Menu Close
మోహన రూపం
-- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు --

తెల్లవారకమునుపే లేచి పొయ్యిపై గిన్నెతో పాలు కాస్తున్న గోపమ్మకు, అంతకు ముందు రోజు తమ గ్రామపెద్ద ఇంట్లో జరిగిన బారసాల కార్యక్రమం పదే పదే గుర్తుకొస్తోంది!

ఎప్పుడూ ఇంటి పనితోనూ, అత్తమామలకు అన్నీ సమకూర్చడంలోనూ, భర్తనూ, పిల్లలనూ చూసుకోవడంలోనూ క్షణం తీరిక లేకుండా ఉండే గోపమ్మను ఆమె అత్తగారు పిలిచి బయటకెడుతున్నామని చెప్పి తయారవ్వమని అడిగినప్పుడు గోపమ్మ ఆశ్చర్యపోయింది! చెరువుకెళ్ళి నీళ్ల కుండతో నీళ్లు తేవడం తప్ప గడపదాటి ఎరుగని తనను ఎటు తీసుకువెడతారో అని మౌనంగా భర్త వెనుక వెళ్లిన గోపమ్మకు గ్రామపెద్ద ఇంటికి చేరే దాకా అక్కడ సంబరాలు జరుగుతున్నాయన్న విషయం తెలియలేదు! గ్రామపెద్దకు లేక లేక కలిగిన సంతానం కావడంవల్ల ఆ పుట్టిన పసివాడి బారసాల ఊరంతా పెద్ద ఉత్సవంగా చేస్తున్నారు. బెరుకుగా భర్త వెనుక కూర్చున్న గోపమ్మకు పసివాడు కనపడగానే ఏదో తెలియని ఆనందం కలిగింది. వెంటనే వెళ్లి ఆ పసివాడిని ఎత్తుకుని ముద్దాడాలని గోపమ్మ మనసు తహతహలాడింది. కానీ అత్తమామలు ఏమంటారోనని బలవంతంగా తన కోరికను ఆపుకుంది. ఎప్పుడూ కస్సుబుస్సుమంటూ ఉండే గోపమ్మ అత్తగారు బాబు దగ్గరకు వెడుతూ తనను కూడా రమ్మంటే ఒక్క ఉదుటున అత్తగారి పక్కన చేరింది గోపమ్మ.

ముద్దులొలుకుతున్న పసివాడిని వచ్చినవారంతా ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటున్నారు. గోపమ్మ వంతు వచ్చింది! ఆనందంతో బాబును రెండు చేతుల్లోకి తీసుకుంది గోపమ్మ. బాబు కమలాలవంటి తన లేలేత చేతుల్తో గోపమ్మను స్పృశించాడు. ముగ్ధమనోహరమైన అతడి రూపం గోపమ్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బాబు చిట్టి చిట్టి పాదాలు గోపమ్మ హృదయాన్ని మెత్తని పువ్వులల్లే తాకాయి. గోపమ్మ మనసంతా పులకించిపోయింది. ఒక అద్భుత శక్తి గోపమ్మ శరీరమంతా పాకినట్లయ్యి గోపమ్మకు ఒళ్ళు గగుర్పొడిచింది! ఆ క్షణం, బాబు లేత పెదవులపై కనీకనపడని చిరునవ్వు విరిసింది. గోపమ్మ కళ్ళల్లోకి తదేకంగా చూశాడా పసివాడు! మెరుస్తున్న ఆ కళ్ళల్లో ఏదో మాయ గోపమ్మను బాబుపైనుండీ చూపు మరలనీయకుండా చేస్తోంది!! గోపమ్మకు రెప్ప వెయ్య బుద్ధి కాలేదు. అంతలో గోపమ్మ పక్కనున్న వారు బాబును గోపమ్మ చేతుల్లోంచి తీసుకున్నారు. గోపమ్మ దాదాపుగా తనని తాను మర్చిపోయింది!

అప్పటినుండీ గోపమ్మ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ పని చేస్తున్నా బాబు రూపమే గోపమ్మ కళ్ళ ముందు కదులుతోంది. ఆ అందమైన కళ్ళు, ఆ మధురమైన స్పర్శ, ఆ ముద్దొచ్చే రూపమూ, అన్నిటికీ మించి గోపమ్మ మదిలో చెరగని ముద్ర వేసిన ఆ పసివాడి చిరునవ్వు.. !

మరుసటిరోజు ఉదయం, పసివాడిని తలుచుకుని మురిసిపోతున్న గోపమ్మ, 'ఆహా! నీ మోహన రూపం! పరమాద్భుతం!!', అని అనుకుంటూ, ఆ దివ్యానుభూతిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, మైమరచిపోయి కళ్ళు మూసుకుంది. అంతలో గోపమ్మ కాస్తున్న పాలు కాస్తా పొంగి పొయ్యిలో పడిపోయాయి! గోపమ్మకు ఆ పాలను చూడగానే పాలు తాగుతున్న పసివాడు గుర్తుకు వచ్చాడు. నీళ్లు తేవడానికి చెరువుకు వెళ్లిన గోపమ్మకు ఆ చెరువులోని కమలాలను చూడగానే పసివాడి బుల్లి చేతులు గుర్తుకు వచ్చాయి! ఇంటికి వచ్చే దారిలో ఎవరి ఇంటి లోగిలిలో ఉయ్యాల చూసినా ఆ పసివాడే జ్ఞాపకం వస్తున్నాడు గోపమ్మకు. ఎలాగైనా ఆ పసివాడిని మళ్ళీ చూడాలన్న బలమైన కోరిక గోపమ్మకు పుట్టింది. ఆ పిల్లవాడి గురించి ఎవరు ఏ విషయం చెప్పినా పరవశించిపోతూ వినేది గోపమ్మ.

రోజులు గడిచిపోతున్నాయి. పసివాడిని కలిసే అవకాశం కోసం గోపమ్మ ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. ఓసారి ఆ పసివాడికి పాలన్నా, వెన్నన్నా, పెరుగన్నా ఇష్టమని ఇరుగు-పొరుగులు మాట్లాడుకుంటూ ఉండగా విన్న గోపమ్మ, ఒక కుండలో పాలు కాచి ఉంచి, ఒక కుండ నిండా పెరుగు తోడు పెట్టి, మరొక కుండనిండా వెన్న చిలికి మూత పెట్టింది. అవి ఆ పసివాడికి ఇవ్వాలన్న వంకతో గ్రామపెద్ద ఇంటికి వెడితే అప్పుడు ఆ బాబును మళ్ళీ ఎత్తుకుని ముద్దాడొచ్చని అనుకుంది గోపమ్మ. కానీ వచ్చిన ఇబ్బందల్లా గోపమ్మ స్వతంత్రంగా ఎవరింటికైనా వెళ్లి ఎరుగదు! భర్త దగ్గర తన కోరికను చెప్తే గ్రామపెద్ద చాలా గొప్పవారనీ, వారింటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లకూడదనీ చెప్పాడు. గోపమ్మకు ఏంచెయ్యాలో పాలుపోలేదు.

ఆ రాత్రి ఆరుబయట కూర్చుని ఆకాశంలో వెలిగిపోతున్న నిండు చంద్రబింబాన్ని చూస్తున్న గోపమ్మకు చంద్రుడిలో కూడా పసివాడి రూపమే కనపడటం ఆశ్చర్యాన్ని కలిగించి.

'ఆ చిట్టితండ్రిని మళ్ళీ చూడగలుగుతానో లేదో!', అని విచారిస్తున్న గోపమ్మకు కళ్ళ వెంట నీళ్లు జలజలా కారాయి.

భోజనాల తర్వాత అందరూ నిద్రపోయారు కానీ గోపమ్మకు మాత్రం ఎంతకూ నిద్ర పట్టలేదు. ఆ పసివాడిని ఎలా కలవాలా అని రకరకాల ఆలోచనలు చేస్తోంది గోపమ్మ మనసు. ఉన్నట్టుండి దేవుడి గదిలో ఏదో అలికిడి కావడం వినపడింది గోపమ్మకు. ఉలిక్కిపడిన గోపమ్మ, దేవుడి గది వద్దకు వెళ్ళింది. ఆ గదిని సమీపించే కొద్దీ వీనుల విందైన వేణుగానం గోపమ్మకు వినపడుతోంది. మధురమైన ఆ వేణుగానం వింటూ, అడుగులో అడుగు వేసుకుంటూ దేవుడి గదిలోకి ప్రవేశించింది గోపమ్మ.

చిత్రం!! అక్కడ పాల కుండా, వెన్న కుండా, పెరుగు కుండలు వరుసగా పేర్చి ఉన్నాయి. వాటన్నిటి మూతలు తీసి ఉన్నాయి! వాటిలోని పదార్ధాలు మాయం అయి ఉన్నాయి!!! కుండలవంక ఆశ్చర్యంగా చూస్తున్న గోపమ్మకు అక్కడున్న శ్రీమన్నారాయణుడి విగ్రహానికి అంటుకుని ఉన్న వెన్న కనపడింది! అప్పుడు తెలిసింది గోపమ్మకు అసలు విషయం! ఆ పసివాడు ఎవరోకాదనీ, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారంగా గోకులంలో వెలసిన శ్రీకృష్ణ పరమాత్మ అనీ!! వెంటనే తన రెండు చేతులనూ జోడించి నమస్కరిస్తూ ఆనంద పారవశ్యంతో స్వామి పాదాలపై పడిపోయింది గోపమ్మ!

**సమాప్తం**

Posted in January 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!