Menu Close
గ్రంథ గంధ పరిమళాలు
హిమాలయ యాత్ర – బ్రహ్మమానస సరోవర యాత్ర, కైలాస యాత్ర – మనోహరరావు బృందం

ఈ యాత్ర 1978 నుండి 1983 దాకా జరిగింది. యాత్రానంతరం మనోహరరావు తన యాత్రల విశేషాలతో కూడిన విషయాలను ‘కైలాస దర్శనం’ అనే పేరుతో 576 పుటలున్న గ్రంథం రచించారు.

ఆ గ్రంథం మీద ప్రముఖుల అభిప్రాయాలు

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు: “తీర్థ యాత్రలలో అత్యంత సాహస పూర్ణము కైలాస మానస సరోవర యాత్ర...ముఖ్యముగా ఈ యాత్ర చేయు వారలకు ఈ గ్రంథము దారి దీపముగా నుండు గాకు.” (కై.ద. పుట -25)(తే.యా.చ. పుట – 390)

కోవెల సంపత్కుమారాచార్య: “కైలాస మానస సరోవర యాత్ర చాలా దుర్గమమైనది... అత్యంత ప్రమాద భూయిష్టమైనది” (కై.ద. పుట -51)(తే.యా.చ. పుట – 390).

నెల రోజుల ప్రయాణానికి అయిన ఖర్చు నాడు ఎనిమిది వేల రూపాయలు.

మానస సరోవరం యాత్ర:

ఢిల్లీ నుండి ఈ యాత్రికులు చంపావతీ పర్వత ప్రాంతానికి చేరుకొన్నారు. చంపావతి చంద్రవంశీయుల ప్రాచీన రాజధాని. అటు తర్వాత దార్సులా నుండి తవా ఘాట్ చేరి గాడిదలు, గుర్రాలపై పదిరోజులు ప్రయాణించి మానస సరోవరం చేరారు. గార్త్వాంగ్ లేక దార్బాంగ్ అనే గ్రామం పూర్వం మనదేశపు చివరి గ్రామం. కాని ఇప్పుడు కాలాపానీ మన దేశపు సరిహద్దు గ్రామం.

తక్లాకోట్ నుండి మానస సరోవరం బయలుదేరాలి. ‘బల్ డక్’ అనే ప్రదేశం చేరగానే కైలాస శిఖర ప్రథమ దర్శనం కలిగింది. మరికొంత దూరంలో ‘రాక్షస తాల్’ అనే నీలి నీటి సరస్సు దర్శనమిస్తుంది. దీని నీరు త్రాగరు. దీని వద్దకు ఎవ్వరూ వెళ్ళరు.

‘ధార్చెన్’ అనబడే కైలాస్ బేస్ క్యాంపు నుండి సరోవర దర్శనానికి బయలుదేరాలి. మానస సరోవరం చుట్టుకొలత 105 కిలోమీటర్లు. సరోవరం మధ్య భాగంలో ఉన్న చెట్లనుండి పండ్లు రాలి నీటిలో పడినప్పుడు వచ్చే శబ్దాన్ని గూర్చి చెప్తూ “వృక్ష రాజముల యొక్క పెద్ద పెద్ద ఫలములు సరోవరములో రాలుచుండగా ‘జం’ అనే శబ్దము వచ్చుటచే ఈ ప్రాంతమునకు జంబూలింగ్ లేక జంబూద్వీపం అని నామకరణము జరిగినట్లు హిందూ పురాణ గాథలు గలవు” అని మనోహరరావు గారు తన మాటగా చెప్పారు. (తే.యా.చ. పుట – 394).

కైలాస యాత్ర: ‘ధార్చెన్’ అనబడే కైలాస్ బేస్ క్యాంపు సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది. టెలిబక్ శిఖరానికి యాకులపై (జడల బర్రెలు) ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ చలికి ఆరురకాల దుస్తులు ధరించాలి. కైలాస్ పర్వతం పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉంది. భక్తులిక్కడ ‘రుద్రమాలా’ పరిక్రమ చేస్తారు. కైలాస పర్వతం ప్రస్తుతం చైనా లోని టిబెట్టు రాష్ట్రంలో ఉంది. హిమాలయాలలో కైలాస పర్వతం జస్కర్ పర్వత శ్రేణులలో ఉంది. భూమండలం యొక్క గరిమనాభి ఇక్కడే ఉన్నట్లు ప్రాచీన మరియు ఆధునిక శాస్త్రజ్ఞుల మాట.

1959 లో ఈ కైలాసయాత్ర మార్గాన్ని కొన్ని కారణాల వల్ల చైనా మూసివేసింది. తిరిగి 1981 లో తెరువబడింది.  భారతీయులకు కాశీ వలె టిబెట్ వారికి కైలాస్ ముఖ్య పుణ్యక్షేత్రం. పదిహేను రోజులు సాగే సాక్షాంగ పరిక్రమ సమయంలో టిబెట్ వారు సత్తు (పేల పిండి) తింటారు. ఈ రెండు తప్పక చూడతగ్గవి.

ప్రణవానంద – మానస సరోవర యాత్ర:

1938 నుండి 1949 వరకు వరుసగా తొమ్మిది సంవత్సరాలు మానస సరోవర యాత్ర చేసి ఎన్నో ప్రదేశాలను అతి ధైర్యసాహసాలను ప్రదర్శించి దర్శించిన వాడు స్వామి ప్రణవానంద. వీరు చేసినంత యాత్ర టిబెట్ వారు గాని, భారతీయులు గాని మరెవ్వరూ గాని చెయ్యలేదు. కైలాస ఉత్తర దక్షిణ పీఠ భాగాలలో “ఖాండో సంగ్లం పాస్” ద్వారా ఒంటరిగా యాత్ర సాగించారు.  అంతేగాక మూడు కనుమలను గూడా పరిశోధించి వాటి కొఱకు 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించడం ఎంతో గొప్ప విషయం. ‘జన్మభూమి, ‘జ్ఞాన నౌక’ అనే పడవల్లో ప్రయాణించి ‘రాక్షస తాళ్’ ‘గౌరికుండ్’ దర్శించి అక్కడ అనేక పరిశోధనలు జరిపి వాటి లోతుపాతులను చుట్టుకొలతలను, స్వరూప స్వభావాలను నిర్ధారించిన ప్రథమ పరిశోధక మహా యాత్రికులు ప్రణవానంద. అంతేగాక యాత్రికులకు కావాల్సిన అనేక సూచనలు గూడా చేర్చి 1949 సంవత్సరంలో ‘కైలాస్ అండ్  మానస సరోవర్’ అనే గ్రంధాన్ని ప్రచురించారు.

కాశ్మీర్ యాత్ర:

ప్రాచీన కాలం నుండే కాశ్మీరు ప్రపంచానికే నందనవనం, క్రీడా మైదానం అని పేరు గాంచింది. కాశ్మీరు ఒకప్పుడు స్వతంత్ర దేశం. తర్వాత మొగలులు, పఠానులు, సిక్కులు పాలించారు. మొగలుల కాలంలో వచ్చిన బెర్నియర్,  పఠానుల కాలంలో వచ్చిన విఘ్నే అనే యాత్రికుడు కాశ్మీర్ చరిత్రను గ్రంథస్తం చేశారు.

నాయని కృష్ణ కుమారి గారి “కాశ్మీర దీపకళిక”:

కేంద్ర ప్రభుత్వ స్థాయిలో భారత దేశ నగరాలలో ఉన్న కళాశాలల నుండి ప్రతి సంవత్సరం ఒక బృందాన్ని (విద్యార్థులు, ఉపాధ్యాయులతో) ఏర్పాటు చేసి విజ్ఞాన వినోద యాత్ర నిర్వహిస్తారు. అందులో భాగంగా డా. నాయని కృష్ణ కుమారి ఆధ్వర్యంలో 1967 జూన్ 18న ఒక బృందం హైదరాబాదు నుండి కాశ్మీరుకు బయలుదేరింది. ఈ బృందం ముందుగా పఠాన్ కోట చేరి అక్కడి నుండి శ్రీ నగర్ కు వెళ్ళింది. ఈ యాత్రానంతరం కృష్ణకుమారి తమ యాత్రానుభావాలను ‘కాశ్మీరు దీపకళిక’ అన్న పేరున గ్రంథం వ్రాశారు.

జమ్మూ ప్రజలు డోగ్రా జాతి వారు. వీరు సాహసికులు. అక్కడ ఆడవారిని గూర్చి కృష్ణకుమారి ‘పంక నిర్మగ్న సుందర పద్మాలు’ అని అభివర్ణించారు. కాశ్మీరు స్త్రీలు సౌందర్యవంతులు: కాని వారి దుస్తులు మురికిగా ఉంటాయని ఆమె అలా వర్ణించారట.

అసలే కళాహృదయురాలు. వెళ్ళింది కాశ్మీర్. అందుకే కృష్ణకుమారి కలం ప్రతివిషయాన్ని అనుభూతిలో అద్ది, అందమైన కాశ్మీరు దీపకళికను మనకందించింది. ఐనిహోల్ కనుమ అందాలు చూడకుండా దానిని దాటి వెళ్ళొద్దని ప్రభుత్వం వారు “స్టాప్ అండ్ సీ బ్యూటిఫుల్ ఐనిహోల్ అన్న బోర్డు పెట్టారట అక్కడ. ‘పిర్ పంజల్’ పర్వతశ్రేణి దాటి క్రింద ఉన్న కాశ్మీరు లోయలోకి ఒక సొరంగ మార్గముంది. అదే జవహర్ టన్నల్. ఇది రెండు మైళ్ళ పొడవు ఉంది (తె.యా.చ. పుట 261).

శ్రీనగర్ కాశ్మీర్ లోయలో ముఖ్యనగరం. లోయకు మధ్యలో ఉంది. వెయ్యి అడుగుల ఎత్తు గల శంకరాచార్య పర్వతం, ఏడువందల అడుగుల ఎత్తుగల హరి పర్వతం, ఈ రెంటి మధ్య శ్రీ నగర్ విస్తరించి ఉంది. శ్రీ నగర్ లో ప్రశస్తమైన సరస్సు ‘దాల్ సరస్సు’. ఇది నాలుగు మైళ్ళ పొడవు, మైలు వెడల్పు ఉంటుంది. బోటు విహారం చేస్తూ ‘చైష్మ షాహి’ ‘నిషాల్ బాగ్’ మొదలైనవి యాత్రికులు దర్శిస్తారు. శ్రీ నగర్ లో ప్రపంచ పసిద్ధి గల తోటపేరు ‘షాలిమార్’. దీనికి భూ, జల మార్గాలు రెండూ ఉన్నాయి. కాశ్మీరులో టీ గులాబి రంగులో ఉంటుందట. కంగడి అనే వేడి సాధనం చలికి కాశ్మీరీలు తమ అంగీల క్రింద పెట్టుకుంటారని, బీదవారికి వీటిని ధనవంతులు దానం చేస్తారని కృష్ణకుమారి తెలిపారు.

ప్రముఖ యాత్రికుడు – రాహుల్ సాంకృత్యాయన్:

రాహుల్ అసలు పేరు కేదార్ నాథ్ పాండే. తన 24వ ఏట రచనా వ్యాసంగం మొదలుపెట్టి 34 సంవత్సరాలలో యాభైవేల పేజీలు ప్రచురించారు.

యాత్రా చరిత్రలను గూర్చిన గ్రంథం “మనుక్కడ్ శాస్త్ర్”. దీనిని యాత్ర విజ్ఞాన శాస్త్ర గ్రంథంగా పెద్దలు అభివర్ణించారు. ఇటువంటి గ్రంథం (యాత్రా చరిత్రల మీద) వ్రాసిన ఘనత రాహుల్ కే దక్కింది. ఇతని ఆత్మకథ 2814 పేజీలలో వ్రాయబడింది. రాహుల్ అభిప్రాయంలో యాత్రా చరిత్రలు వ్రాసేవారు కాలినడకన లేదా తేలిక పాటి వాహనంలో వెళ్లి దారిలోని విషయాలను సేకరించాలి అని తెల్పారు (తె.యా.చ మరియు సాహిత్య మరమరాలు).

A) కొన్ని ముఖ్యమైన భారతీయుల యాత్రా చరిత్రలు మిగతా విశేషాలు:

“భూప్రదక్షకుడు భార్యకు వ్రాసిన లేఖలు” ..మూర్తి
“నేను చూసిన అమెరికా” .. అక్కినేని నాగేశ్వరరావు
“పాశ్చాత్య దేశాలలో 50 రోజులు” .. సి. నారాయణ రెడ్డి
“చైనా యానం” .. శ్రీరంగం శ్రీనివాస రావు

B) రామేశ్వరం లో సేతు మాధవస్వామి తనకు తానె తన కాళ్ళకు సంకెళ్ళు వేసుకొని దర్శనమిస్తాడు. మన దేశంలో రైలు ప్రయాణం మొట్టమొదట 1853, ఏప్రిల్ 16 న సాయంత్రం 8గంటలకు బొంబాయి లో బయలుదేరి ఠాణాకు చేరుకొందని మొత్తం 21 మైళ్ళ దూరం ప్రయాణించినట్లు రాగం వెంకటేశ్వర రావు తన “యాత్రా మార్గదర్శిని” తెల్పారు (తె.యా.చ. పుట 57).

*********

Posted in June 2019, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *