Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

చక్రపాణి రంగనాథుడు, కృష్ణమాచార్యులు, మారన

చక్రపాణి రంగనాథుడు

ఆదికవి వాల్మీకి సంస్కృత భాషలో, అనుష్టుప్ ఛందస్సులో పాడుకోవడానికి వీలుగా రామాయణం రచించాడు. అదే విధంగా తెలుగులో ద్విపద ఛందస్సులో మొట్టమొదట ఒక రామాయణం రచింపబడింది. ద్విపద పాడుకోవడానికి అనువైన ఛందస్సు. ఈ రామాయణం పేరు రంగనాథ రామాయణం అనేది రూఢమైన పేరు.

రంగనాథుడు రచించాడు కాబట్టి, తెలుగు సాహిత్యంలో రంగనాథుడు అనే పేరుగలవాడు చక్రపాణి రంగనాథుడు ఒక్కడే కాబట్టి, రంగనాథ రామాయణ కర్త చక్రపాణి రంగనాథుడే అనే చాలామంది భావన. కానీ దీనిని చక్రపాణి రంగనాథుడు వ్రాయలేదు అని ఆరుద్ర ఇలా అన్నారు-

“రంగనాథ రామాయణం అని చెప్పబడినా స్పష్టంగా దానిని గోన బుద్ధ భూపతి తన తండ్రిపేర వ్రాసినట్లు కనపడుతుంది. ...అయితే రంగనాథుని పేరు ప్రత్యేకంగా చెప్పి రామాయణం లోని ద్విపదలు ఉదాహరించిన లాక్షిణికుడు ఒకడే ఒకడు ఉన్నాడు. అతడు పొత్తపి వెంకటరమణ కవి. అతడు క్రీ.శ. 16వ శతాబ్ది వాడు. ఆయన తన లక్షణ శిరోమణి లో అచ్చవెల్లి రంగన్న గారు అను పేర రంగనాథ రామాయణం లోని ద్విపదలు ఉదహరించాడు.....అందుచేత రంగనాథుని ఇంటిపేరు అచ్చవెల్లి వారే గాని చక్రపాణి వారు కాదు” అని తేల్చి చెప్పాడు.

రంగనాథుడు, పాల్కురికి సోమనాథునికి సమకాలికుడు. వీరిద్దరూ వాదించుకోవడం చివరకు కొంత కథ జరిగి రంగనాథుడు పాల్కురికి సోమనాథుని పాదాలపై పడి వేడుకోగా రంగనాథునికి పోయిన కన్ను తిరిగి రావడం – రంగనాథుడు ఆ సందర్భంగా ‘నయనరగడ’ రచించడం ప్రసిద్ధమైన విషయాలు.

కృష్ణమాచార్యులు

ఆధునిక యుగంలో వచన పద్యాలు బహుళంగా ఆదరణ పొందాయి. అయితే ఈ ప్రక్రియ తెలుగులో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలోనే ప్రారంభమయింది. ఈ కాలపు వాడైన కృష్ణమాచార్యులు అనే కవి ‘సింహగిరి వచనాలు’ అనే కృతి రచించాడు. అయితే నన్నయ గారు కూడా తన కాలంలో ‘నవార్థ వచన రచనా విశారదులైన మహాకవులు ఉండేవారని మహాభారత అవతారికలో తెల్పారు. వచన రచన అంటే తిక్కన కాలం నాటికి కథా కవనం అనే అర్థం ఉండేదని తెలుస్తున్నది. అయితే ఈ వచన అనే మాటనే తిక్కన గారి కాలంలో గద్య అని కూడా పిలిచారు. అందుకే తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో వచనం లేకుండా వ్రాసినప్పటికీ ప్రతి ఆశ్వాసంలో చివర గద్యం వ్రాశాడు. ఆశ్వాసాంత గద్యకు, ఆశ్వాసాలలోపల ఉన్న గద్యకు భేదం ఉందని,  ఆశ్వాసాంత గద్యలను ‘బిరుదు గద్యలు’ అని అంటారని నిడదవోలు వెంకటరావు గారు వివరించారు.

క్రీ.శ. 1430 ప్రాంతం వాడైన అనంతాచార్యుడు తన ‘ఛందోదర్పణం’ లో గద్య లక్షణాన్ని వివరించాడు. (స.ఆం.సా. పేజీలు 434-435). అనంతుడు చెప్పిన గద్యలు మధుర కవితలలో చేరుతుందని వార్తాకవి రాఘవయ్య తెలిపాడు. మధుర కవిత్వంలో కళికోత్కళికలు, గీతప్రభంధములు, బిరుదావళి ....మొ|| అనేక రకాలు ఉన్నట్లు చెప్పి ఆరుద్ర వాని పేర్లను తెల్పారు. అయితే ఈ మధుర కవితలను సంస్కృత లక్షణ కర్తలు క్షుద్ర కావ్యాలుగా పేర్కొన్నారు. కానీ లౌకిక సంస్కృతంలో గద్యానికి ప్రాముఖ్యత ఉంది. వీరశైవంలో ఆది నుంచి వచనాలకు ప్రాధాన్యత ఉంది. మొత్తం మీద కాకతీయ యుగంలో అంతకుముందు కూడా మధుర కవితలకు ప్రచారం ఉంది. ఈ కోవలోనే కృష్ణమాచార్యులు రాణించి ఆద్యుడైనాడు. ఇతనిని గూర్చి ప్రతాపరుద్ర చరిత్రలో ఒక గాథ ఉంది. (స.ఆం.సా. పేజీ 438-39).

ఈ కథ వల్ల కృష్ణమాచార్యులు ప్రతాపరుద్రుని కాలం వాడని తెలుస్తున్నది. ఇతడు తామ్ర పత్రికలపై తన రచనలు రచించాడు. ఇతని రచన పేరు సింహగిరి వచనాలు. తాళ్ళపాక కవులు ఇతనిని గూర్చి తమ రచనలలో పేర్కొన్నారు. అన్నమయ్య మనుమడు చిన తిరుమలయ్య ‘సంకీర్తనా లక్షణం’ అనే గ్రంథం వ్రాశాడు. అందులో ఇలా చెప్పాడు.

‘ధర కృష్ణాచార్యాధిక – పరికల్పత
           పదము తాళబంధ చ్ఛందో
విరహితమై చూర్ణాఖ్యం – బరగున
           నిర్యుక్తనాను భావితమగుచున్’ (54)

ఈ పద్యాన్ని బట్టి కృష్ణమాచార్యుల వారు చూర్ణికలు వ్రాసినట్లు తెలుస్తున్నది. వచన రచన అయిదు రకాలు 1. గద్య, 2. బిరుదుగద్య, 3. చూర్ణిక, 4. వచనము, 5. విన్నపము.

కృష్ణమాచార్యులు సంతూరు అనే గ్రామంలో జన్మించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర చెప్తున్నది. కాని అతడు విశాఖపట్నం దగ్గర ఉన్న సింహాచలంలో ఉండేవాడని అతను వ్రాసిన సింహగిరి వచనాల వల్ల తెలుస్తున్నది. ఈ సింహాచలం అప్పుడు కళింగదేశం లో అంతర్భాగం. దీనిని చాళుక్యరాజు కుళోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1076-1118) పాలించేవాడు. కాబట్టి నేటి విశాఖపట్టణానికి కుళోత్తుంగ చోళ పురం అనే పేరు ఉండేదని ఆరుద్ర తెలిపారు. పుట్టింది సంతూరులో, పెరిగింది సింహాచలం లో అని కృష్ణమాచార్యుల జన్మస్థలం గూర్చి నిర్ణయించడం జరిగింది. అయితే సంతూరు అనే పేరు గల గ్రామాలు నాలుగైదు విశాఖలో ఉండడం వల్ల కృష్ణమాచార్యులు ఏ గ్రామంలో పుట్టారో నిర్ణయించలేక పోతున్నారు. సంతూరు అనే పేరు గల గ్రామాలు సింహాచలం చుట్టుప్రక్కల చాలా ఉన్నాయట.

రచనలు:

కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలు, శఠగోప విన్నపాలు, కొన్ని కీర్తనలు రచించాడు. ఇతని ఆధ్యాత్మిక కీర్తనల వల్ల దేవునికే వైరాగ్యం కల్గిందని అన్నమాచార్య చరిత్రలో ఉంది. (స.ఆం.సా. పేజీ 444).

కృష్ణమాచార్యుల సింహగిరి వచనాలు మచ్చుకు కొన్ని;

  1. దేవా నీ నామోచ్ఛారణంబు సేయక తొమ్మిది కోట్ల తులాభారంబు తూగిన దుర్యోధనుండు యమపురి కేగెన్.
  2. దేవా నీ నామోచ్ఛారణంబు సేయక నాలుగు కోట్ల వస్త్ర దానంబును సేసిన మార్కండేయుడు మతి హీనుండయ్యెన్.

ఈ విధంగా ఇంద్రుడు, హరిశ్చంద్రుడు, ధ్రువుడు మొదలైన వారు సింహగిరి నరసింహస్వామిని సేవించక పోవడం చేత కష్టాలపాలయ్యారని కృష్ణమాచార్యులు తన సింహగిరి వచనాలలో పేర్కొన్నారు. కృష్ణమాచార్యుల సంపూర్ణ రచనలు లభించలేదని అవి లభిస్తే గాని ఆయనను గూర్చి అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు ఆరుద్ర.

కృష్ణమాచార్యులను విష్ణుమూర్తి యొక్క పదకొండవ అవతారంగా నమ్మకం వ్యాప్తి చెందింది. ఏకశిలా నగరం లో చనిపోయిన వానిని కృష్ణమాచార్యులు బ్రతికించడం మొదలైనవి జరిగినట్లు కథలు సింహపురి వచనాల వల్ల తెలుస్తున్నది. చివరగా కృష్ణమాచార్యులను గూర్చి ఆరుద్ర మాటలు-

“...ఇతనితోనే తెలుగులో గానయోగ్యాలైన వైష్ణవ కవిత్వం ప్రారంభమయింది. ...కుల భేదాలను పాటింపక ఒక మత విశ్వాసాలను నమ్మేవారంతా సమానులే అనే ఆశయం అమలుచేస్తూ, తన పెళ్లి నాడే శూద్రునిలో దేవుని చూచి అతనికి తళియ వడ్డింపించి వెలి అయిన కృష్ణమాచార్యులు శ్లాఘనీయుడే. బంధువులకు వెలి అయినా ఇటువంటి ఉదార స్వభావులు వసుదైక కుటుంబ సభ్యులై ఉన్నతాశాయాలకు చేరువలోనే ఉంటారు.” (స.ఆం.సా. పుట 448).

మారన

ఆంధ్ర సాహిత్యంలో లభ్యమవుతున్న మొట్టమొదటి పురాణాన్ని అనువాదం చేసిన కవి మారన. (స.ఆం.సా. పుట 448). తిక్కన గారి శిష్యుడితడు. ఇతను అనువదించింది మార్కండేయ పురాణం. తన గ్రంథాన్ని మారన గన్నయ నాయకునికి అంకితమిచ్చాడు. గన్నయ ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1295 నుండి 1326 దాకా పాలించాడు. మారన, గన్నయ కూడా ప్రతాపరుద్రుని కాలం వారే.

మారన ప్రారంభించిన సంస్కృత పురాణానువాద విధానం, తర్వాత అల్లసాని పెద్దన, గౌరన వంటి వారికి మార్గదర్శకమైనది. మారన గ్రంథంలోని యమలోక వర్ణనను సంగ్రహించి ప్రౌఢకవి మల్లన తన రుక్మాంగద చరిత్రలో పొందుపరచాడని వావిళ్ళ వారు ప్రచురించిన మార్కండేయ పురాణం పీఠికలో శేషాద్రి వేంకటకవులు వ్రాశారు. (స.ఆం.సా. పుట 448).

కవికాలం స్పష్టంగా ప్రతాపరుద్రుని కాలమని తేలింది. కాని ఇతని జన్మస్థలం గూర్చి కొంత ఆలోచించాలి. మార్కండేయ పురాణంలో ప్రతి ఆశ్వాసం చివర “శ్రీ మదుభయ కవి మిత్ర తిక్కన సోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీ పాత్ర తిక్కనా మాత్ర పుత్ర మారయ నామధేయ ప్రణీతంబైన మార్కండేయ పురాణం’ అని గద్యలో చెప్పడం వల్ల మారన నెల్లూరులో జన్మించాడా అని కొందరి అభిప్రాయం. కొందరి మాటల్లో ఇతను ఏకశిలలో జన్మించాడు. ఇక ఆరుద్ర అభిప్రాయం ఇలా ఉంది. “....గ్రంథంలోని పరోక్ష సాక్ష్యం వల్ల ఇతడు తెలంగాణాలోని గోదావరీ ప్రాంతం వాడేమోనని నేను భావిస్తున్నాను.” ఆ సాక్ష్యం –

మార్కండేయ పురాణంలో నాలుగో ఆశ్వాసంలో భూగోళ ప్రకరణం ఉంది. ప్రపంచంలోని ద్వీపాల, నదుల వర్ణనలతో పాటు, ఈ ప్రకరణలో మారన పనికట్టుకొని ఒక పద్యం (179) లో గోదావరిని గూర్చి ప్రపంచంలో కెల్లా పవిత్రమైనదని చెప్పడం గమనించదగ్గదని ఆరుద్ర వివరిస్తూ ‘అది అతని నివాసభూమి కావడమే కారణం కావచ్చు’ అని అన్నారు. (స.ఆం.సా. పుట 449).

మార్కండేయ ఆవిర్భవ కారణాలు వివరించే సందర్భంగా ఆరుద్ర చెక్కిన అందమైన అక్షర శిల్పాలు – “ఇటువంటి పరిస్థితులలో సరస సాహిత్య సౌరభ సంవాసితమైన మారన హృదయకమలం లో అపూర్వ కావ్య రచనా కుతూహలం అనే మధులిహం విహరిస్తున్నది. కొత్తది చెప్పాలనే కోర్కె ఝమ్మని  శ్రుతి మీటుతున్నది.” చెప్పడంలో ఎంత మెత్తదనం, కొత్తదనం!!

**** సశేషం ****

Posted in May 2022, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!