ఏకాంత మందిరాన్ని పూల పరిమళాల తో అలంకరించి
ఏటవాలు చూపులు మౌన ప్రపంచాన్ని వెతుకుతున్నాయి.
మూసేకళ్ళలో రాలిపడిన అనుభవ దృశ్యాలు తేలుతుంటాయి.
ఎక్కడ మొదలయిందో
ఎక్కడ ముక్కలయిందో
ఎక్కడ చక్కబడుతుందో
తెలీని ప్రవాహాలు ముంచుతుంటాయి.
వీచే గాలికీ తెలీదు ఏ ప్రపంచంలో ఈదుతున్నానో
చిన్ని చిరునవ్వు వెనుక దుఃఖ ప్రపంచాన్ని అదిమి పెట్టి
జీవితం రాగాలు వొలికించడమంటే
గాయాలకి వెన్నెల పూసి ఒక ప్రయాణానికి సన్నద్ధం కావటమే.
చూస్తుండగానే ఒక చందమామ ముద్దయినట్లు
చలికి వణికి పోయినట్లు అంత తెల్లదనం లోనూ
కొన్ని నల్లని చారికలు అల్లుకుపోయినట్లు
వెన్నెల చూడలేని కళ్ళకి వసంతాల వర్షాలు కనిపించవు
కాలధర్మంలో రాలే శిశిరాలు తప్ప.
బహుశా దుప్పట్లు కప్పివుంచిన నీ శీతల దృశ్యాలకి
సూర్యరశ్మి చుట్టూనే ఉండవచ్చు.
మూసిన రెప్పల వెనుక భావసంద్రాలు వేరుగా ఉండవచ్చు.
మనసు మందిరాన్ని మౌనంగా అలకరించి
ఆరాధనా దృశ్యాల్ని హారంగా ధరించవూ ..!
వెన్నెలలు అలా వాలుతూ
మరో ప్రపంచంలోకి తీసుకుని పోతాయి.