మనిషి సంఘజీవి. పదిమందితో కలసి మెలసి ఉన్నప్పుడు, మనసులను గెలవడం జరగాలి గానీ మాటలతో గెలిచాం అనుకోవడం మంచిది కాదు. అది పిల్లల విషయంలో కూడా వర్తిస్తుంది. నీ మీద వారికి నమ్మకం కలిగినప్పుడే వారి ఆలోచనలను మీతో పంచుకోవడం జరుగుతుంది. మీ ప్రేమలో పవిత్రత ఉండాలి అంతే కానీ బాధ్యతతో నేను వారిని పెంచుతున్నాను కనుక నా మాట, ఆలోచన వారు పాటించాలి అనుకోవడం మనందరం చేస్తున్న తప్పు. మన యాంబిషన్స్ వారి మీద రుద్ది అది వారి భవిష్యత్తుకు మంచిది అంటే అది అన్నివేళలా కరెక్ట్ కాదు. తరాల మధ్య ఎన్నో సామాజిక మార్పులు వస్తున్నాయి. వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలలో స్వార్థ చింతన అలవాటు చేయకూడదు. రేపు అదే అలవాటు మీ సంరక్షణ విషయంలో కూడా పాటిస్తారు.
మా పిల్లలకు అన్నీ సౌకర్యాలు అమర్చాము. వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకూడదు. ఎండలో కొంచెం సేపు కూడా ఆడుకోకుండా అన్నీ ఇండోర్ గేమ్స్ ఆడనిస్తాము అని అంటారు. అసలు ఎండ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం మరిచిపోయాము. కారణం భయం అనే భూతం మనలను సహజ వనరులను ఉపయోగించు కోకుండా చేస్తున్నది.
మనలోని ఇన్హిబిషన్స్ ని ముందు ప్రక్కన పెట్టి ఎటువంటి పరిస్థితులలోనైనా సర్దుకొని జీవించే అలవాటును ఏర్పరుచుకొంటే మనకు అంతా సుఖంగానే ఉంటుంది. మా ఆయనకు బిరియాని లేనిదే ముద్ద దిగదు. మా వాడికి నిద్రలేవగానే ఫలానా ఫలహారం మాత్రమే ఉండాలి అనే కాన్సెప్ట్ నుండి మనం బయటకు రావాలి. ఎటువంటి ఆహారాన్నైనా (అన్నీ కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు, ధాన్యాలు) తినవచ్చు. కాకుంటే మితంగా ఉండాలి. మొదటినుండి ఒకే రకమైన ఆహారాన్ని భుజిస్తూ, అందుకు తగిన శరీర వ్యాయామం చేస్తూ ఉంటే ఏభై ఏళ్ళు వచ్చినా ఆరోగ్యకరమైన ఇబ్బందులు అంతగా మనలను బాధించవు. జన్యుపరమైన రుగ్మతల నియంత్రణ కూడా జరుగుతుంది. అంతే గానీ మొదట్లో అంతా కనపడిన జంక్ ఆహారాన్ని ఎప్పుడుపడితే అప్పుడు తిని శరీరం బరువు పెరిగి పిమ్మట నలభయ్యో పదిలో అసలు అన్నీ పదార్థాలను కట్టడి చేసి గాలిని మాత్రమే భుజిస్తూ, లేకుంటే ఎవరో ఒక డైటీషియన్ చెప్పారని లేక మరెవరో సూచించారని మన శరీరానికి తగిన పోషకాలను ఇవ్వకపోతే తరువాతి కాలంలో ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు.
బెల్లం, నువ్వులు తింటే వేడి చేస్తుందని అంటారు. కానీ వాటిలో ఉన్న పోషకవిలువలు తెలుసుకుంటే రోజూ మనం తీసుకునే ఆహారంలో వాటిని చేరుస్తాము. అలాగే బీట్రూట్, క్యారెట్, బొప్పాయి, వెల్లుల్లి, ఆకుకూరలు ఇలా ఎన్నో మంచిచేసే ఐటమ్స్ మనతోనే ఉన్నాయి. మాంసం గురించి వ్రాసే సామర్ధ్యం నాకు లేదు కనుక రాయలేను.
మానవ శరీర నిర్మాణం ఎంతో బలమైనది. వివిధరకాల సూక్ష్మక్రిముల వృద్ధిని అడ్డుకొని మనలను అనారోగ్యంపాలు కాకుండా నియంత్రించగలిగే మహత్తర శక్తి మన దేహానికి ఉంది. అందుకు ప్రధాన కారకం మనలోని రోగనిరోధక సాంద్రత. అది ఎంత బలంగా ఉంటే అంత మంచిది. అదే మనలను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది. నేడు మనం ఎదుర్కొంటున్న వైరల్ ఇన్ఫెక్షన్ మహమ్మారిని నివారించే మందు మన శరీరంలోనే ఉంది. అది మనం గమనించి జాగ్రత్తగా మసలుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకొంటూ అందుకు తగిన వ్యాయామం చేస్తూ రోగనిరోధకశక్తిని పెంచుకోవడమే నేడు మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం. ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న సహజవనరులను, ఆహారాలను వాడుతూ మన భూమిని, మట్టిని కలుషితం కాకుండా చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. డబ్బు ఎల్లవేళలా ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కలిగించదు.
**000**