జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
చుట్టాల రాకతో లచ్చవ్వ ఇల్లు హడావుడిగా ఉంది. శాకపాకాలన్నీ సిద్ధమయ్యాయి. భోజన సమయం ఆసన్నమైంది. అందరూ భోజనాలకు ఉపక్రమించారు.
“నేనూ మీతోనే తింటాను!” అని మారం చేశాడు రుద్రాంశ్.
“వాడు ఈ ఇంటికి పెద్ద మగాడు. వాడికి కూడా ఒక ఆకు వేయండి,” అని చెప్పింది లచ్చవ్వ.
“నువ్వు బుద్ధిగా తింటానంటేనే ఆకు వేస్తాను,” అని కొడుకు వైపు చూసింది సౌమ్య.
“నేను బోల్డు బుద్ధి!” అన్నాడు ఆకతాయి రుద్రాంశ్.
“నీ డీ.ఓ.జి. బుద్ధి నాకు తెలుసులే! ఇక్కడ కూర్చో,” అంటూ కాస్త దూరంగా ఆకు వేసింది సౌమ్య.
“అమ్మా, నాకు కూర, అన్నం, పప్పు,” అని చెప్పి ఆకులో అన్నీ పెట్టించుకున్నాడు రుద్రాంశ్.
కావలసినంత ఇష్టంగా తిని, లచ్చవ్వ ఒడిలోకి చేరాడు.
రుద్రాంశ్ బొజ్జమీద సుతారంగా రాస్తూ…
“జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం,
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణం,
గుర్రం తిన్న గుగ్గిళ్లు జీర్ణం,
భీముడు తిన్న బండెడు అన్నం జీర్ణం,
అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణం,
మా బాబు తిన్న పప్పు అన్నం జీర్ణం!”
అని పాట పాడింది లచ్చవ్వ.
“మామ్మగారూ! ఎందుకు నా బొజ్జమీద రాస్తూ పాడారు?” అని అడిగాడు రుద్రాంశ్.
“నీ బొజ్జలో ఉన్న అన్నం జీర్ణం అవ్వాలని,” అని జవాబిచ్చింది లచ్చవ్వ.
“ఎలా అవుతుందో చెప్పండి,” అన్నాడు గడుగ్గాయి రుద్రాంశ్.
“జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అనేది ఒక నానుడి. ఒక కథ చెప్తాను వింటావా?” అని అడిగింది లచ్చవ్వ.
“వింటాను” అని తలూపాడు రుద్రాంశ్.
పూర్వం ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసులు ఉండేవారు. వారిద్దరూ అన్నదమ్ములు.
ఇల్వలుడికి చనిపోయిన వారిని బ్రతికించే విద్య, వాతాపికి కోరిన రూపం దాల్చే విద్య వచ్చు. వీరు నరమాంసం తినడానికి ఒక ప్రణాళిక వేసుకునేవారు.
వాతాపి మేకగా మారిపోయేవాడు.
ఇల్వలుడు అరణ్యంలో లేదా మార్గమధ్యంలో కనిపించే వారిని భోజనానికి పిలిచేవాడు.
మేకగా మారిన వాతాపిని కూర చేసి వారికి వడ్డించేవాడు.”
“అప్పుడు” అని అడిగాడు రుద్ర.
“భోజనం పూర్తయ్యాక, ‘వాతాపీ, రా!’ అని ఇల్వలుడు పిలిచేవాడు.
అప్పుడు వాతాపి తిన్నవారి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇల్వలుడు, వాతాపి ఇద్దరూ వారి మాంసాన్ని తినేసేవారు. ఇలా చాలామందిని తిన్నారు.
ఒకరోజు అగస్త్య మహర్షి ఆ మార్గంలో వెళ్తుండగా, ఇల్వలుడు భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ‘సరే’ అని అగస్త్యుడు ఒప్పుకున్నాడు.
ఎప్పటిలానే వాతాపిని మేకగా మార్చి కూర చేసి వడ్డించాడు ఇల్వలుడు. అగస్త్యుడు భోజనం పూర్తి చేసిన తరువాత, ఇల్వలుడు తన మంత్ర విద్యతో ‘వాతాపీ, రా!’ అని పిలిచాడు.”
“అయ్యో! ఇతని పొట్టకూడా చీలిపోతుందా?” అని భయంగా అడిగాడు రుద్రాంశ్.
“అబ్బే! అప్పటికే అగస్త్యుడు ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!’ అని చెప్పేసాడు.
వాతాపి అగస్త్యుని పొట్టలోనే పూర్తిగా జీర్ణమైపోయాడు. ఇల్వలుడు కోపంతో రాక్షస రూపంలో అగస్త్యుని మీద దాడి చేశాడు. అగస్త్యుడు తన తపోబలంతో ఇల్వలుడిని భస్మం చేశాడు.
అంచేత ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!’ అని చెప్తే తిన్నది బాగా జీర్ణమవుతుందని పెద్దల మాట.” అని వివరించింది లచ్చవ్వ.
“నా బొజ్జలో అన్నం అరిగిపోయిందోచ్!” అని అరుస్తూ బయటకు పరుగెత్తాడు రుద్రాంశ్.
రచయిత పరిచయం
నా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి.
– కాశీ విశ్వనాథం.