నిరంతర సంచారి
- కొడుపుగంటి సుజాత
కల్పనను కాదు ఊహల్లో రూపు దిద్దుకోవటానికి,
కవయిత్రిని కాను కవితలల్లటానికి,
నాలో నేను, ఎవరికో ఏదో చేయాలని అనుక్షణం ఆలోచించే ఆతృతను.
వేకువ కోసం తూరుపు వైపు పరుగులుతీసే పద సంచారిని,
జాబిలి రాకకై ఘడియ ఘడియకు గగనంలోకి తొంగిచూసే కౌముదిని,
నీ, స్మృతి సెలయేటిలో ఎగసిపడే భావుకత తరంగాన్ని.
జ్ఞాపకాల పుటల్లో అక్షరాలు అల్లుకున్న సుమమాలికను,
నింగి నేల కలిసే చోట మానవత్వం ఉనికిని వెతికే నిరంతర అన్వేషిని,
కడలినుండి పాలచుక్కను చిలికించాలని ఆరాటపడే కెరటాన్ని.
తుమ్మచెట్టుకు గులాబీలు పూయించాలనుకునే ఆశా వాదిని,
నిప్పునుండి నిజాలను వెలికి తీయలనే వెర్రి తపనను,
ఆగిపోయిన శ్వాసకు తిరిగి ఊపిరి అందించాలనే అమాయకత్వాన్ని.
కష్టాలు కన్నీళ్లు కాలం క్రతువులో కరిగిపోవాలనే ఆశాజీవిని
కరువు కాటకాలు రూపు మాపాలని మురిసి పోయే ప్రకృతిని
బిడ్డల బంగారు భవితకు వెండిరేకుల రహదారి పరచాలని ఉవ్విళ్లూరే ఉద్రేకాన్ని.
ఇంతకీ నేనెవరినీ?
ఆశల పల్లకిలో ఊరేగే హరివిల్లుని,
అందరి హృదయాలను అమృతంతో తడపాలని ఆరాటపడే అవధులు లేని ఆనందాన్ని,
నాకు నేనే ఒక మధుమాసాన్ని, ప్రేమ పంచే అధరాలపై చిరు హాసాన్ని..
అద్భుతంగా వ్రాశారు చాలా భావుకత వుంది మంచి ఆలోచనకు వందనం