Menu Close
సాహితీ ప్రక్రియ - గజల్...
- దినవహి సత్యవతి -

గజల్ : 11 (ఖండ గతి)
***
ప్రియునికై వేచితిని కాంచవే రాయంచ!
విరహాన వేగుచుంటి చూడవే రాయంచ!

మన్మథుని తలదన్నె సుందరుడె నా ప్రియుడు,
చేరగా రమ్మనీ చెప్పవే రాయంచ!

కోర్కెల పూమాల చేబూని నిలిచేను,
జాగేల చేసెనో అడగవే రాయంచ!

తీయనీ ఆశలే చిగురించె మదిలోన,
దరిజేరి మురిపింప కోరవే రాయంచ!

మనోహరుని బాసలు సత్యమని నమ్మేను,
చేకొనీ పొమ్మనీ తెలుపవే రాయంచ!

***

గజల్ : 12 (తిస్రగతి)
***
పూలబుట్ట చేతబట్టి నవ్వెనులే పూబోణియె,
కొప్పులోన పూలుచుట్టి మురిసెనులే పూబోణియె!

విరబూసిన కలువలతో కొలనెంతో అందగించె,
కలువలకే రాణివలే వెలిగెనులే పూబోణియె!

కలువపూవు చేతబూని మధురముగా నవ్వినదీ,
కొలనుకంత తననగవులు పంచెనులే పూబోణియె!

జరీయంచు కోకలోన మెరుపులీనె వగలాడే,
అందములో అప్సరసల మించెనులే పూబోణియె!

సత్యముగా సృష్టియొక అద్భుతమౌ చిత్రములే,
సృష్టికర్త సృజననెంతొ మెచ్చెనులే పూబోణియె!

***

--- సశేషం ---

Posted in December 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *