పుచ్చపువ్వులాంటి ‘సిరివెన్నెల’ జీవితపు సోయగాలని
ఆనందపు మెరుపులలో కనువిందు చేస్తుంటే
ఆ చల్లదనంలో మనసులు మునకలు వేస్తుంటే
భాష పరిధులు దాటి ఎక్కడికో లాక్కెళుతుంటే
అతడి భావోద్రేకం ఆకాశం అంచులు దాటి పైకెత్తేస్తుంటే …
"నా ఉఛ్వ్వాసం కవనం, నా నిశ్వాసం గానం" అంటూ,
ఊపిరి మెరుపుల సొంపులు గీతంలో పొదిగి ఆలపిస్తుంటే
"నా పాట పంచామృతం" అంటూ గానాన్నిఅమృతం చేసి
శారదమ్మ వీణపై సుస్వనాల నాట్య ఝరులు మైమరపిస్తుంటే
రసమయ లోకాన్ని హృద్యంగా తీర్చి దిద్దిన విధాత ‘సిరివెన్నెల’.
"నీ నవ్వులే వెన్నెలని " అందాలు ఆనందాల అంగళ్లలో కొలుస్తూ
"నాలో నేను లేనే లేను" ఉన్నది నువ్వే అంటూ భావగర్భితంగా గగనం చూపి
"జగమంత కుటుంబం నాది" అంటూ లోకాన్నే ఏకం చేసి అంతలోనే
“ఏకాకి జీవితం నాది" అంటూ నిస్సత్తువగా జీవిత సత్యాన్ని అర్ధవంతం చేసి
"బూడిదిచ్చేవాడిని ఏమికోరేది" అంటూ వైరాగ్యం చాటిన ఘనత ‘సిరివెన్నెల’ దే
"పుట్టుక, చావు ఆ రెండు నీకవి సొంతం" అంటూ సత్యాన్ని సూటిగా గుట్టు విప్పినా
"విరించి తలపున ప్రభవించినది అనాది జీవన వేదం" అంటూ పురిటికందు ప్రసవ రోదనే
ప్రణవ నాదం అని వేదాంతానికి మలుపులు త్రిప్పి చాటినా అతనికేచెల్లు
"బండరాళ్లను చిరాయువులుగా" నిలిచిపొమ్మని “తేనెలొలుకు అందాల పూల బాలలకు"
అల్పాయుషిచ్చిన విధాతని ఏమిటిదని నిగ్గుతీసినా 'సిరివెన్నెల' కే తగును కదా.
“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ జీవశ్చవాన్ని” అని కసిరినా
“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి” అంటూ ఆశావాదిగా ఆక్రోశించినా
“బోటనీ పాఠముంది మ్యాటనీ ఆటవుంది దేనికో ఓటు చెప్పారా” అని గెంతుతూ అల్లరిగా పాడినా
"చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ" అంటూ సామాన్యుల పరిభాష వాడినా
సరసమైన తెలుగులో అందంగా సరదాగా అందలమెక్కించగల సమర్ధుడు ‘సిరివెన్నెల’.
“ఓ నవ్వే చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది,ముత్యాలజల్లు, మృదువైన ముల్లై
మదిలో గుచ్చుకుంటుంది” అంటూ ప్రేయసి ముందు తియ్యగా వయ్యారాలు ఒలికించినా
“కుహుకూయవా కోయలా, మానవా మౌనము” అని బ్రతిమాలి చెలి చేత నవ్వించి,
జనం చేత వొప్పించి అందమైన అక్షరాల తోరణాలు నింగికి వేయగల వాడు
వామనుని లా పెరిగి సినీ కవికులానికి కలికితురాయి అయిన 'సిరివెన్నెల' ఎంతో చతురుడు.
పుడమిమీద పుట్టిననోళ్లు గిట్టకుండ మిగల లేదు ఎన్నడూ
కాళిదాసు, రామదాసు, తులసీదాసు, పురందర దాసు ఎవరైనా గాని
పెద్దన్న, త్యాగయ్య, అన్నమయ్య, విశ్వనాధ, దాశరధి, శ్రీశ్రీ, మల్లాది, మరెందరో
జంధ్యాల, కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ,ముళ్ళపూడి, సినారే, వేటూరి, కృష్ణ శాస్త్రి గాని
ఎందరెందరో, అల్లాగే మరి నేడు సీతారామ శాస్త్రికిని తప్పలేదు కాయ నిష్కృతి.
ఆ పైవాడి లెక్క తేలగానే లాక్కెళ్లడం రివాజు ఆ యమరాజుకి
గుండెలవిసి కార్చే అభిమానుల కన్నీళ్లే తర్పణాలై
‘మిగినోళ్ళు పోయినోళ్ల తీపిగురుతు’లే అవుతారు మరి
మరవలేని గీతాలు అందరి నోళ్ళల్లోనూ, పట్టు పదాలు పరిభాషలోను,
చేరుతూ నిలుస్తుంది కలకాలం ఆ 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి.’ పేరు.
సిరివెన్నెల కవితా పంక్తులతో సిరివెన్నెలకు నివాళి ఇచ్చారంటే ఆయన రాసిన పాటలు పై మీకెంతో అధికారం వుందో తెలియచేస్తోంది. మంచి నివాళి