కర్ణభారమ్ రూపకమ్ -- సంస్కృతములో రచన: మహాకవి భాసుడు – తెలుగనువాదము: అచ్యుతానంద బ్రహ్మచారి
శ్లో॥
అంగైః సహైవ జనితం మమ దేహరక్షా
దేవాసురైరపి నభేద్య మిదం సహాస్త్రైః ౹
దేయం తథాపి కవచం సహకుండలాభ్యాం
ప్రీత్యా మయా భగవతే రుచితం యది స్యాత్ ॥
తె౹ తే గీ
పుట్టి నపుడంగములతోడ పుట్టినట్టి,
దేవ దనుజాయుధాలు భేదించలేని,
నిండు తనువుఁగాచుఁ గవచ కుండలముల
నిష్టపడినచో దానంబు నిపుడొనర్తు.
శక్రః౹(సహర్షమ్)దదాతు దదాతు ౹
తె౹(ఆనందముతో)దానము చేసెదవుగాక, దానము చేసెదవుగాక.
కర్ణః౹(ఆత్మగతమ్)ఏష ఏవాస్యకామః౹కిం ను
ఖల్వనేక కపటబుద్ధేః కృష్ణస్యోపాయః సో౽పి
భవతు౹ధిగయుక్త మనుశోచితుమ్ ౹నాస్తి సంశయః ౹
(ప్రకాశమ్)గృహ్యతామ్ ౹
తె౹(తనలో)ఇదియే ఇతని కోరిక. ఇది అనేక కపట బుద్ధులు కలిగిన కృష్ణునియొక్క ఉపాయమా? అదికూడ అగునుగాక!ఛీ విచారించుట అనుచితము. సంశయములేదు. (ప్రకాశముగా)స్వీకరించుము.
శల్యః౹అంగరాజ!న దాతవ్యమ్ న దాతవ్యమ్ ౹
తె౹అంగరాజా!ఇవ్వవలదు ఇవ్వవలదు.
కర్ణః౹శల్యరాజ!అలమలమ్ వారయితుమ్౹
తె౹శల్యరాజా!వారించుట చాలు చాలు. చూడుము.
పక్షుల అలార శబ్దంతో ఉషోదయం..!! -- కొప్పుల ప్రసాద్
కోయిల కొత్త రాగము అందుకొని
లేత చిగుళ్ళు ఆరగించిన ఆనందముతో
కొసరి కొసరి తిని పరవశంతో పాడ సాగె
కూనిరాగాలు తో వనమంతా పులకిస్తుంది
సందడి చేస్తూ సరిగమలు వినిపిస్తుంది...
పక్షుల అలార శబ్దముతో ఉషోదయం
కళ్ళు తెరుచుకున్నాయి ప్రకృతి సోయగం
తూర్పు దిక్కున కాంతి కిరణం పొడుస్తుంది
సాగరం నుంచి ఆకాశాన్ని ఎగబాకుతూ
నేలమ్మకు స్వర్ణకాంతులు అందిస్తూ
వెలుగు రేఖలు ఉదయించె తూర్పు దిక్కున...
పచ్చటి వృక్షము పైన నూతన కోలాహలం
పక్షులు ఎన్నో కలిసిమెలిసి బృందగానం
కిలకిల శబ్దాలతో వీనుల విందుగా సౌందర్యం
శ్రవణానందముగా కావించే సూర్యోదయం
పిట్ట గోడ పైన పిట్టలు కోలాహల ముచ్చట్లు...
చెట్టు లోని తన నివాసం చూసి పిచ్చుకలు
చిరు గాలుల సేవకు మురిసి పొంగే
గూడులో తన్మయత్వం పొందుతూ
సృష్టిలోనే మహోత్తర గృహ నిర్మాతగా
మానవులకు సవాలు విసురుతూ నివసించే..
పచ్చని రామ చిలక మాటలు నేర్చి
మధురమైన పండ్లను కొరికి తృప్తి పడే
రామ శబ్దముతో విను వీధుల్లో విహరిస్తూ
తత్వము మరిచిన మనిషికి బోధ గావించె
స్వేచ్ఛగా తిరుగుతూ నింగికి రంగులు వేసే..
స్వచ్ఛమైన నీరు త్రాగి పింఛపు రంగులు
సెలయేరుల లయ బద్ధ శబ్దాలకు పురి విప్పిన
మయూరి మైమరిచి నర్తించె అడవిలోన
వికసించిన ప్రకృతికి తన్మయత్వముతో మురిసే
నృత్యానికి మెత్తబడి నింగి ఆనందభాష్పాలు రాల్చే..
కొండ కోనల ధ్వనులకు పక్షులన్నీ ఏకమై
పురివిప్పి నృత్య గానాలతో పుడమి పైన తాండవం
ఉదయించే సూర్యుడికి స్వాగతం పలుకుతూ
సృష్టి అంతా వెండి వెలుగుల తెరను కట్టుకొని
ముస్తాబయి మురిపించే సకల జగత్తును...
దాహం దాహం -- పద్మావతి రాంభక్త
ఎండకు తాళలేక
గూటిలో కూర్చుంటే
ఎండిన నోరు
నీటిని అడిగింది
బలహీనపడిన రెక్కలను
బ్రతిమాలుకుంటూ
చుక్క నీటి కోసం
అమాయకపు ప్రాణం తిరిగింది
భరించలేని వేడికి
నాలుగు కాళ్ళను ఈడ్చుకుంటూ
మూలన ఇంట్లోని
నాలుగు చక్రాల వాహనం కింద నీరసపు జీవి దాగింది
ఎడారవుతున్న నాలుక
నీటిని తెమ్మంటే
ఎంతో వేటాడి అలసి
సొమ్మసిల్లింది
***
అటు చెరువును చంపి
వెన్నుపై నిలిచిన భవంతి గర్వంగా నవ్వింది
ఇటు మట్టిని మింగిన కాంక్రీట్
పచ్చదనాన్ని కొల్లగొట్టి
కృూరంగా చూసింది
నదులు మాయమయ్యాయి
అడవులు గల్లంతయ్యాయి
వాన అలిగి ఎటో తరలిపోయింది
అరాచకాలకు విసిగిన సూర్యుడు
సహనం కోల్పోయి
మండి పడుతున్నాడు
***
ఈ భూమి
అందరిదీ కదా
ప్రకృతి
సమస్త ప్రాణులకు
సొంతం కదా
కానీ మనిషెందుకు
తనదే హక్కంటూ
ఇంత నిర్ధాక్షిణ్యంగా
పెత్తనం చేస్తున్నాడు
అని అన్ని మూగజీవులూ
ప్రశ్నించలేని
నిస్సహాయతలో
మౌనంగా రోదిస్తున్నాయి