"సింహావలోకనం" అంటే "సింహం వెనక్కి తిరిగి చూసుకోవడం" అని అర్థం. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ తాను నడిచి వచ్చిన మార్గాన్ని, గతాన్ని, చేసిన పనులను సమీక్షించుకోవడాన్ని సూచిస్తుంది. దీని ద్వారా చేసిన తప్పులను తెలుసుకోవడం, విజయాలను విశ్లేషించడం, భవిష్యత్తును మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. మనం ఏటూ డిసెంబర్ నెలలో ఉన్నాము కాబట్టి, 2025లో భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో, అటు అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ముఖ్య సంఘటనల సమీక్ష కు ఇదే సమయం అని నాకు అనిపించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా చర్చలోకి వెళ్దాం.
2025 సంవత్సరం భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో అనేక కీలక పరిణామాలను తెచ్చింది. ఈ రచ్చబండ సమీక్షలో ఈ సంవత్సరానికి సంబంధించిన ముఖ్య సంఘటనలను సమగ్రంగా పరిశీలిద్దాం. ముందుగా భారతదేశ స్థాయిలో రెండు మూడు ముఖ్య సంఘటనలు నెమరు వేసుకుందాము.
కాడి పారేసిన ధన్‌ఖడ్:
ఈ మధ్య ధన్‌ఖడ్ స్థానంలో కొత్త ఉపరాష్ట్రపతి ఆ పదవిని అలంకరించారు. విషయంలోకి వెళితే- 2022 ఆగస్టు 11న జగదీప్ ధన్‌ఖడ్ మహానుభావుడు భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన దగ్గర నుండి పలు వివాదాలకు కేంద్రబిందువయ్యారు. తాజా వివాదం మూలాలకు వెళితే, గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఢిల్లీ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు, బయట ఉన్న ఓ గదిలో కాలిపోయిన నోట్ల కట్టల సంచులు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ ను ఇంటికి సాగనంపే ఒక తీర్మానాన్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రతిపక్షాల సంతకాలు కూడా తీసుకుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కూడా కోరింది. అయితే ఇదే విషయమై అదను చూసి ప్రతిపక్ష ఎంపీలు తీసుకొచ్చిన తీర్మానాన్ని రాజ్యసభలో సభాధ్యక్షుడి హోదాలో ధన్‌ఖడ్ ఆమోదించారు. దీనితో ఆగ్రహం చెందిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అనారోగ్యం పేరుతో రాత్రికి రాత్రే పదవి నుండి తొలగించింది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంఘటన రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్‌ఖడ్ స్వతంత్రత, రాజకీయ ఒత్తిళ్లపై కొత్త చర్చకు దారితీసింది. ఉదాహరణకు హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది, అది అనివార్యం కూడా, అయితే హడావుడిగా తగిన పద్దతులు పాటించకుండా న్యాయమూర్తుల నియామకం చేపడితే అది వికటించే ప్రమాదం ఉంది. మరి సదరు న్యాయమూర్తులు గాడి తప్పినప్పుడు - తొలగింపు ప్రక్రియ కూడా సుదీర్ఘం ఉండడం దిగ్బ్రాంతి కలిగించే విషయం. ఆధునిక యుగంలో ఉన్న ప్రజలకు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. లోక్‌సభను, రాజ్యసభలను సమావేశపరిచి సాధారణ మెజారిటీ ఓటింగ్‌తో తప్పు చేసిన సదరు న్యాయమూర్తులను తక్షణం ఇంటికి సాగనంపాలి. ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో కూడిన సొమ్ము ఒక్క రూపాయిని కూడా ఇటువంటి న్యాయమూర్తులను పోషించడానికి, ఖర్చు చేయడానికి ఆధునిక సమాజం అంగీకరించదు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంకా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు, కావున ఇంకా ఆయనకు ప్రభుత్వం నుండి పూర్తి జీతం మరియు అలవెన్సులు అందుతున్నాయి. ఆయన ఇటీవల ఢిల్లీ హైకోర్టు నుండి తన మాతృ హైకోర్టు అయిన అలహాబాద్‌కు బదిలీ అయ్యారు. అక్కడ ఆయనకు ఇంకా ఏ కేసులూ కేటాయించలేదు, కానీ ఆయన తన కార్యాలయంలో ఉంటూనే ఏమి పనిచేయకుండా గోళ్లు గిల్లుకుంటూ సుఖంగా పూర్తి జీతం, మరియు అలవెన్సులు పొందుతున్నారు. కానీ ఈ విషయంలో ప్రస్తుత నిబంధనలు బ్రిటిష్ కాలం నాటివిగా అనిపిస్తున్నాయి, కదా! తప్పు చేసిన వారిని తక్షణమే పదవి నుండి తొలగించడానికి వీలు కల్పిస్తూ, వారికి అప్పీలు చేసుకునే అవకాశం కల్పించే విధంగా, ప్రస్తుత నిబంధనలలో మార్పులు తీసుకురావడం సమంజసం.
ఈ వివాదంలో వేలు పెట్టిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మహాశయుడు ఒక్క వేలు మాత్రమే కాదు మొత్తం శరీరాన్ని కాల్చుకొని, పదవికి రాజీనామా చేసి కాడి పారేసి వెళ్ళిపోయిన పిదప 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేసారు. దీనితో సెప్టెంబర్ 12, 2025 న జరిగిన ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం దక్షిణ భారతానికి చెందిన నాయకత్వాన్ని మరింతగా ప్రాధాన్యం ఇచ్చినట్లు అయింది. ధన్‌ఖడ్ వ్యవహారం పరిశీలించిన వారికి - దారినపోయే తద్దినాన్ని పిలిచి నెత్తి కెక్కించుకున్నట్లు సామెత గుర్తుకు వస్తుంది, 2019 నుండి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న ఆయన్ను తరువాత ఢిల్లీకి పిలిచి ఉపరాష్ట్రపతి పదవిని అప్పగించారు. అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చిన పరిణామం ఇది. అందుకే అంటారు దిగితేనే గాని లోతు తెలియదు అని. ఏది ఏమైనప్పటికీ ఎవరూ ఊహించని విధంగా సీపీ రాధాకృష్ణన్ పంట పండింది, ఆయన 15వ ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ స్థానంలో ఎన్నికయారు.
సీన్ కట్ చేస్తే - జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విషయలో కూడా కేంద్రం ఈ విధంగా దెబ్బలు తింది. సత్యపాల్ మాలిక్ 2018 ఆగస్టు నుండి 2019 అక్టోబరు వరకు జమ్మూ కశ్మీర్ చివరి గవర్నర్‌గా పనిచేశారు. ఆయన గవర్నర్‌గా ఉన్న ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించింది. ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తే.. ఆర్టికల్ 35-ఎ అక్కడి ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తోంది. ఆయన తన రాజకీయ జీవితాన్ని మీరట్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ప్రారంభించారు మరియు లోక్‌దళ్, కాంగ్రెస్, బీజేపీ వంటి వివిధ పార్టీలలో పనిచేశారు. ఇలా వివిధ పార్టీలలో పని చేసిన వారిని గవర్నర్‌గా చేయవచ్చునా? గవర్నర్ పదవి తర్వాత, ఆయన కొన్ని ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు, ముఖ్యంగా 2019 పుల్వామా టెర్రరిస్టు దాడికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వైఫల్యాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. చివరికి ఆయన కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ ఆగష్టు 5, 2025న ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కన్నుమూశారు - తద్వారా అప్పటి వరకు ఆయన ఆరోపణలతో సతమతం అవుతున్న కేంద్ర కొంత ఉపశమనాన్ని పొందింది.
సమయం వచ్చింది కాబట్టి టూకీగా 370,35-ఎ గూర్చి చెప్పుకుందాం. 1949లో షేక్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు, భారత ప్రధాని నెహ్రూ ఆయనతో కుమ్మక్కు అయ్యి, దొడ్డి దారిలో ఈ రెండు ఆర్టికిల్స్ 370,35-ఎ లను భారత రాజ్యాంగానికి జత చేయాలని తలపోసినప్పుడు - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ రెండు ఆర్టికల్స్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన 1949లో రాజ్యాంగ సభలో ఈ ఆర్టికల్స్ గురించి జరిగిన చర్చలో పాల్గొనలేదు. ఫెడరల్ స్పుర్తితో కేంద్రం జమ్మూ మరియు కాశ్మీర్ కు అన్ని రాష్ట్రాలవలె సాయం అందించినప్పుడు, జమ్మూ మరియు కాశ్మీర్‌కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇచ్చే 370, కాశ్మీరీయేతరులు ఉద్యోగాలు పొందకుండా, జమ్మూ మరియు కాశ్మీర్ భూమి కొనుగోలు చేయకుండా నిరోధించే 35ఎ - ఈ రెండూ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తాయని ఆయన వాదన. ఎక్కడో తెలుగు రాష్ట్రంలో మారు మూల ప్రాంతం నుండి అమెరికాకు వలస వచ్చి, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, ఇల్లు కట్టుకున్నప్పుడు - భారత దేశంలో ఉన్నవారు జమ్మూ మరియు కాశ్మీర్ లో ఈ పని ఎందుకు చెయ్యకూడదు? 370, 35-ఎ వంటి వివాదాస్పదమైన నిబంధనల వల్లనే జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ చుట్టూ బంధనాలను ఏర్పరచుకుని మిగతా భారత్ తో పోలిస్తే "అనేక దశాబ్దాలుగా" వెనుకబడి ఉన్నారు అని వాదించే వారు ఉన్నారు. ఏది ఏమైనా ఏడు దశాబ్దాల తరువాత అంబేద్కర్ వాదనే సరైనదని ప్రభుత్వం భావించింది - 370, 35-ఎ కు మంగళం పలికింది, అందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలికారు. 2023 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సమర్థించింది. 370, 35-ఎ లను తొలగిస్తే పెద్ద భూకంపం చెలరేగుతుందనే కుహానా లౌకిక వాదుల వాదనలు, బెదిరింపులు కాలగర్భంలో కలిసిపోయాయి.
మళ్ళీ సత్యపాల్ మాలిక్ మహాశయుడి ఆరోపణల వద్దకు వెళ్డాం. పుల్వామా దాడి జరిగినప్పుడు జవాన్లని తీసుకెళ్లడానికి మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఐదు హెలికాప్టర్లు అడిగితే అందుకు ప్రభుత్వం నిరాకరించిందని సత్యపాల్ మాలిక్ తెలియజేశారు. అందువల్లనే రహదారిపై వెళుతూ జవాన్లు మరణించారని తెలిపారు. మోదీ, అజిత్ దోవల్‌లు ఇద్దరూ తనను దీనిపై మాట్లాడొద్దని అప్పట్లో కోరారని కూడా సత్యపాల్ మాలిక్ ఆ మధ్య మీడియాకు చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి ప్రధాని మోదీ తప్పు చేశారని, ఈ విషయంలో ఆయనను కొందరు తప్పుదోవ పట్టించారని, ఇప్పటికైనా మోదీ తన తప్పును సరిదిద్దుకుని రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు. జమ్ముకశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదా దుర్వినియోగం అవుతుంది అని ఆ రాష్ట్ర పోలీసు శాఖలో అత్యున్నత హోదాలో పని చేసిన పలు తెలుగు ఐ పీ యెస్ లు మీడియా సాక్షిగా చాలా సందర్భాలలో చెప్పారు. కీలకం అయిన జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా రాజకీయ నేపధ్యం ఉన్నవారి కంటే - సైన్యం నేపధ్యం లేదా ఒకే పార్టీకి విధేయత ఉన్నవారు లేదా అసలు ఏ పార్టీకి సంబంధంలేని వారు సరైనవారు అని మనకు కాలం చెబుతుంది. దారిన పోయే కంప ని కాలికి తగిలించుకోవడం అంటే ఇదే - సత్యపాల్ మాలిక్ ఉదంతం మనకు ఇదే తెలుపుతుంది. ఆయన తరువాత గుజరాత్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ముర్ము జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కొద్దికాలం ఉన్నారు. ముర్ము భారతదేశపు 14 వ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ బాధ్యతలు స్వీకరించంతో - ఇప్పుడు మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రెండవ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మరియు భారతీయ జనతా పార్టీ (బీ జె పీ) సభ్యుడు. ముర్ము, పిదప మనోజ్ సిన్హా హయాంలో వివాదాలకు తావులేకుండా జమ్మూ కాశ్మీర్ పాలన సాగడం ఆసక్తికరం.
ఉగ్రదాడులు:
అంతర్గత రాజకీయ చర్చలు మరియు పాలనా సంస్కరణల ఆవశ్యకత ఒక వైపు ఉండగా, దేశ భద్రతకు సంబంధించిన మరింత తీవ్రమైన సవాళ్లను 2025లో భారత్ ఎదుర్కోవాల్సి వచ్చింది. 2025 నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడులు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు సంఘటనతో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు. దీనిని అధికారులు ఉగ్రవాద చర్యగా గుర్తించారు. ఢిల్లీ బాంబు పేలుడుతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఒక ఆపరేటర్ ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది. ఈ సమావేశాన్ని పాక్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. ఆపరేషన్ సిందూర్ తదుపరి జరిగిన సంఘటనతో పాక్ బుద్ధి మరో సారి కుక్క తోక వంకర నానుడిని గుర్తుచేస్తుంది. అయితే ఈ సారి పాక్ నుండి ఉగ్రవాదులు నేరుగా భారత్ లో దిగకుండా, కొంతమంది భారత డాక్టర్లను చేరదీసి, వారికి తుర్కియేలో శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ కు తుర్కియే దేశం డ్రోన్లను సరఫరా చేసిన విషయం మనకు తెలుసు. దాదాపు ఈ డ్రోన్లు అన్నింటినీ భారత్ కూల్చివేసినా, వాటి శిధిలాలతో కొంత నష్టం జరిగింది. విసుగు చెందిన భారత్ - మదగజం కుంభస్తలంలో కొట్టి దారికి తెచ్చినట్లు, కిరానా హిల్స్ లో పాక్ రహస్యంగా దాచి ఉంచిన న్యూక్లియర్ బాంబుల టన్నెల్ ప్రవేశ ద్వారాన్ని బ్రహ్మోస్ మిస్సైల్ తొ పేల్చివేయడంతో - బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు పచ్చజెండా ఊపింది. అయితే తాజాగా ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు బట్టి - మన వేలితో మన కన్ను తోనే పొడవడానికి పాక్ పధకం వేసినట్లు తెలుస్తుంది. పాక్ పై దాడి చేసినట్లు భారత్ తుర్కియే పై దాడి చెయ్యదు ఎందుకంటే అదొక నాటో దేశం, పైగా దాని అధ్యక్షుడు ఒక మత చాందసవాది కాబట్టి - ఇది పాక్ అంచనా! పిచ్చి పలురకాలు.. వెర్రి వేయి రకాలు.. అంటే ఇదేనేమో! భారత్ లో అలజడి సృష్టించడం కోసం తుర్కియే ని వాడుకోవడానికి పాక్ మూకలు తెగించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనందరం అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఏదైనా తేడా అనిపిస్తే తగు సమాచారాన్ని వెంటనే భద్రతా విభాగాలతో పంచుకోవడం అత్యంత అవసరం. ఎక్కడో ఢిల్లీలో ప్రేలుళ్ళు జరిగితే తెలుగు రాష్ట్రాలకు ఏమి సంబంధమని మీరు ప్రశ్నించవచ్చు. ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ముంబాయి పోలీసులు గుంటూరు లో దాడులు చేసి పలు జాతి వ్యతిరేక శక్తులను అదుపులోకి తీసుకున్న విషయం మీడియాలో వచ్చింది.
భారత క్రికెట్:
ఈ భద్రతాపరమైన ఉద్రిక్తతల నుండి కాస్త దృష్టి మళ్లించి, దేశం యావత్తు ఉల్లాసంగా, గర్వంగా జరుపుకోదగిన వార్త క్రీడా రంగం నుండి వచ్చింది. కాబట్టి, ఇప్పుడు గేరు మార్చి 2025 లో భారత క్రికెట్ కు సంబంధించిన విషయాలు చర్చిద్దాం. 2025 సంవత్సరం భారత క్రికెట్ అభిమానులకు పండుగల మాదిరిగా సాగింది. టెస్టులు, వన్డేలు, టీ20లు, అంతర్జాతీయ టోర్నీలు అన్నింటిలోనూ టీమిండియా బిజీగా గడిపింది. - ఆసియా కప్ 2025 సంవత్సరానికి సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఏఈలో జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్ పాల్గొంది. పైగా పాక్ ను ముచ్చటగా మూడు సార్లు ఓడించింది. దీనికితోడు ఫైనల్ పోటీలో తెలుగు తేజం తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ ను గెలిపించడం అద్భుతం.
భారత్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా కూడా నిలిచింది. మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో భారత్ ట్రోఫీల పరంగా అత్యుత్తమ దేశాల సరసన నిలిచింది. క్రికెట్ అభిమానులకు ఇది గర్వకారణం, యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచే ఘట్టం ఇది. - కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 79 పరుగులతో కూడిన అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు, తరువాత పనిని శ్రేయస్ అయ్యర్, కె ఎల్ రాహుల్ దిగ్విజయంగా నడిపించారు.
మరో వైపు క్రికెట్ లొ భారత మహిళలు కూడా తమ సత్తా చూపించారు. 2025 వన్ డే మహిళల ప్రపంచ కప్‌లో భారతదేశం గెలిచింది. నవంబర్ 2, 2025న జరిగిన ఫైనల్లో, 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి, భారత్ తొలిసారి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయి చతికిల బడింది. భారత్ వైపునుండి ఈ ఫైనల్ లో రాణించిన ముఖ్య క్రీడాకారులు: షఫాలీ వర్మ: 78 బంతుల్లో 87 పరుగులు చేసి, కీలకమైన రెండు వికెట్లు తీసింది. దీప్తి శర్మ: 5 వికెట్ల తో పాటు, ఆమె ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది. రిచా ఘోష్: దక్షిణాఫ్రికాపై 24 బంతుల్లో 34 పరుగులు చేసింది. భారత జట్టులోని తెలుగు క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీ చరణి ఈ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రమాలె గ్రామానికి చెందినవారు మరియు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్‌గా రాణించారు. ఫైనల్ మ్యాచ్‌లో ఈమె దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీలకమైన అన్న్కే బోష్ వికెట్‌ను తన మొదటి ఓవర్లోనే తీసి, మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పారు. మొత్తం టోర్నమెంట్లో ఆమె తన నియంత్రిత బౌలింగ్‌తో మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌లను కట్టడి చేశారు, అంతేకాదు ఆమె అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలను కూడా ప్రదర్శించారు. దీప్తి శర్మ ఈ టోర్నమెంట్లో 22 వికెట్లు తీసి ప్రధమ స్థానంలో ఉండగా, తెలుగు తేజం శ్రీ చరణి 14 వికెట్లు తీసి నాలుగవ స్థానంలో ఉంది. ఈ విజయం తర్వాత శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం లభించింది మరియు ఆమె ప్రయాణం మారుమూల గ్రామాలలోని ఎంతో మంది యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సెమీ ఫైనల్లో ఈ ప్రపంచ కప్ ఫేవరెట్ జట్టు అయిన ఆస్ట్రేలియాను ఓడించి భారత్ సగర్వంగా ఫైనల్ లోకి ప్రవేశించింది. తదుపరి కథ మీకు తెలిసిందే. ప్రధానంగా ఈ టోర్నీ విజయం భారత్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు మరియు దేశవ్యాప్తంగా యువ మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చింది.
మొత్తం మీద ఈ సంవత్సరం భారత క్రికెట్‌కు కొత్త శకం ప్రారంభించినట్లు భావించవచ్చు—యువత, వ్యూహాత్మక నాయకత్వం, అంతర్జాతీయ విజయాలతో భారత జట్టు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా ఉంది. అయితే గంభీర్ కోచ్ గా టీ 20, వన్ డే లలో తన ప్రభావాన్ని చూపాడు, కానీ టెస్టులలో భారత రికార్డు బాగా లేదని చెప్పాలి. చిన్నా చితక జట్ల పై విజయాలు సాధించి పెద్ద జట్ల చేతిలో ఘోరంగా ఓటమికి గురి అవుతుంది. రోహిత్ శర్మ, కోహ్లి టెస్టులకు విరామం ప్రకటించిన తరువాత వారి స్థానాలలో యువ క్రీడాకారులు టెస్టు క్రికెట్లో కుదురుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పూజారా తరువాత భారత టెస్టు క్రికెట్లో మూడవ స్థానంలో ఆస్థాయిలో ఆడే వారి కోసం ఇప్పుడు జల్లెడ పడుతున్నారు, ఈ దిశగా గంభీర్ పలు ప్రయోగాలు చేస్తున్నాడు, కానీ ఆయన ప్రయోగాలు ఇప్పట్లో ఫలిచేలాగా లేవు. ఎందుకంటే ఆయన ప్రయోగాలలో రాణించిన వారికి తదుపరి మ్యాచ్ లలో ఆడించడం లేదు, కొత్తవారిని ఆడిస్తున్నారు - దురదృష్టవశాత్తు వారు విఫలం అవుతున్నారు - దాంతో కథ మొదటికొచ్చినట్లు అయింది - టెస్టు క్రికెట్ అభిమానులకు గుండె కోత మిగిలింది. ఈయన కోచ్ కాదు ‘ఇండియన్ గ్రెగ్ ఛాపెల్’.. అని గంభీర్‌ను నిందిస్తున్నారు నెటిజన్లు. పానకంలో పుడకలా ఈ గ్రెగ్ ఛాపెల్ ఎక్కడినుంది వచ్చాడు అనే సందేహం రావడం సహజం. 2005 చివరలో మరియు 2006 ప్రారంభంలో భారత క్రికెట్ జట్టులో కొత్తగా నియమితులైన కోచ్ గ్రెగ్ చాపెల్ మరియు కెప్టెన్ సౌరవ్ గంగూలీ మధ్య జరిగిన వరుస సంఘటనల కారణంగా “చాపెల్ - గంగూలీ వివాదం” ఏర్పడింది. ఈ వివాదం ఫలితంగా 2005 నవంబర్‌లో గంగూలీని కెప్టెన్‌గా తొలగించి అతని స్థానంలో వైస్-కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించారు, గంగూలీని వన్డే జట్టు నుండి తొలగించారు. జనవరి 2006 చివరిలో గంగూలీని టెస్ట్ జట్టు నుండి కూడా తొలగించారు. ఈ వివాదం భారతదేశంలో బలమైన భావోద్వేగాలను రేకెత్తించింది, గంగూలీ స్వస్థలం కోల్‌కతా మరియు అతని స్వస్థలం పశ్చిమ బెంగాల్లో జరిగిన తీవ్రమైన వీధి నిరసనల నుండి, భారత పార్లమెంటులో ప్రసంగాల వరకు వివాదం కొనసాగింది. 2006లో ఛాపెల్ ను ఇంటికి సాగనంపిన తరువాత, 2007 క్రికెట్ ప్రపంచ కప్ లో అక్కడ భారతదేశం గ్రూప్ దశలోనే ఓడిపోయింది. ఆ తరువాత ధోని శకం ప్రారంభం అయ్యింది.
తాజాగా గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయలేక తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు సమర్పించుకున్న భారత్.. బ్యాటింగ్‌లోనూ తేలిపోయింది. 201 పరుగులకే ఆలౌటై ఓటమి దిశగా పయనిస్తోంది. ఇంకా రెండ్రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో భారత్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. గువాహటి టెస్టులో భారత్ ఓడితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంటాడు. మొదటి టెస్టు ఓటమి తరువాత, స్వదేశంలో విదేశీ జట్టు చేతిలో రెండు వైట్ వాష్‌లు ఎదుర్కొన్న తొలి హెడ్ కోచ్‌గా ఆయన నిలుస్తాడు. 2024లో కివీస్ చేతిలో టీమిండియా వైట్ వాష్‌కు గురైనప్పుడు కూడా గంభీర్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. గువాహటి పిచ్ ను ఉటంకిస్తూ "122 పరుగులకే ఏడు వికెట్లు పడే విధమైన పిచ్ ఇది కాదు. భారత బ్యాటింగ్ చాల పేలవంగా ఉంది” అని రవిశాస్త్రి అన్నారు. అయితే వెంటనే మార్పులు చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు గంభీర్ ను ప్రధాన కోచ్ గా కొనసాగించవచ్చని సమాచారం. ఇప్పటివరకూ గంభీర్ హయాంలో 18 టెస్టులు ఆడిన భారత జట్టు కేవలం ఏడంటే ఏడే విజయాలతో నిరాశపరిచింది. 9 మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వగా.. రెండు డ్రాగా ముగిశాయి. గువాహటిలోనూ ఓటమి తప్పేలా లేదు. ఎందుకంటే.. తొలి ఇన్నింగ్స్‌లో 201కే ఆలౌటై సఫారీలకు 288 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న భారత్.. గువాహటి టెస్టును కాపాడుకోవడం శక్తికి మించిన పనే. ఇప్పుడు భారత్ గెలుపు అవకాశాన్ని అటుంచి అసలు మ్యాచ్ డ్రా చేసుకుంటే పదివేలు అనుకునే వారికి కొదువలేదు. గువాహటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఔటైన తీరుకు భారత అభిమానులే కాదు, కామెంటరీ బాక్స్‌లోని షాన్ పొలాక్ కూడా షాకయ్యాడు. కెప్టెన్ రిషభ్ పంత్ సహ చాలామంది తేలికగా వికెట్ ఇచ్చేశారని సఫారీ పేస్ దిగ్గజం పొలాక్ పేర్కొన్నాడు.
తెలుగు రాష్ట్రాలలో ముఖ్య సంఘటనలు:
జాతీయ స్థాయిలో క్రీడలు, రాజకీయాల్లో ఈ విధమైన పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, మన దృష్టిని ఇప్పుడు స్థానిక అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతిపై పెడదాం. తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకున్న ముఖ్య సంఘటనలు పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య సంఘటనలు గురించి చెప్పుకుందాము. ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య సంఘటనలు... ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ హబ్‌గా మార్చేందుకు విశాఖపట్నంలో కీలక ముందడుగు పడింది. వైజాగ్‌లో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు ఈ అక్టోబర్‌లో సంతకాలు చేశారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించనుంది గూగుల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2028-2032 మధ్య రాష్ట్ర జీడీపీకి ఏటా రూ.10,518 కోట్లు, 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకోసిస్టమ్ మొత్తం మారిపోనుంది. వైజాగ్ ఏఐ సిటీగా మారిపోనుంది. మరోవైపు అమరావతిలోని 18 కంపెనీల నుండి ₹36,000+ కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డిఏ) విజయం సాధించింది. అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దీని ద్వారా రాజధానికి చట్టపరమైన భద్రత లభిస్తుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపై రాజధాని ని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి, బహుశా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించిన తరువాత మాత్రమే ఈ మార్పు జరిగే అవకాశం ఉంది - ఈ ప్రక్రియ అప్పటి కప్పుడు జరిగేది కాదు. ఇది కొంతవరకు రాష్ట్రం హక్కును హరించే ప్రయత్నమే ఇది, కానీ ఏంచేస్తాం? సరైన కారణం లేకుండా ఉత్త పుణ్యానికే రాష్ట్ర రాజధానిని మార్చే రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రించడానికి ఇటువంటి చట్ట సవరణ తప్పదేమో! కలికాలం!
మరో వైపు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025" ను నవంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహించింది. 2047 నాటికి తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 500కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మొత్తానికి 2025 సంవత్సరం భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు, చరిత్ర, సంస్కృతి, రాజకీయ పరంగా విశేషమైన సంవత్సరం. ఈ సంఘటనలు దేశ అభివృద్ధి, ప్రజల చైతన్యం, ప్రాంతీయ గౌరవాన్ని ప్రతిబింబించాయి.
2025 లో అంతర్జాతీయ పరిణామాలు:
ఇక అంతర్జాతీయంగా ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం మూలంగా మిడిల్ ఈస్ట్‌లో శాంతి స్థాపనకు మార్గం సుగమమైంది. మధ్యలో ఇజ్రాయెల్-సిరియా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొద్ది రోజుల యుద్ధం సాగిన కూడా - అవి త్వరలో కంచికి చేరాయి. ఇదిలా ఉండగా - మూడేండ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ప్రతిపాదించినట్లు చెబుతున్న '28 పాయింట్ల ప్రణాళిక' ఇప్పుడు మీడియాలో తాజా వార్తగా ప్రచారంలో ఉంది. అయితే, ఈ ప్రణాళిక ఫలించాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనుమతి తప్పనిసరి అని ట్రంప్ స్పష్టం చేశారు, దానికి నవంబర్ 27 డెడ్ లైను ను ఆయన జెలెన్స్కీ కి విధించారు. సౌదీ అరేబియా, అలాస్కా, వైట్‌హౌస్ వేదికగా ఇంతకుముందు జరిపిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఈ కొత్త ప్రణాళికపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈ ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలు (అనధికారికంగా):
- ఉక్రెయిన్ తన తూర్పు డొనెట్స్క్ మరియు లుగాన్స్క్ ప్రాంతాలతో పాటు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆధీనంలో ఉన్నట్లుగా ఉక్రెయిన్ అంగీకరించాలి.
- ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆశయాలను విరమించుకోవాలి మరియు ఉక్రెయిన్‌లో నాటో దళాలను మోహరించడంపై పరిమితులు విధించాలి. ఉక్రెయిన్ సైన్యం పరిమాణాన్ని పరిమితం చేయాలి.
- రష్యాపై ఆంక్షలను క్రమంగా ఎత్తివేసి, జీ8 లోకి తిరిగి ఆహ్వానించాలి.
ఈ ప్రణాళికపై ప్రస్తుతం జెనీవాలో యూరోపియన్ దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన ఉక్రెయిన్ను భవిష్యత్ దాడులకు గురయ్యేలా చేస్తుందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుందని పలు యూరోపు దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. సంధి ఊసెత్తకుండా, ఉక్రెయిన్ కు డబ్బులు, ఆయుధాలు ఇచ్చి రష్యాపై యుద్ధానికి ప్రోత్సహించిన యూరోపు దేశాలు ఇంకా ఎంతకాలం ఈ యుద్దం కొనసాగాలని కోరుకుంటున్నాయో తెలియదు. ఉత్తరోత్తరా రష్యా తమ మీద కూడా దాడులు చేస్తుందేమోననే అర్ధంలేని భయాందోళనలతో యూరోపు దేశాలు పరోక్షంగా ఇటు ఉక్రెయిన్‌లో ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి కారణం అవుతున్నాయి. తన ప్రమేయం లేకుండా రూపొందించిన ట్రంప్ ప్రణాళికపై ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో యూరోపు, అమెరికా దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా, డబ్బులు ఇవ్వడం ఆపితే నాలుగురోజుల్లో యుద్ధం ముగుస్తుంది అని పలువురు విశ్లేషకులు బల్ల గుద్ది చెబుతున్నారు. కమెడియన్ గా సినిమాలు చేసుకునే జెలెన్ స్కీ అదృష్టవశాత్తు ఉక్రెయిన్ అధినేత అయ్యాడని, ఆయనకు ఉన్న రాజకీయ పరిణితి అంతంత మాత్రమేనని, యుద్ధం పేరుతో ఉక్రెయిన్‌లో ఆయన ఎన్నికలు నిర్వహించడంలేదని ఆయన విమర్శకులు మండిపడుతున్నారు. మరో వైపు జెలెన్ స్కీని నియంతగా పోల్చిన ట్రంప్.. ఈ ఫిబ్రవరిలో ఆయనను కమెడియన్ గా సంబోధించారు. ఈ కమెడియన్ అమెరికాతో ఏకంగా 35 వేల కోట్లు ఖర్చు పెట్టించాడని మండిపడ్డారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయింది ఇప్పుడు అమెరికా, యూరోపు దేశాల పరిస్థితి. గౌరవంగా ఉక్రెయిన్ - రష్యా యుద్దం నుండి బయటపడే మార్గం వారు అన్వేషిస్తున్నారు.
కృత్రిమ మేధ - నియంత్రణ:
మరో ఆసక్తికరమైన చర్చ - ఏఐ నియంత్రణ గూర్చి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అంటే కృత్రిమ మేధ - నియంత్రణపై చర్చలు, కొత్త విధానాల, చట్టాల రూప కల్పన జరుగుతుంది. ఈ దిశగా చర్చలు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఏఐ వ్యవస్థలు మానవులకు హాని చేయకుండా ఉండేలా నియంత్రణ ఉండేలా చట్ట సవరణలు వచ్చే అవకాశముంది. అలాగే ఆర్థిక సమానత్వం అంటే ఏఐ వల్ల వచ్చే లాభాలు అన్ని దేశాలు సమానంగా పంచుకోవడం, ఇంకా గ్లోబల్ సహకారం ద్వారా అన్ని దేశాలు కలిసి ఏఐ కు సాధారణ ప్రమాణాలు ఏర్పరచడం పై అర్ధవంతమైన చర్చ 2025 లో జరుగుతోంది.
ఏఐ అనర్ధాలు:
2024 నవంబర్‌లో, గూగుల్ యొక్క ఏఐ చాట్‌బాట్ ఒక కళాశాల విద్యార్థికి "మానవా... దయచేసి చనిపో" అనే బెదిరింపు సందేశాన్ని పంపిందని ప్రముఖ మీడియా సంస్థ సీ బి యెస్ నివేదించింది. కారక్టర్.ఏఐ అనే సంస్థకు చెందిన చాట్బాట్లు తమ పిల్లలను ఆత్మహత్యకు ప్రోత్సహించాయని ఆరోపిస్తూ ఫ్లోరిడా మరియు కాలిఫోర్నియాకు చెందిన కుటుంబాలు వేర్వేరుగా చట్టపరమైన దావాలు దాఖలు చేశాయి. ఓపెన్ ఏఐ యొక్క చాట్‌బాట్ కూడా ఒక కళాశాల గ్రాడ్యుయేట్‌ను ఆత్మహత్యకు ప్రోత్సహించిందని అతని కుటుంబం దావా వేసింది.
అనేక మంది యువతీ యువకులు తెలుసో తెలియకో ఏఐ చాట్బాట్లకు తమ మానసిక సమస్యలు ఏకరువుపెట్టి సలహాలు పొందుతున్నారు. అయితే ఏఐ చాట్బాట్లకు ఆరోగ్య విషయాలలో నైపుణ్యం అంతంత మాత్రమేనని, ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం మదింపు చేసి అది ఇచ్చే సలహాలపై ఆధారపడకూడదని, అలాగే తీవ్రమైన సమస్యలు ఉన్నవారు అందుబాటులో ఉన్న ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ లో ఒకే విషయం పై పరస్పర విరుద్ధమైన సమాచారం ఉంటే - దాని ఆధారంగా ఏఐ దానిపై సంధించిన ప్రశ్నకు సరైన సలహా ఇవ్వలేదు, పైగా అది ఈ పరస్పర విరుద్ధమైన సమాచారంతో గందరగోళానికి గురై, తప్పుడు సలహా ఇచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి ఏఐ వ్యవస్థలను నమ్మి నిర్ణయాలను తీసుకోవడం లేదా ఒక అంచనాకు రావడం మానవులకు ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ చికిత్సలో కొత్త వైద్య పద్ధతులు:
చివరిగా 2025లో క్యాన్సర్ చికిత్సలో కొత్త వైద్య పద్ధతులు ప్రధానంగా ఇమ్యూనోథెరపీ, mRNAఆధారిత చికిత్సలు, జీన్ల ఎడిటింగ్ మరియు టార్గెట్ చేసిన ఔషధాలు రూపంలో ముందుకు వచ్చాయి. ఇవి రోగుల జీవనకాలాన్ని పెంచడంలో, దుష్ప్రభావాలను తగ్గించడంలో ఆశాజనక ఫలితాలు చూపుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. దీనితో టార్గెట్ చేసిన ఈ కొత్త ఔషధాలు తక్కువ దుష్ప్రభావాలతో ఎక్కువ ఫలితాలు ఇవ్వగల దిశగా ముందుకు వెళ్తోంది. వీటిలో కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి. ఎనభైలలో నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు నా సైన్సు ఉపాధ్యాయుడు రాఘవా చారి మాస్టారు చెప్పిన విషయం ఈ సమయంలో నాకు జ్ఞాపకానికి వస్తుంది - "పిల్లలూ - క్యాన్సర్ వ్యాధికి ఇప్పటి వరకు మందు లేదు, భవిష్యత్తులో వస్తుంది ఆశిద్దాం" అని. ఆయన ఊహ, ఆశ నిజమైనది అనిపిస్తుంది.
ఇంకా చెప్పుకుంటే మరెన్నో విషయాలు, అయితే ఏ చర్చకైనా అర్ధవంతమైన ముగింపు ఉండాలి, అయితే శుభం లేదా సశేషం అన్నమాట! మరి మధ్యాన్న సమయం అయి, కడుపు కాలుతున్నప్పుడు ఇంకా ఎవరైనా రచ్చబండ చర్చలో చెట్టు వద్ద కూర్చుంటారా? బాబ్బాబు నన్ను ఈయాల్టికి వదిలెయ్యి, ఇంటికెళ్ళి నాలుగు ముద్దలు తిని ఒక కునుకు వేసి వస్తాను అని ఒక్కోరు చల్లగా జారుకుంటారు కదా? లోకాః సమస్తాః సుఖినోభవంతు! అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో సిరిమల్లె పాఠకులు తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, మీ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో గడపాలని, ఆయురారోగ్యాలతో అందరూ సుఖంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ... పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో ఈ నెల రచ్చబండ చర్చపై స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం