మమేకం
రాత్రి కురిసిన వర్షం లో
ఆరుబయట చెట్లు తడిసి పోయాయి.
కిటికీ వెంట చూపులతో
నేను వొరిసి పోయాను .
అయినా ఇంకా ఆ దృశ్యాల్లో తడుస్తూ ఉన్నాను.
నాలో ఏవో
జ్ఞాపకాల అలలు కుదుపుతున్నాయి.
చిన్ననాటి గురుతులు
కాగితం పడవల్లో తిప్పుతున్నాయి.
ఆకాశం వంక చూశాను
ఎంత నీటిని దాచుకుని వుందో....
బాధా తప్త హృదయాన్ని పరామర్శించాను
ఎన్ని కన్నీటి సెలయేళ్ళను ఓర్చుకుని వుందో ...
తన్మయంగా తదేకంగా
ప్రకృతిని నాలో నింపుకున్న
కొన్ని క్షణాలు చాలు అంతే.
ఆనందాన్ని దుఃఖాన్ని కొలిచే
సాధనాలు ఉన్నాయా..!
చేరువైన అనుభూతులు తప్పా.
ఒక నిశ్శబ్ద నిశీధిలో
తళుక్కున మెరిసే ఆలోచనలు
మనసుని కుదుపుతాయి.
ఏకాంతం లో మెదిలే ఊహలు
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
క్షణాలు ఏవైనా
ప్రకృతి తో మమేకం
కొలవలేని అనుభూతుల్ని మిగుల్చుతుంది.