సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.
నాకు చీకటంటే భయం
నీ తోడులేని రాత్రి అనూహ్యం
నువ్వో! నిత్యం వెలుగు రవ్వవి...
రాత్రిళ్ళు ప్రేమగా పాలపుంతల్లోకి తీసుకెళ్తావు
కంటి మెరుపుల్తో నక్షత్ర కాంతులు ఒడి నింపుతావు
వెలుతురు దేవేరివై విశ్రమించి నీ ఆలింగనమిస్తావు
నాభాగ్యంకొద్దీ చల్లటి వెలుతురై ప్రవహిస్తావు,
లేదంటే ఆ కాంతిపుంజంలో భస్మీభూతమయ్యే నన్ను బ్రతికించడానికి ఎన్ని భాగీరథులు కావాలి?
పాపం, అప్పుడు మళ్లీ నువ్వేగా నితాంతమైన దయతో నాకోసం భాగీరథి వయ్యేది...
అలా ప్రేమగా ఉప్పొంగివచ్చినప్పుడేగా ఆకాశమంతా చుక్కలు పరుచుకొన్నది
నీ దరహాసపు వెలుతురేగా చుక్కలు చుక్కలై ఆనంద లాస్యం చేసినది
అణచిపట్టిన నీ నవ్వుకోసమేగా పంచభూతాలు సాంధ్యరాగపు నట్టువాంగం కూర్చినది
సఖీ! ఎంత వెర్రివాణ్ణి! నువ్వు నా కోసమే ఈ వెలుగు చీకట్లు కల్పిస్తున్నావని గ్రహించలేనివాణ్ణి!
నీ తోడుకై ఆరాటపడ్డానికే ఈ కాలమాయ అని గుర్తించలేనివాణ్ణి
నేను నీ బిందువునై, నిన్ను పొందానని భ్రమిస్తున్నవాణ్ణి
నీ వికల్ప భ్రాంతి కణాన్ని!
శా|| ఛందస్సంగమతః పయోధి నిబిడ ప్రద్యోత గారుత్మత
శ్రీవత్సాంజన పద్మజాలయ మహోరస్కాంతరాత్మాయనః!
యజ్ఞాంధఃకుల ధాతు గర్భ గిరిజానన్య శ్శివః ప్రేక్ష్యతే
శ్రీశూలాభయ శంఖ చక్ర సహిత స్స్వప్నే నవీనో మయా! ||
కం|| ప్రణవార్థంబులు పలుకులు
ప్రణవాచార్యునికి శివుని పసి కొమరునికిన్!
ప్రణవము తుండము ప్రథమ
ప్రణతిని గొను వానికి శివు బ్రథమ సుతునికిన్! ||
ఉండునను మాట యొక్కటి
యుండగ నెల్లరకు తెలిసి, ఉంటుం దుంటా
దుండు ద్దుంటది, మఱియును
ఉండాది, యివన్ని యేల, నొప్పులకుప్పా
అన్నియు కలసిన దుండగ
నున్నది విడనాడి క్రొత్త దొక్కటి వలెనా
కొన్నేండ్లు వెన్క కేగిన
నున్నది యొక రాజమార్గ, మొప్పులకుప్పా
నన్నయ చూచిన మార్గం
బన్నలు వేయేండ్లుగా న మర్చిన మార్గం
బెన్నియొ గడచిన మార్గం
బున్నది, మఱచితిమి దాని, నొప్పులకుప్పా
నీవాడు బాస నీకును
నీవాడకు సరియె, యుండనిమ్మట్లే, దే
శావరకం బైనప్పుడు
నోవరి బాసొప్పఁ గలదె, యొప్పులకుప్పా
చక్కనిది రాజమార్గము
గ్రక్కున విడి దారి తప్పె, క్రమ్మఱి చనినన్
దక్కును, గాక నశించు, న
దొక్కటె బ్రతికించు భాష, నొప్పుల కుప్పా
తలుపులు, కిటికీలు,మూసి
మరొక సారి తడిమి చూసి
బయలు దేరడం ప్రయాణానికి సిద్ధత.
అవసరానికి సరి లెక్కను చూసి
సొరగు మూతను మూయడం
వ్యవహారానికి నిక్షేపత.
ఇత్తడి గిన్నె లో అత్తెసరు పొంగినప్పుడల్లా
మూతను సవరించి
అమ్మ చూపుతుంది
వండివార్చేకుశలత
ఆందోళన వేళల్లో
బజారుకు పడిన మూత
అల్లరి మూకల ఆగడాలకు నియంత్రత
మూత లేని అనిల వాయువు
విస్ఫోటన ప్రమాదత.
మూత వేయని లోతు బావి తవ్వకం
ప్రాణాంతక పరిణామత
పరుగు తీసే పట్టాలపై
రైలుగేటుకు మూత
దాటి వెళ్ళే దారికి భద్రత
నదీ వేగాల తూముకు మూత
జల యాత్రలకు నిశ్చింత,
విద్వేషాలకు మూత
విభేదాలకు మూత
వికట చర్యలకు మూత,
మూత మంచిది
మూత నమ్మకం, మూత రక్షణ, మూత విశ్వాసం
దాగుడు మూతల దండాకోరుల పట్టివేతకు
కనుల మూతను తెరచు కొనడం
తప్పని సరి అనివార్యత.
ఒక ఊహ అలా దూసుకు వస్తుంది
ఎక్కడినుండో ఎడారులను మేసి వచ్చిన
ఒంటరి ఒంటెలా
వాకిట్లో నిలబడి ఇంకారాని పిల్లలకోసం
ఆదుర్దా పడుతున్న అమ్మ మనసులా...
ఒక తలపు తారట్లాడుతుంది
ఊసులు మాలకట్టుకు
పరిమళాలు పంచుకుందుకు
ఎదురుచూస్తున్న ఏకాంతం లా
ఎక్కడి నుండో తప్పటడుగులు వేస్తూ
కంటికొసల చివర కాటుక కొస మెరుపులా ...
ఒక పాట పలకరిస్తుంది
బీడు వారిన ఉనికి పొరలపై
తొలకరి చినుకై రాలుతూ
మొలకెత్తిన ఆర్తికి
తొలిపాలధార కుడుపుతూ
నిస్త్రాణమై తలవాల్చిన లేతమొలక
వెన్నుదట్టి నిలబెట్టే ఊతమవుతూ
లోలోపలి సుప్త స్పందనలను మేల్కొలుపుతూ ....
ఊహ తలపుగా తలెత్తుతూనే
మాటలు మాటలుగా మనసు ప్రజ్వరిల్లుతుంది
చీకటి వత్తులను వెలిగిస్తూ
పాట ఒక వెలుగు పుంతలా తేజో నిలయమై
విశ్వ రూప దర్శనం కలిగిస్తుంది.
కర్తవ్యం విశదమయిన సవ్య సాచిలా
కాలం పిడికిట కలం అస్త్రమై
రేపటిని ప్రవచిస్తుంది.
నేను
మౌనాన్ని
మౌన శిఖరాన్ని
శిఖర మౌనాన్ని.
•
అవును, నేను
అనంత విభావరిని
అనంతర ఆహార్యాన్ని
ఆవలితీర అంతరంగాన్ని.
***
నేను
శబ్ద పరత్వాన్ని
నిశ్శబ్ద పర్వతాన్ని
నిష్క్రమణ పర్వాన్ని.
•
అవును, నేను
శబ్దించని అరూపాన్ని
హృదయ లేఖినిని
అవ్యక్త అక్షరాస్త్రాన్ని.
***
నేను
మౌన రాగాన్ని
రాగ సంసారాన్ని
సంసార సరాగాన్ని.
•
అవును, నేను
శూన్య పల్లవిని
చరణ గతిని
గీత గరిమని.
***
నేను
సాంద్ర సంకల్పాన్ని
చైతన్య స్రవంతిని
నిమీలిత కాలవాహినిని.
•
అవును, నేను
కనుపాపల నిశ్చలతను
కనురెప్పల సమాధిని
కనుదోయి కరుణాకరాన్ని.
***
నేను
వాసన లేని వాసాన్ని
నిర్వ్యాపార నివాసాన్ని
నియతిలేని ఉపవాసాన్ని.
•
అవును, నేను
మానవ రహస్యాన్ని
రహస్య మౌనాన్ని
అక్షర మౌనాన్ని.
***
అవునవును
నేను నిష్క్రమణ మౌనం
నేను అస్తిత్వం మౌనం
నేను మౌనం.
మౌనం మౌనం మౌనం.
సంస్కృతమ్ము నుండి సంస్కారములనొందె
తమిళ కన్నడాలతళుకులొందె
మలయసింహళములమక్కువన్ మన్నించె
మధ్యదేశభాష మదిని నిల్పె.
ఒరియ నుడిని గూడి ఒరవడి గుడికట్టె
తెల్ల వాని భాష తెగువ జూచె.
పారసీకపుర్దు భాషల యాసల
తనవి చేసుకొనియె తనివి దీర.
తెలుగు పాత్రలోన తేనెలూరగ నిండి
భాషలన్నికలిసి బాస జేసె
మధురసమ్ములేము మధుపాత్ర తెలుగేను
దేశభాషలందు తెలుగు లెస్స
భాష తెలుగు జూడ భావమ్ము తెలుగేను
బలము మేమె వెనుక ఫలము తెలుగు.
పలికె నిట్లు తాము పలుకుబడుల పెంచె
తెలుగు జగతిలోన తేజరిల్ల.
1. నవ్వుల రాజ్యం స్థాపిద్దాం
హాస్యపు జల్లులు కురిపిద్దాం
కురిసిన నవ్వుల జల్లుల ధారలు
కుండలలోనే నింపేద్దాం
కోపం వస్తే గుక్కెడు త్రాగి
తాపం వస్తే స్నానం చేసి
ఆనందంగా ఉండచ్చోయ్
ఆరోగ్యంగా ఉండచ్చోయ్
బృందావనపు ఆరోగ్యంలో
బ్రహ్మానందం పొందచ్చోయ్
2. మురిసెడి చేనును దున్నేద్దాం
మురిపెపు గింజలు పండిద్దాం
పండిన మురిపెపు గింజల కుప్పలు
సంచులలోనే నింపేద్దాం
బీ.పీ రోగి గుప్పెడు తింటూ
చక్కెర రోగి చారెడు తింటూ
ఆనందంగా ఉండచ్చోయ్.....
........బ్రహ్మానందం పొందొచ్చోయ్
3. చెణుకుల ఇంటిని నిర్మిద్దాం
చకచక దివ్వెలు వెలిగిద్దాం
వెలిగిన చెణుకుల దివ్వెల వెలుగులు
వరుసగ గుండెల నింపేద్దాం
చింత కలిగితే చిరుదీపంతో
కలత కలిగితే కరదీపంతో
ఆనందంగా ఉండచ్చోయ్ .....
.........బ్రహ్మానందం పొందచ్చోయ్
4. చక్కని చంద్రుని చూసొద్దాం
చల్లని వెన్నెల విహరిద్దాం
చల్లని చంద్రుని వెన్నెల వెలుగులు
కన్నులలోనే నింపేద్దాం
కష్టం వస్తే శుక్ల చవితితో
నష్టం వస్తే నిండు పున్నమితొ
ఆనందంగా ఉండచ్చోయ్ .....
...........బ్రహ్మానందం పొందచ్చోయ్
5. పూల తోటలో తిరిగొద్దాం
ఘుమఘుమ పువ్వులు పూయిద్దాం
పూసిన పూవులు మాలలు కట్టి
బుట్టలలోనే నింపేద్దాం
ఆనందానికి తలలో పెట్టి
ఆరోగ్యానికి మెడలో వేసి
ఆనందంగా ఉండచ్చోయ్....
.........బ్రహ్మానందం పొందచ్చోయ్