ఇది నా జగత్తు
గుండెలనిండా జనం నిండిన ఉషస్సు
మనిషి కోసం నే చేసిన తపస్సు
ఓ మనిషీ
ఏ గగనాంతరాన వెతకను నీ ఉనికికోసం
అక్కడందరూ రాకాసులే
నిజమైన మనిషిని హత్యలు చేస్తున్నారు
ఏ పుడమితల్లి పొట్ట చీల్చి చూడను నీ నిజరూపం కోసం
అక్కడన్నీ పాతాళ నాగులే
పదితలలెత్తి బుసలుకొడుతున్నాయి
ఏ చరిత్ర లో చూడను నీ వీరపరాక్రమం
కురూపుల ఖడ్గధాటికి నువ్వుచచ్చి
నీ పాత సమాధుల పై పచ్చని చెట్లు పెరిగాయి
ఏ వేదాలచాటున చదవను
నీ జీవననాదం
నువ్వుచేసిన దేవుడి వర్ణనలేగాని నీ ఊసేలేదక్కడ
ఏ నవనాగరికతల నైమిశ హర్మ్యాల పైన పరికించను
నీ వివేకచాతుర్యం
కూలిన ఆశల గోడల్లో నీ మంచి రక్తం గడ్డకట్టి చెడ్డ వాసనలొస్తుంది
ఓ మనిషీ
ఎన్ని రాత్రులు నాయింటి గుమ్మం దగ్గర కూర్చొని నీకోసం ఎదురుచూసాను?
ఎన్ని సార్లు మంచి భోజనం వండి
నువ్వొస్తావనీ మురిసి అలసిపోయాను?
ఎన్ని నిర్జీవ క్షణాలు
కళ్ళలో ఆశల దీపాలు వెలిగించి
నా చేతులతోనే ఆర్పేశాను?
ఎన్ని రోజులు
ఏ అదృష్టవీధుల్లో నువ్వొస్తావో తెలియక
అన్నిదారులు కలియతిరిగాను
నీ జ్ఞాపకాలతో బ్రతుకుదామంటే
అవికూడా నీదగ్గరే దాచుకుని వెళ్ళావు
నీ సుమధుర భాషితాలు విని తరిద్దామంటే
నీవొస్తావన్న మాటతప్ప వేరే మాట నా చెవిన పడట్లేదు
నీకై ఎదురుచూపులతో గడిపేద్దామంటే
నువ్వు నాపక్కన లేకుండా కాలం కూడా కదలట్లేదు
నీవొదిలిన స్వేచ్ఛా నిశ్వాసలతో ఊపిరి పోసుకుందామంటే నేనప్పటికే చచ్చి శవమయ్యాను
ఎక్కడున్నావు నువ్వు ?
మార్చిరాసిన మహాగ్రందాల్లో
ఇరుక్కుపోయావా ?
వెంటనే విడిపిస్తాను
ప్రారబ్దం తో
ఏ అసురుడి చెంతనైనా చేరావా ?
ఇప్పుడే యుద్ధం చేసి గెలిపిస్తాను
గ్రహచారం తో
భవసాగరబందనాల్లో
కాంతాసమేతంగా చిక్కుకున్నావా ?
మనోసాగరమధనం గావించి చేతనుణ్ణి చేస్తాను
ఓ మనిషీ
నీకోసం నా అక్షరాలు
భువనైకకన్యాస్వాగతమాలికలై
ఎదురు చూస్తున్నాయి
నా కవితా గానం సప్తలోకాలనేకంచేసే
ఓంకారనాధ ప్రబోధ స్వాగత సంగీతమైంది
నా సారస్వత పూసారమంతా
అత్తరు పరిమళమై సిద్ధం గా ఉంది
నా పుస్తకాలన్నీ
నీ పాదమహావేద నీడలో
ఒదిగిపోవుటకై
మంగళతివాచీలయినాయి
గుండె గుండెనీ కదిపి కలిపే
నా ఆవేశమంతా నీకిచ్చి
నేనో మూల విశ్రమిస్తా
చచ్చినమనిషి కలల్ని, వ్యధల్ని
బ్రతికించే నా కవితామృతాన్ని
నీ గొంతులో నింపుతా
ఉరికొయ్యలముందు
చిరునవ్వుతో నిలబడ్డ
నా బిడ్డల త్యాగ పౌరుషాలన్నీ
నీకిచ్చి నే వెళతా
నా మహాక్షర పరిప్లవ మహాసామ్రాజ్యానికి నిన్ను
రారాజుని చేసి నేనిప్పుడే మరణిస్తా