Menu Close

జాతీయ మహాకవి బమ్మెర పోతనామాత్యుల వారి శ్రీమహాభాగవతం దుర్విఘ్నకృతాటంకాల మూలాన అపరిసమాప్తమైనదని వెలిగందల నారయామాత్యుడు ఆచార్య ఋణాపనోదనంగా శేషపూరణమహోద్యమానికి శ్రీకారం చుట్టి ఆ మహాకార్యాన్ని చేతనైనంతలో సంస్కరించిన కొన్నాళ్లకు బొప్పరాజు గంగనామాత్యుడు పంచమ స్కంధాన్ని చేపట్టిన నాటికే ఏర్చూరు మండలంలో సింగనామాత్యుడు విద్యాదికాన్ని పూర్తిచేసికొని సారస్వత దీక్ష వహించి మహాకావ్యనిర్మాణధురీణుడై దేశంలో పేరుపెంపు గన్నవాడని మనము ఊహింపవచ్చును. అది క్రీస్తుశకం 1485-1490 సంవత్సరాల నడిమి కాలమై ఉంటుంది. అప్పటికి ఆయన వయస్సు ముప్ఫైఅయిదు, నలభైకి మించి ఉండదు. పోతన్న గారి రచనను చదివినట్లు కనబడదు. పురాణేతిహాస ప్రసిద్ధమైన కువలయాశ్వ చరిత్రమును తొలిసారి అపురూపమైన పద్యకావ్యంగా సంతరించాలని నిశ్చయించుకొన్నాడు. శాశ్వతికమైన యశస్సును కాంక్షించే వయఃప్రభావం వల్ల, కవిలోకంలో ఏర్పడిన వైదుష్యగరిమకు లక్ష్యకల్పన చేయాలన్న అహమహమిక మూలాన భావప్రౌఢికి శబ్దాలంకర్మీణత తోడై ఉదాత్తమైన రచనకు పూనుకొన్నాడు. అయితే, భాగవతనువాదవేళకు విషయవైరాగ్యం సమకూడి యౌవకర్మాదుల వైముఖ్యం కలిగి జ్ఞానయోగానుష్ఠానం పట్ల మనస్సు అభిముఖమైనట్లున్నది. తొలినాటి తన కావ్యం పైని శ్రద్ధావైసాదృశ్యం తనకే కలిగిందో, భాగవతమహారచనాసమ్మోహితులైన లేఖకులే దానినంతగా పట్టించుకొనలేదో చెప్పటం కష్టం. కూచిమంచి తిమ్మకవి లక్షణసారసంగ్రహములో ఉదాహరించినదొకటీ, పెదపాటి జగ్గన ప్రబంధసారసంగ్రహంలో చేర్చుకొన్నవి పది - మొత్తం పదకొండు పద్యాలు అందులోనివి ఇప్పటికి వీనుమిగిలాయి. ఇది తిమ్మకవి ఉదాహరించిన అమోఘమైన పద్యం –

మీఱిన భద్రనాగముల మీఁదికి దాఁటి తదీయకుంభముల్
జూఱలువట్టి కేసరికిశోరనఖావళి నుండి రాలి సొం
పాఱిన మౌక్తికంబులు ప్రియంబున నేరి కిరాతబాలికల్
గీఱనగింజ లాడుదురు గేలిఁ దలిర్పఁగఁ బక్కణంబులన్.

అని. బోయపల్లెలలోని బాలికలు అడవిలో కొదమసింహాలు అమితసత్త్వాన్ని కలిగిన భద్రజాతి యేనుగుల మీదికి లంఘించి వాటి కుంభస్థలాలను చీల్చి అందులోని ముత్యాలను కొల్లగొట్టగా – ఆ సింహాల గోళ్లనుంచి రాలిపడిన ముత్యాలను ఎంతో యిష్టంకొద్దీ ఏరుకొని వాటితో గీరనగింజలు ఆడుకొంటున్నారట. చింతగింజలను గుప్పిట్లో గులికించి నేలమీదికి విసురుతారట. వాటిలో దగ్గర దగ్గరగా పడిన రెండేసి గింజల నడుమ కాలితో గీతలను గీస్తూ వంతులవారిగా ఒక అందమైన బొమ్మను పూర్తిచేయాలి కాబోలు. ఇది తెలుగుదేశంలోని బాలికా క్రీడావిశేషం. సాహిత్యంలో సింగనామాత్యుడు తొలిసారిగా అభివర్ణించిన ఈ ఆటను పింగళి సూరన తన కళాపూర్ణోదయము (6-202) లోనూ, ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యము (3-33) లోనూ, అయ్యలరాజు నారాయణామాత్యుడు హంసవింశతి (3-47) లోనూ, శేషము వేంకటపతి శశాంక విజయము (2-19) లోనూ ప్రసక్తానుసారం పేర్కొన్నారు. ఆడపిల్లలు ఇళ్ళల్లో రత్నాలతో గీరనగింజలు ఆడుకోవటం అన్న కల్పన హృదయావర్జకంగా ఉన్నందువల్ల శేషము వేంకటపతి సింగన పద్యాన్ని అందంగా అనుకరించాడు:

చారుచిరత్నరత్నమయసౌధములన్ బురి వైశ్యకన్యకల్
గీరనగింజ లాడుతఱిఁ గ్రిందను జిందిన దివ్యరత్నముల్
పౌరులు ద్రొక్కుచుం జనఁగఁ బాదుకొనన్ ధరణీపురంధ్రికిన్
వారక రత్నగర్భ యను నామముఁ బెట్టిరి సత్కవీశ్వరుల్.

అని. లేక ఆటలో చింతపిక్కలను రత్నాలని వ్యవహరించేవారేమో అనుకోవాలి. అందువల్ల ఉభయకవులకూ ఈ కల్పన స్ఫురించి ఉండవచ్చును. సింగనామాత్యుని మహాప్రభావం ఎంత విశాలపరిధితో విస్తరిల్లినదో తెలుసుకోవటానికి ఈ పద్యం ఒకటి చాలును.

కువలయాశ్వ చరిత్రము శబ్దాలంకర్మీణతకు, లలిత శృంగారభావాలకు, రసవత్కల్పనలకు, ప్రౌఢరచనకు పుట్టినిల్లు. అది కాలగర్భంలో కలిసిపోవటం జాతి దురదృష్టం. అందులోనివి మరికొన్ని స్తవనీయములైన హృద్యపద్యాలు:

గోపురగోపురప్రతిమగోపురముల్ చెలువొంద నప్పురిన్
మాపులు రేపులుం గలుగు మంజులగీతవినోదకృత్యముల్
జూపఁగఁ - గిన్నరాదు లవి చూచు నెపంబున వచ్చి నేర్తు రా
లాపవిశేషనర్తనవిలాసకలాపములన్ ముదంబునన్.  

చల్లని పండువెన్నెలల సౌధతలోన్నతహేమవేదులం
దల్లన వల్లభుల్ గదిసినట్టి సుధాకరుఁ జూచి ప్రాణముల్
జల్లన రాహువుం దలఁచి చయ్యనఁ బాపుదు రంకసంగతో
త్ఫుల్లవధూముఖంబులను బొల్పగు కస్తురిపత్రభంగముల్.

ప్రాచీనంబులు రత్నకాంతులు లసత్ప్రాకారముల్ హేమముల్
సూచింపన్ ఘనవేదికుట్టిమము లా శుభ్రాంశుకాంతంబులై
యే చోటన్ వరరత్నజాలములచే నింపొంది సొంపొందుచున్
వాచాగోచరమై గృహంబు లమరున్ వస్తుప్రశస్తోన్నతిన్. 

తమచూపు లొగిఁ బాంథతతులపైఁ బూనిన
భావజు కరవాలభాతు లనఁగఁ
దమ కురుల్ యువమృగేంద్రములకై తీర్చిన
మరు నసమానంపు టురు లనంగఁ
దమ హాసములు విటోత్కరమానములఁ బట్టు
వలరాజు పూవుల వల లనంగఁ
దమ కాంతి పురుషులఁ దాపంబు నొందించు
రతిరాజు మోహనరస మనంగ
జలజకాహళకదళికాపులినగహన
కోకబిసశంఖచంద్రాళికులముఁ దెగడు
పాదజంఘోరుకటిమధ్యపటుకుచోరు
బాహుగళవక్త్రకచములఁ బణ్యసతులు.

తన జన్మ మప్పులఁ దలమున్క లని రోసి
       పులిన మీ పొంకంబుఁ బొందె నొక్కొ
పరికింపఁ దనపట్టు తిరిగెడి పా టని
          పెన్నిధి సుడిమూర్తి బెరసె నొక్కొ
బ్రతు కెల్లగతి బట్టబయ లాయె నని చూచి
          గగన మీ పుట్టువుఁ గనియె నొక్కొ
పనిలేక బాసెడి పాపంబుఁ దలపోసి
          జక్కవ లీ రీతి కెక్కె నొక్కొ
యనఁగ లలన జఘన మంబుజము నాభి
చామ నడుము బాల చన్నుదోయి
మహితరుచులఁ దెగడి మానవపతి కన్ను
దోయి పండు వగుచు దొరసె నంత.

ఈ విధమైన అమోఘమైన శైలిలో రూపుదిద్దుకొన్న కావ్యం చరిత్రలో అంతర్హితం కావటం జాతి దురదృష్టం కాకపోతే మరేమిటి?

Posted in June 2019, May 2019, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *