తిరువణ్ణామలైలో బయల్దేరి, పవిత్ర క్షేత్రమైన కంచి చేరుకున్నాము. మేము ఇదివరలో కంచి కామాక్షి ఆలయం, శ్రీ వరదరాజస్వామి ఆలయం చూసాము. ఏకామ్రేశ్వరుడి ఆలయం చూడాలని కోరికగా ఉండింది - అందుకని ముందర అక్కడకే వెళ్ళాము. ఒక మాట చాలామంది ఈ ఆలయాన్ని 'ఏకాంబరేశ్వరుడి ఆలయంగా' వ్యవహరిస్తుంటారు. అది తప్పు నామం. ఏకామ్రేశ్వరుడని అనాలి.
పైన చూపించిన ఫోటోలోలాగా, ఈ ఏకామ్రేశ్వరుడి ఆలయం గాలి గోపురం చూడగానే ఆ ఈశ్వరుడి వైభవం తెలుస్తుంది. 9 అంతస్తులతో, 13 కలశాలతో, చూడగానే ఈ గోపురం కట్టిన విధానము చోళుల కాలంకంటే ముందుదని తెలుస్తుంది. కింద ఇచ్చిన వీడియో చూడండి; (వీడియో1) ఈ గోపురం మీద శిల్పాకారాలు ఉండవు. ఈ ప్రత్యేకత మళ్ళీ మీకు మధుర మీనాక్షి ఆలయగోపురాల్లో కనబడదు. అక్కడ వందలకొద్దీ శిల్పాకారాలు ఉంటాయి; వివిధ దేవతారూపాలతో. అదీ తేడా. అక్కడనించి లోపలకి ఆలయం వైపు వెళితే మీకు ఆలయ గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం చాలా ప్రత్యేకంగా, 7 అంతస్తులతో, 7 కలశాలతో ఉంటుంది. దానిమీద శిల్పాకారాలు ఉంటాయి. అలా మేము లోపలకి వెళుతుండగానే ఒకాయన స్కూటరు మీద రయ్యని వెళ్లి, ఆలయంలోపల పార్కు చేసాడు! నేను చాలా బాధ పడ్డాను. ఆయనతో దెబ్బలాడాలనుకున్నాను కానీ, స్థాన బలం లేదని ఊరుకున్నాను. ప్రమాణంకి వీడియో చూడండి. (వీడియో2) ఆ ఆలయం కప్పు కిందే రక రకాల తినుబండారాలు అమ్మే కొట్లు, వాటికి సంబారాలు తెచ్చే వాళ్ళు, అసలు ఆలయం యొక్క పవిత్రతని పాడు చేస్తూ కనిపిస్తారు. బాధనిపిస్తుంది. అలా లోపలకి వెళ్లకుండానే ఒక పెద్ద మంటపంలోకి ప్రవేశిస్తాం.
వీడియో 1
వీడియో 2
ఆ మంటపంలో ఉన్న చాలా స్తంభాలు చక్కగా చెక్కబడి ఉన్నాయి. కానీ పరిశుభ్రత లేకపోవడంతో అందంగా కనబడడానికి వృధా ప్రయత్నం చేస్తున్నాయి. అంత ప్రభుత్వ జులాయి తనం కూడా ఆ శిల్ప సౌందర్యాన్ని కప్పబెట్టలేకపోతోంది. వీడియో చూడండి, (వీడియో3 & 4) చక్కటి శిల్పాలు కనిపిస్తాయి. కానీ స్థాయి మాత్రం మీనాక్షి ఆలయం కంటే తక్కువనిపిస్తుంది. ఇది బయటనుంచి కనబడిన దృశ్యం మాత్రమేనని, లోపల దేవుడి స్థితిని బయట కప్పుతో నిర్ణయించలేమని కొద్దిసేపటిలో తెలిసింది.
వీడియో 3
వీడియో 4
కంచి గొప్ప ఆధ్యాత్మిక చింతనకి, చదువులకి ఆలవాలమని అలనాటిగా పెట్టింది పేరు. మేము క్యూలో లోపలకి వెళ్లి గర్భగుడి దగ్గరకి వెళ్ళగానే మమ్మల్ని చూసి ఒక అర్చకుడు, అద్భుతమైన ముఖ వర్చస్సు ఉన్న మహానుభావుడు - ఆయన పేరు బ్రహ్మశ్రీ షణ్ముఖ సుందరేశ్వరుడట - ఆయన మమ్మల్ని చూసి, ఇక్కడ అభిషేకం చేయించుకోండి - శుభం కలుగుతుంది - అని అన్నారు. నేను వారితో సంస్కృతంలో మాట్లాడాను. ఆయన చక్కటి ప్రౌఢ సంస్కృతంలో సమాధానం చెప్పడమే కాకుండా, చాలా వివరంగా మా గోత్ర నామాలతో, మేమిచ్చే అర్పణతో రుద్రంతో ఈశ్వరుడికి ఎంతో అందంగా అభిషేకం చేయించారు. రోజూ ఆరుసార్లు ఈ అభిషేకం చేయిస్తారు. అంటే మేము సరియైన సమయంలో చేరామన్న మాట. అలాగే హారతితో వెనక ఉన్న మూల విరాట్టు విగ్రహాలని, అక్కడ ఉన్న సైకత లింగాన్ని కూడా మాకు జాగ్రత్తగా చూపించారు. ధన్యులమైనాము. ఆయనకి తెలుగు కూడా కొంచెం వచ్చు.
ఏకామ్రేశ్వరుడు పృథ్వీ లింగంగా వెలిశాడిక్కడ. ఇక్కడ అభిషేకంలో లింగం పైన అభిషేకం చెయ్యరు. పైగా సైకతం కాబట్టి నీరు వాడరు. ఇక్కడ పునుగు తైలం మాత్రమే వాడతారు. అదికూడా పానుమట్టం మీదే అభిషేకం చేస్తారు. అదికూడా లింగం నించి బైటవైపు ఆ ద్రవ్యం వెళ్లేలా అభిషేకం చేస్తారు. ఈ ప్రక్రియ చాలా అందంగా ఉంటుంది. కానీ చేసేవాళ్ళు అనుభవజ్ఞులై ఉండాలని ఇట్టే మనకి తెలిసిపోతుంది. ఈ పృథ్వీలింగం మామూలుగా మనం చూసే లింగాలలాగా ఉండదు. కోసుగా ఉండి, పైకి వెళ్లిన కొద్దీ సన్నగా ఉంటుంది. ఇదంతా ఆనందంగా చూసాక, తీర్థ ప్రసాదాలు తీసుకుని, మేము షణ్ముఖ సుందరేశ్వరులవారిని ఈ ఆలయ స్థల పురాణం గురించి అడిగాము.
వేల ఏళ్లగా కంచి జ్ఞాన, విజ్ఞాన క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. కాత్యాయనుడనే ఋషి చాలా తపోసంపన్నుడు, కానీ సంతాన హీనుడు. ఆయన అమ్మవారి రూపం తలుచుకుని నాకు అలాంటి కూతురు కావాలని తపస్సు చేస్తున్నాడు. ఈలోగా ఒకసారి ఈశ్వరుడు, అమ్మవారు కలిసి కైలాసంలో ఉండగా, అమ్మవారు సరదాగా వెనకనుండి స్వామి రెండు కళ్ళూ తన చేతులతో ఒక్క క్షణం మూసిందిట. ఆవిడ సరదాగా మూసినా, ఆయన కళ్ళు ముయ్యడంతో లోకాలన్నీ చీకట్లు కమ్మాయి. జీవరాశి నశించి పోవడం మొదలయ్యింది. శివుడు మళ్ళీ కళ్ళు తెరిచి, 'ఎందుకు పార్వతీ అలా నా కళ్ళు మూసావు? దానివల్ల ఎంత నష్టం వాటిల్లిందో చూడు! దీనికి నీవు పరిహారంగా భూమి మీద అవతరించు. మానవ, జంతుకోటికి దిక్కై ఉండు' - అని అన్నాడట. పార్వతి అప్పుడు నేనేమి చేస్తే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను? అని అడిగింది. నువ్వు ఆ కాత్యాయనుడనే మునికి బిడ్డవై, అతనికి ఆనందం చేకూర్చు. అక్కడనించి కంచి వెళ్ళు. ఆ కంచిలో ఒక చోట ఒక మామిడి చెట్టు ఒక్కటే ఉంటుంది. అక్కడ నువ్వు నన్ను అర్చించు, నేను నిన్ననుగ్రహించి నిన్ను పెళ్ళాడతానని వరం ఇచ్చాడు. ఆ తల్లితండ్రుల లీలలు లోకకళ్యాణానికే కదా!
అలాగే అమ్మవారు కాత్యాయనుడికి అయోనిజగా కూతురై పుట్టింది. ఇక్కడ మనం చూడవలసినదేమిటంటే అమ్మవారు ప్రతిసారీ హిమవంతుడు, మేనకలకి పుట్టినట్లు పుట్టదు. సీతమ్మలాగా అయోనిజగానే పుట్టి తాను ఎవరికి కూతురవాలో వారికి దొరికేటట్లు అవకాశం సృష్టిస్తుంది. కాత్యాయనుడికి కూతురై, అతనికి ఆనందం చేకూర్చి, 'కాత్యాయని' అయింది. యుక్త వయసు రాగానే ఈశ్వరుడిమీదే భక్తి నిలిపి, తన తండ్రి అనుమతితో కంచి వెళ్ళింది. అక్కడ ఆశ్చర్యంగా ఇసుక పఱ్ఱల మధ్యలో ఇంకే చెట్టూ లేకుండా ఒక్క మామిడి చెట్టు మాత్రమే ఉండడం చూసింది. ఒక్క మామిడి చెట్టు మాత్రమే ఉండడం ఆశ్చర్యం కదా?. మామూలుగా ఇలాంటి చెట్లు అదే జాతి చెట్ల మధ్య మాత్రమే పెరుగుతాయి. అమ్మవారు ఆ చెట్టు కింద కూర్చుని, శివుడికోసం ఘోర తపస్సు "అపర్ణగా" చేసింది. తన తపస్సు కోసం మట్టితో ఒక లింగం చేసుకుని, దాన్నే ధ్యానిస్తూ, శివుడిని మనసులో పూర్తిగా నిలుపుకుంది. ఒక్క మామిడి చెట్టు పక్కనే ఈ పృథ్వీలింగం ఉన్నది కాబట్టి " ఏకామ్రేశ్వరుడ'ని పేరు వచ్చింది. సంస్కృతంలో ఆమ్రమంటే మామిడి కదా?
అక్కడ అమ్మవారి తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ఆమెని పెళ్లి ఆడాడు. ఆ పృథ్వీ లింగం చుట్టూ ఆలయం కట్టడం తరువాత జరిగింది.
ఈ కథ ఆనందంగా విని, షణ్ముఖుల వారిని ఆ మామిడి చెట్టు గురించి ఇంకా చెప్పమని అడిగాము. చెప్పేదేముంది, చూడండి, గుడిలోపలే ఉన్నది; దర్శనం తప్పక చేసుకోవాలి అని అన్నారు. వారే బయటకి వచ్చి ఆ మామిడిచెట్టుకి దారి చూపించారు. మధ్యలో అమోఘమైన స్తంభాల ఆవరణవీధి చూసాము. వీడియో, ఫోటోలు చూడండి. మధ్యలో అద్దాల గదిలో శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలు చూసి, పూజ చేసుకుని, ఆ మామిడి చెట్టు దర్శనానికి వెళ్ళాము.
ఈ ఏకామ్రము చాలా అద్భుతమైనది. దాని చుట్టూతా ఒక కట్టడం ఉన్నది. ఈ చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేసుకునే వీలుంది. గుడి వైపు ఒక నంది విగ్రహం, దాని ముందు మెట్లు, ఉన్నాయి. ఒక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఈ మామిడి చెట్టు వయసు 3,500 సంవత్సరాల క్రితం, కానీ, ఎంత క్రితం అనేది మేము తేల్చలేమని కొద్ధి సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు నిర్ధారణ చేశారట. అక్కడ ఈ మాట చెపుతూ ఫలకాలు ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మామిడి చెట్టుకి ఇంకా కాయలు కాస్తున్నాయి! నేను వీడియో తీశాను, ప్రమాణానికి చూడండి. (వీడియో5) ఈ చెట్టునించి ఆ పృథ్వీలింగం కొద్ది అడుగులు మాత్రమే ఉన్నది. కాబట్టి కథ ప్రమాణం అనిపించింది. కానీ అన్నిటికన్నా గొప్ప విషయం ఈ చెట్టు కింద శివ పార్వతుల విగ్రహాలు ఉన్నాయి. అప్పుడే పెళ్లయిన వధువు ఆమె. ఆయన సుందరేశ్వరుడు. ఎంతో అందంగా ఉన్న వారి విగ్రహాలు పక్క పక్కగా అన్ని ఆలయాల్లో ఉన్నట్లు ఉండవు - అమ్మవారు కొంత ఆయన వైపు తిరిగి, తల వంచుకుని కూడా ఆయనని ఆరాధనగా చూస్తూ ఉంటుంది. ఎంత అందమైన విగ్రహాలో? చూడడానికి రెండు కళ్ళూ చాలవు.
వీడియో 5
అక్కడనించి మళ్ళీ ముందర వైపు వస్తుంటే గుడి లోపలే ఒక విష్ణు మూర్తి ఆలయం ఉంటుంది. నేను మళ్ళీ ముక్కు మీద వేలేసుకున్నాను. కొద్ది కిలోమీటర్ల దూరంలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నది. అయినా ఇక్కడ చాలా చక్కగా నారాయణ సూక్తంతో విష్ణు పూజ చేస్తున్నారు. అద్వైతానికి ఇంతకన్నా పెద్ద పీట ఏది? అక్కడ మేము గోత్రనామాలతో అర్చన చేయించుకుని ఆలయమంతా తిరిగాము.
ఏకామ్రేశ్వరుడి ఆలయంనించి కామాక్షి ఆలయం చేరుకున్నాము. ఆ ఆలయం అందం గురించి నేను వర్ణించేదేమున్నది? ఎవరు ఆ అమ్మవారిని దర్శనం చేసుకోని వాళ్ళు? ఎవరు ఆ అమ్మవారిని చూసి ఏం అడగాలో మర్చిపోయి మంత్రముగ్ధులు కాని వాళ్ళు? ఎవరికి ఆ శ్రీ చక్ర మంటపం తెలియదు? ఎవరు ఆ ఆలయ ప్రదక్షిణంలో కాసేపు కూర్చుని సేదతీరుతూ అమ్మవారికి ధన్యవాదాలర్పించని వాళ్ళు? ఎవరు ఆ పుష్కరిణి మంటపం అలంకరణలు చూసి ఆశ్చర్యపోని వాళ్ళు? ఎవరు అక్కడ గొప్ప భక్తిప్రపత్తులకి ధన్యులవని వాళ్ళు? అమ్మ మన కోరికలు అడగకుండా తీరుస్తుందని తెలియని వాళ్లెవరు? ఆ అమ్మవారి గురించి, ఆ ఆలయ విశేషాలని, వర్ణించే ధైర్యం నాకెక్కడిది? భక్తితో నమస్కారం చేసుకోవడమే తప్ప ఇంకేమీ చెయ్యలేక పోయాను. కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుని చెన్నై వచ్చేసాము.
కంచిలో వరదరాజ స్వామి ఆలయం నేను ఇదివరలో చూసినది. కానీ కళ్ళకి కట్టినట్లున్న ఆ ఆలయం కూడా చాలా అద్భుతమైనది. శిఖరాగ్రాన ఉన్న వరదరాజ స్వామి మనలనందరినీ ఆశీర్వదించాలని కోరుతూ, ఈ ప్రస్తుత తీర్థయాత్రా విశేష సంచికలని వచ్చే నెల వరదరాజ స్వామి ఆలయ వివరణలతో సమాప్తం చేస్తాను.