కూచిపూడి నాట్యాచార్యుడు "వెంపటి చిన సత్యం గారు"
భారతదేశములోని 8 సాంప్రదాయ నృత్య కళారూపాల్లో కూచిపూడి నాట్యం ఒకటి. ఈ నాట్యాన్ని ద్వైత వేదాంతాన్ని అనుసరించే నరహరి తీర్ధ అనే ఒక సన్యాసి ప్రారంభించగా 17 వ శతాబ్దంలో అయన శిష్యుడు సిద్ధేంద్ర యోగి ద్వారా ఈ నాట్యకళ ప్రాచుర్యంలోకి వచ్చింది. కృష్ణా నదీ తీరాన అంటే ప్రస్తుత కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే గ్రామములో పుట్టిన ఈ నాట్యకళ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లోకి తెచ్చిన వ్యక్తుల్లో శ్రీ వెంపటి చిన సత్యం గారు ప్రముఖులు. కూచిపూడి నృత్యం చాలా కాలం నుండి ఉన్నప్పటికీ ఈ నాట్యకళ మన ప్రాంతానికే పరిమితమైన రోజుల్లో, చెన్నైలో భరతనాట్యమే బాగా ప్రచారంలో ఉన్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టిన కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం గారు.
ఆ విధంగా కూచిపూడి నాట్యాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చిన వెంపటి చిన సత్యం గారు కూచిపూడి నాట్యంలో నృత్య నాటికలను రూపొందించి దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడి నృత్యానికి విశేషమైన పేరు ప్రఖ్యాతులను గుర్తింపును తెచ్చాడు. అంతే కాకుండా 1963 లో చెన్నై లో కూచిపూడి ఆర్ట్ అకాడమీ ని స్థాపించి ఆ అకాడమీ ద్వారా ప్రముఖ సినీ కళాకారులు వైజయంతి మాల, ప్రభ, పద్మా మీనన్, వాణిశ్రీ, శోభానాయుడు మరెందరికో కూచిపూడి నాట్యాన్ని నేర్పి వారిని మంచి పేరెన్నిక గల నృత్య కళాకారులుగా తీర్చి దిద్దిన ఘనత వెంపటి చిన సత్యం గారిదే. అంతేకాదు. హేమ మాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప వంటి వారంతా ఆయన శిష్యులే. ఆ విధంగా ఎంతో మంది ప్రతిభ కలిగిన కళాకారులను తయారు చేసారు. ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి కూడా వారి శిష్యులే.
వెంపటి చినసత్యం 1929, అక్టోబర్ 15న కృష్ణా జిల్లాలోని కూచిపూడి వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, తాడేపల్లి పేరయ్య శాస్త్రి, వెంపటి పెదసత్యం ల వద్ద అభ్యసించారు. 1947 లో మద్రాసు కు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లో చోటుదగ్గింది. ఇది నిజంగా తెలుగు వారు ఎంతగానో గర్వించదగ్గ ఉత్తమ పురస్కారం.
కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి తన జీవితమంతా అంకితం చేసిన వ్యక్తి వెంపటి. రకరకాల జతు లనీ, నాట్య ప్రక్రియలను విస్పష్టంగా వర్గీకరించి, సనాతన నాట్యశాస్త్ర సమగ్ర విధివిధానాలతో మేళవించి, ఎన్నెన్నో జతి స్వరాలు, తిల్లానాలూ, వర్ణాలూ సృజించిన నాట్య పరమేష్టి ఆయన. కూచిపూడి నృత్య నాటికలను ఎన్నింటినో రూపొందించి వాటికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశారు. శ్రీ కృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం, క్షీరసాగర మథనం, పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం లాంటివి పేరెన్నికగన్నవి.
ఈయన అందుకున్న పురస్కారాలు విషయానికి వస్తే కొన్ని 1967 లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 1980 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్. 1982లో భరత కళాప్రపూర్ణ, 1998 లో పద్మభూషణ్ పురస్కారం, 2011,12 లో జీవన సాఫల్య పురస్కారం మొదలైనవి.
వ్యక్తిగత వివరాల్లోకి వస్తే వెంపటి సత్యం గారికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారుడు వెంపటి రవిశంకర్ కూడా నాట్యాచార్యుడే. 2012, జూలై 29న 83 ఏళ్ల వయస్సులో వృద్ధాప్యం కారణంగా వెంపటి చెన్నై లోని నృత్య క్షేత్రం 'కూచిపూడి ఆర్ట్ అకాడమీ'లో తుదిశ్వాస విడిచారు. 2012 జూలై 29న ఆయన పుట్టినరోజు అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. ఆయన పేరిట 5 లక్షల రూపాయల స్మారక పురస్కారాన్ని 'యక్షగాన సార్వభౌమ' చింత సీతారామాంజనేయులు ప్రకటించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు దీన్ని ప్రదానం చేస్తారు.