Menu Close
manusmrithi page title
మొదటి అధ్యాయము (ఎ)

బ్రాహ్మణ స్తుతి

‘మనుస్మృతి’ లోని మొదటి అధ్యాయంలోని 92 వ శ్లోకం నుండి 102 వ శ్లోకం వరకు స్మృతికారుడైన మనువు బ్రాహ్మణ స్తుతి చేశాడు. (మొదటి అధ్యాయంలోని ఈ 11 శ్లోకాలను వ్యాఖ్యాతలు ‘బ్రాహ్మణ స్తుతి’ అనే ఉపశీర్షిక కింద ఇచ్చారు.)

ఊర్థ్వం నాభేర్మేధ్యతరః పురుషః పరికీర్తితః |
తస్మాన్మేధ్యతమం త్వస్య ముఖముక్తం స్వయంభువా || (1- 92)

పురుషుని బొడ్డుకు పై భాగంలోని అవయవాలన్నీ బొడ్డుకు కింది భాగంలోని అవయవాలకంటే పరిశుద్ధమైనవనీ, అందునా తన ముఖము (నోరు) మరింత పరిశుద్ధమైనదని బ్రహ్మచే చెప్పబడినది.

ఉత్తమాంగమైనట్టి శిరస్సు నుండి ఉద్భవించిన కారణంగానూ, అందరిలోనూ మొదటగా ప్రభవించిన వాడగుటచేతను, వేదములను ధరించుటచేతను, బ్రాహ్మణులకే కాక క్షత్రియ, వైశ్యులకు కూడా అధ్యాపనం చేసే అధికారం కలిగివున్న కారణంగానూ వర్ణములన్నింటికీ బ్రాహ్మణుడు ప్రభువు. అట్టి బ్రాహ్మణుడిని హవ్యకవ్యములను ఒనరించే నిమిత్తం బ్రహ్మ తన ముఖము(నోరు) నుండి పుట్టించాడు. బ్రాహ్మణుని నోటినుంచే దేవతలు తమకు సమర్పించే హవ్యములను భుజిస్తారు. పితరులు తమకు పెట్టిన కవ్యములను భుజిస్తారు. (యజ్ఞాలలో దేవతలకు సమర్పించే ఆహారం హవ్యము. శ్రాద్ధ కర్మలలో పితృదేవతలకు సమర్పించే ఆహారం కవ్యము)

భూతానాం ప్రాణినః శ్రేష్ఠా : ప్రాణినాం బుద్ధిజీవినః |
బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠా నరేషు బ్రాహ్మణాః స్మృతాః || (1 - 96)

భూతములలో ప్రాణులు శ్రేష్ఠములు. ప్రాణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠమైనవి. బుద్ధిమంతులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు.

బ్రాహ్మణేషు చ విద్వాంసో విద్వత్సు కృతబుద్ధయః |
కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవేదినః || (1- 97)

బ్రాహ్మణులలోనూ శాస్త్ర మర్మాలు తెలిసిన విద్వాంసులు శ్రేష్ఠులు. వారిలోనూ శాస్త్రోక్తంగా అనుష్ఠానం చేయాలనే కోరిక కలిగినవారు శ్రేష్ఠులు. వారికంటే కర్మానుష్ఠానం చేసేవారు శ్రేష్ఠులు. అలా కర్మానుష్ఠానం చేసేవారికంటే బ్రహ్మవేత్తలు శ్రేష్ఠులు.

బ్రాహ్మణుడు పుట్టుకతోనే ధర్మమూర్తిగా పుట్టాడు. అతడు ధర్మాచరణం నిమిత్తమే జన్మించినవాడు. అలా ధర్మాచరణం చేయడం కారణంగా బ్రాహ్మణుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. పుడుతూనే ఒక బ్రాహ్మణుడు సర్వోత్తమునిగా పుట్టాడు. అతడు సృష్టిలోని సకల జీవులకూ ప్రభువు. ధర్మ కోశంలోని సకల ధర్మాలకూ అతడే సంరక్షకుడు.

భూమి మీద ఉన్న సర్వస్వం బ్రాహ్మణుడికే చెందుతుంది. బ్రాహ్మణుడు సర్వశ్రేష్ఠునిగా జన్మించిన కారణంగా ఇక్కడి ప్రతి ఒక్కదానిని పొందే హక్కు, అర్హత  బ్రాహ్మణుడికే ఉంటుంది. ఈ భూమిమీది సర్వస్వం బ్రాహ్మణునిదే. అతడు తన ద్రవ్యమునే అనుభవిస్తున్నాడు. తన వస్త్రమునే తాను ధరిస్తున్నాడు. తన ద్రవ్యమునే ఇతరులకు ఇస్తున్నాడు. అంటే ఈ ప్రపంచములోని సకల వస్తు సముదాయము బ్రాహ్మణునిదే అయిన కారణంగా అతడి దయాగుణం వల్లనే మిగిలినవారంతా ఇక్కడి సర్వస్వాన్నీ అనుభవిస్తున్నారు.

బ్రాహ్మణులకూ, ఇతరులకూ ధర్మసూక్ష్మాలు వివరిస్తూ, వారికి కర్మవివేకాన్ని బోధించే నిమిత్తం స్వాయంభువ మనువు ఈ ధర్మశాస్త్రాన్ని రచించాడు.

ఇప్పుడిక మొదటి అధ్యాయంలో మనువు చేసిన  బ్రాహ్మణ స్తుతిని సవిమర్శగా పరిశీలిద్దాం. అసలీ మనుస్మృతి ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి మనువు రూపొందించాడో మనం గతంలోనే వివరంగా చెప్పుకున్నాం. సమాజంలో అప్పటికే అగ్రవర్ణంగా ఉన్నట్టి బ్రాహ్మణులకు మిగిలిన మొత్తం సమాజంపై తిరుగులేని పెత్తనాన్ని కల్పించడం, బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య వర్ణాల వారికి గతంలో శూద్రవర్ణం పై ఉన్న ఆధిపత్యాన్ని మరింతగా పెంచడం - అనే రెండు ప్రధాన ఉద్దేశాలతోనే ఈ మను ధర్మశాస్త్రం రూపొందించబడింది. ఇక పనిలో పనిగా భారతీయ సమాజం అప్పటికే తనలో ఇముడ్చుకున్న పలువురు విజాతీయులకు ఎవరికి తగ్గ సామాజిక స్థాయిని వారికి కల్పించడం, నాలుగు వర్ణాల ప్రజల మధ్య జరిగిన విలోమ వివాహాల కారణంగా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చిన కులాలవారందరికీ వేర్వేరు కులవృత్తులను  కేటాయించడం, తద్వారా సమాజంలోని వివిధ వర్ణాల, వృత్తుల ప్రజల మధ్య ఒరిపిడిని వీలైన మేరకు తగ్గించడం వంటి తక్షణ లక్ష్యాలు ఎటుతిరిగీ ఉండనే ఉన్నాయి.

పరస్మై పురుషుని శరీరంలోని అన్ని అంగాలూ ముఖ్యమైనవేననీ, అతి ప్రధానమైన అంగాలైనట్టి పాదాలు మిగిలిన శరీరభాగాలకంటే ఎలా తక్కువ కాదో, అలాగే వాటి నుంచి ఉద్భవించిన శూద్రులు కూడా ఎవరికంటేనూ తక్కువకాదనీ, శూద్రుల శ్రమశక్తికి విలువ, గౌరవం ఉన్నాయంటూ కొందరు విద్వాంసులు ఇచ్చిన వివరణలు సత్యపరీక్షకు నిలిచేవి కావు. ఈ అధ్యాయంలోనే ‘బొడ్డుకు కింది భాగం కంటే, పై భాగం మిక్కిలి పరిశుద్ధమైనదనీ, అందునా ముఖము మరింత పరిశుద్ధమైనదనీ బ్రహ్మ చెప్పాడనీ, ఉత్తమాంగమైనట్టి శిరస్సు నుండి పుట్టినవాడూ, మిగిలిన అందరికంటే ముందుగా పుట్టినవాడూ, వేదములను ధరించినవాడూ, అందరికీ ధర్మోపదేశం చేయడానికి  హక్కున్నవాడూ అయినందున  బ్రాహ్మణుడు అన్ని వర్ణములకూ ప్రభువు’ అంటూ మనువు నిర్ద్వంద్వంగా స్పష్టం చేశాడు. దాంతో ఈ ధర్మ సూత్రాలను రూపొందించడంలో మనువు లక్ష్యం ఏమిటో, ఆయన ఎవరి పక్షం వహించాడో తేటతెల్లం అయింది.

విశ్వంలోని సకల జీవులకూ బ్రాహ్మణుడు ప్రభువనీ, నరులందరిలో బ్రాహ్మణులే శ్రేష్ఠులనీ, పుడుతూనే బ్రాహ్మణుడు సర్వోత్తమునిగా పుట్టాడనీ, అతడు ధర్మరక్షణ కోసమే జన్మించాడనీ, ఈ భూమిమీద ఉన్న సర్వస్వం హక్కుగా బ్రాహ్మణుడికే చెందుతాయనీ, ఈ సంపదలన్నీ బ్రాహ్మణుడివేననీ, అతడి దయ కారణంగానే ఇతరులు వాటన్నింటినీ అనుభవిస్తున్నారనీ చెప్పడం చూస్తే మరీ మనువు బ్రాహ్మణ స్తుతి ఏ స్థాయిలో చేశాడో, ఆయన బ్రాహ్మణ పక్షపాతం ఏ స్థాయిలో ఉందో గ్రహించగలం.

మనువు బ్రాహ్మణుడిని ప్రభువు అంటూ కీర్తించినా, ఇంకా ఆ తరువాత కాలంలో బ్రాహ్మణులు భూసురులు, పుడమి వేలుపులు, ధరా నిలింపులు అంటూ భూమిపై నడయాడే దేవతలుగా కీర్తించబడినా, బ్రాహ్మణుడు స్వీయ రక్షణ చేసుకోలేని ప్రభువు. తనకంటూ రాజ్యంలేని ప్రభువు. బ్రాహ్మణులు తమ రక్షణ కోసం తప్పనిసరిగా క్షత్రియుల మీద ఆధారపడవలసిందే. క్షత్రియులు ‘గో బ్రాహ్మణ రక్షణ’ తమ పరమధర్మంగా భావించారు. ‘ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం’ అంటూ అక్కడక్కడా బ్రాహ్మణులు కూడా క్షాత్ర విద్యలలో ఆరితేరి, రాజ్యాలేలిన వారూ ఉన్నారు. చరిత్రలో నేటి పాకిస్థాన్ లోని సింధు రాజ్యాన్ని క్రీ.శ. ఎనిమిదో శతాబ్దిలో బ్రాహ్మణాబాద్ రాజధానిగా పాలించిన హిందూషాహి పాలకుడు దహిర్ ఇందుకో ఉదాహరణ. ఇతడు క్రీ.శ. 712 లో సింధు రాజ్యంపై మహమ్మద్-బిన్-ఖాసిం నాయకత్వంలో అరబ్బులు జరిపిన దాడిలో ఓడి, మరణించాడు.

ఒకపక్క ఈ భూమిమీద ఉన్న సకల సంపదలూ బ్రాహ్మణులకే చెందుతాయి అని చెపుతూనే మనువు మరోపక్క కలియుగంలో దానమే ఉత్తమోత్తమమైన ధర్మమనీ, దానాన్ని స్వీకరించడం (ప్రతిగ్రహం) బ్రాహ్మణుడి జన్మహక్కనీ చెప్పడం కొంత చిత్రంగా అనిపిస్తుంది. బ్రాహ్మణుడు కోరినట్లయితే అందరూ ఏదైనా సరే అతడికి సమర్పించుకోవలసిందే. ఒక బ్రాహ్మణుడు పెండ్లాడగోరితే మిగిలిన మూడు వర్ణాలవారు తమ కన్యలను సైతం అతడికి దానం ఇవ్వాల్సిందే. అనులోమ వివాహం (పై వర్ణం పురుషుడు కింది వర్ణం స్త్రీని పెళ్ళాడటం) ధర్మసమ్మతమేననీ, ఒక బ్రాహ్మణుడు వరుసగా  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహమాడిన కారణంగా పుట్టినవారే వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి అనీ నేను లోగడే పేర్కొన్నాను. నాలుగు వర్ణాలవారిలో మనువు  బ్రాహ్మణుడికి విశేషమైన హక్కులు, అధికారాలు కల్పించాడు. నాలుగు వర్ణాల స్త్రీలలో ఎవరి వివాహం జరిగినా వధువుకు ‘ప్రథమ శోభనం’ ఒక బ్రాహ్మణుడితోనే జరగాలనే ఒక అనాగరికమైన ఆచారం కూడా ఒకప్పుడు ఉండేదని పలువురు చరిత్రకారులు తమ పరిశోధనలలో తేల్చారు. బ్రాహ్మణుడి తరువాత వరుసగా నృపతి (రాజు), కులపతి (ఆమె కులం లేక తెగ కు అధిపతి) ఆమెతో సంగమించిన తరువాతనే ఆ వధువును తన భర్తతో కలవనిచ్చేవారట (బ్రాహ్మణో నృపతీ కులపతీ పతీ). సామాజిక పరిణామం జరిగేకొద్దీ జుగుప్సాకరమైన ఈ అనాచారం క్రమంగా వెనుకపట్టు పట్టి, గత కాలపు ఈ దుష్ట సంప్రదాయానికి చిహ్నంగా వివాహాలలో ‘తోడు పెళ్ళికొడుకు’ గా కులపతికి బదులు వరునికి వరుసకు తమ్ముడయ్యే ఒక చిన్న కుర్రాడిని కూర్చోబెట్టడం ఆనవాయితీగా మారిందనీ, ఆ పసి బాలుడైతే వివాహానంతరం తనకు వధువుతో శోభనం జరిపించమని అడిగే అవకాశం ఉండదు కనుక పూర్వపు అనాచారం స్థానంలో ఈ అలవాటు వచ్చి వుంటుందనీ పరిశోధకులు తేల్చారు. తోడు పెళ్ళికొడుకునే తమిళులు ‘తోళి మాప్పిళ్లై’ అంటారు. పాశ్చాత్య సమాజాల్లోనూ ఈ తోడు పెళ్ళికొడుకు ఆచారం ఇటీవలికాలం వరకూ ఉండేది. పాశ్చాత్య వివాహాలలో  సామాజిక ప్రతినిధి అయినట్టి ‘బెస్ట్ మాన్’ ( Best Man) అనే వాడు పెళ్లి కూతురును పెళ్లికొడుకుకి అప్పగిస్తాడు. మన తోడు పెళ్ళికొడుకు వంటి వాడే ఈ బెస్ట్ మాన్. (‘The History of Human Marriage’ written by Finnish Philosopher Edvard Westermarck in 1891 and published by Macmillan and Co.). ఇక ఆధిపత్య ధోరణితో కూడుకున్న ఇలాంటి అనాచారాలను పక్కనబెట్టి అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుల ఆవిర్భావం ఎలా జరిగింది? అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలోనే మనువు బ్రాహ్మణ స్తుతి చేసినందున ఈ విషయాలను కూడా ఇక్కడే ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది.

పరమేష్ఠి అంటే బ్రహ్మ. బ్రాహ్మణులు బ్రహ్మ వంశీకులని ప్రతీతి. తెనాలి రామకృష్ణకవి రాసిన ‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యంలోని మూడవ ఆశ్వాసంలో నిగమశర్మ అక్క, విషయలోలుడై చెడు నడతకు అలవాటుపడిన తన తమ్ముడిని మందలింపుగా ఇలా అంటుంది - “పరమేష్ఠి (బ్రహ్మ) మొదలు నీ తరం వరకు విశుద్ధమైన గొప్ప వంశం మనది. ఆలోచించావా?”. అదే కవి తన మరో కావ్యం ‘ఉద్భటారాధ్య చరిత్రము’ లో రెండవ ఆశ్వాసంలోని 112 వ పద్యంలో మదాలసుడి తండ్రియైన ధీనిధి అనే బ్రాహ్మణుడి గురించి చెపుతూ అతడు ‘తమ్ముల చుట్టంబగు వేల్పు వంగడమున బుట్టెన్’ అంటాడు. (తమ్ములు అంటే తామరలు. తామరల బంధువైన దేవుడు అంటే తమ్మిచూలి అంటే తామర పువ్వు నుంచి పుట్టిన బ్రహ్మ. అలాంటి బ్రహ్మ వంగడము అంటే వంశంలో జన్మించాడట ధీనిధి అనే బ్రాహ్మణుడు.) విష్ణువు యొక్క బొడ్డు నుండి ఉద్భవించిన తెలి తామర నుంచి బ్రహ్మ ప్రభవించాడని ప్రాచీనుల విశ్వాసం. పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మ విష్ణువు యొక్క నాభిలోని కమలం నుండి ఉద్భవించాడు. ఆయన వంశీకులు బ్రాహ్మణులు. ఋగ్వేదం లోని పదవమండలంలోని పురుషసూక్తంలోనూ, మనుస్మృతిలోనూ చెప్పబడిన దాని ప్రకారం బ్రాహ్మణులు విరాట్ పురుషుని ముఖం నుంచి ఉద్భవించారు. ఆ విరాట్ పురుషుడు విష్ణువేననే భావనతో శూద్రులను తెనాలి రామకృష్ణుడు విష్ణు పాదోద్భవులు అన్నాడు. ఒకప్పుడు గంగ బ్రహ్మ కమండలంలో ఉండేదట. వామనావతారంలో విష్ణువు తన పాదాన్ని బ్రహ్మ నివాసమైన సత్యలోకం వరకు చాచాడట. అప్పుడు తన తండ్రి పాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని గంగతో ప్రక్షాళన చేశాడట. బ్రహ్మ కడిగిన ఆ పాదం నుంచి గంగా జలం లోకాలనన్నింటినీ ముంచెత్తుతూ పరవళ్ళు తొక్కిందట. విశ్వమంతటినీ అల్లకల్లోలం చేస్తున్న ఆ ఆకాశగంగను ఆ తరువాత శివుడు తన జటాజూటంలో బంధించాడట. అలా గంగ విష్ణువు పాదోద్భవి అయింది. తెనాలి రామకృష్ణుడు అందుకే శూద్రులను ‘విష్ణువు పాదోద్భవియైన గంగకు తోడబుట్టినవారు అన్నాడు. (పాం. మా. 1- 112). అలా గంగ, శూద్రులు ఇరువురూ విష్ణువు పాదం నుంచి పుట్టినవారనే భావన భారతీయులు అందరిలోనూ ఉంది. అందుకే ఆ కవి శూద్రులను ‘అభ్రగంగకు తోడంబుట్టువు’ లనీ, ‘పాలమున్నీటికి మరందు’ లనీ తన మరో కావ్యం ‘ఉద్భటారాధ్య చరిత్రము’ (1- 157) లో ప్రస్తావించాడు. నదులన్నింటికీ సముద్రుడు భర్త అనే విశ్వాసం ప్రకారం గంగకు తోడబుట్టిన శూద్రులు పాల సముద్రానికి మరుదులే అవుతారని కవి భావం. పురాణాల విశ్వాసం ప్రకారం విష్ణువు బొడ్డులోని తెల్ల తామర పువ్వునుంచి జన్మించిన బ్రహ్మ యొక్క వంశీకులు బ్రాహ్మణులు. ఋగ్వేదంలోని పురుష సూక్తం ప్రకారం బ్రాహ్మణులు విరాట్ పురుషుడైన విష్ణువు నోటి నుంచి వెలువడ్డారు. మనుస్మృతి లోని (1 - 31) శ్లోకం ప్రకారం కూడా బ్రహ్మ తన నోటి నుంచి బ్రాహ్మణులను సృష్టించాడు. ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన విషయం ఒకటుంది. బ్రాహ్మణులు విష్ణువు నాభి లోని కమలం నుంచి పుట్టినట్టి  బ్రహ్మ వంశంలో జన్మించిన బ్రహ్మ వారసులా? లేక వారు విరాట్ పురుషుడి నోటి నుంచి వెలువడినవారా? శాస్త్రీయంగా చూస్తే మానవులు నోటి నుంచి, బాహువుల నుంచి, తొడల నుంచి, పాదాలనుంచి పుట్టడం ఉండదు. ఈ నాలుగు వర్ణాలవారు మానవులే కనుక వారు అందరు మానవుల వలె జననాంగాల నుంచే పుడతారు. పుట్టుక రీత్యానే కొందరు అధికులు, ఇంకొందరు అధములు అని సిద్దాంతీకరించడానికి మనువు ఇలా ఉత్తమాంగమైనట్టి శిరస్సులోని నోటినుంచి బ్రాహ్మణులు పుట్టారనే అశాస్త్రీయ సిద్ధాంతాన్ని ఆశ్రయించాడు. ఉత్తమాంగం నుంచి పుట్టినా ఏ అంగం నుంచి పుట్టినా బ్రహ్మకు పుట్టిన వారంతా బ్రాహ్మణులే అవుతారు కదా? కేవలం నోటినుంచి పుట్టినవారే బ్రాహ్మణులు అంటే ఎలా? ఆయన పరబ్రహ్మో, విరాట్ పురుషుడో, విష్ణువో ,చతుర్ముఖ బ్రహ్మో, లేక వేరోకరో- ఎవరయినా సరే ఆయన శరీరంలోని వివిధ అంగాల నుంచి నాలుగు వర్ణాలవారూ పుట్టుకొచ్చారని చెప్పినప్పుడు పుట్టిన వారంతా ఆయనకు వారసులే అవుతారుగానీ, కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆయన వారసులు, ఆయన వంశీకులు అంటే ఎలా కుదురుతుంది?

వాస్తవానికి ఈ నాలుగు వర్ణాలుగా విభజించబడిన మానవులంతా అందరు మానవులలాగే జననాంగాల నుంచి పుట్టుకొచ్చిన వారే గానీ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వివిధ శరీరాంగాలనుంచి పుట్టినవారు వీరిలో ఎవరూ లేరు. కేవలం వారిని వర్గీకరించి, కొందరిని అధికులుగానూ, కొందరిని అధములుగానూ చిత్రించే ఉద్దేశంతోనే ఇలా ప్రకృతి విరుద్ధంగా వారంతా వివిధ శరీరాంగాల నుంచి పుట్టడం జరిగిందనే సిద్ధాంతాన్ని సృష్టించారు.

‘బ్రాహ్మణ’ అనే పదానికి ‘పరబ్రహ్మయందు నిష్ఠ కలిగి, సాధనతో బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందిన వాడు’ అనే నిర్వచనమే సమంజసమైనది. పుట్టుకతో అందరూ శూద్రులేననీ, వేదవిహితమైన కర్మలు చేయడానికి యజ్ఞోపవీతం ధరించినవారు ద్విజులు (రెండు జన్మలవారు) అవుతున్నారనీ, వేదపాఠాలు వల్లెవేసేవారు కూడా విప్రులు (విజ్ఞులు, తెలివైనవారు) అని మాత్రమే అనబడతారనీ, కేవలం బ్రహ్మజ్ఞానులు మాత్రమే బ్రాహ్మణులు అనబడతారనీ తెలిపే సంస్కృత మహాభారతం భీష్మపర్వంలోని ఈ క్రింది శ్లోకం పరిశీలనార్హం.

‘జన్మనా జాయతే శూద్రః
కర్మాణా జాయతే ద్విజః
వేదపాఠం తు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానం తు బ్రాహ్మణః ||’

ఒకప్పుడు జన్మ బ్రాహ్మణ్యం అనేదే లేదు. వారు ఆచరించే కర్మలు, వారి జ్ఞానం కారణంగానే ఎవరైనా బ్రాహ్మణులు అనబడ్డారు. అప్పట్లో దైవశాస్త్రం (Theology), తత్త్వశాస్త్రం (Philosophy) వంటి శాస్త్రాలలో నిష్ణాతులైన వారిని, వారు జాతి (పుట్టుక) రీత్యా ఎవరైనా సరే, బ్రహ్మజ్ఞులు, దైవజ్ఞులు, తత్త్వవేత్తలు లేక బ్రాహ్మణులు అనేవారు. అలా బ్రాహ్మణ్యం అనేది దైవజ్ఞానం, వేదవిద్యలతో ముడిపడిన ఒక వృత్తి మాత్రమే. అది జాతీ కాదు. కులమూ కాదు. ఆ వృత్తిని అనుసరిస్తూ తాత్త్విక విషయాలలో పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా బ్రాహ్మణులే. బ్రాహ్మణ్యం జన్మ ద్వారా సంక్రమిస్తుందనీ, తాము పుట్టుకతో చతుర్ముఖ బ్రహ్మ లేక విష్ణువు వంశీకులమనీ, తామేదో పుడుతూనే మెడలలో జందెములతో పుట్టామన్నట్లు ఎవరైనా విర్రవీగుతుంటే వారినలా వారి ఊహాస్వర్గాలలో విహరించనిద్దాం. వేదయుగంలో ఏ వర్ణంలో జన్మించినవారైనా చేసే ఒక వృత్తిగా ఉన్న బ్రాహ్మణ్యం, మనుస్మృతి రచనాకాలం నాటికి  సమాజంలో వర్ణ వ్యవస్థ ఘనీభవించిన కారణంగా అనంతరకాలంలో వారసత్వంగా పుట్టుకతో సంక్రమించే ఒక కులంగా మార్చివేయబడింది.

***సశేషం***

Posted in March 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!