Menu Close
prabharavi

రాజకీయాల అన్నంలో

పథకాలు కూరలు,

వద్దనటం లేదు,

కల్తీ తప్పంటున్నాను.

 

కడుపులో మంటలున్నా

కొందరు కనిపించరు,

సూర్యుడిలాగా

చలాయించుకుంటూ పోతుంటారు.

 

మొక్కకు మాతృభాష

పుష్పం,

పుష్పానికి మాతృభాష

పరిమళం.

 

కాన్వెంటు పిల్లల

కష్టాలు చూసి

చీకటికి కూడా

కన్నీటి “చుక్కలు’.

 

నిన్న మాతృభాష

గుండెలలో,

నేడు పెదవులమీద,

రేపు ఊసెయ్యటమే!

మట్టిలోంచే

ప్రాణులు, ప్రాణాలు,

మాతృభాష నుంచే

మానాలు, అభిమానాలు.

 

మాతృభాష

మనిషికి మూడో కన్ను,

తప్పుడు ప్రభుత్వాలకు

అది మూసుకుపోతేనే దన్ను.

 

ప్రజాసేవ కోసం

రాజకీయాల్లోకి వచ్చారట!

గాంధీజీ మదర్ తెరీసా

ఎంత పిచ్చోళ్ళో!

 

చీకటికి సిగ్గుంది

కన్నాల్లో దాక్కుంది,

ఇంకా వీళ్ళేంటి

కుర్చీలమీద కులుకుతున్నారు!

 

సముద్రానికి

ఎన్ని కళ్ళో,

అందుకే అంత కన్నీరు,

అవని బాధల్ని చూసి!

Posted in June 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!