ఆటవెలది:
శ్రీ శుభకర రీతి సిరులొల్కు పద్దెము
తెలుగు భాష యందు వెలుగు చుండు
పద్యమందు సొగసు హృద్యమగును సదా
పద్యమేర తెలుగు వారి వాణి
పద్యమెపుడు పాతబడదు, ప్రజల నాల్క
లందు నాట్యమాడి అలరు చుండు
రాగయుక్తమైన రంజిల్లు హృదయాలు
పద్యమేర తెలుగు భాష రాణి
తెలుగు పద్యమెపుడు తేనీయలు కురియు
హృదయ వీణమీటి ముదము గూర్చు
విన్నవారి మదికి విందు చేకూర్చును
పద్యమేర తెలుగు భాష వెలుగు
శ్రావ్యమైననోట సరిగమలు విరియ
పద్యమొకటిపాడ పరవశించి
శిశువు పసువులెల్ల శిరసులూపుముదమున్
పద్యమన్న తెలుగు వారి సొమ్ము
పద్య పఠన వలన ప్రతిభ వెలుగుచుండు
జ్ఞాపకంబు పెరుగు జ్ఞాన మబ్బు
దాని రుచి తెలిసిన దాసులౌదురుగాదె
పద్యమందు జూడ వన్నెలెన్నొ
అసలు పద్యమనగ అమ్మరా భాషకు
భాష అందమంత పద్యమందె
గలదు తరచిజూడ కవన సారమదియె
పద్యమేర తెలుగు భావవాణి
అలతి అలతి పదము లొలుక పద్యమొకటి
నీరు త్రావురీతి నేర్వవచ్చు
మంచి రాగమందు మనసు పరవశించు
పద్యమేర కవికి పావనంబు
అమ్మ లాలి పాట కమ్మదనముతోడ
పద్యమొకటి వినగ పరవశమగు
తొలగు చీకు చింత కలుగు ప్రశాంతత
పద్యమేర మనకు పరమ హితుడు
పద్యాలు అన్నిటికి మకుటం ఒకటే ఉంటే బాగుండేది గురువుగారు
చక్కగా ఉన్నాయి మాస్టారు.రెండవ పద్యం యతి స్థానం “అ”బదులు “య” అని ముద్రించి ఉండాలి.