Menu Close

page title

గబ్బిలము [పక్షి కాని ఎగిరే జంతువు]

Gabbilam

గబ్బిలం ఒక వింత విచిత్ర జీవి. అటు మృగమూ కాదు, ఇటు పక్షీ కాదు. జంతువులా పిల్లలకు పాలిస్తుంది, పక్షిలాగా ఎగురుతుంది. గబ్బిలం  వెలుతురు చూడలేదు. చీకట్లోనే వేటాడి తిండి తింటుంది. గబ్బిలాన్ని ఒక "అపశకున పక్షి"గా జనం భావిస్తారు.

గబ్బిలానికి అనేక పేర్లున్నాయి. అవే అజినపత్త్ర, గబ్బిడాయి, చర్మచటకము, చర్మచటి, చర్మపత్త్ర, చీకురువాయి, చీవుక, జతుక, జిబ్బటీ, జిబ్బడాయి, తరుతూలిక, తైలపాయిక, పరోష్టి, యకృదాత్మిక, వాతులి. ఎన్నిపేర్లున్నా మనకు గబ్బిలం అనే మాటే బాగా తెలుసు. గబ్బిలం అనగానే మనకు తోచేది ఇంకోటుంది, అదే ప్రముఖ కవి జాషువా గారి  పద్య కృతి [ఆత్మకథాత్మక కావ్యం] ‘గబ్బిలం-ఖండకావ్యం.’

Gabbilamగబ్బిలాలు చీకట్లో చెట్లకొమ్మలకు, పాడుపడిన ఇళ్ళలో దూలాలకూ తల క్రిందులు గా వ్రేలాడుతుంటాయి. పక్షులు, కీటకాలూ ఎగిరినా అవి తలక్రిందులుగా వేలాడవు. గబ్బిలం మాత్రమే ఎందుకిలా తలక్రిందులుగా వ్రేలాడు తుంటుందీ? మిగిలిన పక్షులన్నీ ఎగర గలవూ, అవసరమైతే కాళ్లతో నడవగలవు కూడా. కాని గబ్బిలాలు అస్సలు నడవలేవు. కాళ్ళున్నా కూడా వాటి కాళ్లకి నడిచే శక్తి లేదు. కనుక, ఒక చోటి నుండి మరో చోటికి వెళ్ళాలంటే ఎగరక తప్పదు. గబ్బిలం చాలా విచిత్రమైన జీవి అని చెప్పుకు న్నాం కదా! క్షీరదాలలో అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జీవుల్లో ఎగిరేది గబ్బిలం మాత్రమే! ఇది మానవులు, ఆవులు, గేదెల్లా పిల్లలని కంటుంది. ఒక కాన్పుకు ఒక గబ్బిలం మాత్రమే పుడుతుంది. వాటికి పాలిస్తుంది. తల్లి గబ్బిలం వేటకి వెళ్తూ, పిల్లలను పొట్టకు కరచుకొని, కోతి తన పిలల్లను కరుచుకున్నట్లుగా  ఎగురుతూ పోతుంటుంది.

Gabbilamగబ్బిలం రెక్కలకూ, పక్షి రెక్కలకూ చాలా తేడా ఉంది. పక్షుల రెక్కలకు ఈకలు ఉంటాయి. వేళ్ళ మధ్యన గొడుగు కున్న గుడ్డ లాంటి సాగ దీసిన చర్మంతో చేసిన రెక్కలు గబ్బిలాలకి మాత్రమే ఉండటాన అది ఎగుర గలుగుతుంది. బొటన వ్రేలు తప్ప మిగిలిన వేళ్లన్నీ గొడుగు ఊచల లాగ పని చేస్తాయి. బొటన వేలు మాత్రం పైకి పొడచుకొని వచ్చి, విడిగా ఉండి  చెట్టు కొమ్మనో, గోడకంతనో పట్టుకోను ఉపయోగిస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు. అంత గట్టి ఉడుము పట్టన్నమాట. ఇవి పురుగులను, కొన్ని పళ్ళను తింటాయి, కొన్ని పుప్పొడిని నాకుతాయి, మరికొన్ని నిద్ర పోతున్న జంతువుల రక్తం కూడా త్రాగుతాయి.

రెక్కలకి ఉన్న గోళ్ళతో చెట్టు కొమ్మనో, గోడ పగులునో పాత ఇంటి దూలన్నో పట్టుకొని తలక్రిందులుగా వ్రేలాడుతాయి. గబ్బిలాయులు శరీరాన్ని తలక్రిందులుగా వేలాడతీయడం వల్ల గాలిలోని స్పందనలను, ప్రతిధ్వనులనూ సులువుగా వినగలుగుతాయి.

శాస్త్రీయ వర్గీకరణ విషయానికోస్తే ఈ గబ్బిలాలు 'ఏనిమేలియా' జాతికి చెందిన 'కార్డేటా' విభాగానికి చెందిన క్షీరదాలుగా తెలుస్తున్నది. ఇది కైరాప్టెరా అనే క్రమానికి చెందిన పాలిచ్చే జంతువు

ఏ పక్షీ తమ పిల్లలకు పాలిచ్చి పెంచవు. అన్నిటికన్నా భిన్నమైన జీవి గబ్బిలం. తల్లక్రిందులుగా వ్రేలాడే జీవి. పిల్లల పెంపకంలో కూడా వేరుగానే ఉంటుంది గబ్బిలం. పిల్లలకు పాలిచ్చి పెంచడం వలన పక్షి జాతికి చెందినదీ కావట్లేదు, నాలుగు కాళ్ళు, తోక నడవడం లేనందున జంతువూ కాదు. కనుక ఇది అటు పక్షి జాతీకాదు, జంతుజాతీకాదు, విలక్షణమైన జాతికి చెందిన జీవి.

దీనికి కళ్లున్నాయి కానీ  మిగతా జీవుల్లా చూడను పనికిరావు. తన నోటితో చిత్రమైన ధ్వనులను చేస్తూ ఆ ధ్వనుల ప్రతిధ్వనులను విని పరిసరాలను, వస్తువులను ఆహారాన్ని తెల్సుకుంటుంది. ఆడ, మగ గబ్బిలాలు ఉన్నాయి. ఆడ గబ్బిలం గర్భం ధరించి పశువులు, మనుషుల లాగానే పిల్లల్ని కంటుంది. ఒక కాన్పుకు ఒకే బిడ్డను కంటుంది.

ఆడ మగ గబ్బిలాలు కలుసుకున్నా ఆహారం బాగా దొరికే వరకూ ఫలదీకరణం జరగకుండా శుక్రకణాల్ని, అండాన్ని విడివిడిగా తన శరీరంలోనే ఉంచుకోగల అద్భుత సామర్థ్యం ఆడ గబ్బిలాలకు ఉంది. సృష్టిలోనే చాలా చిత్రమైన జీవి ఇది. బిడ్డ గబ్బిలం తనలాగే ఎగిరేవరకూ తల్లి పాలిచ్చి పోషిస్తుంది. ఏ జీవిలో నైనా మాతృభావం, ప్రేమ ఒక్కవిధంగానే ఉంటాయిమరి!.

గబ్బిలాలు ఎగరటానికి  రెక్కలు పుట్టుకురాను కారణం, 50 మిలియన్‌ సంవ త్సరాల క్రితం వాటి శరీరంలో ఉండే ఒక జన్యువు మారడమే. ఈ జన్యుపరమైన మార్పు వల్ల గబ్బిలం శరీరానికి రెండువైపులా పలుచని పొరల రూపంలో  కణు పుల లాంటి ఎముకలు బాగా సాగి అవి రెక్కల లాగా మారాయి. గబ్బిలం దేహంలో వచ్చిన ఈ పూర్తి మార్పు వల్ల అది నడవడం మానేసి ఎగిరే స్థాయికి వెళ్ళింది. ప్రకృతిలో ఇలాంటి మార్పులు చాలా తక్కువ కాలం వరకే జరుగుతాయి. దాని వల్ల గబ్బిలాలు క్షీరద జంతు జాతికి చెందినప్పటికీ వాటికి రెక్కలు ఏర్పడి అవి ఎగరడానికి వీలైంది. కానీ వీటికి నడవడం చేత కాదు.

గబ్బిలం పగటిపూట చూడలేదు కనుక  ప్రకృతి వాటికి రెక్కలు ఇచ్చి శత్రు బారిన పడకుండా ఎక్కడో పాడుపడిన ఎత్తయిన భవనాల మీదో, ఎత్తయిన చెట్ల కొమ్మల మీదో తలకిందులుగా వేలాడుతూ ఉండే అవకాశం కల్పించింది. భగవంతుడు సర్వజీవ రక్షకుడు కదా! చీకటిపడగానే దూర ప్రాంతాలకు వెళ్లి ఆహారాన్ని వేటాడి సూర్యోదయానికల్లా తిరిగి చెట్లపైకి చేరుకుని, తలక్రిందులుగా వ్రేలాడుతూ నిద్రపోతాయి. కొందరు మానవులు వీటిని చెడు సంకేతాలుగా భావిస్తే మరి కొందరు ఈ జీవులను శుభం సూచకంగా  భావిస్తారు.

గబ్బిలాలు చీకట్లోనూ అతి వేగంతో ఎగురుతూ గబుక్కుని ఏదో గుర్తొచ్చినట్లుగా పక్కకు తిరిగి ఎగురుకుంటూ పోతుంటాయి. గబ్బిలాలు ఎగురుతున్న పురుగులను ఎగురుతూనే హాయిగా భోజనం చేస్తూ పోతుంటాయి. వీటికి డైనింగ్ టేబుల్ అవసరంలేదు. కటిక చీకట్లో కూడా దేనికీ తగులుకోకుండా సులువుగా తప్పించుకుని ఎగురుతూనే కనిపించక పోయినా పురుగుల్ని పట్టుకొని తింటూ పోతుంటాయి.

గబ్బిలాలు చాలా విచిత్రమైన జీవులు. చీకట్లో ఎగరడం ఒక్కటైతే, వీటికి పళ్ళు, చెవులు ఉంటాయి. గబ్బిలాల శిలాజాలను బట్టి ఇవి  ఆరు కోట్ల సంవత్స రాల నుంచీ ఈ భూమి మీద నివసిస్తున్నాయని తెలుస్తున్నది. ఇప్పటికి గబ్బిలాలలో 2000 రకాలున్నాయి. ఒక్క ధ్రువ ప్రాంతాలలో తప్ప ఇవి అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. వీటి రెక్కలు ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు గల గబ్బిలాలు ఉన్నాయంటే ఆశ్చర్యమేమరి! వీటిలో చాలా భాగం పురుగుల్ని పట్టుకు తింటాయి. పక్షుల్ని తినేవి, చేపల్ని పట్టేవి, రక్తం త్రాగేవి కూడా ఉన్నాయి.

అన్నిటినీ పరిశీలించినట్లే గబ్బిలాల గురించి కూడా శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. గబ్బిలాలు కటిక చీకట్లో కూడా చెట్లకు, పుట్టలకు, స్తంభాలకు గుద్దు కోకుండా ఎలా ఎగరగలుగుతున్నాయో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు ఒక ప్రయోగం చేశారు. ఒక పెద్ద గదిలో అడ్డంగా కొన్ని తీగలని కట్టి, కొన్ని గబ్బిలాలని పట్టుకొని, వాటి కళ్ళకు గంతలు కట్టి, ఆ గదిలో విడిచి పెట్టారు. అవి ఏ తీగలకైనా తగిలితే ఒక గంట మ్రోగేటట్లు అమర్చారు. ఒక్క తీగకైనా తగలకుండా మామూలు వేగంతో అవి సునాయాసంగా తీగల మధ్య నున్న సందుల్లోంచి ఎగురుకుంటూ పోయాయి. అంటే కళ్ళతో చూడకుండానే గబ్బిలాలు దారి తెలుసుకొంటున్నాయి అని దీనివల్ల ఋజువైంది.

రెండో ప్రయోగంలో గబ్బిలాల చెవులకు బిరడాలు పెట్టి, గదిలో వదిలి పెట్టారు. ఈ మారు అవి సరిగ్గా ఎగరలేకపోయాయి. మాటిమాటికీ తీగలకే కాక, గోడలకి కూడా గుద్దుకోవడం మొదలుపెట్టాయి. మూడవ ప్రయోగంలో వాటి నోరు కట్టేసి వదిలారు. ఈ మారు కూడా అవి సరిగ్గా ఎగరలేకపోయాయి.

దీనిని బట్టి గబ్బిలం దారి ఏ విధంగా తెలుసుకొంటుందో అర్థంమైంది. అది ఎగురు తున్నప్పుడు నోటితో సన్నని కూతలాంటి శబ్దం చేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రిక్వెన్సీ [పౌనఃపున్యం] తో ఉండటాన (అంటే సుమారుగా సెకండుకి 45వేలు నుండి 50 వేలు సార్లు అన్న మాట) అది మన చెవులకి వినిపించదు. ఈ హై ఫ్రిక్వెన్సీ [కంపవేగము] శబ్ద తరంగాలు వాటి ఎదురుగా ఉన్న అడ్డంకులకి తగిలి, ప్రతిఫలించి వెనక్కి తిరిగి వచ్చి, గబ్బిలం చెవులకి తాకుతాయి. వీటి చెవులు బహుసున్నితమైనవి కావడం చేత పరావర్తనం చెంది తిరిగి వచ్చిన స్వల్పమైన శబ్దాలను విని, ఎదురుగా ఉన్న అడ్డంకిని గుర్తించ గలుగుతాయి. ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతోందో, కదిలితే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతుందో, కచ్చితంగా తెలుసుకో గలుగుతాయి. ఆ వస్తువు తాను తినడానికి పనికి వచ్చే పురుగో, లేక తాను తప్పించుకోవలసిన చెట్టు కొమ్మో గ్రహించి, తదను గుణంగా తాను ఎగిరే దిశను మార్చు కుంటూ పురుగైతే దాని దగ్గరకు రాగానే తినడం, అది అడ్డంకి ఐతే తప్పించుకోడం చేయగలుగుతాయి. వీటి కళ్ళు మామూలుగా చూడలేవు కానీ ఏదైనా వస్తువును దగ్గర నుండి చూసి అది తన తిండికి పనికి వచ్చేదో కాదో, కళ్ళతో చూసి తెలుసు కొంటాయి.

గబ్బిలాయి మొఖం అనీ పల్లెటూరి గబ్బిలాయి అనే వాడుక పదాలు ఉన్నాయి. తెలివిలేని వాడనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. వదలకుండా వెంట పడేవారిని కూడా గబ్బిలాయిలా వ్రేలాడు తుంటాడు విడవకుండా అని అంటుంటారు. చిత్రమైన ఈ జీవి గురించి మనం తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి కదా! ఈ చరాచర సృష్టిలో ఒక్కో జీవి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. నేనుకూడా గబ్బిలాయిని కాకుండా ఇక్కడితో ఆపేస్తున్నాను.

******

Posted in June 2019, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *