయితాలు పంపిస్తాడు కవితా, దినేష్ లకి వీసా రావడానికి. దినేష్ దత్తత కాయితాలు శివరాం చేతిలో పని.

ఓ రెండు, మూడు గంటలు కూర్చుని ఆలోచించేడు శివరాం తనకి తెలిసిన బాగా దగ్గిర స్నేహితులు ఒకరిద్దరితో. రామారావు అమెరికా వెళ్ళాక కవితకి కాయితాలు పంపకుండా మోసం చేస్తే? ఆ తర్వాత రామారావునే అడిగేడు – అంత డైరక్ట్ గా కాదు కానీ కాయితాలు రావడానికి లేట్ అయితే ఎలా, అమెరికాలో రామారావు చేసే ఉద్యోగం, ఎక్కడ ఉంటున్నాడు, దగ్గిరలో ఉన్న ఇండియన్, అమెరికన్ కాన్సులేట్ ల సంగతీ అవీను.

రామారావు చిరునవ్వు నవ్వి చెప్పేడు, “శివరాం జీ ఇవన్నీ ఎందుకడుగుతున్నారో తెలియనంత అమాయకుణ్ణి కాదు. నేనే కవితని మోసమే చేద్దామనుకుంటే అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఉండేవాణ్ణి కాదు కదా? మీరు రిజిస్టర్ మారేజ్ సర్టిఫికేట్ కాన్సలేట్ లో చూపించి నేనిచ్చే నా సోషల్ సెక్యూరిటీ నెంబర్ చూపించారంటే నన్ను మూడు నిముషాల్లో పట్టుకుని ఇండియా పంపిస్తారు. ఆ తర్వాత నా ఉద్యోగం ఊడడానికీ నన్ను వెనక్కి పంపడానికీ మూడు రోజులు చాలు. అవన్నీ పేపర్లలో, ఇంటర్నెట్లో వచ్చాక నేను బతికినా ఒకటే చచ్చినా ఒకటే.”

ఇంకేం అభ్యంతరం పెళ్ళికి? కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదుకదా? మర్నాడు రామారావు, కవిత బ్రీచ్ కాండీ మహాలక్ష్మీ గుడిలో దండలు మార్చుకుని పూజారితో అక్షింతలు చల్లించుకున్నాక పెళ్ళి రిజిస్టర్ చేసినప్పుడు శివరాం తన స్నేహితులు ఇద్దరు ముగ్గుర్ని సాక్షులుగా చూపించాడు. గంటలో పనై పోయింది. ఓ ఇరవై, ముఫ్ఫై ఫోటోలు, సింపుల్ గా పెళ్ళీ అయ్యేక ఈ అరడజను మందికీ హోటల్లో భోజనం. అంతే కధ.

* * * *

అమెరికా వచ్చాక మహేష్ భట్ తో టూకీగా చెప్పేడు జరిగినదంతా రామారావు. రామారావు ఇంత స్పీడుగా కవితని పెళ్ళి చేసుకుంటాడని ఊహించని మహేష్ తుళ్ళిపడ్డాడు కానీ తేరుకుని “మొత్తానికి అసాధ్యుడివి, నిజంగా నువ్వు కవితని ప్రేమించానని నిరూపించేవు,” అన్నాడు.

“మీరే చెప్పారు కదా, నేను ఎవరో తెలియని ఒకమ్మాయిని పెళ్ళి చూపుల్లో పది నిముషాలు మాట్లాడి చేసుకుని ఏదో ఒకలాగా బతకటం మంచిదా, లేకపోతే తెలిసిన కవితని చేసుకోవడం మంచిదా?”

“కవితని చేసుకోవడమే మంచిదిలా ఉంది, అయినా మీకు నచ్చిన అమ్మాయితో మీ జీవితం బాగుంటుంది అనుకుంటున్నాను, కంగ్రాట్యులేషన్స్!”

వెనక్కి వచ్చి ఉద్యోగంలో పడ్డాక తీరిక చేసుకుని కవితకి, శివరాం కీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు రామారావు. ఈ లోపుల శివరాం షెనోయ్ తెలిసినవాళ్లనీ వీళ్ళనీ పట్టుకుని ఉత్తరం, దక్షిణం సమర్పించుకుని దినేష్ ని కవితకి దత్తత కొడుకుగా చూపించే కాయితాలు సంపాదించాడు. ఇది జరిగిన మూడు నెలలకి రామారావు పంపిన కాయితాలతో వీసా సంపాదించి కవిత, దినేష్ అమెరికాలో దిగారు. వాళ్ళు వచ్చేలోపునే రామారావు మహేష్ భట్ ఉన్న ఇంట్లోంచి మరో ఇంటికి మారాడు మొదలుపెట్టబోయే సంసారం కోసం.

* * * *

ఓ వారాంతం సాయింత్రం మహేశ్ ని భోజనానికి పిల్చిన వేళ రామారావు కవిత పక్కనే కూర్చుని ఉన్నప్పుడు కబుర్లలో రామారావు పెళ్ళి ఎంత నాటకీయంగా జరిగిందో ఒకరి కొకరు చెప్పుకుంటూంటే ఒక్కసారి మహేష్ అన్నాడు, “రామారావు గారూ, మీకు తెలియని విషయం ఒకటి – రహస్యమే అనుకోండి, చెప్దామనుకుంటున్నాను. ఏమనుకోరు కదా?”

“చెప్పండి ముందు, అనుకోవడమా లేదా అనేది చెప్పే విషయాన్ని బట్టి చూద్దాం.” నవ్వేడు రామారావు.

“కవిత మా చుట్టాలమ్మాయి, మీరు కవితని ప్రేమించారని శివరాం అంకుల్ చెప్పాడు. ఇంకా ప్రేమిస్తున్నారో లేదో కనుక్కుని నేనే ఇదంతా నాటకం ఆడాను.”

“అవునా, భలే ఉందే, ఆ మాత్రం ఇప్పుడైనా చెప్పారు చాలు.” రామారావు నవ్వుతూ, కవిత చుట్టూ చేయి వేసాడు. కవిత కూడా రామారావు దగ్గిరగా జరిగింది.

“ఇంకా మీకు తెలియని మరో రహస్యం ఉంది.”

కవితకి కొంచెం గిల్టీగా ఉన్నట్టనిపించినా రామారావు చేతిలో చేయి వేసి పట్టుకుంది ఒక్కసారి.

“అది కూడా చెప్పేయండి మరి,” కవితని అలా పొదివి పట్టుకునే అన్నాడు రామారావు అదే చెరగని చిరునవ్వుతో.

“దినేష్ కవితకి పుట్టిన కొడుకే, కవిత కి వైజాగ్ నుంచి పూనా వెళ్లగానే పెళ్ళి చేసారు. వాళ్ళాయన కార్ ఏక్సిడెంట్ లో పోయారు పాపం. కవితకి పెళ్ళి అయిపోయిందంటే మీరు చేసుకోరని అలా నేనే అబధ్ధం ఆడి శివరాం అంకుల్ ని ఒప్పించాను.”

ఒక్కసారి నిశ్శబ్దం. కవిత తన చేయి మెల్లిగా వెనక్కి తీసుకోబోతూంటే రామారావు వదలకుండా దగ్గిరకి లాగాడు. ఏదో ఆలోచిస్తున్నట్టూ కాసేపు మరింత నిశ్శబ్దం.

ఇప్పుడు రామారావు గానీ ఏదైనా గొడవ చేస్తాడేమో, అయినా ఏదైనా గొడవ అయితే మేరేజ్ సర్టిఫికేట్ చూపించి జైల్లో పెట్టించడం లాంటివి చేయొచ్చు అనే అలోచనల్లో ఉన్న మహేష్ కీ, ఇప్పుడు ఏమౌతుందో అనుకుంటూ బుర్ర స్తబ్దుగా అయిపోయిన కవితకీ ఓ అయిదు నిముషాలు నిశ్శబ్దంగా గడిచాక రామారావు కంఠం వినిపించింది ఇద్దరికీ.

“ఇప్పుడు మరి నేను చెప్పే రహస్యం వింటారా?”

కుతూహలంతోనూ ఆశ్చర్యంగానూ చూసారు మహేష్ కవితా రామారావు కేసి.

“మొదట్లో మీరు కవిత గురించి అడిగి గూగిల్ చేయమన్నప్పుడు విషయాలన్నీ కనుక్కోవడానికి అందరికీ ఫోన్లూ, ఉత్తరాలూ రాసాక నాకు తెలిసిన మొదటి విషయం కవితకి పెళ్ళి అయి కొడుకు ఉన్నాడని. అప్పుడు మరింత లోతుగా కనుక్కుంటే తెలిసిన విషయం మీరూ కవితా కజిన్స్ అని. మీరు అలా నాటకం ఆడుతున్నప్పుడు నేను కూడా సరదాగానే నాటకంలో పాలు పంచుకున్నా. గూగిల్ మీద కవిత ఎడ్రస్, చుట్టాలనీ అందరినీ పట్టుకుని వాళ్లతో మాట్లాడాక మిగతా విషయాలు ఆ మాత్రం తెలుసుకోలేనని మీరెలా అనుకున్నారు?” కవిత చుట్టూ ఉన్న చేతిని అలాగే ఉంచి రామారావు అడిగేడు.

“ఒకసారి కవితకి పెళ్ళి అయిపోయాక మీకు ఇంక కవితని మర్చిపోతారని అనుకున్నాం. అదీకాక ప్రేమ వేరూ, పెళ్ళి వేరూ కదా, అందులోనూ కవితకి దినేష్ ఉన్నాడు …“ మాట నానుస్తూ చెప్పేడు మహేశ్.

“మనం మొదట్లో మాట్లాడుకున్నాం గుర్తుందా? నేను కవితని ప్రేమించానని చెప్పినప్పుడు చెప్పాను. కవిత సంతోషంగా ఉంటే చాలు జీవితంలో అని. మూడేళ్ళ కొడుకుతో ఎంతకాలం తల్లీ తండ్రులతో ఉంటుంది? అదీకాక నేను పెళ్ళి చేసుకుంటే అమెరికాకి రావచ్చు. ఇండియాలో ట్రీట్ చేసినట్టూ ఉండదు ఇక్కడ. నా వైపు గురించి ఆలోచిస్తే ఎప్పటికైనా కవితనే చేసుకుందామని నేను అనుకున్నా దినేష్ గురించి తెలిసాక కూడా. పూనే వెళ్ళినది నాతో పెళ్ళి కవితకి ఇష్టమేనా కాదా అని పూర్తిగా తెల్సుకోవడానికి. నేను కవితని ప్రేమించాను, కామించలేదు. కామించి ఉంటే శివరాం జీ పెళ్ళి కి ఒప్పుకోనప్పుడు ఏసిడ్ తోనో, బ్లేడుతోనో దాడి చేసి ఉండేవాణ్ణేమో. కాలేజీ రోజుల్లో పెళ్ళవని నాకు తెలిసిన కవితనీ, ఇరవై ఏడేళ్లకే తన జీవితం అయిపోయిందనుకుంటూ ఉన్న కవితనీ, ఇప్పుడు నా పక్కనే ఉన్న కవితనీ నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నా. అలా కవిత హేపీగా ఉంటే చాలనే అనుకున్నాను నేను.” ఈ సారి నవ్వు బిగ్గరగా పెంచుతూ అన్నాడు రామారావు.

కవిత ఒక్కసారి రామారావు చుట్టూ రెండూ చేతులూ వేసి హత్తుకుంది. రామారావు కూడా కవితని దగ్గిరకు లాక్కున్నాడు అటు పక్కనే ఉన్న దినేష్ ని రెండో చేత్తో దగ్గిరకి లాగుతూ.

తనముందు ఎదురుగా కూర్చున్న రామారావు వామనమూర్తిలా ఇంతింతై, వటుడింతయై అన్నట్టు మహోన్నతంగా ఎదిగిపోతునట్టనిపించింది మహేష్ భట్ కి.

కూర్చున్నవాడు ఒక్క ఉదుట్న లేచి దగ్గిరకొచ్చి, రామారావు చేయి పట్టుకుని పైకి లేపుతూ కావలించుకున్నాడు.

----- సమాప్తం -----

Posted in June 2019, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *