Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

రామశర్మ – పీత

అనగనగా ఒక  గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. ఒకనాడు రామశర్మ కి అత్యవసర పనిమీద ప్రక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి రెండు మార్గాలున్నాయి.

మొదటి మార్గం, అడవిలోంచి వెళుతుంది. ఈ మార్గాన వెళితే త్వరగా ప్రక్క గ్రామం చేరుకోవచ్చు. రెండవది అడవి  వెలుపలినుంచి వెళుతుంది. ఈ మార్గాన వెళితే చాలా సమయం పడుతుంది. రామశర్మ త్వరగా వెళ్ళాల్సి ఉంది కనుక అడవి మార్గంగుండా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.

అది తెలిసిన రామశర్మ తల్లి ‘నాయనా అడవి మార్గంలో ఒక్కడివే వెళ్ళడం అంత క్షేమం కాదు. ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళు’ అని సలహా ఇచ్చింది.

‘అమ్మా! నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు తోడూ వెతుక్కునేంత సమయం లేదు. ఒక్కడినే వెళతాను. భయపడకు’ అన్నాడు.

కొడుకు అవసరం గ్రహించిన రామశర్మ తల్లి ఇంటి వెనుక దిగుడు బావిలోంచి ఒక పీతని తెచ్చి ‘దీనిని నీతో తీసుకుని వెళ్ళు. అవసర సమయంలో నీకు సహాయపడగలదు’ అని చెప్పింది.

‘సరే’ అని పీతని ఒక కర్పూరపు భరిణలో ఉంచి మూత వేసి, తన జేబులో పెట్టుకుని బయలుదేరాడు.

వేసవికాలం కావడాన ఎండ అధికంగా ఉంది. కొంత దూరం వెళ్ళాక అలసట అనిపించి ఒక చెట్టుక్రింద విశ్రమించాడు. అలసిఉన్న రామశర్మ కి వెంటనే నిద్ర  పట్టేసింది.

ఇంతలో ప్రక్కనే ఉన్న పుట్టలోంచి ఒక పాము రామశర్మ దగ్గరగా వచ్చి కర్పూరం వాసన వస్తున్న భరిణని బయటకి లాగింది. అలా లాగడంలో భరిణ మూత తెరుచుకుని పీత బయటపడి పాముని తన కొండేలతో కొరికి చంపేసింది.

కొంతసేపటికి రామశర్మ లేచి చూడగా చచ్చి పడున్న పాము ప్రక్కనే నెమ్మదిగా కదులుతున్న పీత కనిపించాయి. తనని కాటువేయడానికి వచ్చిన పాముని పీత చంపి ఉండవచ్చని అనిపించింది రామశర్మకి.

ఒంటరిగా వెళ్ళొద్దని ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళమని తల్లి ఎందుకు చెప్పిందో అప్పుడు అర్థమైంది రామశర్మకి.

ఈ పీతని తనతో తెచ్చుకోవడం మేలైందనీ దానివల్లనే తన ప్రాణాలు నిలిచాయనీ సంతోషించి పీతని మళ్ళీ భద్రంగా భరిణలో పెట్టి, భరిణని జేబులో వేసుకుని తిరిగి ప్రయాణం సాగించాడు.

నీతి: పెద్దలు చెప్పే మాటలలో, ఇచ్చే సలహాలలో నమ్మకం ఉంచితే తప్పక ప్రయోజనం ఉంటుంది.

Posted in March 2020, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!