మత్తేభమాలిక | గరుడారూఢుని వేంకటేశునిఁ గనన్ గల్యాణముల్ గల్గుఁగా
దురితంబుల్ నశియింప మ్రొక్కు శ్రితసందోహంబు క్షీరాబ్ధియై, అరుదౌ కాంచనహార(1)రత్నమణిభూషాలంకృతుండై, గరు త్కర(2)కోటిద్యుతి వెల్గు నా గరుడహస్తద్వంద్వనీతాంఘ్రిపం కరుహంబుల్(3) చెలువార, మస్తకనమస్కార(4)స్తుతుల్, నృత్యగీ తరవంబుల్, వివిధశ్రుతిశ్రవణముల్(5), ధన్యంబులౌ హారతుల్, సిరికిన్ దావగు చోటఁ బచ్చ(6) మెఱయన్, శ్రీవిల్లిపుత్తూరునన్ మురువై వచ్చిన పుష్పదామ(7) మదిగో, మున్నెన్న డే జన్మ నీ తిరువీధుల్ తిరుగాడి కొల్చితినొ యీ దేదీప్యమానాకృతిన్, పరమాత్మున్, భుజగేంద్రశైలనిలయున్(8)? వైకుంఠధామంబె యీ ధర నిల్చెన్, గని దైవమానవతపోధన్యుల్ ముద మ్మొంద, నా తరమా యీ యనుభూతిఁ దెల్పఁగ? నితాంతశ్రీకరం, బద్భుతం బరవిందాసనునుత్సవంబుఁ(9) గను భాగ్యంబబ్బెఁ ద్వక్చక్షువుల్(10) తరియింపన్, హరియింప మానసములన్ దానే స్వయంవ్యక్తుఁడై(11), హరి కల్పించిన లీల, లీలలకె నిత్యావాసమౌ(12) సప్తభూ ధరవైభోగము నెందుఁ గాంచఁ దరమౌ ధాత్రీతలం బందునన్? |
(1) | గరుడసేవలో ప్రత్యేకముగా అలంకరించే, వేంకటేశ్వరనామములు చెక్కిన 1008 బంగారు కాసులు కలిగిన కాసులపేరు (2018 సంవత్సరములో ఒక భక్తుఁడు సమర్పించిన అరుదైన కానుక) |
(2) | గరుత్ (=సూర్య)+కర(=కిరణము) |
(3) | గరుత్మంతుని రెండు చేతులయందు ఉంచఁబడిన కమలముల వంటి పాదములు (స్వామివారివి) |
(4) | తలమీద రెండు చేతులు చేర్చి చేయు నమస్కారము |
(5) | పలురకముల వేదముల వినికిడి |
(6) | లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్స్థలమున నున్న పచ్చ(మరకతము) |
(7) | శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ధరించి పంపిన పూలమాల |
(8) | శేషాద్రినివాసుఁడు |
(9) | బ్రహ్మోత్సవము |
(10) | చర్మపుకళ్ళు (భౌతికనేత్రములు) |
(11) | స్వయంభువు |
(12) | ఎల్లప్పుడు నిలయమైన |