కథ లాంటి కవిత (కాలచక్రం)

సూర్యరశ్మిన గులాబీ కిలకిల నవ్వింది
రేకుపై మంచు చుక్క విలవిల లాడింది.
మంచు చుక్క:
గట్టిగా నవ్వకక్క గంతులేయవద్దు
కూసంత కదిలితే క్రిందికి జారేను
తోడు దొరికావని జోడు కలిపాను
నేలపాలు చేసి నేస్తమిడవద్దు
గులాబి:
ఏమిటోయమ్మ! నీ ఎలమంచి కేకలు
ఆక్రమించి నా అరవిచ్చిన రేకులు
తగుదునమ్మాయని తెల్లార విచ్చేసి
మృదువగు నా రేకులు మంచున ముంచేసి
మంచు చుక్క:
ఏమి చేయుదునక్కా! ఏటిలో దూకుదునా!
కష్టముల నీవాదుకొనక నింగిపై కెగరుదునా!
ఆయుష్షుండబట్టి నీపై నిలిచాను
ఆపద్భాందువుని పదిసార్లు తలిచాను
అటు చూడు! అటు చూడు! ఆ భాస్కరుని
చెప్పు! ఆతనికి ఏమని విన్నవింతునని?
కసిగ నాప్రాణములు లాగు ఇదియే అదనని
నీమూల నక్కిన నా అల్ప ప్రాణమని ….!
లేవు! అతనికి దయాదాక్షిణ్యములు
కలుగు అతనిచూడ భయాభ్రాంతులు
కరుకు కాఠిన్యము అతని కలిమిగ యెంచి
కసిగ అతని కిరణమ్ములు నను వెంట గొనిపోవు.
ఆమె మాటలకి ఆలవోకగనవ్వి
అదిరీ అదరనట్ట్లు నడుము ఊపి
ఆవలించి గులాబీ చిటిక వేయ
ఆ అదురుకు బెదిరి మంచు చుక్క జారె!
జీవితము ముగిసెనని మనసున వ్యధచెంది
జారిపోవు గుండెను, చేతితో అదిమిపెట్టి
జాలిగ చూచిన గులాబీని కసిగ తిట్టి
తాను బండను కరుచు బాణి చూడక
కండ్లు గట్టిగ మూసె మంచుచుక్క.
జరిగినదంత మెలకువుగ గమనించిన
మంచుచుక్కను ప్రేయసివలె ఊహించిన
గులాబీ మొక్క క్రింద శయనించిన గడ్డిపోచ
చాచి తన రెండు చేతులు ఇచ్చెను ఊత.
జరిగినది ఊహించి మంచుచుక్క జవజవ లాడె
గడ్డి పోచ ఒండ్లు తడిమి కువకువ లాడె
గట్టిగ మంచుచుక్కను కౌగిలిలో బంధించి
డాబుగ ఎర్ర గులాబి వంక జూసి నవ్వె!
అంత భానుండు నడి నెత్తి మీదకి వచ్చె
అన్ని హస్తములు నలుమూలల విసిరె
ఒక హస్తపు వేడితో వడిగ వీచిన గాలితో
ప్రేమ బాసల తూగిన మంచుచుక్క
మాట ఒక్కటి లేక మాయమైపోయె!
అందాల తనువు ఆవిరై పోయె
ఆకసమ్మునజేరి మబ్బుల్ల దాగె
గడ్డిపోచ గట్టిగ గుండెలు బాదుకునె
చక్కని చుక్క చేజారినదనుకునె.
ఆగ్రహమ్మున ఆకసవీధిని జూసి
ప్రజ్వరిల్లుతున్న ప్రభాకరుని జూసి
ఏమయ్యా! ఎంత పాపమునకు ఒడిగట్టితివి?
ఎవ్వరు లేనట్లు నా ప్రేయసిని చేపట్టితివి!
అంతయు గులాబీ గల గల నవ్వె
తలవంచి ఆతని వీపును మెల్లగ దట్టె
ప్రేమగ ఆతని శిరసును నిమిరి
కంటినీరు తుడిచి మరి ఇట్లు పలికె!
తెలియదు కామోసు నీకుయు సృష్టి రహస్యం
ఎవరైన విన్నను పట్టింతురు హాస్యం
ఈ జగతి అంతయూ చిత్రవిచిత్రమయం
ఎరుగని వారికి అంతయు అగమ్యగోచరం.
దివారాత్రులు తెలియకనే ఎట్లు గడుచునో
దినముకు ఇరువది నాలుగు గంటలుండునో
సాలుకు ఆరు ఋతువులు ఎట్లగునో
చావుబ్రతుకులు కూడ అంతెయు కదయ్యా!
తెల్లారగనే వచ్చు ఆ మంచుచుక్క
అమిత చందాల మెరిసేటి అందాల చుక్క
భానుని కిరణములు సోకినంతయు చాలు
తనువు చాలించి మొయిలుపై వ్రాలు.
అంతటితో ఆగెనా దాని జీవనమ్ము
మరు ప్రొద్దుయే చేయు భువిని పావనమ్ము
క్రొత్త కోక ధరియించి నీపై లేక నాపై వ్రాలు
నడిప్రొద్దు వరకు ఎచటనో మోపు కాలు.
ఆమెకు మనసులేదు మరణము లేదు
నీవు ఒక్కడివే ఆలంబన కాదు.
పొద్దువేళ పుట్టి ప్రొద్దుగుంకువేళ గిట్టును
దినముకొక జన్మయెత్తి పుడమిన వెలయును.
ఇంతియే కదా! మానవులైనను
వారి జన్మ ఎన్ని విద్యలు నేర్చినను
ఇహమున తనువు చాలించి ఈశ్వరుని వద్దకు పోయినను
ఇంతి వలెనో కుంతి వలెనో ఇంకొక జన్మనెత్తును
చేయబోవు కార్యములు చేయబూనినంతనే
గుటిక్కున గుటక మ్రింగి నింగికి నిచ్చెననెత్తు..
మంచుముక్క ఒకటియా! మానవుడు ఒకటియా!
అందరికై పరచి ఉన్నది ఒకే ఒక బాట !
అంతమొందని సృష్టి బండి చక్రపు బాట