తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.
వెన్నెల పైటని సవరించుకొంటూ....
చలికుచ్చిళ్ళు జీరాడుతూంటే
వదిలివెళ్లనని అలకలొలకబోసే చినుకుల్ని...
చీకటికోక సింగారానికి మెరిసే అద్దాల్లా కుట్టి..
శరదృతువు అందాన్ని రవికె సోయగాలకు బిగించికట్టి...
కార్తీకపుకన్నె నగవుల నర్తిస్తూ
అడుగుపెడుతున్నది మడుగులు కట్టిన చలి ముంగిళ్ళలోకి...
నెగళ్లను పేర్చుకొంటున్న నెయ్యపు అంగళ్ళలోకి...!
పెద్ద ముత్తైదువులై ప్రమిదలూ,
మేనంతా మెలితిప్పుకొన్న వనితలై వత్తులూ,
తీరూతెన్నూ వివరించి చెప్పే తరుణులై తిలాతైలాలూ...
ఒకచో కూడి చర్చించుకుంటుంటాయ్...
నెలరోజుల పండక్కి వచ్చిన కార్తీకపుకన్నె నెలా అలంకరిద్దామా అని...
గుమ్మానికిరువైపులా వెలిగే దీపాలు
మేం లోలాకులమౌతామంటాయ్..
తెల్లవారుఝామున తులసికోట ముందు వెలిగే దీపం
నే నొసటన కోల తిలకమౌతానంటుంది..
వీధిఅరుగుపై బారుతీరిన దీపాలు
మేం మువ్వల పట్టీలమౌతామంటాయ్
పిట్టగోడపై దీపాలు వడ్డాణమౌతామంటాయ్
లక్షవత్తుల దీపం మేని స్వర్ణచందన మలదుతా నంటుంది...
కార్తీకమా! కంబళ్ళలోకి, కౌగిళ్ళలోకి మము దూరేలా చేస్తావు..
సరసుల ఎదల్లో వెచ్చటి కైతలు ఊరేలా చేస్తావు...
భావపు తైలం పోసి, అక్షరాల వొత్తులు వేసి..
ఇదిగో...
సాహిత్య సంధ్యాదీపాన్ని మేమూ
రసజ్ఞుల గుండె కొలనుల్లోకి ఒదులుతున్నాములే...!
ఏదో బహూకరిస్తున్నావని ఎంత ఆశతో ఎదురు చూశాను
చివరికిదా, సగం రాసీరాయని కాగితాల కట్ట..
సంతకమైనా పెట్టవయ్యా అంటే నా ఊపిరే నీ సంతకమన్నావు
పూట పూటకో పుట తిప్పేస్తూ ఆ ఊపిరినే తీసేస్తున్నావ్
ఏం రాతయ్యా నీది, చదువుతుంటేనే వాక్యం అదృశ్యమౌతుంటుంది
ఒక్కో మాట విద్యుత్తరంగమ
వుతుంటుంది
పైకి ఒకలా చదువుతూంటే లోన ఒకలా ధ్వనిస్తుంటుంది
తన చేతిలో పెడితే ప్రణయ కావ్యంలా అగుపిస్తుంది
చెయ్యి మారితే ప్రళయకావ్యంలా ఘోషిస్తుంది
నువ్వూ నాలాటి వాడివే, నీ కోసమో ఎదిరికోసమో తెలియకుండా
నీకు మాత్రమే అర్ధమయ్యే పిచ్చిరాత రాసుకొనేవాడివి
తాతల నాటి నుంచి అదే రాత, తాటాకు పుట్టకముందు నుంచి అదే లెక్క
అన్నట్లిదేమిటి, సగం ఎక్కల పుస్తకం, సగం నీతి పద్యాల శతకం, సగం చరిత్ర, సగం భూగోళం, అంతా కలగాపులగం
మహాప్రభో! ఏ ప్రబంధం కోసమో ఆశపడుతూంటే,
ఇచ్చి ఇచ్చి ఈ 'పెద్దబాల శిక్ష' నెందుకు బహుమానంగా ఇచ్చావయ్యా!
ఇచ్చిన నువ్వా నేనా పెద్దబాలుడివి??!
ఆగకుండా కురుస్తున్న వర్షం
తలపుల పెట్టె తలుపులు తెరిచింది
ఓరగా బాల్యం తొంగిచూసింది
నీటి గుంటల్లో ఆడిన అల్లిబిల్లాటలు
కాగితపు పడవల సయ్యాటలు
రెండు చేతులా ఒడిసిపట్టే
వానధారల ఒయ్యారి బంతులాటలు
వర్షంలో తడిసిన ఒళ్ళు తుళ్ళింతలు
మధురమైన ఙ్ఞాపకాల చిరుజల్లులు..
వయసును పంచుకున్న యవ్వనం
వర్షాన్ని హర్షంతో కౌగలించుకుని
ఎదలోని భావాల వురవడిని
పరవళ్ళ గోదారిలా ప్రవహంప చేసేది
మనసైన వాడి దరిచేరేందుకు
తనువు తహతహలాడుతుంటే
చిటపట చినుకులు విరహాగ్నిని ఎగదోసి
ప్రేమ బంధానికి బంధమయ్యేవి
ఇప్పటికీ అదే వాన
అవే తడియారని హృదయ స్పందనలు
అనుభవాలను నెమరేసుకునే మనసుకు
వయసు పెరిగినా
ఆమనసుకు ఇప్పటికీ
ఆ జ్ఞాపకాలు మరచిపోలేని మధురోహలు.
వీధిగుమ్మం దగ్గర ఏదో అలికిడి
ఎవరో తలుపు దగ్గరగా వేసినట్టు
నిద్ర ఇంకా పూర్తిగా వదలలేదు
మత్తుపరదాలు పూర్తిగా తొలగలేదు
కళ్లు నులుముతూ లైటు వేస్తే
నా...నీడ...
మళ్ళీ నన్నొదిలి వెళ్ళిపోయింది
దీనికిది అలవాటే.. నాక్కూడా!
అది చెప్పాపెట్టకుండా వెళ్ళడం
నేను వెతికి వెతికి పట్టుకురావడం
నీడ కూడా తోడు లేకపోతే ఎలా?!
హలో... నేను..
అర్ధరాత్రి కాల్ చేస్తున్నా.. సారీ
ఓసారి నీ గుమ్మంలో చూస్తావా
నా నీడేమైనా వచ్చిందేమో
లేదా???
సరే.. వస్తే కాల్ చెయ్. ఉంటా!
తబీయత్ ఇన్ దినో
బేగానా-ఎ-గమ్ హోతీ జాతీ హై
కొంచెం గట్టిగా ప్లే చేస్తున్నా
దగ్గర్లోనే గనక ఉండుంటే
బేగం అఖ్తర్ గొంతు వినబడితే
పరుగుపరుగున అదే వస్తుంది
ప్చ్... ఇక లాభం లేదు
ఊరంతా తిరగాల్సిందే
చిన్నప్పుడు సరాసరి మిఠాయి షాపుకి వెళ్ళే వాణ్ణి
లేదా చెరువుగట్టు దగ్గర దొరికేది
ఇప్పుడు లైబ్రరీ, సినిమాహాలు
క్రికెట్ గ్రౌండు, గుడి, ఎక్కడా లేదు
ఊరిచివర స్మశానమే మిగిలింది
హమ్మయ్య.. ఇక్కడ కూర్చుంది
నన్ను చూసి అదోలా నవ్వింది
"ఈ స్మశానంలో ఏంచేస్తున్నావ్?"
అదే నవ్వు.. అదే సమాధానం
ఇంతలో దూరం నుండీ చప్పుడు
కిచకిచకిచకిచకిచకిచకిచకిచకిచ
"రా.. ఇంటికి వెళ్దాం"
అదోరకంగా నవ్వుతూనే
నా నీడ రూపాంతరం చెందుతోంది
అంతలో వచ్చింది
వేయి గబ్బిలాల గుంపు ఒకటి
కిచకిచకిచకిచకిచకిచకిచకిచకిచ
చూస్తూండగా నా నీడ
ఒక గబ్బిలంలా మారింది
ఆ గుంపులో కలిసి ఎగిరిపోయింది
కిచకిచకిచకిచకిచకిచకిచకిచకిచ
"నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావ్?"
నా ఆక్రందన
ఆ కిచకిచల నడుమ ఒక గొంతు
"పడమర తెలియని తూర్పులోకి!"
కం|| | శ్రీ రుద్రమన్యు పుత్రుని! హేరంబుని! సామజముఖు! నిష్టవరదునిన్! ప్రారబ్ధాఖిల కర్మ వి కారోద్భవ విఘ్న నిఘ్న గణపతి గొల్తున్! || |
శా|| | మన్యో! రుద్ర! శుభంకర! శ్రుతిపితః! కైవల్య సంధ్యా శిర స్సీమంతారుణ కేశ నీల గగన న్యాసార్భటీ తాండవ! ప్రాలేయాచల సాను శేఖర మహీ గోముక్త గంగాధర! స్థాణో! సానుమదాత్మజారమణ! నిర్ గ్లాయాః! ప్రధీ గ్లౌ కలామ్! || |